Saturday, August 30, 2025

అనుభవాలు-జ్ఞాపకాలు Part-12 రచన: డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

                                                                    అనుభవాలు-జ్ఞాపకాలు

Part-12

రచన:

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

శ్రీ రాజీవగాంధీ భారతప్రధానిగా ఉంటున్న రోజుల్లో ,   U.G.C వారు ఉనతవిద్యాప్రణాళికలో రిఫ్రెషర్ కోర్సుల పేరుతొ ఒక స్కీమును మొదలుపెట్టారు . దాని ప్రకారం ప్రతి అధ్యాపకుడు తన జ్ఞానాన్ని పెంపొందిం చుకోవడం కోసం ఒక orientation-course,   మూడు refresher-courses విధిగా చెయ్యాలి. నాకు కూడ ఈ  కోర్సులు చేసే అవకాశం వచ్చింది . orientations courseలో అన్ని విషయాలకు సంబంధించిన అధ్యాపకులు ఉంటారు. ఇక refresher course మాత్రం  ప్రత్యేకించి ఆ సబ్జెక్టుకు సంబంధించి ఉంటుంది. ఈ స్కీము ప్రకారం ఆయా విశ్వవిద్యాలయాల్లో నియమించబడిన ఒక విభాగం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది . వారు, అనేక ప్రాంతాల నుండి నిష్ణాతులైన పండితులను    రప్పించడం, వివిధ విషయాలపై ఉపన్యాసాలు ఇప్పించడం చేస్తారు . అవి చాల ఆసక్తికరంగా ఉంటాయి. వారి  ఉపన్యాసాల  తరువాత వారు చెప్పిన విషయాల పై చర్చ జరుగుతుంది.

ఒకసారి ఆంధ్రవిశ్వవిద్యాలయం ఒక వక్తను పిలిచారు . ఆయన Israil దేశంలోని ఒక విద్యాసంస్థలో ఆచార్యునిగా పనిచేస్తున్నారు. వారిని ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా    ఆహ్వానించారో, లేక ఆయన ఏ పని మీదనైనా ఈ దేశం వస్తే ఆయనను అక్కడకు  రమ్మని పిలిచారో,  నాకు సరిగా గుర్తు లేదు గాని ఆయన స్వీకరించిన అంశం మాత్రం అద్భుతమైనది. అది ఏమిటంటే, నత్కీరుని కథ,  తమిళంలోనూ , తెలుగులోనూ,   ఎలా ఉంది వాటిలోని భేదాల తులనాత్మక పరిశీలన. ఈ కథ శ్రీకాళహస్తి మాహాత్మ్యము లో మనకు కనిపిస్తుంది . కవి ధూర్జటి .

ఆయన ఆ చరిత్రను తులనాత్మకంగా, చక్కగా వివరించారు . నాకు నత్కీరుడు ఎవరో తెలుసు గాని ,  తమిళంలో ఆ కథ ఎలా ఉందో మాత్రం తెలియదు. . ఇక మిగిలిన వారిలో చాల మందికి  నత్కీరుడు అంటే ఎవరో కూడ తెలియదు .

పూర్వకాలంలో,  పాండ్యరాజు ఆస్థానంలో పన్నెండు మంది మహాకవులు ఉండేవారు. వారు అందరు శైవ సిద్ధాంత విజ్ఞానంలో సముద్దండ పండితులు .  వారిలో నత్కీరుడనే వాడు ఒకడు. ఆ దేశంలో ఒకప్పుడు కరువు కాటకాలు సంభవిస్తాయి. తినడానికి తిండి దొరకదు . ఆ దేశం లోని ఒక ఊరిలో ఒక శివార్చకుడు ఉంటాడు . ఆయన,  ఆకలికి సహించలేక ఆ ఊరు విడిచిపెట్టి వెళ్లిపోడానికి సిద్ధమౌతాడు.    తనకు సెలవిమ్మని శివుని వేడుకుంటాడు .  అపుడు పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై ఒక పద్యం వ్రాసి ఇచ్చి అది రాజుకు చూపించమని  , సభలో చదవమని,  అలా చేస్తే రాజు ఎంతో కొంత  ధనం ఇస్తాడని,  ఆ ధనంతో సుఖంగా జీవించ వచ్చునని,  నచ్చ చెపుతాడు . ఆ శివార్చకుడు శివుని మాటను కాదనలేక  ఆయన, తనకు  వ్రాసి ఇచ్చిన పద్యాన్ని తీసి కొని వెళ్ళి, సభలో వినిపిస్తాడు  . ఆ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటంటే స్త్రీల యొక్క  కేశపాశాలు సహజంగానే సౌరభం కలిగి ఉంటాయని. సభలో ఉన్న నత్కీరుడు అది విని, అది తప్పు అని,  కవితా ధర్మానికి  విరుద్ధమని  వాదిస్తాడు .    ఆ శివార్చకుడు వినయంతో,  అయ్యా! ఈ కవిత నాది కాదు, ఆ పరమేశ్వరుడే నాకు స్వయంగా వ్రాసి ఇచ్చాడు . అందులోని తప్పొప్పులు నాకు తెలియవు ,  సాక్షాత్తుగా ఆ శివుడు వ్రాసి ఇస్తే నేను చదివానని వివరిస్తాడు . ఆ తరువాత ఆ  శివార్చకుడు అవమానంతో, సిగ్గుతో, తలవంచుకుని  అక్కడి నుండి వెళ్ళిపోతాడు . వెంటనే శివుని చేరుకొని  ఓ శివా! నిన్ను నమ్మి నేను అవమానాల పాలయ్యాను . ఔనులే! ప్రతివాడు,  తాను నేర్చిన  విద్య మీద ఆధారపడి జీవించాలి, అంతే గాని  పరుల విద్యను నమ్ముకొని జీవిస్తే నా లాగే అవమానాల పాలు కాక తప్పదు. నిన్ను నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అయినా నా దురదృష్టం అలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావులే . నేను బయటకు పోయి, ముష్టి ఎత్తుకుని జీవిస్తాను. నాకు సెలవు ఇప్పించు అని వేడుకుంటాడు. శివుడు,  జరిగిన దానికి బాధపడి రాజాస్థానానికి వచ్చి కవితలో ఎక్కడ తప్పు ఉందో చెప్పమని రాజసభలో  అడుగుతాడు. నత్కీరుడు మునుపటి లాగే ఆక్షేపిస్తాడు . అప్పుడు శివుడు, అతనితో  గిరిజాదేవి కేశపాశాలు సహజ గంధాలు అంటాడు. నత్కీరుడు శివునితో ‘ఆమె కేశపాశాలు సహజ గంధాలు కావచ్చు,  ఇది మానవులకు వర్ణించుట  సబబు  కాదు, “ఇటువంటి లూలామాలపు  మాటలు చాలులే ”  అని శివుని కూడ ఆక్షేపిస్తాడు. శివుడు అతనికి తన మూడవ కన్ను చూపిస్తాడు. అపుడు నత్కీరుడు శివునితో “నీ తల చుట్టూ కళ్ళున్నా నేను భయపడను, నీ చేష్టలు కట్టిపెట్టు” అని నిలదీస్తాడు. శివుడు కోపించి నీకు కుష్ఠువ్యాధి సంక్రమిస్తుంది అని శపిస్తాడు . ఆ తరువాత నత్కీరుడు శివుని పాదములపై పడి తన అపరాధాన్ని క్షమింపుమని, శాపము తొలగు మార్గము తెలియజేయుమని, కోరగా శివుడు  అతనితో కైలాస శిఖరము చూచినప్పుడు మాత్రమే శాపము తొలగునని చెప్పి అదృశ్యమౌతాడు . నత్కీరుడు కైలాస దర్శనానికి బయలుదేరి  జంబునాథ శివలింగాన్ని, ఆ  తరువాత   అరుణాచలేశ్వరుని , కాంచీ క్షేత్రాన్ని నెల్లూరులో ఉన్న పెన్నానదిని , గుండ్లకమ్మను,  సమస్త పుణ్య క్షేత్రాలు తిరిగి, తిరిగి చివరకు, కృష్ణ వేణిని , గౌతమిని, పిఠాపురాన్ని , సింహాచల క్షేత్రాన్ని , శ్రీ కూర్మం , గోకర్ణం, పురుషోత్తమ క్షేత్రాన్ని , కటకాన్ని , జలేశ్వరాన్ని, నందనేశ్వరం, గగనేశ్వరం, గయా క్షేత్రం, గంగానదిని , విశ్వేశ్వరుని, విశాలాక్షిని, దర్శించి ఉత్తర దిక్కులో ప్రయాణం చేస్తూ ఒక భయంకరమైన అటవీ ప్రదేశంలో ప్రవేశిస్తాడు.  అక్కడ ఒక భూతానికి చిక్కుకుంటాడు . ఆ భూతం నత్కీరుని ఒక గుహలో దాచింది.  నత్కీరుడు ఒక్క కుమారస్వామి మాత్రమే ఆ భూతాన్ని చంపగలడు అని తెలుసుకొని ఆయనను ప్రార్థిస్తాడు .  కుమారస్వామి ఆ నత్కీరుని ప్రమాదం నుంచి రక్షిస్తాడు. అప్పుడు నత్కీరుడు కుమారస్వామితో ! స్వామీ !  నేను అజ్ఞానంతో  చాల తప్పు చేసి శివుని శాపానికి గుఱి అయ్యాను.  . నేను ఇప్పటికే చాల అలసిపోయాను కైలాస శిఖరాన్ని ఎలా చూడ గలను ?  నాకు శాపం ఎలా తొలగిపోతుంది ? అని అడుగుతాడు. అప్పుడు కుమారస్వామి నత్కీరునితో,  ఏమయ్యా! ఆ శివుడు కైలాసం అన్నాడు గాని ఉత్తర దిక్కులో ఉన్న కైలాసమని ప్రత్యేకంగా చెప్పలేదు కదా!

అందువల్ల అంతే మహత్త్వము కలిగిన,    దక్షిణ కైలాసంగా పేరుపొందిన,  శ్రీకాళహస్తిని దర్శించి నచో నీ శాపం తొలగి పోతుందని చెప్పగా నత్కీరుడు శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి దైవానుగ్రహానికి పాత్రుడై, శాపం నుంచి విముక్తుడు ఔతాడు.  తన వ్యాధిని పోగొట్టుకుంటాడు . ఇదీ సంగ్రహంగా కథ .   ఈ వృత్తాంతం ద్వారా ఎంత పండితునకైనా అహంకారం, దైవదూషణ తగదని గ్రహించాలి .           ఇక ఎక్కడో ఇజ్రాయిల్  దేశం నుంచి వచ్చిన  ఆ పండితుడు  ఈ కథను , స్వల్పమయిన మార్పులతో ఉన్న తమిళ కథను తులనాత్మకంగా వివరించి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇది తలుచుకున్నప్పుడు పసి హృదయానికి కల్లలు, రస రాజ్యానికి   ఎల్లలు లేవని పలికిన డాక్టర్ . సి . నారాయణ రెడ్డి గారి మాట తిరుగులేని సత్యం అనిపిస్తుంది .

            <><><>

No comments: