ఆంధ్రులు-అద్వైత వేదాంత సేవ
అధ్యాయం-3
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
భాషాప్రవీణ , వేదాంత విద్యాప్రవీణ ,
M.A. (సంస్కృతం), M. A. (తెలుగు)
M.A. (తత్త్వశాస్త్రం), Ph. D (సంస్కృతం)
ఆస్తిక దర్శనాలు (న్యాయ -వైశేషిక దర్శనములు)
న్యాయ-వైశేషిక దర్శనములు:
న్యాయ దర్శన
ప్రవర్తకుడు గౌతమ మహర్షి . ఈయనకే
అక్షపాదుడు అనే పేరు కూడ ఉంది. ఇది సరైన
ఆలోచన, మరియు నిజమైనజ్ఞానం పై ప్రధానంగా దృష్టి గల దర్శనం. ఇక వైశేషికదర్శన
ప్రవర్తకుడు కణాదమహర్షి. ఈయన బాటలకిరు వైపుల సంచరిస్తూ నేలపై రాలి పడిన ధాన్య
కణాలను తింటూ జీవితం కొనసాగించే వాడని అందుకే (కణం అత్తి ఇతి కణాద: ) కణాదుడని
ఇతనికి పేరు వచ్చినదని కొందరి భావన. ఈయనకు ఉలూకుడు అనే మరొక పేరు కూడ ఉంది. అందుకే
ఈయన సిద్ధాంతాన్ని ఔలూక్య దర్శనం
అని కూడ పిలుస్తారు. ఈయన అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ప్రపంచాని కందించిన
మొట్ట మొదటి మహర్షి. ఇక న్యాయ, వైశేషికాలు రెండు సోదర దర్శనాలు.
ఈ రెండు దర్శనాలను వివరించే కొన్ని వందల గ్రంథాలు
ఉన్నాయి.
గౌతముడు ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, సమవాయ, అభావాలు,
అని ఆరు మాత్రమే పదార్థాలుగా చెపితే, కణాదుడు
విశేషాన్ని చేర్చి ఏడు పదార్థాలన్నాడు. అందుకే వారికి వైశేషికులని పేరు
వచ్చింది. ఈ నాటి తర్కశాస్త్రంలో న్యాయ వైశేషికాలను రెంటిని కలిపే వ్యవహరిస్తున్నారు
.
ద్రవ్యం మరల
భూమి, నీరు , అగ్ని, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు , ఆత్మ అని తొమ్మిది రకాలు. ఈ విధంగా తర్క శాస్త్రం ఈ రెండు సిద్ధాంతాల మేళనంతో
సాగిపోతుంది.
గౌతముడు ప్రత్యక్షం,
అనుమానం, ఉపమానం , శబ్దం అని నాలుగు ప్రమాణాల్ని అంగీకరించారు. జ్ఞానo
పొందడానికి కొన్ని సాధనాలున్నాయి. వాటిని ప్రమాణాలు అంటారు. వాటిలో మొదటిది ప్రత్యక్ష ప్రమాణం . ఇంద్రియార్థ సన్నికర్షజన్యం జ్ఞానం ప్రత్యక్షం . ప్రత్యక్ష
ప్రమాణమంటే జ్ఞానేంద్రియాలకు వస్తువులతో సంయోగం ద్వారా
కలిగే జ్ఞానం . ఈ ప్రత్యక్షజ్ఞానం నిర్దుష్టమే అయినా దానికి కొన్ని
పరిమితులున్నాయి.
1. అతి
దగ్గరగా ఉన్న మన కంటిరెప్పలు మనకు కనిపించవు.
2. అతి దూరంగా ఎక్కడో ఎగురుతున్న పక్షి మనకు
కనిపించదు.
౩. కన్ను పోతే ఏమి కనిపించదు.
4. మనస్సు స్థిరంగా లేకపోతే ఏమి కనిపించదు.
5. అతి చిన్న వైన అణువులు,
పరమాణువులు మనకు కనిపించవు.
6. మనకు మన ఇంటి గోడ అవతల ఉన్న వస్తువు కనిపించదు.
7. సూర్యుని వెలుగు ముందు నక్షత్రాలు కనిపించవు.
8. పెద్ద మినుగుల రాశిలో ఒక బెడ్డ కనిపించదు.
అంతే కాకుండ ప్రత్యక్షంగా కనిపిoచేవన్ని నిజం కావు. ప్రక్క రైలు బండి
కదులుతుంటే మన రైలు బండి కదులుతున్నట్లు కనిపిస్తుంది. పంకా ఒక వైపు తిరుగుతూంటే
మరో వైపు తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే చంద్రుడు మనకు చూడడానికి చాల
చిన్నగా కనిపిస్తాడు. కాని ఇవన్ని నిజాలు
కావు.
మరో విషయం ఏమిటంటే భగవంతుని ఉనికిని ప్రత్యక్ష
ప్రమాణం రుజువు చెయ్యలేదు. అందువల్ల మరో ప్రమాణాన్ని ఆశ్రయించక తప్పదు . అది అనుమాన
ప్రమాణం . ఉదాహరణకు కొంతమంది
ఇలా ఆలోచిస్తూ ఉంటారు . ఒక పర్వతం
మీద పొగ కనిపిస్తోంటే దాన్ని ఆధారం చేసుకుని అక్కడ అగ్ని ఉంది అని నిర్ధారణ చేస్తాడు (ఇక్కడ
పర్వతం పక్షం . అగ్ని సాధ్యం . పొగ హేతువు).
ఎక్కడెక్కడ పొగ ఉoటుoదో అక్కడక్కడ నిప్పు ఉంటుంది . ఉదాహరణ వంటిల్లు .
పర్వతం మీద పొగ కనిపిస్తోoది కాబట్టి అక్కడ నిప్పు ఉంది
అని తార్కికులు నిప్పును చూడకుండానే బుద్ధి బలంతో పొగను బట్టి
నిప్పుయొక్క ఉనికిని ఊహిస్తారు. ఇది అనుమాన ప్రమాణం .
ఇది భగవంతుని ఉనికిని నిరూపించడానికి ఉపయోగపడుతుంది .
క్షిత్యంకురాదికం సకర్తృకం కార్యత్వాత్ ఘటవత్ అనే నియమం ఉంది . ఒక కుండ
ఉంటే దాన్ని బట్టి దానిని చేసిన వాణ్ణి మనం ఉన్నాడని నిరూపించవచ్చు . ఈ విశాలమైన
ప్రపంచాన్ని బట్టి దీని సృష్టికర్త భగవంతుడనే వాడు ఒకడు ఉన్నాడని చెప్పవచ్చు.
దీన్ని అనుమాన ప్రమాణమని పిలుస్తారు . ఇది ప్రత్యక్షం పైనే ఆధారపడి ఉంటుంది
కాబట్టి ఇది స్వతంత్రమైనది కాదు.
ఇక మూడోది ఉపమాన ప్రమాణం. ఉపమానం అంటే పోలిక. ఒక
వ్యక్తి ఉన్నాడు. వాడికి ‘గవయ’ మృగం అంటే ఏమిటో, ఎలా
ఉంటుందో తెలియదు. ఒకసారి అడవిలో తిరుగుతూ అక్కడ
సంచరించే వ్యక్తిని ‘గవయ’ మృగం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? అని అడిగాడు. ఆ
వ్యక్తి ‘‘ గో సదృశో గవయ:” అన్నాడు . ఏ జంతువైతే ఆవు కాకుండా ఆవు లాగే ఉంటుందో అది ‘గవయమృగం’
అని దాని కర్థం. ఈ వ్యక్తి అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక జంతువును చూశాడు. అది ఆవు
కాదు గాని ఆవు లాగానే ఉంది అప్పుడు అది
గవయ మృగమని తెలుసుకున్నాడు . ఇది ఉపమాన ప్రమాణం .
ఇక నాలుగోది శబ్ద ప్రమాణం. ఆప్తవాక్యం శబ్ద: ,
ఆప్తస్తు యథార్థ వక్తా
అని నియమం . నిజం చెప్పే ఆప్తుని వాక్యం శబ్ద
ప్రమాణమని దీని కర్థం.
ఇది అన్నిటి కంటే గొప్పది. సాధారణంగా మనకు తెలియని
ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం ఎక్కడ ఉంది ? ఎలా చేరుకోవాలి ? అని మనం
అడిగినప్పుడు వారు ఆ ప్రదేశం ఫలానా చోట అని చెపుతూ మార్గం కూడ సూచిస్తారు. మనం వారి మాటలు నమ్మి మనకు కావలసిన
ప్రదేశానికి చేరుకుంటున్నాం. ఇది ‘శబ్ద ప్రమాణం’. ఈ
ప్రపంచమంతా శబ్దప్రమాణం పైనే నడుస్తోంది . భగవంతుని దర్శించిన కొంతమంది మహానుభావులు భగవంతుడు
ఉన్నాడని చెపుతున్నారు. మనం వారి మాటలు నమ్మి మన ప్రయత్నాలు మనం చేసుకుంటున్నాం.
ఇవి గాక అర్థాపత్తి, అనుపలబ్ధి , సంభవం , ఐతిహ్యం అనే మరో నాలుగు ప్రమాణాలున్నాయి.
న్యాయ దర్శనం మాత్రం ఈ నాలుగు ప్రమాణాలనే అంగీకరించింది.
ఇక వైశేషిక దర్శనం ప్రత్యక్షం , అనుమానం ఈ రెంటినే
ఒప్పుకుంది . మిగిలిన రెంటిని ఒప్పుకోలేదు . మిగిలినవి రెండు అనుమానంలో అంతర్భవిస్తాయని
అభిప్రాయపడింది .
శబ్దోపమానయోర్నైవ పృథక్ పామాణ్యమిష్యతే
అనుమాన గతార్థత్వాదితి వైశేషికం మతం .
న్యాయ
సిద్దాంతం 16 అంశాలను పేర్కొన్నది. అవి 1. ప్రమాణం అనగా జ్ఞాన సాధనం 2. ప్రమేయం అంటే ప్రమాణం ద్వారా తెలియబడేది 3. సంశయం
అంటే సందేహం 4. ప్రయోజనం, 5. దృష్టాంతం అంటే ఉదాహరణ 6. సిద్ధాంతం అంటే అభిప్రాయ
సారం 7. అవయవం అంటే ఒక విషయాన్ని నిరూపించడానికి
సహకరించే ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయ’ నిగమనాది ఉపకరణాలు. 8. తర్కం అంటే ఒక విషయ
నిరూపణకు సహకరించే ఊహాది సాధనాలు 9. నిర్ణయం అంటే జ్ఞాన సాధనాల సహకారంతో వస్తువు యొక్క
యథార్థ స్వరూపాన్ని నిర్ణయించడం 10. వాదం అంటే వస్తు స్వరూప నిర్ధారణకు ముందు
జరిగే వాదోపవాదాలు. 11. జల్పం అంటే వస్తు
స్వరూపాన్ని తెలుసుకోడం కోసం కాకుండా పరస్పరం ఒకరినొకరు జయించాలని చేసుకునే వాదోపవాదాలు.
12. వితండం అంటే తన వాదం గురించి
మాట్లాడకుండా ఎదుటి వాడి వాదనలో తప్పులు వెదకడం 13. హేత్వాభాస అంటే మనం ఒక దాన్ని
నిరూపించడానికి సరైన హేతువును కాకుండా స్వీకరించే తప్పుడు హేతువు. 14. ఛలము అంటే ఒక
పదానికి మరో అర్థం కల్పించి వాదించడం.
ఉదా:- నవకంబళ: బాల: అని ఒకడు అన్నాడనుకోండి.
అందులో తప్పేమీ లేదు బాలుడు నూతనమైన కంబళం ధరించాడని అర్థం, కాని ప్రతివాది నవ అనే
పదానికి తొమ్మిది అని అర్థం తీసి వాదిస్తే
అది మొండి వాదం ఔతుంది. 15. జాతి అంటే ఒక విధంగా
చెప్పవలసిన దానిని మరో విధంగా చెప్పడం ఉదా :- శబ్దం నిత్యం కాదు అది కార్యం
కాబట్టి ఉదా:- కుండ. అని ఒకడు వాదిస్తే శబ్దం నిత్యం ఆకాశం వంటిది అని వాదిస్తాడు మరొకడు.16. నిగ్రహస్థానం అంటే ఓటమికి
కారణం. వాదనలో సాధారణంగా ఓటమికి రెండు కారణాలుంటాయి. ఎదుటి వాని వాదాన్ని అర్థం చేసుకోలేక
పోవడం లేదా తప్పుగా అర్థం చేసుకోవడం .
ఎదుటి వారి వాదనలో తప్పులు వెదకడం కూడ ఇందులో చేరుతుంది. ఈ విధంగా పదహారు అంశాల వివరణ ఇందులో ఉంది . వీటి యొక్క
సదవగాహన ద్వారా మొక్షం సంప్రాప్తిస్తుందని చెప్పబడింది.
ఈ న్యాయ వైశేషిక
దర్శనాలు రెండు తర్క ప్రధానాలే . ఈ
ప్రమాణాల్లో ఎన్నెన్నో భేదాలు కూడ ఉన్నాయి.
ప్రత్యక్ష
ప్రమాణం బాహ్య ప్రత్యక్షం, అంతర ప్రత్యక్షం అని రెండు
విధాలు. ఒకటి ఇంద్రియాలద్వారా, రెండు మనస్సు ద్వారా. ఇంద్రియాలు ఐదు కాబట్టి బాహ్య
ప్రత్యక్షం ఐదు విధాలు . ఆంతర్యం మానసం .
అలౌకిక
ప్రత్యక్షం మరల మూడు విధాలు .1. సామాన్యలక్షణ 2. జ్ఞాన లక్షణ 3. యోగజ .
ప్రమాణాల
ద్వారా ఆత్మ, శరీరం మొదలైన
తత్త్వజ్ఞానం
వల్లనే అపవర్గం (మోక్షం) సిద్ధిస్తుందని వారి అభిప్రాయం. ఇక మోక్షం అంటే సుఖ దు:ఖ నివృత్తియే
అని వీరి సిద్ధాంతం.
ఈశ్వరుడు జగత్కారకుడు.
ఆయన శూన్యం నుంచి ఈ ప్రపంచాన్ని సృష్టించ లేదు. పరమాణువులు, దిక్కు , ఆకాశం, కాలం , మనస్సు , ఆత్మల నుండి
సృష్టించాడు. ఒక కుండ ఉన్నది అనుకుంటే దానిని సృష్టించిన కుమ్మరి ఉంటాడు. అలాగే ప్రపంచం
ఉన్నది అనుకుంటే దానికి కర్త (ఈశ్వరుడు) లేకుండా అది జరగదు. ఈ విశ్వానికి సృష్టి
స్థితి లయ కారకుడు ఈశ్వరుడు. అణు రూపంగా ఉన్న ఈ విశ్వాన్ని ఒకటిగా కలిపేది ఈశ్వర శక్తియే .
ఆయన
సర్వజ్ఞుడు, సర్వ శక్తి మంతుడు, సర్వవ్యాపి .
మోక్షం అంటే
సుఖ దు:ఖముల నుండి విముక్తి . తత్త్వ జ్ఞానం వల్లనే ముక్తి కలుగుతుంది. అది
ఈశ్వరుని కృప వల్లనే కలుగుతుంది .
ఈ న్యాయ, వైశేషికదర్శనాలలో ఇంకా ఎన్నెన్నో విషయాలు
చర్చించారు. అవన్నీ వాటిని ప్రత్యేకంగా చదివి తెలుసుకోవాలి.
<><><>
No comments:
Post a Comment