హృద్యం-తెనుగు పద్యం 6
( సిద్ధాంతమేదైన
నా రక్షణ బాధ్యతనీదే )
డాక్టర్ . చిలకమర్తి దుర్గా ప్రసాద రావు .
గతతరానికి సంబంధించిన
తెలుగు కవులలో శ్రీచిలకమర్తి .
లక్ష్మీనరసింహం పంతులుగారొకరు. వారు కేవలం కవి మాత్రమే కాదు చారిత్రక
పరిశోధకులు , నాటకకర్త, నిష్కళంక దేశభక్తులు , సంఘ సంస్కర్త , ఆంగ్లేయుల నెదిరించిన తొలి తెలుగు కవి. ఆయన
రచించిన గయోపాఖ్యానం ఆనాడే ఒక లక్ష ప్రతులు అమ్ముడయ్యాయంటే ఆయన కవిత్వం ఎంత
ప్రజారంజకంగా ఉండేదో మనం ఊ హిoచుకోవచ్చు. ఆయన F.A చదువుతున్నప్పుడు ఆయనకు
రెండు కళ్ళు పోయాయి . ఆయనను Andhra Milton అనికూడా కొంత మందిపిలుస్తారు
.
శ్రీ చిలకమర్తి వారి
పద్య రచనా సౌ౦దర్యానికి “ కృపా౦భోనిధి” శతకం
ఒక పరాకాష్థ . ఇది మొట్టమొదటి సారిగా సంఘ సంస్కర్త రాజారామమోహన్ రాయ్ గారి
నిర్యాణ శతాబ్ది సందర్భంగా 1933 లో తెలుగువారికి లభించింది .
ఆ
తరువాత ఎన్నో ఏళ్ళకు శ్రీయుతులు Y.S.నరసింహా రావు , Dy.E.o. s. సుబ్బరాజు, ప్రముఖ సాహితీ
విమర్శకులు అక్కిరాజు రామాపతిరావుగార్ల
ప్రోత్సాహంతో శ్రీ యుతులు గంధం సుబ్రహ్మణ్యం, పురాణపండ శ్రీనివాసు గార్ల సహకారంతో శ్రీ పెరుమాళ్ళ రఘునాథ్ గారు ఈ
గ్రంథాన్ని మనకందించారు .
ఒక పద్యాన్ని
పరిశీలిద్దాం . ఈ పద్యo ద్వారా భారతీయ
తత్త్వశాస్త్రంలోని ఎన్నో విషయాలు వారికి
కరతలామలకాలని తెలుస్తోంది .
ద్వైతుల్
జెప్పెడి భంగి నన్యుడనొ దేవా నేను , నీకంటె న
ద్వైతుల్ జెప్పెడి
మాడ్కి నీశ్వరుడనో తల్పన్ విశిష్టాఖ్యుల
ద్వైతుల్
చెప్పునటుల్ మరొక్కడనొ నే భావిo పనెట్లైన
నీ
చేతన్ రక్షణమొంద
నర్హుడజుమీ శ్రీ మత్ కృపా౦భో నిధీ!
ఓ పరమ దయాళుడా !
ద్వైతులు చెప్పిన విధంగా
నువ్వు నేను వేరు కావచ్చు, అద్వైతులు చెప్పిన
విధంగా నువ్వు నేను ఒకరే కావచ్చు , అలాగే విశిష్టాద్వైతులు చెప్పిన ప్రకారంగా
నువ్వు నాలో అంతర్యామివి కావచ్చు. అదంతా
నాకు తెలియదు నన్ను రక్షించవలసిన బాధ్యత మాత్రం నీదే సుమా ! అని కవి ఒక ప్రక్క చాల
అమాయకంగా, మరో ప్రక్క చాల గడుసుగా ప్రార్థించడం ఈ పద్యంలోని విశేషం .
ఎంత అందంగా ఉందీ పద్యం.
ఇక స్వల్పంగా సిద్దాంతాల గురించి తెలుసుకుందాం . వేదాంత శాస్త్రానికి ఉపనిషత్తులు
, బ్రహ్మసూత్రాలు , భగవద్గీత అనేవి ఆధార గ్రంథాలు . ఇక ఉపనిషత్తులకు తార్కికపరమైన
వ్యాఖ్యానం బ్రహ్మ సూత్రాలైతే ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత. ఈ మూడు ఆధారం చేసుకుని
శ్రీశంకరాచార్యులు అద్వైతసిద్ధాంతాన్ని నెలకొల్పారు. వారు “సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన” మొదలైన అద్వైతపరమైన శ్రుతులను
స్వీకరించి జీతాత్మకు పరమాత్మకు మధ్య ఏకత్వాన్ని ప్రతిపాదించారు . ఒక ‘బూందీలడ్డు’
ఉదాహరణగా తీసుకుoటే మొత్తం లడ్డు పరమాత్మ
అoదులో ఉన్న బూందీ పలుకు జీవాత్మ. ఇది అర్థం చేసుకోడానికి నేను చెప్పే ఉదాహరణ, అంతేగాని అద్వైత సిద్ధాంత మంటే బూందీ
లడ్డు అనుకోకండి. ఇక లడ్డులో ఎటువంటి మాధుర్యాది గుణాలున్నాయో అవన్నీ ఒక్కొక్క బూందీపలుకు లోను ఉన్నాయి . ఎటొచ్చీ పరిమాణంలో SIZE లోనే తేడా ఉoది. అలాగే
పరమేశ్వరునిలో ఉండే సత్- చిత్- ఆనందాది గుణాలు జీవునిలో కూడా ఉన్నాయి.
ఇక శ్రీ
రామానుజాచార్యులవారు. “ఆత్మనా అనుప్రవిశ్య, నామరూపే వ్యాకరవాణి”, “ఆత్మానం అంతరో యమయతి “
మొదలైన శ్రుతులను ప్రథానంగా స్వీకరించి భగవంతుని
అంతర్యామిగా ప్రతిపాదించారు. ఆయన సిద్దాంతం బట్టి
శరీరం , ఆ శరీరంలో
జీవుడు , ఆ జీవునిలో అంతర్యామిగా
పరమేశ్వరుడు అని three steps ఉన్నాయి . మనం సులభంగా అర్థం చేసుకోవాలనుకుంటే సోడాబుడ్డి
శరీరం , అందులో ఉన్న ద్రవం జీవుడు, గోళీ అంతర్యామి . సృష్టికి ముందే ఈశ్వరుడు నేను
సకల జీవ , జడ పదార్థాల్లోను అంతర్యామిగా ప్రవేశిస్తానని ప్రతిజ్ఞ చెయ్యడం వల్ల జీవ
విశిష్టమైన (అంతర్యామిగా) ఉన్న పరమేశ్వరునకు సృష్టికర్తకూ ( బేదం లేక పోవడం వల్ల
ఇది విశిష్టాద్వైతo అయ్యింది . ఆయన ఈయన
ఒకరే కదా!
ఇక మనం ద్వైతసిద్ధాతం పరిశీలిద్దాం శ్రీ మధ్వాచార్యుల వారు “ ద్వా సుపర్ణా సయుజా: సఖాయా:
సమానం వృక్షం పరిషస్వజాతే: తయోరన్య: పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్నన్యో అభి చాకశీతి
“ మొదలైన శ్రుతులు తీసుకుని జీవునికి పరమేశ్వరునికి భేదం ప్రతిపాదిం చారు . వారి అభిప్రాయం ప్రకారం ఈ
ప్రపంచంలో ఐదు భేదాలున్నాయి .
1.
పరమేశ్వరుడికి జీవుడికి
మధ్య భేదం
2.
జీవుడికీ జీవుడికి మధ్య బేదం
3.
జీవుడికి జడపదార్థానికి మధ్య భేదం
4.
జడానికి జడానికి మధ్య భేదం
5.
జడానికి పరమేశ్వడుడికీ
మధ్య భేదం
ఈ విధంగా పంచ భేద వాది ఆయన.
ఇటువంటి మహాకవుల భావనలను మనం ఆకళింపు చేసుకుని ఈ తరం వారికందిoచకపోతే రాబోయే తరాలు
మనల్ని క్షమించవు .