Wednesday, December 18, 2024

అనుభవాలు -జ్ఞాపకాలు-8 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసదరావు

 

అనుభవాలు -జ్ఞాపకాలు-8

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసదరావు

అది1986. నేను Class లో పిల్లలకు   పాఠం చెప్పుకుంటున్నాను . నాకు ఒక ఉత్తరం వచ్చింది. క్లాసు  పూర్తయ్యాక నేను ఆ ఉత్తరం తెరిచి  చూశాను . అందులో ‘మీ పరిశోధన ఉత్తమ పరిశోధనగా ఎన్నికైంది .  గంగిరెడ్డి గోల్డు మెడల్ కు మీరు ఎన్నికయ్యారు. కాన్వొకేషన్ కు హాజరై మెడల్ తీసుకోవాలి. కానీ ఆ మెడల్ కి కొంత డబ్బు మీరు చెల్లించాల్సి ఉంటుందని వ్రాసి ఉంది.  నాకు ఒక పక్క సంతోషం  ఇంకో ప్రక్క ఆందోళన కలిగాయి. సంతోషం  ఎందుకంటే   బంగారు పతకం వస్తున్నందుకు . ఆందోళన ఎందుకంటే డబ్బు ఎప్పుడు, ఎలా , ఎవరికి, ఎంత పంపించాలో అందులో వివరంగా లేనందుకు .  ఆ రోజు ఎలాగో గడిచింది . రెండు రోజుల తరువాత మరో ఉత్తరం వచ్చింది. అందులో  మేము మెడల్ mint  ద్వారా తయారు చేయిస్తున్నాం. మీరు డబ్బులు పంపించ వలసిన అవసరం లేదు. ఫలానా రోజున అక్కడికి వచ్చి మెడలు  తీసుకోండని  వ్రాసి ఉంది. నేను ఊపిరి పీల్చుకున్నా. నిర్దేశించిన  సమయానికి రెండు రోజులు ముందుగానే అక్కడికి చేరుకున్నాను . ఆ సంవత్సరం కాన్వొకేషన్లో ప్రముఖ దర్శకుడు శ్రీ దాసరి నారాయణరావు, ప్రముఖ క్రీడాకారుడు శ్రీ సునీల్ గవాస్కర్, అలాగే మరో కొంతమంది ప్రముఖ అమెరికన్ శాస్త్రవేత్తలకు సన్మానం జరుగుతోంది. ఆ సంవత్సరంలో శ్రీ సునీల్ గవాస్కర్  గారు పదివేల పరుగులు తీసిన సందర్భంగా ఆయనకి ‘క్రీడాప్రపూర్ణ’ అనే బిరుదు ఇచ్చి సత్కరిస్తున్నారు.  ఆ సందర్భంలో  నాకు కూడ బంగారు పతకం రావడం ఆనందమే  అనిపించింది. పరిశోధనకు చాల కష్టపడవలసి వచ్చింది . గతం ఉర్తుకు వచ్చింది. అసలు Ph.D చెయ్యడానికి ప్రోత్సహించిన వ్యక్తి మా బావమరది Dr. రావూరి  విశ్వనారాయణ. ఇక నేను ముందుగా Andhra Contribution to Advaita Vedanta అనే అంశం  తీసుకుని కొంత కాలం work చేశాను . అద్వైతగ్రంథకర్తలలో కొంతమంది ప్రసిద్ధులైన ఆంధ్రులు ఉన్నారు కాని వారి ఆంధ్రత్వాన్ని  నిరూపించడానికి తగిన ఆధారాలు నాకు సంపూర్ణంగా దొరక లేదు. ఆంధ్రులకు మాత్రమే ఒక ప్రత్యేక తరహాలో ఇంటి పేరు ఉంటుంది.  కాని వారు గ్రంథాలను సన్యాసం తీసుకున్న తరువాత మాత్రమే వ్రాయడం వల్ల ఆశ్రమ నామం తప్ప అసలు పేరు గాని ఇంటి పేరు గాని ఉపయోగించక పోవడం వల్ల వాళ్ళ పేర్లు యథాతథంగా తెలుసుకోవడం కష్టం అయ్యింది. అందుకని అది వదిలేసి A Study Ratnaprabha  అని Topic మార్చుకుని మళ్ళా మొదలెట్టాను . ఆ రోజుల్లో నాకు వచ్చే  scholarship నెలకు 250 రూపాయలు. Field work కి ఎక్కడికి వెళ్ళాలన్న చాల డబ్బు కావలసి వచ్చేది. అందులోనూ నా పరిశోధనకు కావలసిన  పుస్తకం ఒకటి publish కాలేదు. అది manuscript రూపంలోనే ఉంది . అది చదివితే గాని  వర్క్ పూర్తి కాదు. ఆ పుస్తకం మద్రాస్ గవర్నమెంట్ ఓరియంటల్ లైబ్రరీ లో ఉన్నట్లు తెలిసింది . Minnesota University కి సంబంధించిన Karl H Potter మహాశయుడు ప్రపంచంలో ఏ సంస్కృత గ్రంథం ఏ ప్రాతంలో ఉంటుందో తెలియజేసే Potters Bibliography అనే గ్రంథం తయారు చేశాడు. ఆ తరువాత New Catalogues cataloguer అనే గ్రంథాన్ని Dr.V. రాఘవన్ గారు రూపొందించారు . అది ఏ పుస్తకం ఎక్కడ  దొరుకుతుందో, అది ఏ  పరిస్థితిలో ఉందో కూడ చెపుతుంది. మొత్తం మీద వాటి సహాయంతో ఆ పుస్తక Madras Government manuscripts లైబ్రరీ లో   ఉందని తెలుసుకుని   అక్కడకెళ్ళి copy చేసుకుని రావలసొచ్చింది. ఆ రోజుల్లో  మద్రాసులో ఉండడం కొంత ఖర్చుతో కూడిన పని. అందుకోసం విశాఖపట్నంలో నేను కొన్ని నెలలు పార్ట్ టైం టీచర్ గా పని చేశా . కొన్నాళ్ళు అక్కడుండి పుస్తకం copy చేసుకున్నాను. డైరెక్టర్ గారిని అభ్యర్ధిస్తే ఆయన ఆ ప్రతిని తన ఆపీసులోనే పని చేసే తిరు జ్ఞాన సంబందర్ అనే వ్యక్తికిచ్చి ఆయన ఇంటికి వెళ్లి వ్రాసు కొమ్మని చెప్పారు . ఆ విధంగా కొంత సమయం ఆదా అయ్యింది . ఈ లోపులో నాకు ఉద్యోగం వచ్చిన కారణంగా పరిశోధన కొనసాగించడం చాల కష్టమే అయింది . ఈ సందర్భంగా నేను గ్రహించిన దేమిటంటే సాధ్య మైనంతలో ప్రతి విద్యార్థి ప్రతిక్షణం చాల విలువైనదిగా భావించాలని , సాధ్యమైనంతలో డబ్బు సంపాదనకు ప్రయత్నించకుండా పరిశోధనపైనే దృష్టి పెట్టాలని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను .           ఆ తరువాత శ్రీ రాణి. నరసింహ శాస్త్రి గారి వద్దకెళ్ళి కొన్ని గ్రంథాలు చదవవలసి వచ్చింది. నా అదృష్టమేంటంటే           మా గురుదేవులు శ్రీ వేదుల సుందరరామ శాస్త్రి గారు ( మొసలపల్లి ) నేను కూడ నీతో పాటు చదువుతాన్రా అన్నారు. ఇక మా గురువు గారు, శ్రీ రాణి నరసింహశాస్త్రి గారు (మోడేకుఱ్ఱు )  బాల్యమిత్రులు. ఒరేయ్ అంటే ఒరేయ్ అనుకునే స్నేహం వారిది . ఈ విధంగా మా గురువుగారితో కలసి వారి వద్ద చదవడమనే  అరుదైన అదృష్టం నాకు కలిగింది. ఆ తరువాత ఉద్యోగ నిమిత్తం గుడివాడలో ఉంటున్న కారణంగా మా గురుదేవులైన శ్రీ రామలాల్ శర్మగారి సహాయంతో శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రిగారిని కలుసుకునే అదృష్టం కలిగింది . వారిద్దరి సంప్రదింపులతో విషయం పై అవగాహన కలిగింది. శ్రీ రాణి శ్రీనివాస శాస్త్రిగారు  ,  వారి కుమారులు శ్రీ రాణి నరసింహమూర్తి గారల సహకారంతో ఆదరాభిమానాలతో పరిశోధన కార్యక్రమం పూర్తయింది. మా Guide,  Professor P. శ్రీరామ మూర్తి గారు. పుస్తకం type చేయిస్తే రెండో కాపి , మూడో కాపి సరిగ్గా రావు  అందువల్ల type చేయించొద్దు చేతితో వ్రాయన్నారు .

వంచిన తల ఎత్తకుండా వ్రాస్తే పుర్తి కావడానికి నెల రోజులు పట్టింది .   మొత్తం మీద మూడు ఏళ్లలో పూర్తి కావలసినది నాలుగేళ్లు పట్టింది. .        నేను కన్వోకేషన్ థియేటర్ లో కూర్చున్నంత సేపు ఈ పరిశోధనలో నాకు సహకరించిన పెద్దలను గురించి కృతజ్ఞతా పూర్వకంగా గుర్తు తెచ్చుకుంటూ ఏదో ఆలోచిస్తున్నాను. ఈ లోగా  నా పేరు పిలిచారు . వెంటనే పైకి వెళ్లాను . ఆనాటి రాష్ట్ర గవర్నర్ Ms. Kumud Ben Joshi గారు ఆ పతకాన్ని నా మెడలో వేస్తారు. అదొక మరపురాని అనుభూతి . ముఖ్యంగా చెప్పేది  ఏంటంటే ఆ సంవత్సరం కాన్వొకేషన్ కి ఇసుకేస్తే రాలని జనం  హాజరయ్యారు . దానికి కారణం ఒకరు క్రికెట్ క్రీడాకారుడు గవాస్కర్ గారైతే , రెండోవారు  శ్రీ దర్శకుడు నారాయణరావు గారు. నేను అంతకుముందు కొన్ని  కాన్వొకేషన్ లకు హాజరైనా  అంతమంది జనాన్ని నేనెప్పుడు చూడలేదు.

<><><> 

Friday, December 13, 2024

అనుభవాలు -జ్ఞాపకాలు-7 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

అనుభవాలు -జ్ఞాపకాలు-7

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

అది 1978. నేను పాలకొల్లులో భాషప్రవీణ పాసై, రాజమండ్రిలో  ట్రైనింగ్  కూడ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను . ఒక రోజున మా అమ్మ నాతో ‘ ఒరేయ్  మన డాక్టర్  కేశవరావుగారి దగ్గరకెళ్లి  ఎక్కడైనా ఉద్యోగం వేయించమని అడుగు’ అంది . నేను సరే అన్నాను.  మా ఫ్యామిలీ డాక్టర్ శ్రీ కేశవరావుగారి ఇంటికెళ్ళి నాకు ట్రైనింగు పుర్తి అయింది ఎక్కడైనా ఉద్యోగం వేయించండి’ అనడిగాను. ఆయన నాతో పాలకొల్లులో మా అన్నయ్య  డాక్టర్ గోపాలం ఉన్నారు కదా! ఆయన నీకూ తెలుసు.  ఆయన దగ్గరకెళ్ళి అడుగు. నా కంటే మీ ప్రిన్సిపాల్ శ్రీ L.Vసుబ్రహ్మణ్యం  గారి మాట మా అన్నయ్య బాగా వింటాడు. నువ్వు ఆయన ద్వారా కలుసుకుంటే చాల మంచిదయ్యా  అన్నారు. నేను వెంటనే పాలకొల్లు వెళ్లి ప్రిన్సిపాల్ గారిని  కలుసుకుని నమస్కారం పెట్టి   విషయం చెప్పాను. ఆయన మండిపడ్డారు . ఓరి సన్నాసి ! ఇప్పుడే నీకు ఉద్యోగం కావలసొచ్చిందా . అదేం కుదరదు, M.A చదువు . అప్లికేషను పెట్టడానికి రేపే చివరి తేదీ . వెంటనే ఈ రాత్రికే బయలు దేరు. కావాలంటే డబ్బులిస్తాను అన్నారు . నేను గతుక్కుమన్నాను . అన్నీ వదలిపెట్టినవాడు సన్యాసి అందరు వదిలేస్తే వాడు సన్నాసి అని సుప్రసిద్ధ అవధానశేఖరులు శ్రీ రావూరి వేంకటేశ్వర్లుగారు ఎక్కడో అవధానంలో చెపితే విన్నాను. ఇక మా ప్రిన్సిపాల్ గారి గురించి చెప్పాలంటే మళ్ళీ నన్నయగారి దగ్గరకెళ్ళాలి. నిండుమనంబు నవ్యనవనీత సమానము పల్కు దారుణాఖండలశస్త్ర తుల్యము.  ఆయన అమృతహృదయులు. మనసు మంచి మాట పెళుసు. అది నాకు బాగా తెలుసు .  ఐనప్పటికీ నాకు పై చదువు చదివే  ఆలోచన లేనే లేదండీ!  అనేశాను  కొంచెం ధైర్యం తెచ్చుకుని . కాని ఆయన ససేమిరా  ఒప్పుకోలేదు . వెంటనే బయలు దేరతావా? లేదా? అన్నారు . ఇంకేమీ మాట్లాడే ధైర్యం లేక ‘సరేనండి’ అన్నాను . నువ్వు M.A సంస్కృతం చదువు. ఎందుకంటే M.A తెలుగులో చేరితే నీకు కొత్తగా ఏమీ అనిపించదు, నువ్వు ఇక్కడ చదివినవే అక్కడ కూడ చదవవలసి వస్తుందని సూచన చేశారు. నేను ఆ రాత్రికి రాత్రే బయలుదేరి విశాఖపట్నం చేరుకుని M.A తెలుగు M.A సంస్కృతం రెంటికి అప్ప్లై చేశాను. రెంటిలోనూ సీట్ వచ్చింది. నేను సంస్కృతంలోనే చేరడానికి నిశ్చయించుకుని ఇంటర్వ్యూకి హాజరయ్యాను. ఆ కాలంలో సంస్కృతంలో చాల specialisations ఉండేవి . ఏది తీసుకోవాలో నాకు సరైన అవగాహన లేదు . అక్కడున్న ప్రొఫెసర్. శ్రీరామమూర్తిగారిని అడిగాను. ఈ సంవత్సరం దర్శనాలు అనే ఒక కొత్త specialisation ప్రారంభిస్తున్నాం . అది తీసుకుంటే బాగుంటుంది అన్నారు. అప్పట్లో నాకు అదేమీ తెలియలేదు. సరే అన్నాను. ఆ సబ్జెక్ట్ చాల కష్టమైనదైనా,  అది తీసుకోవడం వల్ల  ఆ తరువాత అందులోనే Ph.D చేయడం వల్ల నాకు ఎన్నెన్నో మంచి  అవకాశాలు లభించాయి.

నేను ఇప్పటికీ అనుకుంటాను. ఆ రోజు  మా అమ్మ అలా అనక పోయినా, నేను ఆ మాట వినక పోయినా,  ఆ రోజే మా ప్రిన్సిపాల్ గారి వద్దకు చనక పోయినా, పై చదువు చదివే అవకాశం వచ్చేది కాదేమో! అని .

           <><><>

Sunday, December 8, 2024

అనుభవాలు - జ్ఞాపకాలు-6 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 

అనుభవాలు - జ్ఞాపకాలు-6

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 

నేను  1972 లో పదో తరగతి  పాసయ్యాను. 59% మార్కులు వచ్చాయి. నాకు   పరీక్షలని కూడ  ఆలోచించకుండా మా అమ్మా, నాన్న మా తాతయ్య గారి షష్టిపూర్తి కార్యక్రమానికి  వెళ్లారు. నేనే ఎలాగో ఒంటరిగా ఉండి పరీక్ష వ్రాశాను.    వాళ్ళు వెళ్ళకుండా ఉంటే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేవేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. ఇక పై  చదువు చదవాలి. మా నాన్న గారు ‘నిన్ను కాలేజీలో చదివించలేన్రా’ అని చెప్పేశారు. ఆ నాటి పరిస్థితులలా ఉండేవి .   ఏమి చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాను . ఒకసారి మా ఇంటికి మా తెలుగు మాస్టారు శ్రీ ఆకెళ్ళ సూర్యప్రకాశరావు గారు వచ్చారు . ఆయనంటే నాకే కాదు , మా నాన్న గారెకి కూడ గురుభావమే ఉండేది  . ఆయన మా నాన్నగారితో వీడికి తెలుగు బాగా అబ్బు తుంది, పాలకొల్లులో కొత్తగా కాలేజీ పెట్టారు. అక్కడ చేర్పించండి అన్నారు. నాకు మాత్రం physics అంటే చాల ఇష్టం. దానికి కారణం  హైస్కూల్లో శ్రీ గోటేటి కనకలింగేశ్వరరావు (GKL) గారు చాల ఆసక్తికరంగా  సైన్సు పాఠాలు చెప్పేవారు . ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు laboratory కి తీసి కెళ్ళి అన్నీ వివరిస్తూ ఉండేవారు. సైన్సులో మార్కులు కూడ పరవా లేదు, 65% వచ్చాయి . మొత్తం మీద ఆ కోరిక నెరవేరలేదు. పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వరస్వామి ఓరియంటల్ కళాశాలయే ఖాయం అయ్యింది.  అది  శ్రీ క్షీరారామలిoగేశ్వరస్వామివారి   కృపాకటాక్షవీక్షణాల  వలన అప్పుడే  ఏర్పడింది. ప్రారంభంలో గుడిలోనే వెనుక పాఠాలు చెపుతూ ఉండేవారు . శ్రీ అత్యం నరసింహ మూర్తి అనే మహనీయుడు (M.A New York) ఆ కళాశాలను ప్రారంభించిన వారిలో ఒకరు . భాషాప్రవీణ  ఎంట్రన్సు పాఠాలు చెప్పడానికి శ్రీ మండలీక వేంకటరావుగారు సాయంకాల సమయంలో వచ్చేవారు. వారు సాయంకాలం ప్రైవేట్లు చెప్పుకుంటే ఆనాడే కొన్ని వందలు సంపాదించ గలిగే వారు. కానీ వారన్నీ వదులుకుని మాకు ఉచితంగా పాఠాలు చెప్పేవారు  వారి ఋణం మేమెన్ని  జన్మలెత్తినా తీర్చుకో లేనిది. వారు పెట్టిన జ్ఞానభిక్షతో భీమవరం D.N.R college లో Entrance వ్రాసి  పాసయ్యాక ప్రిలిమినరీ లో చేరాం. మాది రెండో బ్యాచ్ . శ్రీ లంక విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం గారు ప్రిస్సిపాల్ . సాధారణంగా మన పెద్దలు పురాకృత సుకృతం అని ఒక మాట అంటూ ఉంటారు . అదేమిటో మాకు ఆ నాడే తెలిసింది . అప్పుడే శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు (మహాకవి , మూర్తీభవించిన అంధ్రసరస్వతి), శ్రీ వేదుల సుందరరామశాస్త్రి గారు (భాష్యాంతవైయాకరణి, శ్రీ తాతా రాయడుశాస్త్రి గారి శిష్యులున్ను)  అధ్యాపకులుగా నియమితులయ్యారు. ఒకరు తెలుగువ్యాకరణం,  సాహిత్యం,  రెండోవారు సంస్కృత వ్యాకరణం, సాహిత్యం  చెప్పేవారు .  ఇద్దరూ ఇద్దరే ఎటువంటి పుస్తకాపేక్ష లేకుండా ఏ విషయాన్నైనా బోధించడమే వారి వృత్తి, ప్రవృత్తి కూడ.      

ఆ రోజుల్లో నేను మా కాలేజీ గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు ఒక పద్యం చెప్పేవాణ్ణి.

మహిమున్వాగనుశాసనుండు  సృజియింపన్ కుండలీంద్రుండు   

న్మహనీయస్థితిమూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్మహా

మహులై సోముడు, భాస్కరుండు వెలయింపన్  సొంపువాటిల్లు  నీ

బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్యమూహించెదన్ .

ఇది ఆంధ్రసారస్వతం పుట్టుక, వికాసాలను    ప్రపంచంతో పోలుస్తూ  భట్టుమూర్తి చెప్పిన పద్యం.

ఇది నేను మా కలాశాల పుట్టుక వికాసాలకన్వయించేవాణ్ణి.

ఇక వాగనుశాసనులు శ్రీ అత్యం నరసింహ మూర్తి గారు ఆయన న్యూయార్కులో M.A చదువుకున్న వ్యక్తి. అప్పుడప్పుడు మా దగ్గర కొచ్చి చదువు యొక్క గొప్పతనం, ఇంకా ఎన్నో విషయాలు చెపుతూ ఉండేవారు. రెండో వారు కుండలీంద్రులు. ఆయనే మండలీక వారు . ఆయన లేక పోతె కాలేజీయే లేదు . ఇంట్లో కొంతమంది  పిల్లలకు భోజనం కూడ పెట్టి చదువు చెప్పిన సందర్భాలెన్నో.  ఇక మూడవ వారు శ్రీనాథులు ప్రిన్సిపాల్ శ్రీ లంక విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం గారు. ఆ తరువాత సోముడు  శ్రీ మల్లంపల్లి వారు, భాస్కరులు శ్రీ సుందరరామశాస్త్రి గారు. శ్రీ లంక విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం గారు శ్రీనాథుడు , కాదంబరి చెప్పేవారు. శ్రీ మల్లంపల్లి వారు మహాకవి .  సూరి మరపించి అభినవసూరిగా పేరు పొందిన గొప్ప పండితులు. వారు   తెలుగు ప్రబంధాలు , వ్యాకరణం చెప్పేవారు. శ్రీ సుందరరామశాస్త్రి గారు సిద్ధాంతకౌముది , భారవి చెప్పేవారు . ఆ తరువాత నియమితులైన డాక్టర్ శ్రీపాద కృష్ణమూర్తి గారు , శ్రీ సోమంచి సత్యనారాయణ గారు సంస్కృతకావ్య, నాటకాలు,   శ్రీ వీరుభొట్ల కుటుంబసత్యనారాయణ గారు ఆహోబలపండితీయం, ఆధునికకావ్యాలు, శ్రీ V.ప్రభాకరం గారు సంస్కృతవ్యాకరణం చెప్పేవారు .  వారు అందరు సంస్కృతాంధ్రభాషల్లో నిష్ణాతులు కావడంతో బాటుగా ఒక్కొక్కరు ఒక్కొక్కశాస్త్రంలో పరిపూర్ణమైన ప్రజ్ఞాపాటవాలు గలవారు. అందరు విద్యార్థులను సుతనిర్విశేషంగా ప్రేమించేవారు.               

                సాధారణoగా ఓరియంటల్ కళాశాలల్లో సoస్కృతాంధ్రభాషల్లోనువివిధశాస్త్రాల్లోను ఆరితేరినవారు కనిపిస్తారు. కాని ఆంగ్లభాషాభిజ్ఞులు చాల అరుదుగా కనిపిస్తారు. అటువంటి అరుదైన వారిలో శ్రీపాద వారు ఒకరు. ఏ పుస్తకం వెలువడినా అది ఆయన ముందుగా చదివేవారు . అందుకే మా మిత్రుడు సాంబశివరావు  ఆయన గురించి చెపుతూ

పుస్తకంబును మునుముందు ముట్టువారు

పరగనొజ్జలు మనకు శ్రీపాద వారు అనేవాడు.

వీరికి  మరో ముఖ్యమైన విశేషమేమంటే వారికి ఇంచుమించు ఆధునిక కవులందరితోను ముఖ్యంగా శ్రీయుతులు నారాయణరెడ్డి, బాలగంగాధరతిలక్ వంటి కవులతో   స్నేహసంబంధాలున్నాయి. అందుకేనేమో  ఆధునిక తెలుగుకవితారీతులు  ఆయనకు కరతలామలకాలు.  అటు నన్నయ్య గారి నుండి ఇటు నారాయణరెడ్డి గారి వరకు అందరి కవితారీతులు ఆయన  అలవోకగా వివరించేవారు. ప్రాచీన సాహిత్యాన్ని  ఎంత ఆసక్తికరంగా బోధించే వారో ఆధునిక సాహిత్యాన్ని కూడ అంతే ఆసక్తికరంగా బోధించే వారు. ప్రతిపద్యాన్ని రసానుగుణంగా చదివేవారు. ఇక ఆంధ్రసాహిత్యచరిత్ర ఏ గ్రంథo చూడకుండానే  అలవోకగా డిక్టేట్ చేసేవారు. మాకు చాల ఆశ్చర్యంగ ఉండేది.       

        ఇక  రాత్రి వేళల్లో  మేము చదువుతున్నామో లేక సినిమాలకు , షికార్లకు పోతున్నామో తెలుసుకోడానికి తరచుగా వస్తూ ఉండేవారు. తప్పు చేస్తే తిట్టే వారు కాదు. మృదువుగా మందలి౦చేవారు. 

యాస్కమహర్షి ఉపాధ్యాయుని లక్షణాలు వివరిస్తూ ‘ ఆచరతీతి ఆచార్య:, ‘ఆచారం గ్రాహయతీతి ఆచార్య:, ‘ ఆచినోతి అర్థానితి ఆచార్య:’ అంటారు . ఈ మూడు లక్షణాలు మా కళాశాల అధ్యాపకుల్లో  పుష్కలంగా ఉన్నాయి.

ఇక శ్రీ అత్యంవారికి  , అద్దేపల్లి వారికి  , రేపాకవారికి సంబంధించిన సత్రాల్లో భోజనం చేస్తూ ఉండేవాళ్లం . కొన్ని సమయాల్లో అన్నదాన సమాజంలోను  , దేవస్థానంలోను కూడ భోజనం చేసే వాళ్లం. 

ఇక విద్యార్థులు మాటకొస్తే అందరు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వాళ్ళే . తినడం చదువుకోవడం తప్ప వేరే పని లేదు . అప్పుడప్పుడు మాత్రం  సినిమాలు చూసే వాళ్ళం .

కుల, మత, వర్గ, ప్రాంతీయభేదం లేకుండా కలసిమెలసి ఉండేవాళ్లం . అందరు సహ విద్యార్థినుల పట్ల సోదరభావంతో చాల మర్యాదగా ప్రవర్తించే వాళ్ళం.

        ఇక ఒక్కొక్క విద్యార్థిలో ఒకొక్క ప్రత్యేకత ఉండేది. మల్లాది సాంబశివరావు ఉండేవాడు . ఏ భావాన్నైనా ఏ పద్యంలోనైనా  ఇమడ్చ గల సమర్థుడు. ఏ పద్యం నుంచైనా  ఒక విశేషార్థాన్ని రాబట్టగల ప్రజ్ఞాశాలి. గోరస సుబ్రహ్మణ్యాచార్యులు అనే మరొక మిత్రుడు  ఉండేవాడు. తెలుగు వ్యాక రణంలో నిధి. ప్రపంచంలో ఉన్న బాలవ్యాకరణ ప్రతులను ఒకవేళ ఎవరైనా కనబడకుండా దాచేసినా    అప్పచెప్పగల ధీశాలి. అతను కొన్ని సందేహాలడిగితే అధ్యాపకులే చాల ఆలోచించి గాని సమాధానం చెప్పలేకపోయే వారు. వరదా రామలింగం మరొక మిత్రుడు. పొరుగూరి నుంచి సగం దూరం బస్సులోను, సగం దూరం నడిచీ   వచ్చేవాడు . ఆ రోజుల్లోనే సంస్కృతంలో శ్లోకాలు, నాటక రచనలు చేసేవాడు .   సుభద్రరావు ఇంకొక మిత్రుడు. ఎప్పుడు పుస్తకాల్లోనే మునిగి తేలేవాడు. ఇక గంటి ముత్యాలరావు మరొక మిత్రుడు. ఎంత అల్లరి చేసే వాడో  అంత కంటే  బాగా చదివే వాడు. ఒకసారి  కాలేజీకి చేరువలో ఒక పెద్ద సభ జరుగుతోంది . అతను కూడ వెళ్ళాడు . సభ జరుగుతుండగా మధ్యలో లేచి స్టేజ్ దగ్గరకు వెళ్లి ‘గంటి ముత్యాల రావు అనే బాలుడు  తప్పిపోయాడు’ అని announcement చేయించి తాపీగా తన సీట్లోకొచ్చి ముసిముసి నవ్వులు నవ్వుకుంటు కూర్చున్నాడు. పాపం! వాళ్ళు కార్యక్రమం ఆపి, ఎంతో సమయం announcements చేసి చేసి ఎప్పటికీ తప్పిపోయిన పిల్లవాడు దొరక్క పోవడంతో  మళ్ళీ  తమ కార్యక్రమం కొనసాగించు కున్నారు .    ఇక అనిపెద్ది. జగన్నాథ శాస్త్రి మరొక మిత్రుడు . ఆధునిక కవిత్వం కోసమే పుట్టాడా అన్నట్లు శ్రీశ్రీ గారినే ఆరాధిస్తూ అవే చదువుతో ఉండేవాడు. ఆధునిక కవితా రీతులపై మంచిపట్టు సంపాదించాడు . మరొక మిత్రుడు గారపాటి ధర్మారావు . అతను అప్పటికే వివాహితుడు మాతో పాటు పోటాపోటీగా చదివేవాడు. ఇంకా చాల మంది ఉన్నారు . వాళ్ళ గురించి ప్రస్తావించ లేకపోతున్నందుకు చింతిస్తున్నాను .   

          ఇక అల్లరి విషయంలో అందరు ఆరితేరిన వారే . అది అందరిని అలరించేదిగా  ఉండేది గాని ఎవరినీ నొప్పించే విధంగా ఉండేది కాదు.

ఒకసారి ఒకరి పుట్టినరోజు వచ్చింది. దీపాలార్పడం కార్యక్రమాల్లో ఒక భాగం. కొవ్వొత్తులు కొనాలి . డబ్బు దండగ .  ఒకరికి ఒక ఐడియా వచ్చింది . మా దగ్గరున్న ‘ స్టౌ’ తీసుకొచ్చి  ఒకసారి వెలిగించారు . మళ్ళీ ఆర్పేసి మరొక సారి వెలిగించి ఆర్పేశారు. అది ఇరవై ఏళ్ళ పండుగ కాబట్టి సరిపోయింది. ఒకటి అటు ఇటు ఐతే కొంచెం ఇబ్బంది అయ్యేది .

ఇక శివరాత్రికి పిల్లలం అందరం క్షీరారామలింగేశ్వరుని సేవల్లో పాల్గొనే వాళ్ళం. ఆ రోజుల్లో అక్కడ చదవడం వల్లనే  శ్రీయుతులు రావూరి వేంకటేశ్వర్లు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి , మంగళంపల్లి బాలమురళీకృష్ణ , తుమ్మల సీతారామమూర్తిచౌదరి, ఆచార్య తూమాటి దొణప్ప , దాసరి నారాయణ రావు , అల్లు రామలింగయ్య , రావు గోపాలరావు , శ్రీమతి  శ్రీరంగం గోపాలరత్నం వంటి పండితులను, సుప్రసిద్ధకళాకారులను స్వయంగా చూసే భాగ్యం కల్గింది . నేను కేవలం కొంతమంది మిత్రుల గురించే ప్రస్తావించాను. మా ముందు మా తరువాత ఎంతోమంది ఎన్నో ఉన్నతమైన చదువులు చదివారు. అక్కడ చదువుకున్న విద్యార్థులందరు ఎన్నెన్నో ఉన్నతస్థానాలు పొందారు.   అవన్నీ చెప్పాలంటే అదొక మహాభార(త)మే అవుతుంది.

ఇక ఆర్ధికమైన ఇబ్బందులు, కష్టాలు  ఎన్నున్నా ఆ రోజులు మఱపురానివి, , మఱువలేనివి. నా అభిప్ర్రాయ ప్రకటనలో ఎవరినైనా నొప్పిస్తే మన్నించ ప్రార్థన.

            <><><>

 .

Sunday, December 1, 2024

శ్రీ కాడుమల్లేశ్వరశతకం-2రచన : ఆచార్య .వేదుల సుబ్రహ్మణ్యం సమీక్ష : డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

        అభినందనమందారమాల

                        శ్రీ కాడుమల్లేశ్వరశతకం-2 

     రచన : ఆచార్య .వేదుల సుబ్రహ్మణ్యం 


                                                                     సమీక్ష : డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు


   

   ఉదయంతు శతాదిత్యా: ఉదయంత్వి౦దవశ్శతం

   న వినా కవివాక్యేన నశ్యత్యాభ్యంతరం తమ:

 

వందమంది సూర్యులు ఉదయి౦చు గాక, వందమంది చంద్రులు ఉదయి౦చు గాక, మనిషి

 హృదయా౦రాళాల్లో దాగిన అజ్ఞానం కవి మాటల వల్ల మాత్రమే తొలగిపోతుంది, ఇంకో మార్గం

 లేదు. కవి పలుకులకు అంతటి శక్తి ఉంది. కవి సమాజంలో నెలకొన్న అజ్ఞానాన్ని

  తొలగించడానికి తన ఆలోచనల్ని అక్షరబద్ధం చేసి ఆయుధంగా ఉపయోగిస్తాడు. అవి

 సమాజాన్ని ఆలోచి౦చేలా చేస్తాయి. ఆ పని కవి మాత్రమే చేయగలడు. మరొకరికి సాధ్యం  కాదు

. ఎందుకంటే కవి కలంనుంచి జాలువారిన  ఒక్క సిరాచుక్క కొన్ని లక్షల మందిని

 ఆలోచించేలా చేస్తుందిఆంగ్లమహాకవి బైరన్ మాటల్లో చెప్పాలంటే.

 

But words are things; and a small drop of ink

Falling, like dew upon a thought, produces

That which makes thousands, perhaps millions think.

(Byron-Don Juan, canto III, st.88)

 

 అందువల్ల సమాజాన్ని కవి మాత్రమే మార్చగలడు. అతనికి సాధ్యం కాని దేదీ లేదు .

ఈ వ్యవస్థ మారదనే వాదానికి తావు లేదు, రాక్షసవృక్షం సైతం రంపానికి లొంగుతుంది


అంటారొక ఆధునిక కవి.

 

ఇక సాహిత్యప్రక్రియల్లో శతకప్రక్రియ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్షరాల్ని

 పొదుపుగా వాడుకుంటూ చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్పే సౌలభ్యం ఇందులో ఉంది.

 అంతే  గాక తిక్కన వంటి  ఎంతో మంది మహాకవులు ముందుగా శతకరచనను చేపట్టి కవిగా

 పేరుతెచ్చుకుని ఆపై కావ్యాలను వెలయించిన వారే.

       

ఆధునిక కాలంలో భక్తిజ్ఞానవైరాగ్యాలను  ప్రబోధించే ఎన్నో శతకాలు వెలువడు తున్నాయి

 . అటువంటి శతకాల్లో శ్రీ కాడుమల్లేశ్వరశతకం ఒకటి. కవి ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యం గారు.

 ఈయన  విజ్ఞానశాస్త్రంలో ప్రఖ్యాతి గాంచిన మహా మనీషి. వీరు, మా గురుదేవులైన శ్రీ వేదుల

 సుందరరామశాస్త్రిగారి కుమారులు. శ్రీ వేదుల సందరరామశాస్త్రి గారు విశ్వ విఖ్యాత

 వ్యాకరణశాస్త్రపండితులు శ్రీ తాతా  రాయుడు శాస్త్రి గారి అంతేవాసి. భాష్యాంతవైయాకరణి

, ఉత్తమఅధ్యాపకులు, కవి, పండితులు, బహుగ్రంథకర్త. ఇక సుబ్రహ్మణ్యం గారి  విషయానికొస్తే

 ఇంతటి కవితాశక్తి వీరికి ఎలా అబ్బి౦దనేది అందరికి  ఆశ్చర్య౦ కలిగించే విషయమే.

  శ్రీ సుందరరామ శాస్త్రి గారి కుమారులుగా జన్మించడం, వారినుండి సాహితీ వారసత్వం

 పొందడం ఒక కారణమైతే చతురకవిత్వతత్త్వపటుసంపద ఒక్కరి సొమ్ము గాదు భారతి

 దయ  అన్న కనుపర్తి అబ్బయామాత్యుని పలుకులు మరొక కారణం కావచ్చు.  అంతేగాక

 కవితాకన్య ముక్తికా౦త ఎవరినెప్పుడు వరిస్తారో ఎవరికీ తెలియదు. ఈ గ్రంథానికి మరో

 విశేషముంది. ఇది రెండవ సంపుటం. స్తోత్రప్రియుడైన ఆ కాడు మల్లేశ్వరస్వామియే మరోసారి

 ఈ శతకాన్ని కోరి వ్రాయి౦చుకున్నట్లుగా తోస్తుంది.

 

ఛందోబద్ధములైన పద్యసుమముల్ సంసేవనా చిత్తమున్

ముందుంచన్ జని నిన్ను దేవళమునన్ మ్రొక్కంగ నేబోవ నా

యందున్ కల్గె వినూత్న భావమొక దివ్యాదేశమై యొప్పి నా

కందెన్ నేను మరిన్ని పద్యములు వ్రాయన్ కాడుమల్లేశ్వరా !  3

 

మొదటి వంద పద్యాలకు తనివి తీరక మరల మరల ఈయన స్తుతులు వినాలనే కోరికతో ఈ

 రచనకు పురిగొల్పడం బట్టి చూస్తే ఆ స్వామికి ఈ భక్తునిపై ఎంత దయ, వాత్సల్యాలు

 ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. రచయిత స్వయంగా ఈవిషయాన్ని ప్రస్తావించడ౦

గమనార్హం.

  

సాధారణంగా ప్రతి రచనలోను  కవిహృదయం ఎంతో కొంత ప్రతిఫలిస్తుంది. ఇక శతకరచన

 మాటకొస్తే  నూటికి నూరుపాళ్ళు కవిహృదయం ప్రతి ఫలిస్తుందనడంలో ఎటువంటి సందేహం

 లేదు. కవి భక్తి జ్ఞాన వైరాగ్య భావాలను వెదజల్లడంతో బాటుగా సమకాలీన సమస్యలను,

 సమస్యలకు పరిష్కార ముద్రను కూడ సూచించారు.

 

భగవంతుడొక్కడే అని ఆయన్ని అనేక పేర్లతో వ్యవహరిస్తున్నారని ఏకం సద్విప్రా: బహుదా

వదంతి అని ఋగ్వేదం ఘోషిస్తోంది. ఆ వైదిక భావాన్ని చాల అందంగా ఈ క్రింది పద్యంలో

 పొందుపరచి మతసామరస్యానికి మంచి మార్గం ఏర్పరిచారు.

 

            నీవే రాముడ వీవె కృష్ణుడనగ న్నిన్నీశు డంద్రందరున్   

    నీవే బుద్ధుడ వీవె సాయివి మరి న్నీవే గదా యేసువున్!


    నీవే యొక్కడ విందరన్న నిజము న్నేనాడు గుర్తింతురో!     

            నీవే సర్వమనంగ కొల్తును సదా నిన్ కాడుమల్లేశ్వరా !          40

 

దేశ క్షేమానికై తను మన ప్రాణాల్ని అర్పిస్తున్న జవానుల సేవల్ని స్తుతిస్తూ వారు కర్తవ్య విధిలో

 మరణిస్తే వారికి ముక్తి ప్రసాదింపుమని కోరడం వీరి దేశభక్తికి ఒక మంచి ఉదాహరణ.

 

దేశక్షేమము గోరి రక్షణ విధిన్ ధ్యేయంబుగా నిల్పి తా

లేశంబైనను ప్రాణభీతి యనగన్ లేకుండగా శత్రులన్

దేశంబావల తర్మిగొట్టి తన యాధిక్యమ్ము కర్తవ్యమున్

సౌశీల్యంబును చాటు యోధునకిదే జై కాడు మల్లేశ్వరా !   15

 

          స్వజనంబెల్లర దూరముంచియు మహాసంగ్రామముల్ పోరి దే

శ జనక్షేమము గోరి ముందుజని నిస్స్వార్ధంబుగా పోరియున్

నిజ కర్తవ్యము నిర్వహించు విధిలో నీ సన్నిధిన్ జేరగా

             విజయంబొందిన కీర్తి సద్గతుల నీవే కాడు మల్లేశ్వరా !       16

 

ఈ లోకంలో హింసా ప్రవృత్తితో పేట్రేగి  పోతున్న దుష్టులనుపేక్షిం పవలదని వారిని

 భస్మీపటలం చెయ్యమని   శివునితో  మొరపెట్టు కొన్న ఈ పద్యం ఎంతో హృదయంగమంగా

 ఉంది.

 

కైలాసంబున వాసముండి జగతిన్ కాలాగ్నిరుద్రుండవై

యేలా యూరక నుందు వయ్య తగునే యింకన్నుపేక్షింప! నీ

ఫాలాగ్నిన్ రగిలించి భస్మమొనరింపన్ జెల్లు హింసాత్ములన్    

జాలింజూపగ పాత్రులౌదురె గిరీశా! కాడుమల్లేశ్వరా !      14

 

మాతృభాషలో విద్యను బోధించడం వల్ల చాల ప్రయోజనాలున్నాయని, అదే వాక్సతికి నిజమైన

సేవ అని ప్రకటి౦చే ఈ పద్యం వారికి మాతృ భాషపట్ల వారికి గల అపారమైన ప్రేమను

 సూచిస్తోంది.

 

మంచిన్ బెంచుచు మాతృభాషను సుసంపన్నంబు గావించి నీ

పంచన్ చేరిన పిల్లలందరకు నీ భాషన్ ప్రబోధించి సే

వించ న్నేర్పుచు నోర్పుతో సుజనతన్ వేనోళ్ళ బోధించి ప్రే

మించన్ వాక్సతి గొల్చు భాగ్యమదె సుమ్మీ కాడుమల్లేశ్వరా !   43

 

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకు తోలెయ్యకుండా ఇంటిలోనే వారిని ఉంచుకొని

 ప్రేమతో చూడడం ఉత్తమమైన ధర్మమని దాన్ని మించిన ధర్మం మరొక్కటి లేదని ఆ విధంగా

ఆచరించే వాడే  ధన్యుడని చెప్పినపద్యం నేటి సమాజానికి ఎంతో కనువిప్పు కలగజేస్తుంది. 

 

వృద్ధాప్యంబున తల్లిదండ్రులను సేవింపంగ లేమంచు నా

పద్ధర్మంబుగ వేరె యాశ్రమములం బంపంగ యోచించియున్

సద్ధర్మంబు స్ఫురింపగా తనదు స్వస్థానంబు నన్నుంచి తా

శ్రద్ధన్ జూపిన వాడు ధన్యుడు గిరీశా! కాడుమల్లేశ్వరా !                 12

 

దేశం సుసంపన్నం కావాలంటే ద్వేషం ,అసూయ,క్రోధం మొదలైన దుర్గుణాలు విడనాడాలని

  ఈ జగత్తులో ఉండే  జనులలో ఆదుర్గుణాలు లేకుండా చెయ్యమని వేడుకుంటున్న ఈ పద్యం

 చాల హృద్యంగా ఉంది.  

 

జగతిన్ ద్వేషమసూయక్రోధములు సంజాతమ్ములై యుండగన్

ప్రగతిన్ పొందగ నౌనె! దేశము సుసంపన్నంబు గానౌనె! కా

దుగదా! కూడని చర్యలన్ కుటిల విద్రోహప్రయత్నంబులున్ 

    జగమందెల్ల హరించి గావుమము నీశా! కాడుమల్లేశ్వరా !  33

 

కవి సందర్భానుసారంగా ఎన్నో జాతీయాలను, నుడికారాలను ప్రయోగించారు. ఇవన్నీ ఆయన

 భాషా పటిమకు నిదర్శనాలు. తలతాకట్టు , కప్పల్తక్కెడ, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు

, నివురు గప్పిన నిప్పు మొదలైన ప్రయోగాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ప్రతి పద్యం ఉక్తి

 వైచిత్రితో ఒక ప్రత్యేకమైన సౌందర్యాన్ని సంతరించుకుందికవి ఎన్నో సామాజిక అంశాలమీద

 తమ దృష్టిని సారించడం వల్ల వైవిధ్యం గోచరిస్తోంది. ప్రతి సామాజిక దురాచారాన్ని తీవ్రంగా

 ఖండించడం వల్ల నైశిత్యం కనిపిస్తోందిప్రతి పద్యంలోను నేడు సమాజంలో దిగజారుతున్న

 విలువలపట్ల ఆయన పొందిన మనస్తాపం ప్రతిబింబిస్తోంది.  సూచించిన పరిష్కారముద్రల

 వల్ల కావ్యప్రయోజనం కూడ నెరవేరినట్లే. మతం కంటే ధర్మమే గొప్పదన్న విషయాన్ని

 వివరిస్తూ మతమౌఢ్యాన్ని దుయ్యబట్టేరు. సద్గతులకు బాటవైచుకొని ధార్మిక బుద్ధిని

 పాదుకొల్పమని హితంచెప్పడం ఆయన ధర్మతత్పరతకు ఒక ఉదాహరణ. ప్రతిపద్యంలోను

దిగజారుతున్న విలువలపట్ల ఆయన పొందిన ఆవేదన తొంగి చూస్తోందికొన్ని పద్యాల్లో

 పరిష్కారం కనిపిస్తోందిమరికొన్ని పద్యాల్లో అది సమాజానికే వదిలేసినట్లుగా అనిపిస్తోంది

శతకంలో ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. అవన్నీ వివరిస్తే మరో పెద్ద గ్రంథం అవుతుంది. ఈ

 శతకం ఆంధ్ర సాహిత్య చరిత్ర పుటలలో, విశిష్య శతక సాహిత్య పుటలలో శాశ్వతస్థానాన్ని

 సంపాదిస్తుందని ఆశిస్తున్నాను. వీరి కల౦ నుంచి మరెన్నో కావ్యాలు వెలువడి సమాజ

 కళ్యాణానికి తోడుపడాలని ఆశిస్తున్నాను.ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావు , ఆచార్య

 మల్లాప్రగడ  శ్రీమన్నారాయణ మూర్తి వంటి  విద్యాధికులు ఈ శతకాన్ని సమీక్షించారు.


ఈ శతకంపై నా అభిప్రాయాలను వ్యక్తీకరించుటకు అవకాశం ప్రసాదించిన వారికి నా

 కృతజ్ఞతలు.

 

-- డా|| చిలకమర్తి దుర్గా ప్రసాద రావు

Bhashapraveena, Vedanta  Vidyapraveena

M.A. (Sanskrit), M.A. (Telugu), M.A. (Philosophy)

Ph.D. (Sanskrit)

Retd. Reader & Head, Dept. of Sanskrit

ANR College, Gudivada (A. P.)