Friday, June 6, 2014

నాణ్యమైన ముక్తికి నాలుగు మెట్లు

నాణ్యమైన ముక్తికి నాలుగు మెట్లు
Dr. Chilakamarthi Durga Prasada Rao
3/106, Premnagar,
 Dayalbagh, AGRA.
dr.cdpraogmail.com
1. పవిత్ర గ్రంథాలు చదవడం
2. ఇష్టదైవాన్ని స్మరించడం
3. సజ్జన సాంగత్యం
4. దీనజనులను ఆదుకోవడం      
                        మానవజీవితంలో  ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగు పురుషార్థాలున్నాయి . ఇవి మానవులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చేవి కాబట్టి పురుషార్థాలయ్యాయి. ఇందులో మొదటి మూడు ఆచరిoచేవి. నాల్గోది పొందేది. నాలుగోదైన  మోక్షం పరమానందస్వరూపం, శాశ్వతం, కావడం వల్ల పరమపురుషార్థంగా అంగీకరిoపబడుతోంది.  ఈ మోక్షసిద్ధికి కర్మ, జ్ఞానం, భక్తి మొదలైన ఎన్నో సాధనాలున్నాయి,
అవన్నీ వినడానికి చదువుకోడానికి బాగానే ఉంటాయి గాని ఆచరణ అంత సులభమేమీ కాదు. కర్మాచరణకు అంగబలం, అర్థబలం; జ్ఞానానికి బుద్ధిబలం; భక్తికి మనోబలం ఎంతో అవసరమౌతాయి. మోక్షమార్గం అంత జటిలమైతే ఇక సామాన్యునకు ఉద్ధారం కలిగే అవకాశమే లేదా అనే సందేహం రావడం సహజం. ఇక పుట్టిన ప్రతివ్యక్తి మోక్షo పొoదడానికి అర్హుడే . అందువల్ల అందరికి  మోక్షం అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యoతో అతి సులభమైన నాలుగు మెట్లు ఏర్పరిచారు  శ్రీ శంకరులు.
గేయం గీతానామసహస్రం
ధ్యేయం శ్రీపతిరూపమజస్రం
నేయం సజ్జనసంగతిరనిశం
దేయం దీనజనాయ చ విత్తం .
మొదటి మెట్టు  భగవద్గీత చదవడం. రెండోమెట్టు  నారాయణుని ఎల్లప్పుడూ ధ్యానం చెయ్యడం . మూడోమెట్టు  మంచివారితో స్నేహం చెయ్యడం. ఇక   నాల్గోమెట్టు  శక్తి కొలది పేదసాదలకు దానధర్మాలు చెయ్యడం . ఈ నాల్గు మెట్లు ఎక్కితే సంసారబంధం నుంచి విముక్తుడై మోక్షం పొందడం ఖాయం . వీటిని గురింఛి  కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇవి ఒక సంస్కృతికి గాని ఒక మతానికి గాని పరిమితమైనవి కావు. అందరికి సంబంధించినవి, ఆచరణ యోగ్యమైనవి.

మొదటి మెట్టు  గీతాధ్యయనం: వేదాలు సాక్షాత్తుగా సృష్టికర్త ముఖం నుంచి వెలువడ్డాయి. అటువంటి వేదాల సారాంశం ఉపనిషత్తులైతే ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత. ప్రపంచంలోని అన్ని ధార్మికగ్రంథాల కంటే గీత విలక్షణమైనది. మిగిలిన గ్రంథాలు మానవుని అభ్యున్నతి కోసం ఒక్కొక్క  ప్రత్యేకమైన మార్గాన్ని సూచిoచాయి. గీత అలా కాకుండా వివిధమార్గాలు  వివరించి ఎవడు ఏ మార్గం అనుసరించినా ఫలితం ఒక్కటేనని, చివరకు పరమాత్మను చేరుకుంటాడని స్పష్టం చేసింది. కాబట్టి భగవద్గీత చదవడం, చక్కగా అర్థం చేసుకోవడం, అందులో చెప్పినవి  ఆచరణలో పెట్టడం వల్లనే పూర్తిగా ప్రయోజనం నెరవేరుతుంది. కాబట్టి ఒకవ్యక్తి తానేమతానికి చెందినవాడైనా తన  మతానికి సంబంధించిన  పవిత్రగ్రంథాలను  క్షుణ్ణoగా చదివి అర్థం చేసుకుని ఆచరించాలి. ఇది మొదటి మెట్టు .

 రెండవ మెట్టు ఇష్ట దైవాన్ని ధ్యానం చెయ్యడం:
భగవంతునకు ఒక నిర్దిష్టమైన రూపం అంటూ ఏదీ లేదు . అంతా తానే అన్నీ తానే. ఈ ప్రపంచాన్ని  సృష్టిoచేవాడు (Generator), నడిపించేవాడు ( Operator), లయం చేసేవాడు ( Destroyer )  ఆయనే. ఆయన ఆదిమధ్యాంతరహితుడు  . అటువంటి పరతత్త్వానికి మన వీలుననుసరించి ఒక రూపం, పేరు కల్పించుకోవడం తప్పులేదు గాని అవే గొప్పవనుకోడం మిగిలినవి హీనమనుకోడం మాత్రం చాల తప్పు. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంథమైన ఋగ్వేదం పరమేశ్వరుడు ఒక్కడే అని,  ఆయనను   భిన్నభిన్న వ్యక్తులు  భిన్న భిన్న రూపాలలో పేర్కొంటున్నారని ఏకం సద్విప్రా: బహుధా వదంతి  అనే మాటల్లో  వివరించింది. బంగారంతో చేసిన ఆభరణాలు ఎన్నో పేర్లతో. ఎన్నో రూపాలతో భిన్నంగా కన్పించినా మూలరూపం బంగారం అంతట సమానమే. భగవంతుడు ఎన్ని పేర్లతో ఉన్నప్పటికి మూలభూతమైన సచ్చిదానంద స్వరూపం ఒక్కటే.  కాబట్టి ప్రతివ్యక్తి ఇతరమతాలవారితో విభేదిoచకుండ తాను నమ్మిన  దైవాన్ని నిండు మనస్సుతో  ఆరాధించడమే రెండవమెట్టు. అంతే గాక మరో విశేషo ఏమిటంటే  భగవంతునికి ప్రపంచానికి భేదం లేదు. ఏ విధంగా సాలెపురుగు తనలోని ఒక పదార్థంతో సాలె గూడు నిర్మించి దానికంటే వేరుగా కూడా ఉంటుందో అలాగే భగవంతుడు తనను తానే ప్రపంచంగా సృష్టించుకుని దానికి  భిన్నoగా కూడ ఉంటాడు. అందుకే ఈ లోకానికి సేవ చేస్తే లోకేశ్వరునికి చేసినట్లే. అలాగే తాను నమ్మిన  దైవాన్ని అంతట అందరి యందు  చూడగలగడం కూడ అసలు సిసలైన భక్తిగా మనపెద్దలు పేర్కొన్నారు.
మూడవమెట్టు మంచివారితో స్నేహం:
మంచివారితో స్నేహం బుద్ధిమాంద్యాన్ని తొలగించి మంచిమార్గం వైపునకు నడిచేలా చేస్తుంది.  మంచివారితో స్నేహం చెయ్యడం వల్ల మానవునకు రాగద్వేషాలు నశిస్తాయి. రాగద్వేషాలు నశిస్తే మోహాలు తొలగిపోతాయి. మోహాలు తొలగిపోతే  మనస్సు నిశ్చలమౌతుoది. ఆ నిశ్చలమైన తత్త్వమే జీవన్ముక్తి అని అంటారు శ్రీ శంకరాచార్యులు. 
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం                                                               
నిశ్చలతత్త్వే జీవన్ముక్తి:  
 నాల్గవ మెట్టు  దీనజనులను ఆదుకోవడం:
సాటి మనిషిగా తనవారిని, దీనజనులను ఆదుకోవడం మానవుని కనీసకర్తవ్యo . అది చేదోడు వాదోడుగా గాని  అవసరమైన  వస్తువులను సమకూర్చడం ద్వారా గాని కావచ్చు. సమాజంలో దానధర్మాలు చేసే వాళ్ళు చాల మంది ఉంటారు . కాని వాటి వెనుక ఉండే ఉద్దేశాలు మాత్రం వేరు.  దానం మూడు విధాలు . ఎదుటి వారి అవసరాలను తెలుసుకుని సకాలంలో చేసే దానం సాత్త్వికదానం. ఇది ఇచ్చేవారికి పుచ్చుకునేవారికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు. ఇది ఉత్తమమైన దానం. ఇక కొంతమంది గొప్పకోసమో, కీర్తిప్రతిష్ఠలకోసమో దానధర్మాలు చేస్తూ ఉంటారు . ఇది రాజసికం . ఉదాహరణకు కొంతమంది వ్యక్తులు కలిసి ఒక గుడికి ఒక ఫ్యాను దానం చేస్తారు . అదెప్పుడు తిరగకూడదు. ఎoదుకంటే అది తిరిగితే దానిపైన వ్రాయించుకున్న వాళ్ళ పేర్లు కన్పించవు. ఇది  రాజసికం.  ఇది కూడ కొంతవరకు నయమే . ఎoదుకంటే దాతల సమక్షంలో అవి ఉపయోగిoచలేక పోయినా వాళ్లు లేని సమయంలో అవి ఉపయోగిoచు కోవచ్చు. ఇక  తామసికదానం  చాల దారుణమైనది . ఇది వెంట్రుక విసిరి కొండను రాబట్టడం వంటిది. సాధారణంగా రాజకీయనాయకులు ఇటువంటి దానాలు చేస్తూ ఉంటారు . ఎన్నికలముందు ఓటర్లకు వందో ,వెయ్యో విసిరి గెలిచాక  కోట్లాది రూపాయలు రాబట్టుకుంటారు. ఇది దానం కానే కాదు . ఒకవేళ దానం అనుకుంటే అది అధమాధమం.
కాబట్టి దానం చెయ్యడం ఎంత ముఖ్యమో ఎవరికి ఎప్పుడు దానం చెయ్యాలో తెలుసుకోవడం కూడ అంతే ముఖ్యం . లేకపోతే అది అపాత్రదానమౌతుoది. వర్షం పంటపొలంలో కురిస్తే ప్రయోజనం  గాని పెంట కుప్పమీదో, సముద్రంలోనో  కురిస్తే ప్రయోజనం లేదు.    అందువల్ల సమాజంలోని దీనజనులను గుర్తించి వాళ్ళను తగిన సమయంలో ఆదుకోవాలి.      

    ఈ నాల్గు మార్గాలు అందరికి అందుబాటులో ఉన్నవి. అందరు అనుసరిoచ దగినవి. కాబట్టి ప్రతి వ్యక్తి  తాను ఏ మతానికి చెందినవాడైనా, ఏ  సంస్కృతికి  చెందినవాడైనా ఆయామతాలకు సంబంధించిన పవిత్రగ్రంథాలను చదివి, అర్థం చేసుకుని ఆచరిస్తూ , ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ , మంచివారితో స్నేహం చేస్తూ , దీనజనులకు సహాయసహకారాలు అందిస్తూ పరమపురుషార్థమైన ముక్తిని పొందగలడు. ఇంతకంటే సులభమైన ఉపాయం మరొక్కటి లేదు.   
************
   

                  

No comments: