Saturday, August 12, 2023

ఆచార్య పోచంచర్ల శ్రీ రామమూర్తిగారి రమ్యారామం

 

ఆచార్య పోచంచర్ల శ్రీ రామమూర్తిగారి

రమ్యారామం

(కవితాసంపుటి)

ఒక విహంగ వీక్షణ సమీక్ష

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

భాషాప్రవీణ , వేదాంత విద్యాప్రవీణ , పి..యల్,

ఎం. ( సంస్కృతం ) ఎం . ( తెలుగు) ఎం . (తత్త్వశాస్త్రం )

 పిహెచ్.డి (సంస్కృతం )

dr.cdprao@gmail.com

 

ఉదయం తు శతాదిత్యా: ఉదయం త్వి౦దవశ్శతం

వినా కవివాక్యేన నశ్యత్యాభ్యంతరం తమ:

అన్నారు పెద్దలు.  వందలకొలది   సూర్యులు ఉదయి౦చు గాక . అలాగే వందల కొలది  చంద్ర బింబాలు ఉదయి౦చుగాక. మానవునిలో దాగియున్న అజ్ఞానమనే చీకటి కవి వాక్కువలన మాత్రమే తొలగిపోతుంది. అంటే వందల కొలదీ  సూర్యులు,  చంద్రులు కూడ చెయ్యలేని పని కవి ఒక్క కలంతో  చేయ గలుగుతున్నాడనేది యథార్థం .  

కవి వాక్కు  అంత శక్తివంతమైనది. ఎందుకంటే అది ప్రతి మనిషినీ ఆలోచించేలా  చేస్తుంది. అందుకే  Byron అనే ఆంగ్లకవి ఇలా అంటారు. 

But words are things and a small drop of ink,

Falling, like dew upon a thought, produces

That which makes thousands, perhaps millions think.

(Don Juan, canto III, st.88.

అటువంటి ఆలోచనాత్మకమైన కవిత్వాన్ని కూర్చడంలో సిద్దహస్తులు, కుశలురు   

మా గురువర్యులు ఆచార్య శ్రీరామముర్తి గారు.

వారు ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని  సంస్కృత విభాగంలో ఆచార్యులుగా పనిచేశారు.

వందలాది విద్యార్థులను తీర్చిదిద్దుతూనే వందలాది పరిశోధన వ్యాసాలను సమర్పించి సంస్కృత సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు . వారు పాల్గొన్న రాష్ట్రీయ , జాతీయ  ,అంతర్జాతీయ సదస్సులు లెక్కకు మిక్కుటాలు. వారి అభిమానశాస్త్రం అలంకారశాస్త్రమే (Aesthetics) అయినా  వారి పరిశోధన వ్యాసాలు సాహిత్యం , వ్యాకరణం , భాషాశాస్త్రం , వేదాంతం మొదలైన రంగాలలో ఉండడం ఒక విశేషమైతే , వారి పర్యవేక్షణలో  వెలువడిన పరిశోధనలు సంస్కృత సాహిత్యానికి సంబంధించిన దాదాపు అన్ని రంగాలలోను ఉండడం మరీ అరుదైన విశేషం.

ఇక కావ్యాలంకరణజ్ఞమేవ కవితాకన్యా  వృణీతే ధృవం అన్న బిల్హణుని మాట  వీరి కవిత్వాన్ని పరిశీలించాక అక్షరాల  నిజమనిపిస్తుంది . వీరి కవితాఖండికలు ఆంగ్ల , హిందీ , తెనుగు , సంస్కృతభాషలలో కనిపించడం  అరుదైన విశేషం . ఒక విధంగా ఇది అపూర్వం, అనపరం, అసదృశం  అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక వారి కవితాప్రపంచమనే ‘రమ్యారామం’లో  . అనేక పుష్పాల సొగసులు , గుబాళింపులు రసవత్ఫలాల రుచులు కవితల రూపంలో మనకు దర్శనమిస్తాయి. సాధారణంగా కవి తలలో ఉండే భావాలు కవితలలో వ్యక్తమౌతాయంటారు పెద్దలు . ఏ కవీ  తన మనసు లోని భావాన్ని సంపూర్ణంగా నూటికి నూరుపాళ్లు  అక్షరబద్ధం చేసి వ్యక్తం చెయ్య లేడు. అలా చేసిన వారు కూడ ఇంత వరకు ఎవరు లేరు.  అది సాధ్యం కాని పని కూడ.  దీన్ని బట్టి ఆలోచిస్తే వీరి  కవితలలో కనిపించే సౌందర్యం కన్నా  వారి హృదయగతమైన సౌందర్యం, ఆలోచనా రామణీయకత   మరెంతో  ఎక్కువనేది నిర్వివాదాంశం .

         ఇక వీరి రమ్యారామంలో 36 తెలుగు కవితలు , 4 హిందీ కవితలు , 3సంస్కృత కవితలు 36 తెలుగు కవితలకు 36 ఆంగ్లానువాదాలు ఉన్నాయి. ఈ కవితల  సంపుటి రాశి లో చిన్నదే అయినా  వాసిలో మిన్న. ఏకకాలీనమైన అంశాన్ని సార్వకాలికం , వైయక్తికమైన  విషయాన్ని విశ్వజనీనం చేసేదే కవిత్వం .    అక్షరరూపమైన ఆయుధంతో  సమాజాన్ని శాసించ గలవాడే కవి. కవి సాధించ లేని దంటూ ఏదీ లేదు. “ ఈ వ్యవస్థ మారదనే వాదానికి చోటు లేదు. రాక్షసవృక్షం సైతం రంపానికి లొంగుతుంది అంటాడొక ఆదుధునిక కవి. కవి  ఏ దేశంవాడైనా, భాష ఏదైనా  సమాజాన్ని మంచి దారిలో నడిపించడమే కవి ఆశయం.  

   ఈ కవితల  సంపుటి విషయానికొస్తే  ముందుగా  కవి తాను  కవిని కానని ఎంత చెప్పుకున్నా ఒక దివ్యశక్తి వారి నోట పలికించిందనీ,   తాను  వివశుడనయి  పలికాననీ అన్నారు .   అలుపు సొలుపులు లేని ఆనందానుభూతులే కావ్యపఠన ప్రయోజనం అన్నారు  . ‘నేనెవేరినో’  అనే ఖండిక ఆవేదనకు అంతర్య శోధనకు దర్పణం .     ‘చెలియ చెలిమి’ అనే కవితలో పరమపురుషుని యెడ కలుగు ప్రేమ అన్నిటికన్నా మిన్నయని ప్రతిపాదించారు .’ఈశావాస్యమిదం సర్వం’  అనే కవిత ఈ సకల జగత్తుకు మూలం  పరమేశ్వరుడేనని,,  మనమంటూ , మనదంటూ ఏదీ లేదని ప్రతిపాదిస్తోంది. ‘కరువు’ అనే కవిత అసలుసిసలైన కరువు యొక్క స్వరూపాన్ని ఉన్నదున్నట్లుగా చూపించి,  సమాజంలోని అందరికీ కనువిప్పు కలిగిస్తుంది.

‘ప్రకృతి’ అనే కవితలో మనం అందరు ప్రకృతితో సహజీవనం చేయాలని చెబుతూ ప్రకృతితోటి పోరాటం నిప్పుతో చెలగాటమని హెచ్చరిస్తూ పర్యావరణపరిరక్షణకు బంగారుబాటలు వేసింది. ‘వసుధైకకుటుంబం ‘ అనే కవిత ద్వారా మనుషులందఱు,  ఈర్ష్యా ద్వేషాలు వదలి ఒకే తల్లి ఒడిలో, ఒకే తండ్రి బడిలో నిశ్చింతగా, నిర్లిప్తంగా జీవించాలని హితబోధ చేశారు.    

    ‘సమైక్యం’ అనే కవితలో భిన్నత్వంలో ఏకత్వం; ఏకత్వంలో భిన్నత్వం హిమాలయాలు చెపుతున్నాయని అదే దేశానికి గర్వకారణమని వివరించారు. ‘నా కోరిక’  అనే కవితలో కవి తమ  జీవిత ధ్యేయాన్ని తెలిపారు. ‘గొప్ప’  అనే కవిత అసలైన గొప్పదనాన్ని చెపుతుంది. గొప్పవారి మెప్పుకోసం తప్పు చెయ్యకపోవడమే గొప్పయని , కన్నవారి కలలు నెరవేర్చడమే గొప్పని, వెలితి పడకుండా కష్టాలను దాటడమే గొప్పని , చేసిన తప్పును ఒప్పుకోవడమే కాక ఆ తప్పును మరలా చేయకుండా ఉండడమే గొప్ప అని  నిజమైన గొప్పదనాన్ని చాల గొప్పదైన రీతిలో  ప్రతిపాదించారు. ‘ఉద్యోగం’ అనే కవిత ద్వారా సంఘ క్షేమం , దేశక్షేమం మానవజాతి క్షేమం  దృష్టిలో ఉంచుకుని ఏది చేసినా అది ఉద్యోగమేనని, ఉద్యోగానికి హెచ్చుతగ్గులు,  హోదాలు కొలమానాలు కావని ప్రబోధించారు. ‘అణోరణీయాన్’ అనే కవితలో అంతా మనమే అని అంతా మనలోనే దాగియున్నదనే శాశ్వతసత్యాన్ని   వెలువరించారు.    

‘స్వరాజ్యం’  అనే ఖండికలో నాదేశం అందరిదీ, నేను అందరివాడను అని జాతీయతా సమైక్య రూపమైన పిలుపునిచ్చారు. ‘అసాఫల్యం’  అనే కవితలో అందని పండునకర్రులు సాచవద్దని హెచ్చరించారు . ‘ఆధ్యాత్మ్యం ‘ అనే ఖండికలో శాశ్వతసత్యం యొక్క స్వరూపాన్ని దర్శింప చేశారు.   

‘ఏమిటిది?’ అనే కవితలో   మానవస్వభావాన్ని,  ‘దారి’ అనే కవితలో జీవుని వేదనను  రూపొందించారు .  ఇక ‘చరిత్ర చారిత్రం’  అనే కవిత ఏ దేశచరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం;  నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అనే శ్రీ శ్రీ గారి అభిప్రాయాలను జ్ఞప్తికి తెస్తోంది. ‘అందీ అందనిదీ’ అనే కవిత నేను నాది కాదని నాది నేను కాదని అంతరంగంలో అవగాహన చేసుకుంటే నాకు నా వారికీ అందరికీ క్షేమం అనే పరమార్థాన్ని  బోధిస్తుంది.  ‘తప్పు’  అనే కవితద్వారా తప్పు తెలిసి మారకుంటే   మరీ మరీ  అగును తప్పు అని నొక్కి చెప్పారు .

ఇక ‘ ప్రతిభ’ అనే కవితలో కావ్యనిర్మాణకారణం ప్రతిభయే యని ప్రతిభ వల్లనే సహృదయుడు కావ్యానందం పొందగలడని రససిద్దాంత సారాన్ని కాచి,  వడపోసి, తేర్చి  చూపించారు. ఇలాగే ‘వ్యక్తిత్వం’ ‘తొలి’   మొదలైన కవితలు రసరమ్యాలు.  ఇక  ‘స్వర్గం మోక్షం’ అనే కవితలో   నీ కోసం నీ వారి కోసం నీ పరిసర ప్రజల కోసం జీవించి తరిస్తే అదే స్వర్గం అదే మోక్షం అని మొక్షోపాయాన్ని సుగమం చేసి  చూపించారు. ఇంతే గాక  ‘రారమ్ము’  ‘పయనం’  ‘నేనూ ఒకణ్ణి’ అనే కవితలద్వారా ఎన్నో విషయాలు వివరించారు. ఇక  ‘మట్టి ఇల్లు’  అనే కవితలో మట్టిలోని శక్తి తెలియగానే మట్టిని నేనై పోతిని మట్టిలోని శక్తి నఱయ మట్టిని నేనైపోతిని మట్టికాదు ఇది ప్రమిద , దివ్వె కునిది ఆధారపు మాతృభూమి. అని మట్టి విలువ ప్రపంచానికి తెలియజెప్పి, మట్టితో మమైక్యం అయ్యేలా చేసే  ఈ కవిత కవితలకు తలమానికమనడంలో సందేహంలేదు.  

‘మనుగడ’  అనే ఖండిక మనసులేని మనుగడ మనుగడ కాదని నిర్ధారణ చేసింది. భరతమాత’ ‘సమైక్య భావం , అంతా నాకే అన్ని నాకే’ ఖండికలలో మనిషిలోని పేరాశ , ‘పేదవారూ  పెద్దవారూ’  మొదలైన కవితలలో ఎన్నో ప్రజాహిత సందేశాలను పొందుపరిచారు కవి .  

ఈ పొత్తంలో మరెన్నో హిందీ, సంస్కృతకవితలున్నాయి. అవన్నీ నిత్యనూతనాలు, ప్రజా హితబోధకాలు . తమ  కవితలన్నీ సహృదయులకే అంకితం అని చెప్పడం కవి గొప్పదనమే కాదు  గడుసుదనం కూడ.               వీరి కలం నుండి మరెన్నో కవితలు వెలువడి తెలుగు సారస్వతాన్ని పరిపుష్టం చెయ్యాలని కోరుకుంటూ .....

నమస్కారాలతో ..........

చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

For copies: 

Dr. P Sriramamurthy

4-112, Vidyutnagar, dayalbagh, Agra, India-282005,Mobile.07505497325.

                                                                       .