Sunday, August 31, 2025

కలనైనా మఱువబోకు ‘కమ్మనైన’ అమ్మభాష రచన : డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

కలనైనా మఱువబోకు ‘కమ్మనైన’ అమ్మభాష

 

రచన : డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు

9897959425

Revised

 

 

                సుప్రసిద్ధ సంస్కృత కవి , ఆలంకారికుడు, తత్త్వవేత్త అయిన  శ్రీ అప్పయ్య దీక్షితులు “ఆంధ్రత్వమాంధ్రభాషా చ, నాsల్పస్య తపస: ఫలం”  అన్నారు

. అంటే ఆ౦ధ్రుడుగా పుట్టడం, ఆంధ్రభాష మాట్లాడ గలగడం ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సిద్ధి౦చదని ఆ మాటలకర్థం .                                                   

​భాష ప్రాణం వంటిది . భాషను పోగొట్టుకుంటే మనం మన  ఉనికిని కోల్పోయినట్లే.  ప్రతి వారికి కనీసం,  తమ మాతతమ మాతృభూమి, తమ మాతృభాషలపట్ల ఎనలేని గౌరవం ఉండాలి. మాతృభాషను కించపరిస్తే  తల్లిని అవమానించి నట్లే అ౦టారు మన జాతిపిత మహాత్మా గాంధి . ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. जो मातृभाषा को अवगणना कर्ता है , वह अपनी माता की कर्ता है (Belittling ones mother Tongue is like disparaging ones own mother )

 ​తెలుగుభాష మాట్లాడేవారు తెలుగు రాష్ట్రాల్లో సుమారు తొమ్మిది కోట్ల మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లోను విదేశాల్లోను కూడ ఇంచుమించు అ౦త మందే ఉన్నారు. ఇంతమంది ఉన్నా కాలగతిలో మన భాష నిలుస్తుందా?, నిలవదా? అనే సందేహం మనకు లేకపోలేదు. దానికి కారణం ఒక భాష పదికాలాలపాటు మనుగడ సాగించాలంటే ఆ భాష మాట్లాడాలి, కేవలం మాట్లాడితేనే సరిపోదు, ఆ భాషలో  వ్రాయగలగాలి, వ్రాస్తేనే సరిపోదు, ఆ భాషలో సాహిత్యసృష్టి జరగాలి,  సాహిత్యసృష్టి జరిగినంత మాత్రాన సరిపోదు, ఆ సాహిత్యం జనసామాన్యానికి అందుబాటులో ఉండాలి. అప్పుడే ఏ భాషైనా కాలగతిలో  నిలుస్తుంది. లేకపోతే నిలిచే ప్రసక్తి లేదు.

 ఇక ప్రస్తుత విషయానికొస్తే నేటి తరం విద్యార్థులకు ముఖ్యంగా తెలుగు మాతృభాషగా గల విద్యార్థులలో చాల మందికి  తెలుగుభాషపట్ల ప్రేమ లేదు. ఆంగ్లభాషమీదున్న ప్రేమలో వెయ్యో  వంతు కూడ ఆంధ్రభాషపైన లేదు . ఈ విషయంలో వారి వారి తల్లిదండ్రులే చాల వరకు కారణమని చెప్పక తప్పదు. అందరు తమతమ మాతృభాషలు రావడం గొప్పగా భావిస్తుంటే తెలుగువారమైన మనం తెలుగు భాష రాకపోవడం గొప్పగా భావిస్తున్నాం . నిజంగా ఇది సిగ్గుచేటు .  మదర్ టంగ్ రాని వాడికి అదర్ టంగ్ రాదు. అమ్మ భాష రానివాడికి అన్యభాష సరిగా రాదు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పూర్వం విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్వ్యక్తుల్ని పరిశీలిస్తే వారందరూ తెలుగు భాషలో  నిష్ణాతులని తేలింది. నేడు చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు తెలుగుభాష నేర్పిస్తే సమయం వేస్టు అయిపోతుందని ఆ సమయాన్ని కూడ ఆ౦గ్లభాషకు కేటాయిస్తే ఇంకా ప్రగతిని సాధిస్తారనే అపోహలో ఉన్నారు .  అమ్మభాష రాని వాడికి అన్య భాష రానే రాదు. ఈమధ్యనే ఒక సంఘటన జరిగింది. పొరుగూరిలో  ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థి కాలేజి నుండి తన ఇంటికొచ్చాడు . ఇంటికి తీసుకొచ్చిన ఆటో డ్రైవరు  అరవై ఐదు రుపాయిలైందని అతనికి చెప్పాడు . అతనికి పాపం అరవై ఐదంటే ఎంతో అర్థం కాలేదు . అడగడానికి నామోషి. అందువల్ల చిల్లర లేదని అబద్ధమాడి, ఇ౦ట్లోకెళ్ళి వాళ్ళ తాతను అరవై ఐదుకి అర్థం అడిగి తెలుసుకొని డబ్బు చెల్లించాడు. ఇదీ నేటి పరిస్థితి. ఇదే కొనసాగితే కొన్నాళ్ళకి బస్సుల మీది తెలుగులో వ్రాసే ఊళ్ళ పేర్లు చదవలేక ఇబ్బంది పడవలసిన స్థితి వస్తుంది .  

 ఇక ఆంగ్లభాష విషయానికొద్దాం. ఆంగ్లబాషను చాల రాష్ట్రాలవారు భాషగా నేర్చుకుంటున్నారు. మనం మాత్రం మీడియం ద్వారా నేర్చుకుంటున్నా౦. రెంటికి చాల తేడా ఉంది . భాషగా నేర్పే వాళ్ళు మంచిపండితులై ఉండి ఆ భాషలోని మెలుకువలు, మర్మాలు నేర్పుతారు. ఇక మీడియం విషయానికొస్తే ప్రతి వాడు అధ్యాపకుడే . వారికేమి తెలీదు. పుస్తకంలో ఉన్న విషయాన్ని క్లాసుల్లో చదివేసి , బట్టీ పట్టించి మార్కులు పోసేస్తున్నారు.  క్లాసుల్లో కుక్కింగు; పరీక్షల్లో కక్కింగు నేటి పరిస్థితి .  అందువల్ల  ఇంగ్లీషులో ఒక చిన్న అప్లికేషన్ కూడ వ్రాయలేక పోతున్నాడు. అటు ఇ౦గ్లీషు, ఇటు తెలుగు రెండు రాక రెంటికి చెడ్డ రేవడుగా తయారౌ తున్నాడు. అందుకే "ఇంగ్లీషును కాటుకగా దిద్దుకో గాని ఒళ్లంతా పూసుకోకు నల్ల బడతవు" అన్నారు శ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారు.

ఒక విద్యార్థి,  ప్రిన్సిపాల్ కి  లీవులెటరు వ్రాస్తూ please grant me leave for today as I am suffering from mouth motions అని వాశాడు . వా౦తి అనే దానికి ఏ పదం  వ్రాయాలో తెలియక  mouth motions  అని వ్రాశాడు . వాడి సంగతేమోగాని ఆ లెటర్ చదివి ప్రిన్సిపాల్ వా౦తి చేసుకున్నాడు .

ఇక కొంతమంది మిత్రులు తమకు తెలిసో, లేక తెలియకో  తెలుగును సులభం చెయ్యాలంటే కొన్ని వర్ణాలు తొలగించాలనే వాదన చేస్తూ ఉన్నారు. ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఒక విద్యాశాఖాధికారి (D.E.O) గారు నా దగ్గరకు వచ్చి శకటరేఫ అంటే బండిఅరసున్న మొదలైన వర్ణాలు తొలగించాలని వాదించారు. నేనన్నాను, ఏమండి!  enough, committee మొ||   పదాలకు అన్ని అక్షరాలు అవసరమా?    కొన్ని తిసేయ్యొచ్చు కదా! తీసిచూడండి,  ఏ౦ జరుగుతుందో చూద్దాం అన్నాను.  ఆయన ముఖంలో నెత్తురు చుక్క లేదు. అందువల్ల తెసేయడం పరిష్కారంకాదు.    శకటరేఫ (ఱ) విషయానికొద్దాం . బండి ర ఉపయోగించకుండ నీరు అంటే water,  ఉపయోగించి నీఱు అంటే ashes (బూడిద). పాఱు అంటే ప్రవహించడం పారు అంటే పారడం. ఒక అవధానంలో ఒకాయన అడిగారు . మనం బయలుదేరేటప్పుడు నక్క, కుడి ప్రక్క పారితే మంచిదా ఎడమ ప్రక్క నుండి పారితే మంచిదా అని . దానికి సమాధానంగా అవధాని గారు ఎటు పారినా పరవాలేదు మన మీద చి౦దకుండా ఉంటే చాలు అన్నారు.

ఇక అరసున్న విషయానికొద్దాం. వెలుగులో అరసున్న ఉంటే ప్రకాశం అని అర్థం.  (వెలు(గు).  ఒకవేళ అరసున్న లేకపోతే వెలుగు అనే పదానికి ‘ముళ్లకంచె’ అని అర్థం . చీకు అనే పదంలో అరసున్న ఉంటే గ్రుడ్డి అని అర్థం . నన్నయ గారు ధృతరాష్ట్రుని ‘చీ(కురాజు’ అనడం మనం గమనించవచ్చు. అరసున్న లేక పోతె ఆ పదానికి చీకిపోవడం అనే అర్థం వస్తుంది. అందువల్ల వాటిని మనం పిల్లలకు నేర్పినా నేర్పక పోయినా పరవా లేదు గాని తీసెయ్యడం మాత్రం చాల తప్పు . ఈ మధ్య కొంతమంది మహా ప్రాణ వర్ణాలు (ఖ,ఘ మొదలైనవి ) తొలగించమని అంటున్నారు. ఇప్పుడు తెలుగు భాషామతల్లి కనీసం కొన ఊపిరితోనైనా ఉంది. ఆ మహాప్రాణవర్ణాలు తొలగిస్తే, ప్రాణమే కోల్పోతుంది .

ఇక మరికొంత మంది టైము టిక్కెట్టు రోడ్డు మొ|| పదాలు వాడుతున్నాం . మనం మాట్లాడేది తెలుగే కాదు అని పిచ్చిపిచ్చిగా  వాదిస్తున్నారు.`ఇది చాల తప్పుడు అభిప్రాయం ఎందుకంటే Time అనేది ఆంగ్లపదం గాని టైము తెలుగుపదమే అవుతుంది . అలాగే Ticket ఆంగ్ల పదం, టిక్కెట్టు మాత్రం తెనుగు పదమే. అలాగే Road ఆంగ్లపదం  రోడ్డు తెలుగుపదమే.

భాషలో తత్సమం- తద్భవం- దేశ్యం- గ్రామ్యం అనే నాలుగు రకాల పదాలుంటాయి.  ‘రామ’ అనే సంస్కృతపదం తీసుకుని మనం రాముడు చేసుకున్నాం . అది తత్సమం . అగ్ని అనే పదం ,  ‘అగ్గి’ అయింది అది తద్భవం . ‘అక్క’ ‘అన్న’ మొదలైన పదాలు దేశ్యాలు అవి మన స్వంత పదాలు. అవి కాకు౦డ వస్తాడు ,  లెగుస్తాడు, కూకుంటాడు మొదలైనవి గ్రామ్యపదాలు . ఇక టైము రైలు మొ || అన్యదేశ్యాలు. ఇవన్ని తెలుగు పదాలే కాబట్టి వాటిని తెలుగుపదాలు కావనడం సాహసం . తొలగి౦చాలను కోవడం అవివేకం . 

భాష, ఎంత పెరిగితే అంత గొప్పదవుతు౦ది. అయ్యయ్యో! అమ్మాయి పెద్దదై పోతోంది పెద్దదైతే మరలా బట్టలు కుట్టి౦చాలి అని ఎవరైనా బాధ పడతారా! . పైగా ఆనందిస్తారు.  పెరిగే కొద్ది ఆనందంతో కొత్త బట్టలు కొట్టిస్తారు. ఎందుకంటే పెరుగుదల సహజం పెరగక పోవడం అసహజం  . అంగ్లభాష చూడండి ప్రపంచంలో ఉండే అన్ని భాషాపదాల్ని తనలో కలుపుకు౦టూ ఎంత విస్తృతంగా పెరిగిందో. ‘జనన్నాథ’ అనే పదాన్ని Juggernaut గా మార్చుకుని తనలో ఇముడ్చుకుంది . పండిత pandit అయింది . అలాగే gaddi గద్ది (సంహాసనం)   మొదలైన కొన్ని వందల, వేల  పదాలకు తన నిఘంటువులో స్థానం కల్పి౦చింది . ప్రతి సంవత్సరం నిఘంటువుల్ని, వ్యాకరణాన్ని మార్చుకుంటూ పోతోంది . మనం ఆ పనే చెయ్యాలి .

ఇక ఇంగ్లీషు భాష రాకపోతే ప్రగతి ఆగిపోతుందని వాది౦చేవాళ్ళు కొంతమంది లేక పోలేదు. భాష నేర్చుకుందాం తప్పు లేదు . కాని మన భాషను పోగొట్టుకుని మాత్రం కాదు .

కొంత కాలం క్రిత౦  మా గురువులైన ఆచార్య పోచంచర్ల శ్రీరామముర్తి గారు  జర్మని వెళ్ళారు . వాళ్లకు ఇంగ్లీషు రాదు, వీరికి జర్మన్ భాష రాదు. కాలం ఎలాగో గడిచి పోయింది, ఎవరికీ ఏమి రాకపోయినా కాలం ఆగదు కదా   . ఆయన, తిరిగి స్వదేశానికి వస్తున్నప్పుడు వారితో “మీకు ఆంగ్లం రాదు . నేర్చుకోవాలని ఎప్పుడు అని పి౦చలేదా! ఆంగ్లం రాకపోతే అభివృద్ధి సాధ్యమా ? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా వారు మాకేమవసరం ప్రపంచంలో ఎవరు ఏ పుస్తకం వ్రాసినా అనతికాలంలోనే మాకు దాని జర్మన్ అనువాదం మా చేతిలో ఉంటుంది . ఆంగ్లం నేర్చు కోవడం మాకేమీ  అవసరం లేదు పొమ్మన్నారు . 

          దురదృష్టవశాత్తు అటువంటి అవకాశం మనకు  లేదు . అందువల్ల  మనం ఇ౦గ్లీషు నేర్చుకుంటే గాని డాక్టర్స్ కాలేం, ఇ౦జనీర్సు కాలేం . ఇదే ఆంగ్లభాషా వ్యామోహానికి ఒక ప్రథాన కారణం.  అందువల్ల మనం జర్మన్ దేశీయులమార్గాన్ననుసరి౦చాలి.

ఇక ఫ్రాన్సు  దేశం,  బ్రిటన్ కు చాల చేరువలో ఉంది . అందువల్ల ఆంగ్లం వాళ్ళ భాషను ఎక్కడ కబళించి వేస్తుందో అన్న భయంతో ఎన్నో ఆంక్షలు విధించారు . ఉదాహరణకి నేను విన్న, ఒక విషయం చెపుతాను . ఫ్రాన్సులో,  కార్యాలయాల్లో ఎవరైనా ఇ౦గ్లీషులో ఉత్తరం వ్రాస్తే  అది చి౦పి పారేస్తారు. లేకపోతే వాళ్ళ భాష అంతరించి ఇప్పటికి ఎన్నో శతాబ్దాలు అయు౦డేది.

మరికొంతమంది  ఉరుమురిమి మంగల౦ మీద పడిందన్నట్లుగా   సంస్కృతభాషమీద విరుచుకు పడుతున్నారు. పాపం! అదేం చేసింది తెలుగును పెంచి పోషించడం, అభివృద్ధి చేయడం తప్ప. గాంధీమహాత్ముడు అన్నారు Sanskrit is like river Ganges to our country if it is dried up all regional languages will lose their vitality and power.

అందువల్ల సంస్కృతాన్ని ద్వేషించడం జాతిని, జాతి పితను అవమానించడమే అవుతుంది.  

కాబట్టి  ప్రభుత్వ విధానాలు స్పష్టంగా ఉండాలి. ఎక్కడ లోపం ఉందో అక్కడ సవరించాలి . రోగం ఒకటి వైద్యం మరొకటి కాకూడదు. ఒక ప్రక్క మాతృభాషను ఉద్ధరించాలి అంటూనే  ఇంగ్లీషు చదివేవారి పట్ల మక్కువ చూపిస్తుస్తున్నా౦. ఇది సబబు కాదు. తెలుగును ప్రోత్సహించాలి వారికి ప్రభుత్వ సంస్థల్లో గౌరవప్రదమైన స్థానం కల్పించాలి  .  కాబట్టి సమస్యకు ఏది మూల కారణమో తెలుసుకుని దాన్ని గమనించి నివారించ కలిగితే, భాషారక్షణ అభివృద్ధి పెద్ద పనే౦ కాదు. భాష రక్షణకు అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిద్దాం . తెలుగులెంక, ​శ్రీ తుమ్మల సీతారామ మూర్తి గారి ఆవేదనా పూరితమైన పద్యంతో ముగిస్తాను.

బెంగాలీ కృతికర్త పాదములకర్పి౦చున్నమస్కారము

ప్పొంగున్  పారశిలేఖినీ విలసనంబుల్సూ చి రావయ్య నా 

బంగారంబ యటంచు నాంగ్లకవి నాహ్వానించు నేపాపమో! 

రంగా మెచ్చడు తెల్గుబడ్డ కవి సమ్రాట్టున్ స్వదేశీయునిన్  .​

మాతృభాషను రక్షించుకుందాం , ఆత్మ గౌరవాన్ని కాపాడు కుందాం . నమస్కారం .

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

9897959425.

 

><><><>< 

 

 

No comments: