Monday, December 12, 2016

ఎంత విచిత్రం !

ఎంత విచిత్రం !
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
శివా! సాధారణంగా మానవుడు అవసాన సమయంలో దేన్ని గురించి ధ్యానం చేస్తాడో దాన్నే పొందుతాడు అని నువ్వు  శ్రుతి,  స్మృతి , ఇతిహాస , పురాణాల ద్వారా ఎన్నోసార్లు చెప్పావు .  యథా క్రతురస్మిన్ లోకే పురుషో భవతి తథేత: ప్రేత్య భవతి (ఛాందోగ్య ఉపనిషత్తు III -14-1) అని ఒక ప్రక్క ఉపనిషత్తులు చెబుతుండగా  యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవేతి కౌంతేయ! సదా తద్భావభావిత:(VIII-6) అని భగవద్గీత కూడ ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది . అంతేకాకుండ జడభరతుని  వంటి మహామునుల చరిత్రలు  ఈ విషయాన్నే ఋజువుచేస్తున్నాయి. కాని శివా ! ఇదేం చిత్రమయ్యా! నీ పాదద్వంద్వాన్ని ధ్యాన్నిస్తుంటే  ద్వైతభావం కలగాలి . కాని అందుకు భిన్నంగా శీతోష్ణ సుఖదు:ఖాది ద్వంద్వాతీతమైన  అద్వైతస్థితి  కలుగుతోంది. ఇది  చాల ఆశ్చర్యంగా ఉంది కదూ!.
 అంతే చింతయతే యత్తత్తామేతి చ త్వయా గదితం
శివ! తవ చరణద్వంద్వధ్యానాన్నిర్ద్వంద్వతా చిత్రం (3)
(శ్రీ అప్పయ్యదీక్షితుల-ఆర్యాశతకం)
శివ! = ఓ శివ 
అంతే =మరణ కాలమందు
యత్=ఏది
చింతయతే = ధ్యానము చేయునో
తత్=అది
తాం=అతనిని
ఏతి=పొందును (అని) 
 త్వయా చ =నీచేత కూడ
గదితం =చెప్పబడినది (నువ్వూ చెప్పేవు)
తవ =నీ
చరణ ద్వంద్వ= పాదద్వంద్వమును
ధ్యానాత్=ధ్యానము చేయుట వలన
నిర్ద్వంద్వతా= ద్వంద్వాతీత స్థితి  (సిద్ధిస్తో౦ది)
చిత్రం =ఇది చాల వింతగా ఉంది కదూ!
                                  ***


No comments: