Wednesday, July 12, 2017

మినీ కవితలు-3

మినీ కవితలు-3
డా|| చిలకమర్తి  దుర్గాప్రసాదరావు


1 అహం- అన్నారు ఆదిశంకరులు
సోsహం- అన్నారు రామానుజులు
దాసోsహం- అన్నారు మధ్వాచార్యులు
అక్షరాలు పేర్చారు అర్థాలు మార్చారు
ఆ పేర్పు ఆ మార్పు  ఆ నేర్పు
అర్థం కావాలంటే  ఉండాలి కొంత ఓర్పు
ఉపనిషత్తులు చదవండి ఉత్తమగతులు పొందండి
                ***
2 . తడిపితే బిగుసుకుపోతాయ్  
    తలుపులు
    తడపకపోతే  బిగుసుకుపోతాయ్
    ఉద్యోగి తలపులు  
                 ***
3. నిరుద్యోగి కన్నా చిఱుద్యోగి మిన్న
   బోడిగుండు కన్నా బట్టబుర్ర మిన్న 
   ఖాళీగా కూర్చోడంకన్నా
   కాస్తంత ఉద్యోగం మిన్న  
          ***
4. అర్హతగల అధ్యాపకులొకచోట
   అర్హులైన విద్యార్థులు వేఱొక చోట
  అందమైన సేలరీలు ఒకచోట
  అడ్డమైన చాకిరీలు ఇంకొక చోట
  చదువుకున్న వాడి కన్న
  చదువుకొన్న వాడే మిన్నగా
 సరస్వతి సిగ్గుతో ఒదిగిపోతోంటే   
 లక్ష్మి చకచకా ఎదిగిపోతోంది
              ***  
5. పిల్లలు చెప్పుచేతల్లో లేకపోతే
   పెద్దల  చెప్పులు చేతుల్లోకే  
                ***
6. పరలోకపు ఆ  కల్పవృక్షాలకోసం
   ఇహలోకపు ఈ కలపవృక్షాల్ని నాశనం చేసుకోకు
   పరలోకపు ఆ సుఖసంపదలకోసం
   ఇహలోకపు ఈ  పశుసంపదను నాశనం చేసుకోకు .
   జ్ఞానంతో శోధిస్తే   యోగంతో సాధిస్తే
  అన్నీ నీకందుతాయ్ అందరికీ చెందుతాయ్ .       

                      ***

No comments: