ఆంధ్రులు-అద్వైత వేదాంత సేవ
అధ్యాయం-3
డాక్టర్ .
చిలకమర్తి దుర్గాప్రసాద రావు
భాషాప్రవీణ ,
వేదాంత విద్యాప్రవీణ ,
M.A. (సంస్కృతం), M. A. (తెలుగు)
M.A.
(తత్త్వశాస్త్రం), Ph. D
(సంస్కృతం)
ఉత్తర-మీమాంసాదర్శనం
మనం ఇంతకు ముందు
పూర్వ మీమాంసా దర్శనం దాని స్వరూపం, ఉద్దేశ్యం, లక్షణాలు
గురించి సంగ్రహంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం . ఇప్పుడు ఉత్తరమీమాంసాదర్శనం
గురించి తెలుసుకుందాం . దీనికే వేదాంత దర్శనమని మరో పేరు కూడ ఉంది . వేదాంతము అంటే
ఉపనిషత్తు .
వేదం ముందుగా
కర్మల యొక్క ప్రాధాన్యాన్ని వివరించి చిట్టచివరకు కర్మల వలన పరమప్రయోజనం నెరవేరదని, అది ఆత్మ జ్ఞానం వల్లనే కలుగుతుందని స్పష్టం చేసింది.
అంతేగాక ఉత్తర మీమాంసా దర్శనం ఆత్మ యొక్క స్వరూప
స్వభావాలు అత్యద్భుతంగా ప్రతిపాదించింది . అందుకే ఇది అన్ని దర్శనాలలో అత్యుత్తమ
దర్శనంగా చెప్పబడుతూ ఉంది.
ఈ వేదాంత దర్శనం,
ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు , భగవద్గీత అనే ముక్కాలి పీటపై నిలిచి ఉంది . ఆత్మా
వా అరే ద్రష్టవ్య: , శ్రోతవ్య: , మంతవ్య: , నిదిధ్యాసితవ్య: అంటుంది ఉపనిషత్తు
.
ఆత్మదర్శనం
కోసం శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి , నిదిధ్యాసనం చెయ్యాలని ఆ మాటలకు అర్థం .
శ్రవణ స్థానీయాలు
ఉపనిషత్తులు , మనన స్థానీయాలు
బ్రహ్మసూత్రాలు, నిదిధ్యాసనం కోసం భగవద్గీత .
శ్రోతవ్య: శ్రుతి వాక్యేభ్య:
మంతవ్యశ్చోపపత్తిభి: మత్వా చ సతతం ధ్యేయ: ఏతే దర్శన హేతవ: అని పెద్దల మాట.
ఉపనిషత్తులు 108 లభిస్తున్నా పది ఉపనిషత్తులను
చాల ప్రముఖమైనవిగా పెద్దలు అంగీకరించారు .
ఈశ, కేన, కఠ,
ప్రశ్న, ముండ, మాండూక్య, తిత్తిరి:,
ఐతరేయం, చ ఛాందోగ్యం,
బృహదారణ్యకం, దశ . ఉపనిషద్ ఋషులు ద్రష్టలు . వారు ఆత్మ పదార్థాన్ని
అనేక కోణాలలో దర్శించడం వల్ల
అనేక రూపాలలో కనిపించింది . ఉదాహరణకి హిమాలయ పర్వతాలు భారత దేశం వైపు నుంచి చూస్తే ఒక
లాగా , పాకిస్తాన్ నుంచి చూస్తే మరో లాగా , చైనా నుంచి చూస్తే ఇంకో లాగా బర్మా
నుంచి చూస్తే మరో విధం గాను కనిపిస్తాయి . చూసే కోణంలో తేడా గాని పర్వతాలు అవే. అలాగే
ఉపనిషత్తులు ఆత్మ స్వరూపాన్ని వర్ణిస్తూ “మనసైవ అనుద్రష్టవ్య:” అంటే ఆత్మను మనస్సుతోనే
దర్శించాలి, అని ఒక చోట చెప్పి మరొక చోట “
యన్మనసా న మనుతే అంటే మనస్సుతో తెలుసుకోలేము అని చెపుతుంది . ఒక చోట ‘తదేజతి’ అంటే
ఆత్మ కదులుతుంది అని చెప్పి వెంటనే ‘తన్నైజతి’ ఆత్మకు చలనం లేదు అంటుంది . అలాగే ‘తద్దూరే’
అంటే, ఆత్మ చాల దూరంలో ఉంది అని చెప్పి వెను వెంటనే ‘త దు అన్తికే’ అంటే అది చాల దగ్గరలో ఉంది
అంటుంది. ఇవి పైకి పరస్పర విరుద్ధాలు గా
కనిపిం చినా అవి విద్ధాలు కావు . ఆ
వైరుధ్యాన్ని తర్క బద్ధంగా తొలగించడం కోసం బ్రహ్మ సూత్రాలు రచించారు బాదరాయణ
మహర్షి. వేదాంతవాక్యాలనే పువ్వులను సూత్రాలనే త్రాళ్ళతో దండగా కూర్చారని శ్రీ శంకరులు స్వయంగా చెప్పడం మనం
గమనిస్తాం . ‘బదరము’ అంటే రేగి చెట్టు . వ్యాసుడు రేగి చెట్ల వనంలో నివసించడం చేత
ఆయనకు బాదరాయణుడు అని పేరు. వచ్చింది. జీవునకు బ్రహ్మత్వాన్ని ప్రతిపాదించే సూత్రాలు బ్రహ్మ సూత్రాలు, అవి 555.
బాదరాయణులు తమ
బ్రహ్మ సూత్రాల్లో అంతకు ముందున్న కొంతమంది ఆచార్యుల అభిప్రాయాలను సమీక్షించారు .
ఆ సిద్ధాంతాలను ‘ఆర్షవేదాంతము’ అని పిలుస్తారు. ఇక శ్రీ శంకరులకు ముందే సుందర
పాండ్యుడు, ద్రవిడాచార్యుడు, బ్రహ్మనంది, భర్తృప్రపంచుడు
, భర్తృహరి మొదలైన ఆచార్యులు ఎందరో ఉన్నారు. బ్రహ్మ సూత్రాలకు శ్రీశంకరులకు ముందే
ఉపవర్షాచార్యుల వారు వ్యాఖ్యానం వ్రాశారని అది జ్ఞాన కర్మ సముచ్చయ వాదాన్ని
సమర్థిస్తుందని పెద్దలు చెపుతున్నారు. ఈయన క్రీస్తు పూర్వం రెండు ఒకటి శతాబ్దాల మధ్యకాలంలో
నివసించారని సాంప్రదాయ వాదుల విశ్వాసం . ఈ గ్రంథం నేడు మనకు లభించడం లేదు .
ఇక భగవద్గీత 700
శ్లోకాలతో కూడినది . ఇది ఉపనిషత్తులకు సారాంశము కావడం వల్ల ఈ మూడు గ్రంథాలు వేదాంత దర్శనానికి మూల
గ్రంథాలుగా ప్రసిద్ధి పొందాయి.
అన్ని ఇతర దర్శనాలు
తార్కికమైన ఆలోచనపై ఆధారపడితే వేదాంత
దర్శనం శ్రుతికి అనుకూలమైన తర్కం మరియు అనుభవంపై ఆధారపడింది .
ఉదాహరణకి మనం
ఒక వస్తువును చూస్తున్నాం అనుకుందాం . కన్ను చూడడం లేదు; అలాగే ఒక శబ్దం వింటున్నామనుకుందాం
, చెవి వినడం లేదు . అలాగే ఎవరితోనో మాట్లాడుతున్నాం అనుకుందాం . నోరు మాట్లాడడం లేదు. ఒక చోటి నుండి
మరొక చోటికి నడిచి వెడుతున్నామనుకుందాం . కాళ్ళు నడవడం లేదు. అదే వాస్తవమైతే శవం
కూడ ఆయా పనులు చెయ్యాలి . కాని అలా జరగడం లేదు. కాబట్టి దేహము , ఇంద్రియాలకు
అతీతమైన ఒక (శక్తి) పదార్థం వీటి ద్వారా ఈ
అన్ని పనులు చేస్తోంది. అందుకే ‘నేను ఎవరిని చూస్తున్నానో అతనితోనే
మాట్లాడు తున్నాను’ అని మనం అంటాం. కాని వాస్తవానికి ఇక్కడ చూసే కన్ను జ్ఞానేంద్రియం, మాట్లాడే నోరు కర్మేంద్రియం . అ రెండు వేరు . కాని ఈ రెంటికి ‘నేను’తో
సంబంధం.
ఇంకో ఉదాహరణ. ‘నా ఇల్లు’ అంటే ‘నేను’ వేరు ‘ఇల్లు’ వేరు . అలాగే
‘నా కన్ను’ అంటాం . అంటే ‘కన్ను’ వేరు, నేను వేరు . నా
చేయి అంటాం. దీన్ని బట్టి చేయి వేరు నేను వేరు . అలాగే నా శరీరం అనగా శరీరం వేరు నేను వేరు
.
అలాగే ఇంట్లో
ఒక వ్యక్తి మరణిస్తే వాడు పోయాడు అంటాం లేదా
ఆమె పోయింది అంటాం . కాని శరీరం అక్కడే ఉంది . దీన్ని బట్టి శరీర, ఇంద్రియాలకు
అతీతంగా ఒక శక్తి దాగి ఉందనే మాట స్పష్టం ఔతోంది . అదే మన అసలైన స్వరూపం అంటుంది
వేదాంత శాస్త్రం .
ఇక ‘నేను లేను’ అని ఎవడు అన లేడు. ఎవడైతే ‘నేను లేను’ అని అంటాడో వాడి మాట “మా అమ్మ గొడ్రాలు” అనే మాట వంటిది. వాళ్ళ అమ్మ గొడ్రాలైతే వాడేలా
పుడతాడు? పుట్టడు కదా! ఇక నేను అనేది ఆత్మగా నిజం. కాని మనం దాన్ని మన శరీరంతోను , ఇంద్రియాలతోను కలగాపులగం చేసి నేను లావుగా ఉన్నాను, నేను
కుంటి వాణ్ణి, నేను గ్రుడ్డివాణ్ణి, నేను చెవిటి
వాణ్ణి, నేను మూగవాణ్ణి అని అనుకుంటున్నాం
. ఆత్మకు ఇవేమీ లేవు . కాబట్టి శరీర, ఇంద్రియ ధర్మాలను ఆత్మయందు మనం ఆరోపించుకుని
వ్యవహరిస్తున్నాం .
ఇక అద్వైత
సిద్దాంతంలో బ్రహ్మమే సత్యం . ఈ జగత్తు మిథ్య . జీవుడు బ్రహ్మ కంటే భిన్నుడు కాదు
. ఇక్కడ మిథ్య అంటే అది లేదని కాదు . దానికి సంబంధించిన అసలైన వాస్తవ రూపం
తెలియగానే అంతవరకు ఉన్న తప్పుడు జ్ఞానం తొలగిపోతుంది అని అర్థం . ‘ సమ్యగ్ జ్ఞాన
బాధ్యత్వం మిథ్యాత్వమ్’ అని శాస్త్రం చెప్పింది.
ఒక వ్యక్తి మసక
మసక చీకటిలో నడుస్తూ ఒక త్రాడుపై కాలు వేశాడు. ఆ త్రాటిని పాముగా పొరబడ్డాడు .
వెంటనే చెమటలు, నోటి నుండి నురగలు రావడం మొదలౌతాయి.
ఆ తరువాత మరో
వ్యక్తి అక్కడకు వచ్చి దీపపు కాంతిలో దాన్ని చూపించి అది పాము కాదు త్రాడు మాత్రమె
అని చెప్పగానే అంత వరకు ఆవరించి యున్న భయమంతా తొలగిపోతుంది.
ఇక్కడ శాస్త్రం
ఏమి చెపుతుందంటే ముందుగా లేనిది, ఆ తరువాత లేనిదీ మధ్యలో కూడ లేదని, అది కేవలం భ్రాంతి
మాత్రమె అని చెపుతుంది .
‘ఆదావంతే చ
యన్నాస్తి వర్తమానేsపి తత్తథా
వితథై: సదృశా:
సంత: అవితథా ఇవ లక్షితా:’ బ్రహ్మ
నిర్గుణమైనది, అపరిమితమైనది , ఆనంద రూపమైనది, అయినప్పటికీ శరీరంలో ఉండి, శరీరంతో తాదాత్మ్యం
చెందటం వలన నేను అనే భావనను కలిగిస్తోంది. ఇక తానుగా ఉంటున్న ఆత్మను నేనుగా
భావించడమే అన్ని అనర్థాలకు మూలం . ఈ శరీరంలో ప్రత్యగాత్మ రూపంలో ఉన్న జీవుడు
పరమాత్మకంటే భిన్నుడు కాడు అని శ్రీశంకరుల అద్వైతం , ఇక ఈ శరీరంలో గల జీవుని యందు
అంతర్యామిగా పరమేశ్వరుడున్నాడని శ్రీరామానుజుల విశిష్టాద్వైతం , జీవుడు, పరమేశ్వరుడు
వేర్వేరని శ్రీమధ్వాచార్యుల ద్వైతం
చెపుతున్నాయి . ఆ సిద్ధాంతాలన్నీ ప్రస్తుతం అప్రస్తుతం .
వేదాంతశాస్త్రం
ఈ ప్రపంచానికందించిన ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రస్తావించడం ప్రస్తుతం అప్రస్తుతం
కాదు .
ఉపనిషత్తు “వాచారంభణం
వికారో నామధేయం , మృత్తికేత్యేవ సత్యం” అనే ఒక అమూల్యమైన మాట పలికింది . అదేమిటంటే
పేరు, ఆకారం, కేవలం వ్యవహారం కోసమే అందులో ఉండే వస్తువు ఒక్కటే అని ఆ మాటలకు అర్థం
. మట్టితో చేసిన పాత్రలయొక్క నామ, రూపాలు
వేరైనా మట్టి ఒక్కటే.
ఉదాహరణకు
మనం ఒక బంగారు ఆభరణం ముక్కు దగ్గర ధరిస్తే అది ముక్కుపుడకని, చెవికి పెట్టుకుంటే
కుండలం అని, మెడలో తగిలించుకుంటే హారమని,
నడుమునకు బిగించుకుంటే అది ఓఢ్యాణమని
అంటాం . వాటి రూపం , పేరు మాత్రమె వేరు, కానీ అంతా బంగారమే. అలాగే భారతదేశానికి
తూర్పున ఉన్నది బంగాళాఖాతమని, దక్షిణాన ఉన్నది హిందు మహాసముద్రమని , పశ్చిమాన
ఉన్నది అరేబియా సముద్రమని వివిధమైన పేర్లతో పిలుస్తాం. వాస్తవానికి అంతా నీరే.
పేర్లు కేవలం వ్యవహారం కోసమే. అలాగే భగవంతుని మనం ఏ పేర్లతో పిలుస్తున్నా ఆయనలోని
సచ్చిదానందరూపం ఒకటే. పేర్లు పట్టుకుని కొట్టుకు చావకండి అంటుంది ఉపనిషత్తు.
ఈ విషయాన్నే ప్రపంచంలోనే
మొట్టమొదటి గ్రంథమైన ఋద్వేదం “ ఏకం సద్విప్రా: బహుధా వదంతి ” అని నొక్కి
చెప్పింది . ఉన్న పదార్థం ఒక్కటే , దానిని భిన్న భిన్న వ్యక్తులు భిన్న భిన్న
విధాలుగా చెపుతున్నారు అని ఆ మాటలకు అర్థం .
ఇక ఈ అద్వైత వేదాంత
శాస్త్రం, ఆకాశం కంటే ఉన్నతమైనది , సముద్రం కంటే లోతైనది, భూమండలం కంటే విశాలమైనది
. కొన్ని వేల గ్రంథాలతో కూడి ఉంది . అవి
సూత్ర గ్రంథాలు, వివరణ గ్రంథాలు , వ్యాఖ్యానాలు , ఉప వ్యాఖ్యానాలు, ఖండన, మండనాత్మక
గ్రంథాలుగా మనకు లభిస్తున్నాయి .
ఈ అద్వైత
సిద్ధాంతంలోనే భామతీ ప్రస్థానం, వివరణ ప్రస్థానం , వార్తిక
ప్రస్థానం అనే భిన్న భిన్నమైన అభిప్రాయాలతో కూడిన ప్రస్థానాలున్నాయి. వారు
కొన్ని సిద్ధాంతాలలో పరస్పరం విభేదించినప్పటికి జీవ, బ్రహ్మైక్య విషయంలో ఏకాభిప్రాయమే
ఉండడం వల్ల అద్వైతసిద్ధాంతానికి ఎటువంటి విఘాతం కలుగ లేదు. ఇక ఈ సిద్ధాంత వ్యాప్తికి
ఆంధ్రులు చేసిన కృషి సంస్తుతి పాత్రం . అవన్నీ ముందు ముందు తెలుసుకుందాం.
<><><>
No comments:
Post a Comment