Thursday, January 1, 2026

Masters of Advaita- Vedanta 1. Ashtavakra

 

Masters of Advaita- Vedanta

1.    Ashtavakra

అష్టావక్రుడు

అష్టావక్రుడు ఒక మహర్షి. ఈయన సుజాత కహోలుల పుత్రుడు. ఉద్దాలకుని కుమార్తె యొక్క బిడ్డ . శ్వేతకేతుని అక్క కొడుకు . వదాన్యుని అల్లుడు. సుప్రభకు భర్త. ఉద్దాలకుడనే ఋషి   తన శిష్యుడైన కహోలునకు తన  కుమార్తె యగు  సుజాతను ఇచ్చి వివాహం చేశాడు . సుజాత గర్భం ధరించింది . సుజాత గర్భంలో అగ్నిలా వెలుగొందుతున్న శిశువు అందరివలె  శిష్యుల మధ్యలో చదువుతున్న తన తండ్రి కహోలుని గమనించాడు .ఈ కహోలుని అధ్యాపనను ఆక్షేపించాడు . అది గమనించి కోపించిన ఉద్దాలకుడు తన మనుమని ‘నువ్వు గర్భంలో ఉండే నన్ను ఆక్షేపిస్తున్నావు కాబట్టి నువ్వు అష్టావక్రుడవు అవుతావని శపించాడు . అందువల్ల పుట్టుకతోనే వంకరగా పుట్టి  అష్టావక్రుడుగా పేరు పొందాడు. కొంత కాలానికి అష్టావక్రుని తండ్రి కహోలుడు తన భార్య ప్రేరణతో ధనం సంపాదించడానికి జనకుని నగరంలో ప్రవేశించి, అక్కడ ద్వారపాలకుని చేతిలో  వాదనలో ఓడిపోయి అవమానంతో నీటిలో మునిగి చనిపోయాడు. తన తండ్రి మరణ వార్తను తల్లి ద్వారా తెలుసుకున్న అష్టావక్రుడు మేనమామ సహాయంతో జనకుని నగరంలో ప్రవేశించి వాదంలో ద్వారపాలకుని, జనకుని కూడ ఓడించి సమంగ అనే మరో పేరు గల మధుబిలమనే పవిత్ర నదిలో స్నానం చేసి తన శారీరక వక్రతను పోగొట్టుకుని, వదాన్యుని కుమార్తె యగు  సుప్రభ అను కన్యను పెండ్లి చేసుకున్నాడని మహాభారత కథను బట్టి మనకు తెలిస్తోంది. .  

ఈయన రచించిన గ్రంథం ‘అష్టావక్రగీత’ . ఇందులో 20 అధ్యాయాలున్నాయి . బ్రహ్మము  యొక్క అద్వితీయత్వప్రతిపాదనమే   ఈ గ్రంథ సారాంశం . ఈ గ్రంథానికి విశ్వేశ్వరుడు రచించిన  దీపిక,  పూర్ణానందతీర్థులు, ముకుందముని, భాసురానందులు రచించిన మరో మూడు,    మొత్తం నాలుగు వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ గ్రంథానికి  ఎంతో ప్రాముఖ్యం ఉంది.

<><><>