Tuesday, November 13, 2018

మహాత్ములకు ఆత్మబలమే అసలైన బలం ఆయుధాలు కావు


మహాత్ములకు ఆత్మబలమే అసలైన బలం ఆయుధాలు కావు

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
3/106. ప్రేమనగర్, దయాల్బాగ్,
ఆగ్రా -5
08279469419.

తెలుగు చిత్రపరిశ్రమలో విజయాసంస్థ వారు  ఎంతో పేరుప్రఖ్యాతులు గడించారు . దానికి కారణాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే వారు తీసిన సినిమాలే . అవి ఆ నాటికి ఈ నాటికి ఏనాటికి చెక్కు చెదరని మొక్కవోని నిక్కమైన కళాఖండాలు .సంగీతానికి , సాహిత్యానికి ,సత్సా౦ ప్రదాయాలకు, అందమైన సందేశానికి సరసమైన వినోదానికి విజయావారి సినిమాలు ఉదాహరణలు . అసభ్యతకు ఏ మాత్రం తావులేని అచ్చమైన కుటుంబకథాచిత్రాలు వారివి . నిజంగా ఆ సంస్థ యాజమాన్యం , వారిదగ్గర పనిచేసిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు చాల అద్రుష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు .  వారి అకుంఠితదీక్షాదక్షతలు నేటి సినీపరిశ్రమకు ఆదర్శప్రాయం .     ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వారి బ్యానర్ పై ఉండే సూక్తి వారి గొప్పదనాన్ని సూచిస్తు౦ది. సినిమా మొదలు కాగానే మనకు  క్రియా సిద్ధి: సత్వే భవతి  మహతాం నోపకరణే  అనే సూక్తి కనిపిస్తుంది. ఒక సంస్థ గొప్పదనం వారు ఏర్పరచుకున్న motto పైన ఆధారపడి ఉంటుంది . మహాత్ములకు కార్యసిద్ధి వారి బలం మీదనే ఆధారపడి ఉంటుంది గాని సాధనాలపైన కాదు . ఈ సూక్తి వారి గొప్పదనానికి స్ఫూర్తి . దీన్ని పరిశీలించిన నాకు దీనికి సంబంధించిన   ఎన్నో విషయాలు తెలిశాయి. అవన్నీ ఈ వ్యాసంలో సంగ్రహంగా పొందుపరుస్తున్నాను .

మహాత్ములు ఏ కార్యాన్నైనా  స్వశక్తితో సాధిస్తారు గాని సాధనాలపై ఆధారపడరు . ఒకవేళ సాధనాలు స్వీకరించినా అవి నామ మాత్రంగానే ఉపయోగపడతాయిగాని కార్యసిద్ధిమాత్రం వారి బలం వల్లనే కలుగుతుంది . ఈ విషయాన్ని బలపరచడానికి మన పురాణాల్లో ఉదాహరణలు కోకొల్లలుగా లభిస్తున్నాయి . మనం కొన్నిటిని పరిశీలిద్దాం.   

ముందుగా మొదటి ఉదాహరణగా రాముణ్ణి తీసుకుందా౦ .  ఆయన జయి౦చ వలసింది లంకారాజ్యం.  అది సమీపంలో ఉందా అంటే లేదు , సముద్రమధ్యంలో ఉంది. సముద్రాన్ని దాటి వెళ్ళాలి . కాలి నడకతోనే గమ్యం చేరాలి . ఇక ప్రత్యర్థి సామాన్యుడు కాదు . ముల్లోకాలను జయించిన రావణుడు అతడు ఒక రాక్షసుడు . ఇక రాముని సహాయకులు యుద్ధంలో నిపుణులా అంటే కాదు , నిరాయుధులైన వానరులు . ఐనప్పటికీ రాముడు రావణుని జయించగలిగాడు . అందువల్ల మహాత్ములు తమ పరాక్రమం చేతనే  కార్యాన్ని సాధిస్తారు గాని సాధన సామగ్రి వలన కాదు .

1. విజేతవ్యా లంకా చరణ తరణీయో జలనిధి:
విపక్ష: పౌలస్త్య: రణభువి సహాయాశ్చ కపయ:
తథాప్యేకో రామ: సకలమవధీద్రాక్షాస కులం    
క్రియాసి ద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

विजेतव्या लङ्का चरणतरणीयो जलनिधि:                 
विपक्ष: पौलस्त्य: रणभुवि सहायाश्च कपय:                           
   तथाप्येको राम: सकलमवधीद्रावणकुलम्
   क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |

ఇపుడు నిండైన రెండో  ఉదాహరణ తీసుకుందాం. ఆయనెవరోకాదు,  సూర్యుడు . ఆయన రథానికి ఒకే చక్రం . ఏడు గుర్రాలు అవి పాములచేత కట్టబడినవి . ఇక్కడ ఏడు గుర్రాలంటే సూర్యకిరణం లోని ఏడు రంగులని అర్థం .  అవి  Violet, Indigo, Brown, Green, Yellow, Orange and Red (VIBGYOR). ఇక  ఆమార్గం ఎటువంటి ఆలంబన లేనిది . పోనీ సారథి గొప్పవాడా అంటే కాదు . ఆయన సారథి అనూరుడు. దివ్యా౦గుడు, ఊరువులు కూడ లేని అవిటివాడు . ఐనప్పటికీ ఆ సూర్యుడు ప్రతిరోజూ ఆకాశం ఈ వైపునుంచి ఆ వైపు వరకు అలసటలేకుండా సంచారం చేస్తూ ప్రపంచానికి వెలుగు పంచుతున్నాడు . అందువల్ల మహాత్ముల కార్యసాధనకు  స్వశక్తియే ఆధారం గాని ఆయుధాలు , అనుచరులు కాదు .

2. రథస్యైకం చక్రం భుజగయమితా: సప్త తురగా:
నిరాలంబో మార్గ: చరణరహిత: సారథిరపి
రవిర్గచ్ఛత్యంతం ప్రతిదిన మపారస్య నభస:      
 క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

रथस्यैकं चक्रं भुजगयमिता: सप्ततुरगा:             
 निरालम्बो मार्ग:  चरणरहित: सारथिरपि                   
 रविर्गच्छत्यन्तं   प्रतिदिनमपारस्य नभस                                
क्रियासिद्धि : सत्त्वे भवति महतां नोपकरणे |

ముచ్చటగా మూడో  ఉదాహరణ  చూద్దాం .        ఆయన ఎవరో కాదు  మన్మథుడు. మన్మథునకు పువ్వే విల్లు . తుమ్మెదలే అల్లె త్రాడు . ఇక చపలచిత్తలైన స్త్రీల చంచలమైన చూపులే బాణాలు . ఇక సహాయ సహకారాలేమైనా ఉన్నాయా అంటే ఏమీ లేనట్లే . ఎందుకంటే చైతన్యం లేని చంద్రుడే సహాయకుడు . ఐనప్పటికీ మన్మథుడు తన స్వశక్తితో ఈ మూడు లోకాలను  సంమోహపరుస్తున్నాడు . త్రిభువన విజేతగా నిలిచాడు . కాబట్టి మహాత్ములకు స్వశక్తియే కార్యసిద్ధికి కారణం ఔతుంది గాని ఆయుధాలు, బలగం ఏమాత్రం కావు .
3. ధను: పౌష్పం  మౌర్వీ మధుకరమయీ  చంచలదృశాం
దృశాం కోణో బాణ: సుహృదపి జడాత్మా హిమకర: 
తథా ప్యేకోsనంగ: త్రిభువనమపి వ్యాకులయతి
 క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

धनु: पौष्पं  मौर्वी मधुकर मयी चञ्चलदृशां                
 दृशां कोणो बाण: सुहृदपि जडात्मा हिमकर:                              
तथाप्येकोsनङ्ग: त्रिभुवमपि व्याकुलयति
क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |
నాణ్యమైన నాలుగో ఉదాహరణ చూద్దాం . ఆయన ఎవరో కాదు  మన్మథుడే. మన్మథుడు స్వయంగా శరీరం లేనివాడు .ఇక  ప్రత్యర్థి సామాన్యుడు కాడు . ముల్లోకాలకు ప్రభువైన ఈశ్వరుడు.   ఇక మన్మథుని  సహాయకుడైన వసంతుడు ప్రాణంలేని ఒక జడ పదార్థం . మంచి ఆయుధాలేమైన ఉన్నాయా అనుకుంటే అవి పువ్వులు . అందులోనూ ఐదు పువ్వులే.  అవి అరవిందం , అశోకం , మామిడి , నవమల్లిక , నీలోత్పలం . అవన్నీ చాల మృదువైనవి ముట్టుకుంటే విరిగిపోయేవే . ఇక ఆయన సైన్యం అబలాజనం . ఐనప్పటికీ మన్మథుడు ముల్లోకాలను జయిస్తున్నాడు . కాబట్టి మహాత్ములకు కార్యసిద్ధి వారి స్వశక్తి వల్లనే కలుగుతుంది గాని సాధనాలతో పనిలేదు .
4. విపక్ష: శ్రీకంఠ: జడతనురమాత్య: శశి ధర:
వసంతో సామంత: కుసుమమిషవ: సైన్యమబలా:
తథాపి త్రైలోక్యం జయతి మదనో దేహరహిత:
క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే 

विपक्ष: श्रीकण्ठ: जडतनुरमात्य: शशिधर:                  
 वसन्तो सामन्त: कुसुममिषव: सैन्यमबला:                                  
  तथापि त्रैलोक्यं जयति मदनो देह रहित:                                                क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |    
ఇపుడు అందమైన ఐదవ  ఉదాహరణ పరిశీలిద్దాం . ఈయన అగస్త్యుడు .ఆయన  మట్టికుండలో పుట్టాడు . ఆయన ఇరుగు పొరుగు పరివారం అంతా మృగాలే . భూర్జ పత్రాలె బట్టలు . నివాసం అడవి. కంద, మూల ఫలాలే ఆహారం.  బక్క చిక్కిన  శరీర౦ . ఇన్ని లోపాలున్నప్పటికి ఆయన స్వశక్తితో సముద్రాన్ని పూర్తిగా త్రాగివేసి తమకు అపకారం చేసి సముద్రంలో దాక్కుంటున్న  కాలకేయులను బయటపెట్టి వారిని నిర్మూలనకు ఎంతో సహకారం చేశాడు . కాబట్టి మహాత్ములకు కార్యసిద్ధి వారి స్వశక్తి వలననే కలుగుతుంది గాని వేరొకరి సహాయం వలన కాదు. కాలకేయులనే కొంతమంది రాక్షసులు మునులకు ఎంతో అసౌకర్యం కలిగించేవారు . వారిని హింసించి తరువాత సముద్రంలో దాక్కునేవారు . ఎంతకాలమైనా సముద్రంలో దాక్కునే నైపుణ్యం వారికుంది . ఇక వారి జాడ ఎవరికీ తెలిసేది కాదు . వారి బాధలు పడలేక మునులందరూ దేవతలను ప్రార్థించగా వారందరూ విష్ణువును చేరి ఆ కాలకేయులను మట్టుబెట్టే మార్గాన్ని సూచించమని వేడుకున్నారు . అపుడు విష్ణువు దేవతలతో మీరు అగస్త్యుని ప్రార్థి౦చండి  ఆయన సముద్రాన్ని త్రాగివేయ గల ఏకైక సమర్థుడు అని చెప్పగా దేవతలు అతని చేరి జరిగిన సంగతి వివరించగా అగస్త్యుడు తనశక్తినంతా కూడ గట్టుకుని సముద్రాన్ని త్రాగివేయగా అప్పుడు దేవతలు కాలకేయులజాడ కనుగొని వారిని తరిమి తరిమి చంపారు .
5. ఘటో జన్మస్థానం మృగపరిజన: భూర్జవసన:
వనే వాస: కందాశనపి చ దుస్థం  వపురిదం
తథాప్యేకోsగస్త్య: సకలమపిబద్వారిధి జలం
 క్రియాసిద్ధిస్సత్వే భవతి మహతాం నోపకరణే
     
घटो जन्मस्थानं मृगपरिजन: भूर्जवसन:           
वने वास: कन्दाशनमपि च दु:स्थं वपुरिदं                       
 तथाप्येकोsगस्त्य: सकलमपिबद्वारिधिजलम्                                   
 क्रियासिद्धि : सत्त्वे वसति महतां नोपकरणे |
కాబట్టి మానవుడు ఈ పై విషయాలను స్ఫూర్తిగా తీసుకుని ఇతరులపై ఆధారపడకుండ స్వశక్తితో ఆత్మవిశ్వాసంతో కార్యసాధనకు పూనుకోవాలి. ఆత్మవిశ్వా సం గలవాడు సాధించలేనిదంటు ఏది ఉండదు .
                                               *****

3 comments:

కంది శంకరయ్య said...

మీ వ్యాసం బాగున్నది.

seethadevi gurram said...

చాల మంచి వ్యాసం!🙏🙏

Durga Prasada Rao Chilakamarthi said...

ధన్యవాదాలు