Wednesday, August 27, 2025

ఆంధ్రులు-అద్వైత వేదాంత సేవ అధ్యాయం-3 పూర్వ మీమాంసా దర్శనము (సంగ్రహంగా)

 

ఆంధ్రులు-అద్వైత వేదాంత సేవ

అధ్యాయం-3

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

భాషాప్రవీణ , వేదాంత విద్యాప్రవీణ ,

M.A. (సంస్కృతం), M. A. (తెలుగు)

M.A. (తత్త్వశాస్త్రం), Ph. D (సంస్కృతం) 

 

పూర్వ మీమాంసా దర్శనము

(సంగ్రహంగా)

 

    ఇంతకు ముందు  మనం చార్వాక , జైన , బౌద్ధ , సాంఖ్య, యోగ , న్యాయ , వైశేషిక దర్శనాల గురించి సంగ్రహంగా తెలుసుకున్నాం . ఇప్పుడు పూర్వ మీమాంసా దర్శనం గురించి కొన్ని విషయాలు చాల సంగ్రహంగా తెలుసుకుందాం.    ‘ మీమాంస ’ అనే పదానికి వివరణాత్మకమైన  చర్చ లేదా క్లిష్టమైన విచారణ అని అర్థం.

ఈ దర్శనానికి ఆద్యుడు జైమిని మహర్షి .

వేదం ముందుగా కర్మ ప్రాధాన్యాన్ని చెప్పి ఆ తరువాత కర్మల వలన శాశ్వతమైన ప్రయోజనం అంటే ముక్తి సిద్ధించదని,  అది జ్ఞానం వల్లనే కలుగుతుందని స్పష్టం చేసింది . అందువలన ఈ మీమాంస పూర్వ-మీమాంస మరియు ఉత్తర-మీమాంస అని రెండుగా  విభజించబడింది. పూర్వమీమాంస వ్యవస్థాపకుడు జైమిని మహర్షి. ఈయన రచించిన మీమాంసా సూత్రాలు ఈ దర్శనానికి ఆధారం. ఈ శాస్త్రంలో ఒక వెయ్యి అధికరణాలతో అనేక విషయాలపై  చర్చ జరిగింది. శబరస్వామి  ఈ సూత్రాలకు భాష్యం వ్రాశారు. ఒక్కొక్క అధికరణంలో ఐదు అంశాలుంటాయి. 1. విషయం (Subject) 2. సంశయం (doubt) 3. పూర్వపక్షం (objection) 4. సమాధానం  (reply) 5. సంగతి ( consistency with the other parts of the work). ఇక  వైదిక పరమైన యజ్ఞ, యాగాది క్రతువులు ఆచరించే విధానాన్ని చర్చిస్తుంది ఈ శాస్త్రం . ‘మీమాంస’ అనే పదానికి విశేషంగా చర్చించడం అని ముందే చెప్పుకున్నాం . వేదల్లో పరస్పర విరుద్ధంగా ప్రతిభాసిస్తున్న వాక్యాలను సమన్వయ పరచడం, వైదిక కార్యకలాపాల విషయంలో రేకెత్తిన సందేహాలను నివృత్తి చేసి యజ్ఞకార్యోన్ముఖుని చేయడం మీమాంసా దర్శన ప్రయోజనం .

కాని శాస్త్రకారులైన రచయితలు అంతటితో ఆగరు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా తాను చేసిన యజ్ఞ కర్మలకు తగిన ఫలం అనుభవించడానికి తాను పర లోకంలో ప్రవేశించే అవకాశం కోరుకుంటాడు. ఎందుకంటే  ఏ సోమయాజీ యజ్ఞం పూర్తి కాగానే  సశరీరుడై సాక్షాత్తుగా స్వర్గం చేరుకోలేడు కదా! .

అందువల్ల శరీరం, మనస్సు , ఇంద్రియాలకంటే అతీతమైన   లేదా భిన్నమైన ఆత్మయొక్క ఉనికిని స్థాపించవలసిన అవసరం ఉంది. ఇక జీవుని స్వరూపం రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది నిత్య జీవితంలో అనుభవ గోచరమైన ‘నేను’ అనే భావం. అంటే నేను ఈ పనికి కర్తను, ఈ పనియొక్క ఫలితానికి  నేనే భోక్తను అనే భావం . రెండోది వీటన్నిటికి అతీతంగా ఉన్నటు వంటి వేదాంత ప్రతిపాదితమైన  సచ్చిదానంద స్వరూపం.        శ్రీ కుమారిలభట్టు తమ వార్తికాలలో ఈ విషయాలను పూర్తిగా చర్చించి ఆత్మయొక్క యథార్థ తత్త్వ జ్ఞానం కోసం వేదాంత దర్శనాన్ని ఆశ్రయించి తీరాలని సిద్ధాంత రూపంగా ప్రతిపాదించారు.

ఇక శ్రీ కుమారిల భట్టు ఆత్మ యొక్క స్వరూపం 

కర్తృ, భోక్తృ రూపమైనదని, ధర్మాచరణ విషయంలో ఆత్మను జ్ఞాన స్వరూపంగా  భావించడం అనవసరమే కాక దానివల్ల ఎంతో వ్యాఘాతం (నష్టం ) కూడ  కలుగుతుందని అభిప్రాయ పడ్డారు.

ఈ విధమైన కుమారిలభట్టు అభిప్రాయాలు పూర్వ మీమాంసకులలోనే  భిన్నాభిపాయం గల ప్రాభాకరమిశ్రుల వారి మాటలద్వారా నిర్ణయించబడ్డాయి.

వాస్తవానికి ‘నేను’ ‘నాది’ అనేవి కేవలం ఆరోపితాలు. కాని అవి సన్యాసులకే వర్తిస్తాయి గాని కర్మమార్గ ప్రవర్తకులైన వారికి వర్తించవు. అందుకే పరమపూజ్యులైన  ద్వైపాయనులవారు అజ్ఞానంతో కర్మాసక్తులైన వారి (కర్మిష్ఠుల) యొక్క మనస్సులను  విషపూరితం చెయ్యకూడదని ఉద్బోధించారు.

మీమాంసకులలో భాట్టులు, ప్రాభాకరులు అని  రెండు తెగలున్నాయని చెప్పుకున్నాం . కొంతమంది కుమారుల భట్టును అనుసరిస్తారు . మరి కొంతమంది ప్రభాకరమిశ్రుని అనుసరిస్తారు. సాధారణంగా మీమాంసకులు ప్రత్యక్ష , అనుమాన , ఉపమాన, శబ్ద, , అర్థాపత్తి , అనుపలబ్ధి అనే ఆరు ప్రమాణాలను  అనుసరిస్తారు. . అనుపలబ్ధిని కుమారిల భట్టు అంగీకరించాడు, ప్రభాకరమిశ్రుడు అంగీకరించలేద .

మీమాంసక మతంలో వేదం స్వత: ప్రమాణం. వేదం తనకు తాను ప్రమాణమౌతూ మనందరికీ ప్రమాణం ఔతుది . మీమాంసకుల మతంలో జగత్తు నిత్యం . వీరు కర్మప్రాధాన్య వాదులు. వేద విహితమైన కర్మలు చేయడం వల్ల కర్త యొక్క ఆత్మలో సంస్కార రూపమైన ఒక అపూర్వం పుడుతుంది.  ఆ ప్రభావంతో స్వర్గాది లోకాలలో సుఖాలు అనుభవిస్తారు.

ఆత్మ అనాది, అనంతం, చైతన్య రూపం .

వేద విహితమైన కర్మానుష్ఠానమే జీవిత పరమార్థం.  కర్మలు ఫలితాన్ని ఇచ్చేవే అయినా కర్మలు కర్మ కోసమే చెయ్యాలని వారి అభిప్రాయం . స్వర్గమే అత్యున్నత లక్ష్యం . ఆ తరువాతనే ముక్తి. అది సుఖ, దు:ఖాలకు అతీతమైన స్థితి.  




       

<><><> 

 

No comments: