Thursday, July 13, 2017

Let us know -5

Let us know -5
(తెలుసుకుందాం -5)
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

1. ఈ రె౦డూ వదిలెయ్యాలి
కాశీనగరాన్ని సందర్శించినవారు తమకిష్టమైన  రెండు వస్తువులను వదిలెయ్యాలనే నియమం మన సంస్కృతిలో ఉంది . దానికి తగ్గట్టుగానే అక్కడకు వెళ్ళిన వారు తమకు బాగా ఇష్టమైన పండో , కాయో వదిలేసి వస్తూ ఉంటారు . ఇక జీవితంలో వాటిని ముట్టుకోరు . అంతా బాగానే ఉంది కాని ఈ నియమం యొక్క ఉద్దేశ్యం ఒకటి,  జరుగుతున్నది మరొకటి . ఇక్కడ రెండు వదలాలి  అంటే అహంకార , మమకారాలు  అని అర్థం . ఇవి చాల ప్రమాదకరమైనవి కాబట్టి వాటిని విడిచి పెట్టాలి . అంతేగాని కాయలూ, పువ్వులూ, పండ్లూ కావు . అవి వదిలెయ్యడం వల్ల వచ్చే లాభమూ లేదు వదలక పోవడం వల్ల వచ్చే నష్టమూ లేదు .  
ఇక అన్ని దు:ఖాలకు మూలం నేను (అహం) అనే భావన . తాను గా ఉండే ఆత్మను మనం శరీర౦తో తాదాత్మ్యం పొంది౦చి కలగా పులగం చేసి నేను అని వ్యవహరిస్తున్నాం .  నిద్రలో అహం అనే భావన లేదు .  ఆత్మ తనకు  తాను గానే ఉంది . అందుకే ఏ దు:ఖమూ లేదు . ఈ గొడవంతా మెళుకువ వచ్చాకనే . అహం వచ్చిన వెంటనే మమ (నాది) అనే భావన తనంతట తానే వచ్చేస్తుంది . నేను --> నాది---à సమస్త ప్రపంచం . ఇదీ క్రమం . నిత్యజీవితంలో మనకు మూడు స్థితులు ఉంటాయి . ఒకటి మెలకువ , రెండు కల , మూడు నిద్ర. మెలుకువలో సుఖం , దు:ఖం రెండు ఉన్నాయి . అలాగే  కలలో కూడ సుఖం, దు:ఖం రెండు కనిపిస్తున్నాయి . మంచి కలొస్తే సుఖం , పీడకల వస్తే దు:ఖం . కాని నిద్రలో దు:ఖం లేదు సుఖం మాత్రమే ఉంది . మనకు మూడు స్థాయిల్లోను  సుఖం ఉంది , రెండు స్థాయిల్లో మాత్రమే దు:ఖం ఉంది అంటే ఉన్నదసలు సుఖమే (ఆనందమే) దు:ఖం తెచ్చి పెట్టుకున్నది .  ఉదాహరణకి ఎవరికైనా ఒక వస్తువు పోయి౦దనుకో౦డి. అయ్యో ! పోయిందే అనుకుంటే దు:ఖం, పొతే పోయిందిలే మరోటి కొనుక్కోవచ్చు అనుకుంటే సుఖం . ఒక పిల్లవాడు రోడ్డు మీద నుంచొని ఏడుస్తున్నాడు . ఆ దారిన వెడుతున్న ఒకాయన ఎందుకేడుస్తున్నావయ్యా అని అడిగాడి . దానికి సమాధానంగా నా రూపాయి ఒకటి పడిపోయింది అందుకే ఏడుస్తున్నాను అన్నాడు . అయ్యో! అలాగా ఇదిగో ఈ రూపాయి తీసుకో అని తన దగ్గరున్న ఒక రూపాయిని తీసి ఇచ్చాడు . ఆ పిల్లవాడు ఆ రూపాయి తీసుకుని తన జేబులో వేసుకుని మళ్లీ ఏడవటం ప్రారంభించాడు . దానికా వ్యక్తి మళ్లీ ఎందుకేడుస్తున్నావని అడిగినప్పుడు అది కూడ ఉంటే నాకు రెండు రూపాయలయయ్యేవి కదా అని వాపోయాడట . సరే ఆ సంగాతలా ఉంచుదాం . అసలు దు:ఖానికి మూల కారణం అహం. అందుకే అహము విదిచితే ఆనందమురా అన్నారు . ఈ అహం రాగానే మమ అనేది వస్తుంది . అందుకే ఈ రెంటిని విడిచిపెట్టమన్నారు మన పెద్దలు . కాయలు , పళ్ళు కాదు .    
***
2. ఓనమాలు
మనం ఎవరినైనా ఆక్షేపి౦చేటప్పుడు వాడా ! వాడికి ఓనమాలు కూడ రావు పెద్ద పండితుడిలా పోజిస్తాడు అంటాం . అసలీ ఓనమాలు అనే మాట ఎలా వచ్చిందో తెలుసుకుందాం.   విద్య నేర్పే  గురువు అక్షరాభ్యాసానికి ముందు ఓ - న - మ: శి- వా- య: -సి ద్ధం నమ:   అని పలకపై వ్రాయిస్తాడు . లేదా ముందుగా తాను వ్రాసి పిల్లవాడిచేయి పుచ్చుకుని   వ్రాయిస్తాడు . లేదా నోటితో అనిపిస్తాడు.  దీనికి అసలు మంత్రం  ఓం నమశ్శివాయ అని . ఈ మంత్రం ఉపదేశించాలటంటే ఉపదేశం పొందే వ్యక్తికి ఉపనయనం కావాలి . ఉపనయనం అయినవాడికే ఉపదేశార్హత .  అక్షరాభ్యాసం చేసే సమయానికి సాధారణంగా ఎవరికీ ఉపనయనం జరుగదు కాబట్టి ఒక demmy మంత్రం ఉపదేశిస్తాం . అదే ఓనామ:-శివాయ: అనేది .  నారదుడు మంత్రోపదేశానికి అర్హతలేని బోయవానికి రామమంత్రాన్ని ఉపదేశించడానికి  మరా-మరా అని ఉపదేశిస్తే దాన్ని జపించి ఆబోయవాడు వాల్మికిగా మారడం మనకు తెలిసిన విషయమే.
ఇక ఈ ఓ-నా-మ: అనే వాటినే మనం ఓనమాలని అంటాం . మొత్తం మీద ఓనమాలు రానివాడు అంటే బొత్తిగా అక్షరజ్ఞానం కూడ లేనివాడనే  అర్థంలో మనం వాడుతున్నాం .        
***



No comments: