Wednesday, June 27, 2012

బాలరాముని పసిడిపలుకులు


బాలరాముని పసిడి పలుకులు
Dr.Chilakamarthi DurgaPrasadaRao
91+9897959425

చిన్న పిల్లలు భగవంతునికి ప్రతిరూపాలు. వారి చేష్టలు మాటలు అందరికీ ఎంతో ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల మాటలు ముత్యాల మూటలు. అర్థంకాని అస్పష్టమైన మాటలైన అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల చేత ముద్దుముద్దుగా మాట్లాడించి ఆనందిస్తూ ఊంటారు. ఎందరో కవులు ఇటివంటి సంఘటనలల్ని ఆధారం చేసుకుని ఎన్నో అందమైన పద్యాలు వాశారు. మచ్చుకు ఒకటి చూద్దాం.
రాముడు చాల చిన్నవాడు. మాటలు ఎలాగో కూడబలుక్కుని మెల్లమెల్లగా మాట్లాడుతున్నాడు. ఒకసారి కౌసల్య అటువంటి రాముని ముద్దు మాటలు వినాలనుకుంది. దగ్గరకు పిలిచింది. పిలవగానే దగ్గరకొచ్చి నిలబడ్దాడు. నాన్నా! నీపేరేమిట్రా అంది. వెంటనే రాముడు అని చెప్పాలనుకున్నాడు. కాని నోరు తిరగలేదు. అందుకే 'లాములు' అన్నాడు. అదిసరేగాని మీనాన్న గారి పేరేమిటని అడిగింది. దశరథ మహారాజు అనాలని ప్రయత్నం. కాని ' దాచాతమాలాలు' అన్నాడు. అది సరే గాని నాపేరు చెప్పరా అంది. వెంటనే అమ్మగాలు అన్నాడు. నాపేరు అమ్మ కాదురాబాబు కౌసల్య అంది. కౌసల్య అనడానికి రాముడు ప్రయత్నం చేస్తున్నాడు. కాని అనలేక పోతున్నాడు. సాధారణంగా పిల్లలు తామనుకున్నది చెయ్య లేనప్పుడు ఏడుపు మొదలెడతారు . అంతే రాముడు ఏడవడం మొదలెట్టాడు. పసివాడి ఏడుపు తల్లి వినలేక పోయింది.ఆమె గుండె చెరువై పోయింది. నాపేరు కౌసల్య కాదులేరా బాబూ అమ్మే అని ఆవిడ తన బిడ్డను దగ్గరకు చేరదీసి ముద్దుపెట్టు కుందట.-
ఇంతటి రసవత్తరమైన భావాన్ని తనలో ఇముడ్చుకున్న శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి రామాయణ కల్పవృక్షం లోని పద్యాన్ని స్వయంగా చదివి ఆనందించండి. ఇదిగో ఆ పద్యం.
తానో 'లాములు' తండ్రిపేరెవరయా ?'దాచాతమాలాలు'
లేనాపేరన అమ్మగాలనగ నోలిందల్లి కౌసల్య తం
డ్రీ!నాగాననబోయి రాకకనులన్నీర్వెట్ట గౌసల్యనే
గానేకానులె 'అమ్మ' నే యనిప్రభుంగౌసల్యముద్దాడెడున్.

No comments: