Thursday, January 9, 2020

Hats off to the talent of Dr. Kadimilla


Hats off to the talent of  Dr. Kadimilla

Dr. DurgaprasadaRao Chilakamarthi

తెలుగుసాహిత్యలోకంలో డాక్టర్  శ్రీ కడిమిళ్ళ  వరప్రసాదరావు గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు . ఆయన ఆంధ్ర, సంస్కృతాంగ్ల భాషల్లో నిపుణులుగా , ఆంధ్రభాషాధ్యాపకులుగా  , సహస్రావధానిగా సాటిలేనిమేటి కీర్తినార్జిస్తున్నారు  ఒకసారి    వారు అవధానం చేస్తున్నప్పుడు  వర్ణన అనే అంశంలో ఒక పృచ్ఛకుడు అయ్యా ! అవధానిగారూ! సంజీవని పర్వతం తెస్తున్న శ్రీఆంజనేయస్వామివారి  తోకను వర్ణిస్తూ రసవత్తరమైన ఒక పద్యం చెప్పండి అని అడిగారు . ఆడిగే వారికి చెప్పేవారు లోకువ అన్నట్లుగా అడిగేవారు ఏదైనా అడుగుతారు . చెప్పేవారికే కష్టం . కాని సహజప్రతిభావంతులైన ఆయన అడిగిన వెనువెంటనే  ఆశువుగా ఒక  పద్యాన్ని ఇలా అందించారు . అవధానసాహిత్యంతో  నాకు  పరిచయం చాల తక్కువే ఐనప్పటికీ  ఇంత రసవత్తరమైన పద్యం నాకు మరొక్కటి కనిపించలేదు .  ఇది ఒక అద్భుతం , అనన్యం , అసదృశం. అవధాన పద్యాలలోనే తలమానికం. పద్యం పరిశీలించండి .
వాలంబో! ప్రణవాకృతింబొలుచు దివ్యత్వ౦బొ! శేషాహియో!
ఫాలస్థానికవహ్నియో! యినకులవ్యాసక్త కోదండమో!
లీలాకల్పితవీరభద్రజటయో! ఋక్షప్రకంపంబొ! యీ
గోలాంగూలము లక్ష్మణావనకళాకుంఠంబు తోరంబుగన్
   
ఆలోచించేకొద్దీ ఆనందాన్ని ఇనుమడింప చేసే ఇటువంటి పద్యాలు అవధానసాహిత్య వినీలాకాశంలో ధ్రువతారలుగా వెలుగొందుతాయనడంలో ఎటువంటి సందేహంలేదు .   ఇంత మంచి పద్యాన్ని మనకం దించిన  ఆయనకు, వారిప్రతిభకు అనేక వందనాలు.

                                         <*><*><*><*><*>
   

No comments: