Thursday, November 18, 2021

ఒకప్పటి లాoఛనమే నేడు లంచం అయింది

 

ఒకప్పటి లాoఛనమే నేడు లంచం అయింది

 డాక్టర్ చిలకమర్తి దుర్గాప్రసాద రావు

 

మన భారతీయసమాజంలో సగటు మనిషిని తీవ్రంగా  బాధపెట్టే అoశాల్లో లంచo  ఒకటి.  ఇది ఎవరు  నిర్మూలిoచ లేని విధంగా వేళ్లూని పాతుకు పోయి ఉంది. దీన్ని నిర్మూలిoచాలంటే   దీనికి  కారణం మనo తెలుసుకోవాలి , తెలుసుకుందాం  . ఒకప్పటి లాoఛనమే నేడు లంచంగా మారి ఉoటుoదని  నేనకుంటున్నాను.

పూర్వం వివాహాల్లో అత్తగారి  లాంఛనాలు  , ఆడపడుచు లాంఛనాలు  అని  డబ్బో లేక విలువైన  వస్తువో ఇచ్చేవారు. దీనికి కారణం ఆలోచిస్తే  అమ్మాయి మరో ఇంటికి అంటే అత్తా వారింటికి వెళ్ళేటప్పుడు అత్తగారికి ,  ఆడపడుచులకు ఆమె మీద ప్రేమ కలగటానికి  సొమ్ము రూపం లోనో, వస్తురూపంలోనో కొంత ముట్ట చెప్పే వారు.                                                                     

          ఇక కట్నం కూడ ఎలా  వచ్చి ఉంటుందో ఆలోచిద్దాం . సాధారణంగా  పెళ్లి, ఆడపిల్ల  ఇంటిలో జరుగుతుంది కాబట్టి అబ్బాయి తల్లి దండ్రులు , వారి  పరివారం అమ్మాయి ఇంటికి రావాలి  కాబట్టి వారు రావడానికి పెద్ద మొత్తంలో ఖర్చు ఔతుంది కాబట్టి పెళ్లి కుమార్తె తండ్రి వారికి చేదోడు వాదోడుగా సంతోషంతో  కొంతసొమ్ము ముట్ట చెప్పేవాడు . అలాగే వరుడు తనకు యోగ్యమైన అమ్మాయిని వెదికి తీసుకు రమ్మని కొంత డబ్బు మిత్రుడికి ‘ మదర్థం కన్యాం వృణీధ్వం’ ( నాకోసం ఒక యోగ్యురాలైన అమ్మాయిని వెదికి తీసుకురా)  అని ఇచ్చేవాడు. ప్రస్తుతం ఈ తాంబూలం పెళ్లి చేయించే బ్రాహ్మణుడు నొక్కేస్తున్నాడు. . ఏది ఏమైనా మొత్తం మీద   ఇదంతా ఇష్టంతో చేసేదే ఇందులో బలవంతం ఏమీ లేదు. ఇది వేదకాలంనాటి నుంచీ ఉన్న సంప్రదాయo  అయ్యుండొచ్చు.

అందుకే “సంప్రదానసమయేsర్థ హారికా దారికా హృదయ దారికా పితు: ” ( సంప్రదానం అంటే పెళ్లి,  పెళ్లి సమయంలో డబ్బు హరించేది,  తండ్రికి దు:ఖం కలిగిo చేది ) అని కొన్ని మాటలు మనకు వినిపిస్తున్నాయి.

ఇక లంచగొండి తనం ఎలా వచ్చిందో ఆలోచిద్దాం . ఆంగ్లేయులు  మన దేశాన్ని పరిపాలిo చేటప్పుడు కార్యాలయాల్లో లంచాలుoడేవి  కావట . ఎవరైనా తమ పనులు త్వరగా జరగడంకోసం డబ్బు ఇవ్వ బోతే we are not twice paid ( మాకు ప్రభుత్వం జీతం ఇస్తోంది , ఇదెందుకు)  అని మృదువుగా తిరస్కరిoచే వారట.  

    కాని స్వతంత్ర  భారతంలోనే ఈ లంచగొండి తనం . మనం లంచాల వలన తీవ్ర మైన ఇబ్బందికి గురి ఔతున్నాం . అందుకే నేనొక సారి అన్నాను.

తెల్లదొరలేగ నిప్పుడు

నల్ల దొరలె దేశమందు నయవంచకులై

కొల్లంగొట్టుచు ప్రజలను

తెల్ల దొరలె నయమటంచు తెలిపిరి మనకున్ -అన్నాను నేనొక చోట .

దీనికొక్కటే మార్గం . ఆధ్యాత్మిక చింతన . ముఖ్యంగా కబీరు దాసువంటి మహాత్ముల  మాటలు మనం ఎప్పుడు మనస్సులో పెట్టు కోవాలి.

 

దుర్బల కో న సతాయియే

జాకీ మోటా హాయ్

.......................    

 సా ర భస్మ హో జాయ్’’

దుర్బలుణ్ణి ఇబ్బంది పెట్టుకు . వాడు  బలం లేని వాడైనా వాడి  ఊపిరి (ఉసురు) చాల బలమైంది. గిన్నెలకు మాట్లు వేసే కొలిమిలో  ప్రాణం లేని కొలిమితిత్తి నుండి వెలువడే గాలి ఇనుమును కరిగిస్తోoది. ఇక ప్రాణమున్న అభాగ్యుని ఉసురుందే  అది నీ వంశాన్ని దహిస్తుoది జాగ్రత్త! అంటాడు.

లంచం లాంఛనం నుంచి వచ్చినా ఇష్టంతో ఇచ్చేది లాంఛనం, ఇష్టం లేకుండా బలవంతంగా  పుచ్చుకునేది లంచం .     

నేను లంచం తీసుకునే వారి కొన్ని కుటుంబాలు పరిశీలించాను.  సాధారణంగా ఆ ఇంటిలో సుఖశాo తులుoడవు. పిల్లలు సర్వనాశనం అయిన కుటుంబాలు చాల కనిపిస్తాయి. పెద్దలు చేసిన తప్పులు పిల్లలకు కొడుతుoదనే మాట నూటికి నూరు పాళ్ళు నిజమే అని పిస్తుంది.     

    పరుగును తానె ఆపుకుంటే అది ప్రవాహ మౌతుoదా

విత్తం కోసం చేసుకుంటే అది వివాహ మౌతుందా అంటారు 

డాక్టర్ సి . నారాయణ రెడ్డిగారు వరకట్న దురాచారాన్ని నిరసిస్తూ . 

నేనొక్కణ్ణి లంచం తీసుకోవడం మానేస్తే   లంచగొండితనం ఆగిపోతుందా అని కొంతమంది వాదిస్తారు. ఆ వాదన సరికాదు . నేను తీసుకోకపోతే లంచగొండుల సంఖ్య ఒక్కటి తగ్గుతుందికదా! అని ప్రతివాడు ఆలో చించాలి .   

 లంచగొండులను నిరసిద్దాం . దురాచారాలను నిర్మూలిద్దాం.