-: అభినందన:-
(అక్షరసుమాంజలి)
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
మానవుడు తన జీవితకాలంలో సాధించవలసిన
వాటిని పురుషార్థములని పిలుస్తారు. అవి ధర్మం , అర్థం, కామం, మోక్షం అని నాలుగు. వాటిలో ముందున్న మూడు మనం ఆచరించేవి,
నాలుగోది మనం పొందేది. ఇక మోక్షం అంటే ఈ జన్మ మరణ రూపమైన సంసారచక్రం నుంచి బయటపడడమే.
ఈ మోక్ష సాధనకు కర్మ,
భక్తి , జ్ఞానం మొదలైన ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో భక్తి మార్గం చాల సులభమైనది, గొప్పదీ
అవుతోంది . అందుకే శ్రీ శంకరులు “మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ”
అన్నారు. నారదభక్తిసూత్రాలలో ‘సా త్వస్మిన్ పరమప్రేమరూపా’ అని భక్తికి
నిర్వచనం చెప్పారు . సాధకునకు భగవంతుని
యందు గల పరమ ప్రేమయే భక్తి అని ఆ మాటలకర్థం. ఇక “కలౌ సంస్మరణాన్ముక్తి:” అని చెప్పడం ద్వారా ఈ కలియుగంలో కేవలం భగవన్నామ స్మరణ చేతనే ముక్తి పొంద వచ్చునని తెలుస్తోంది. అటువంటి భగవద్భక్తులకు చేయూతగా ఎన్నో స్తుతి
కావ్యాలున్నాయి. వాటిలో సోదరి శ్రీమతి పర్వతనేని
శ్రీసత్యగారు రచించిన ‘స్తుతికదంబం’
అనే సంస్కృత గ్రంథం పేర్కొన దగినది. నేను ఈ గ్రంథాన్ని స్థాలీపులాకన్యాయంగా పరిశీలించాను. ఇది
సర్వ దేవతా స్తుతి రూపమైనది . ఇందులో సుమారు 120 శ్లోకాలున్నాయి . రచయిత్రి సమస్త దేవీ దేవతలను
ఇందులో మనసార స్తుతించారు. వాగ్దేవతా స్తుతితో
ఈ గ్రంథం మొదలైంది. గ్రంథమంతా అనుష్టుప్ ఛందస్సుతో సాగింది. ఇంచుమించు దేవతామూర్తులందరినీ
వీరు ప్రస్తుతించడం చెప్పుకోదగిన విశేషం .
అంతేగాక ప్రతి శ్లోకానికి అర్థం చేకూర్చడం వల్ల ఇది
పాఠకులకు చాల మేలు చేకూర్చే విధంగా ఉంది. భగవద్ధ్యానమే సర్వ సౌభాగ్యాలను కలిగిస్తుందని వివరించే
పదవ శ్లోకంలోను, 82 శ్లోకంలోనూ భక్తియొక్క
వైశిష్ట్యాన్ని, భక్తిలో గల కొన్ని ముఖ్యమైన భేదాలను , ఉపాయాలను వివరించడం కనిపిస్తోంది. ఇక ఆయా
దేవీ దేవతలను కేవలం స్తుతించడమే కాకుండా వారి గుణ గణాలను కూడ ప్రశంసించడం ఒక ప్రత్యేకత.
ఉదాహరణకు37, 39, 87మొ||
శ్లోకాలలో రాముని గుణ గణాలు మరికొన్ని శ్లోకాలలో కృష్ణుని గుణ గణాలు పేర్కొన్నారు . ఇక తృప్తి వివేకం వల్లనే
కలుగుతుంది గాని , సంపదల వలన కలుగదని; తనకు
వివేకాన్ని ప్రసాదించమని భగవంతుని వేడుకోవడం
కవయిత్రి మానసిక పరిణతికి ఒక దర్పణంగా కనిపిస్తోంది(23) . అలాగే 47
వ శ్లోకంలో ‘నిగమాగమవేద్యం’ అని హరిని స్తుతించడం ద్వారా “ వేదైశ్చ
సర్వైరహమేవ వేద్య: వేదాంత కృద్వేదవిదేవ చాsహం” అనే గీతావాక్యాన్ని స్మరించేలా
చేసింది . తోయజాక్షీం తోయజాస్యాం తోయజాం తోయజోద్భవామ్
తోయజాలంకృత పదాం
వందే తాం తోయజార్చితామ్ అనే (100) శ్లోకం కవయిత్రి ప్రతిభకు ఒక ఉదాహరణ . ఇంద్రియాలను
అదుపులో ఉంచడం ద్వారా స్థిరమైన చిత్తాన్ని ప్రసాదించమని భగవంతుని పదే పదే కోరడం
ద్వారా వైరాగ్యం పట్ల రచయిత్రికి గల ప్రగాఢమైన అభిరుచి తేటతెల్లం ఔతోంది . కావ్యంలో
అక్కడక్కడ ఒకటిరెండు ఛంద: పరమైన దోషాలున్నా
అవి గమనానికి ఆటంకాలు కావు .
19 వ శ్లోకం లో శివానీ
అనే పదాన్ని ప్రయోగించడం ఆశ్చర్యంగా అనిపించింది . ఈ గ్రంథం భక్తులకు సమస్త దేవతలపట్ల పరమ ప్రేమను రేకెత్తించే విధంగా ఉంది . ఇక ఇది భగవద్భక్తులందరికి నిత్య పారాయణ గ్రంథంగా
ఉపయోగ పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి అమూల్యమైన గ్రంథాన్ని రచించి, భగవద్భక్తులకు కరదీపికగా
అందించి, భక్తి మార్గాన్ని బలోపేతం చేసే బంగారు
బాటను నిర్మించిన సోదరి శ్రీసత్యగారు అభినందనీయురాలు. వారిని మనసార అభినందిస్తూ, ఈ
గ్రంథంపై నాలుగు మాటలు వ్రాయడానికి నాకు అవకాశం కలుగజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియ జేసుకుంటూ
......
చిలకమర్తి
దుర్గాప్రసాదరావు.