అభినందన మందారమాల
శ్రీ గోరస సుబ్రహ్మణ్యాచార్యులు గారి సుందరకాండ వ్యాఖ్యాన౦
ఒక సమీక్ష
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
ఒక
వ్యక్తి గొప్పదనం బయట పడాలంటే దానికి కొంతమంది
కారకులు, ప్రేరకులు ఉండాలి . ఈ నియమం రాముని విషయంలో
కూడ వర్తిస్తుంది . ఆయనకు ఎవరు ఏ శుభముహూర్తంలో ‘రామ’ అని పేరు పెట్టారో తెలియదు గాని ఆయన కారణజన్ముడు, సార్థక నామధేయుడు
అయ్యాడు . రాముని గొప్పదనం విశ్వవ్యాప్తం
అయ్యింది . ఈ లోకంలో ఆ రాముని తత్త్వం ఇద్దరికి మాత్రమే పూర్తిగా తెలుసట . ఒకరు
విశ్వామిత్రుడు . రెండవవారు కైకేయి .
అందుకే విశ్వామిత్రుడు యాగరక్షణ అనే నెపంతో రాముని గొప్పతనాన్ని అందరికి చాటిచెబితే
కైకేయి వరాలు కోరి అడవులకు నెట్టి రావణసంహారం ద్వారా ఆయన పరాక్రమాన్ని విశ్వవ్యాప్తం
చేసింది . ఆమె సామాన్యవనిత కాదు అనేక జన్మల్లో చేసిన తపస్సు వల్ల కలిగిన
ఆత్మజ్ఞానంచే పవిత్రమైన అంత: కరణ కలిగిన మహనీయమూర్తి . ఆమె లేకుంటే అసలు రామాయణమే
లేదు. అందరి రాజుల్లాగే రాముడు కూడ కొంతకాలం రాజ్యం చేసి ఆ తరువాత కాలగర్భంలో
కలిసిపోయి ఉండేవాడు. అందుకే అన్నారొక కవి
:
“ రాముని
తతత్వ మంతయు కరామలకంబుగ గా౦చువారలీ
భూమిని యిర్వురుండిరి తపోమహితు౦డగు గాధినందన
స్వామియు నైకజన్మసముపాత్త తప:పరిశీలితాత్మ వి
ద్యామహిత ప్రభావహృదయంగమ కేకయరాజపుత్రియున్ “
ఏమిటి ?
రామునిలో ఇంత గొప్ప ఉందా అంటే ఉంది . ఆయన సార్ధక నామధేయుడని ముందే అనుకున్నాం . రామ అనే మాటకు రమయతి ఇతి రామ: అని అర్థం
చెప్పుకోవచ్చు. అంటే అందరికి ఆహ్లాదం కలగజేసే వాడు అని అర్థం . అందుకే వాల్మీకి
రాముని కొనియాడుతూ సర్వసత్వ మనోహర: అంటారు . ఇక రామ అనేమాటకు రాక్షసమరణ
హేతువు అని అర్థం చెప్పుకోవచ్చు . అలాగే రావణ మరణ హేతువు అనే అర్థం
కూడ చెప్పుకోవచ్చు . అలాగే రమంతే యోగినో యస్మిన్ స: రామ: ఎవరి నామాన్ని జపించి యోగులు విగళీతవేద్యా౦తరమైన
బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారో ఆయనే రాముడు . మరో విశేషమేంటంటే
“ రాశబ్దో
విశ్వ వచన: మశ్చాపీశ్వర వాచక:
విశ్వాధీనేశ్వరో
యో హీత్యేవం రామ: ప్రకీర్తిత: “ అన్నారు.
రా అంటే విశ్వం , మ
అంటే ఈశ్వరుదు అనిఅర్ధం . మొత్తంమీద రామ శబ్దానికి విశ్వాధిపతి అనే అర్థం
వస్తుంది. దీనికి కూడ రెండు అర్థాలున్నాయి.
విశ్వ: అధీన: యస్మిన్ స: విశ్వాధీన: (విశ్వం తన అధీనంలో కలవాడు) అని ఒకర్థం,
విశ్వస్య అధీన: ప్రపంచానికి అధీనంలో ఉన్నవాడు అని మరో అర్థం . ఈ రెండూ కూడ ఆయనకు వర్తిస్తాయి. ముల్లోకాలకు ప్రభువై యు౦డి
కూడ, సామాన్యజనుని మాటకు లొ౦గి, వశుడై ప్రాణంతో సమానమైన భార్యను అడవుల పాలు చేశాడు .
అటువంటి రామకథ ఆపాత మధురం. అమృతతుల్యం .
అందుకే రామకథ ఎందరి హృదయాలను ప్రభావితం చేసిందో చెప్పనలవి గాదు. ఇంతటి ప్రజాదరణ పొందిన గ్రంథం ప్రపంచంలో
మరే ఇతర భాషలలోను లేదు. ముఖ్యంగా భారతావనిలో రామాయణానికున్న ప్రాశస్త్యం మరే ఇతర గ్రంథానికి
లేదని చెప్పొచ్చు. గొప్పగొప్ప కవులు, నాటకకర్తలు, కళాకారులు , వాగ్గేయ కారులు రామకథను
ఏదో రూప౦లో స్పృశించి తాము తరి౦చి లోకాన్ని తరింప చేసినవారే.
ఆధునిక కవులలో ప్రముఖులైన శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు రామకథా వైశిష్ట్యాన్ని
వివరిస్తూ “ వ్రాసిన రామచంద్రు కథ
వ్రాసితివంచనుపించుకో “ అని తమ తండ్రి గారు హెచ్చరించారట
. అలాగే ‘దేవతలు అమృతం త్రాగేరు వాళ్ళమీద నాకేమాత్రం అసూయ
లేదు . ఎందుకంటే వాల్మీకి మహర్షి అందించిన రామ సత్కథాసుధారసం త్రాగేను అది చాలు
నాకు అంటారు . వారి మాటల్లోనే చెప్పాలంటే
:
అచ్చమైన యమృత మమరులు త్రాగినా
రోయి దానికేనసూయ పడను
పరమ భాగవతుడు వాల్మీకి కృత రామ
సత్కథా సుధా రసంబు గ్రోలి
ఇక రామనామం యొక్క గొప్పదనం గురించి చెప్పాలంటే ఎన్నో
విషయాలున్నాయి ఒకనాడు రావణుడు సభలో ఉండగా సేవకుడొకడు లోపలికి ప్రవేశించి మహారాజా !
ఎవరో రాముడట వానరులతో మన లంకానగరంలో ప్రవేశించాడు . ఆయన మిమ్మల్ని యుద్ధానికి
ఆహ్వానిస్తూ వర్తమానం పంపించాడు . అది మీకు విన్నవించడానికే వచ్చాను మహారాజా!
అన్నాడు . రావణుడికి చాల ఆశ్చర్యం కలిగింది . వాళ్ళంతా సముద్రాన్ని దాటి ఎలా
రాగలిగారు ? అని ప్రశ్నించాడు . నాకు తెలీదు మహారాజా! కాని
అక్కడ వాళ్ళ మాటలుబట్టి నాకు అర్థమయిందేంటంటే ఆ వానరులందరు ‘రామ’ ‘రామ’ అంటు శిలలు సముద్రంలో
పడవేయగానే అవి నీటిపై తేలేయట . వాళ్ళు వారధి నిర్మించుకుని వచ్చినట్లుగా నాకర్థమై౦ది
స్వామీ ! అని చెప్పి వెళ్లిపోయాడు. అదివిన్న రావణుని సభలో ఉన్నవారికి రాముని
గొప్పదనం అర్థమై౦ది. అటువంటి గొప్పవ్యక్తిని మనం
ఎదిరించి గెలువగలమా! అది అసాధ్యం అనుకున్నారు . వాళ్ళల్లో క్రమక్రమంగా నిరుత్సాహ౦
పెల్లుబికింది అది గమనిస్తున్నాడు
రావణుడు. వాళ్ళల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాలి. లేకపోతే నిర్వీర్యులై పోతారు
అనుకున్నాడు . కాని ఎలా ? ఆలోచించాడు . వాళ్ళతో ఓ సభాసదులారా! రాయిని నీళ్ళపై తేల్చడ౦ పెద్ద పనే౦ కాదు . ఎవరైనా చేయ గలరు అన్నాడు . వెంటనే సైనికులలో ఒకరు రాజా ! ఆ పని మీరు చేయగలరా ? అన్నాడు . ఎందుకు చెయ్యలేను అన్నాడు
ధీమాగా . ఐతే చేసి చూపించండి అన్నాడు ఆవ్యక్తి . వెంటనే నీరు రాయి తెప్పించారు .
రావణుడు ఏదో మంత్రం చదివి నీళ్ళల్లో రాయి విసిరాడు . ఆశ్చర్యం! అది తేలింది .
రావణుని పక్షంలో ధైర్యోత్సాహాలు వెల్లి విరిశాయి. అందరు రావణునకు నమస్కరించి వెళ్ళిపోయారు . ప్రధానమంత్రి యైన
ప్రహస్తుడొక్కడే ఉన్నాడు . ఆయనింకా ఆశ్చర్యం
లోంచి తేరుకోలేదు . కొంతసేపటికి రావణుని చేరి
మహారాజా! నేనింకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు, .మహారాజా! మీరు ఏం చేశారో దయజేసి నాకు చెప్పండి అని అడిగాడు .దానికి సమాధానంగా రావణుడు ఓ మహామంత్రి ! ఇది
చాల రహస్యం ఎవరికీ చెప్పకు . నేను మాత్రం ఏ౦ చేస్తాను . ఆ రామమంత్రాన్నే నేనూ
జపించాను అని చల్లగా చెప్పాడు . రామమంత్రం అంత గొప్పది .
మరో ఉదాహరణ
అడవిలో కిరాతకులైన కొంతమంది బందిపోటు
దొంగలు ఇలా అనుకుంటున్నారు. “ మేము, అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తాం. ధనం, సంపదలు కొల్లగొడతాం. నదులన్నీ ఈదుకుoటూ దాటేస్తాం. మేమెవరినీ లెక్కచెయ్యం, ఎవరికీ భయపడం” ఈ విధంగా వారు చెడ్డబుద్ధితో అసభ్యంగా
మాట్లాడినప్పటికి తెలిసో తెలీకో ‘రామ’’రామ’అoటూ ఆ పరమపవిత్రమైన నామాన్ని ఉచ్చరించడం వలన వారికి
ముక్తి లభిoచిందట.
వనే చరామ: వాసు చాహరామ:
నదీ౦స్తరామ: న భయం స్మరామ:
ఇతీరయంతోSపి వనే కిరాతా:
ముక్తిం గతా: రామపదానుషంగాత్
ఇటువంటి మహోన్నతుడైన రాముని కథ రామాయణం . ఆ రామాయణమనే
హారానికి మణిపూస సుందరకాండ . ఇది కథా పరంగా , రసపరంగా ఎంతో ప్రాధాన్యాన్ని
సంతరించుకుంది. పరస్పర
వియోగ దు:ఖితులైన సీతారాములకు కొ౦త ఉరట కలిగింఛి కథాగమనానికి సహకరించిన ఘట్టాలు
ఇందులో ఉన్నాయి .
ఇక ఈ
సుందరకాండను వ్యాఖ్యానించిన గ్రంథకర్త
శ్రీ గోరస సుబ్రహ్మణ్యాచార్యులు గారు నాకు చిరకాల మిత్రులు , సహాధ్యాయి. ఎప్పుడు
సాంప్రదాయ బద్ధమైన తెల్లటి లాల్చీ , పైజమా
ధరించేవారు . ‘ విరవపురవాస ! గోరస !
వినుతవేష’ అని మేము ఆయన్ని సరదాగా వేళాకోళం చేస్తూ
ఉండేవాళ్ళం . ఆయన సంస్కృతా౦ధ్రభాషల్లో
గొప్ప పాండిత్యం గలవారు . ముఖ్యంగా వ్యాకరణశాస్త్రంలో సునిశితమైన ప్రజ్ఞాపాటవాలు గలవారు. ఎవరైనా
కోపంకొద్దీ ఈ దేశంలోని బాల ప్రౌఢ వ్యాకరణాలను ఎవరికీ కనిపి౦చకుండా దాచేసినా యథాతథంగా
సమకూర్చగలశక్తి ఆయనకుంది. ఆయన క్లాసులో ఉంటే తెలుగువ్యాకరణం చెప్పడానికి కొంతమంది అధ్యాపకులే
సందేహిస్తూ ఉండేవారు . ఒకసారి క్లాసులో ఆయన
ఒక సందేహం అడిగారు . ఆ సందేహాన్ని ఎవరు తీర్చలేక పోయారు. అందరు సుదీర్ఘమైన ఆలోచనలో
పడ్డారు . సమాధానం రాలేదు. ప్రధానాధ్యాపకులు
అది గమని౦చి సందేహం తీర్చడానికి క్లాసులోకి ప్రవేశించారు. ఎంత ఆలోచించినా సమాధానం
స్ఫురించలేదు . అంతే మెల్లగా జారుకున్నారు. ఇక్కడ అధ్యాపకులను కించ పరచడం
తాత్పర్యం కాదు . ఆయన అంత నిశితమైన ధీశక్తి కలవారని చెప్పడమే తాత్పర్యం . ఆ తరువాత
వేదాంతశాస్త్రంలో కూడ పాండిత్యం సంపాదించారు . తెనుగుదనం ఉట్టిపడే తెనుగువాక్యం
వ్రాయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య . .వారు చేసిన ఈ అనువాదం చాల సహజంగా ఉంది.
చదివేకొద్ది చవులూరించే విధంగా ఉంది . వాల్మీకి హృదయాన్ని ఆవిష్కరించేదిగా ఉంది . తెలుగుదనం
ఉట్టి పడే వారి రచన ఆబాలగోపాలాన్ని అలరిస్తు౦దనడం ఎటువంటి సందేహం లేదు . వారికి ఆ
శ్రీరామచంద్రమూర్తి ఆయురారోగ్యైశ్వర్యాలిచ్చి రక్షించాలని , మరెన్నో ఇటువంటి
అమూల్యమైన గ్రంథాలు వారి ద్వార వెలువడాలని ఆశిస్తున్నాను. నాకు అర్హత ఉన్నా
లేకపోయినా నాలుగు మాటలు వ్రాయడానికి అవకాశం కల్పించిన వారికి మన:పూర్వక కృతజ్ఞతలు.
ఇట్లు
చిలకమర్తి
దుర్గాప్రసాదరావు
Dr. Chilakamathi
Durgaprasada Rao
Reader in Sanskrit
(Retired)
3/106, PremNagar,
Dayalbagh,
Agra-282005.