Thursday, March 12, 2020

An ounce of intensive reading is better than a ton of extensive reading


An ounce of intensive reading is better than a ton of extensive reading


Dr. DurgaprasadaRao Chilakamarthi

ఒక సుప్రసిద్ధమైన విశ్వవిద్యాలయంలో కొన్ని సంస్థలన్నీ కలిసి ఒక ఉద్యోగమేళా ఏర్పాటు చేశాయి. walk in interview రూపంలో ఒక interview జరిగింది.  ఒక్కొక్కరిని పిలిచి తమకు నచ్చిన అంశాన్ని తీసుకుని ఆ అంశంపై తమకు తెలిసిన భాషలో పది నిముషాలు  మాట్లాడమని అడిగారు . ఆశ్చర్యం ! పది శాతం విద్యార్థులు కూడ ఏఒక్క అంశం మీద కనీసం పది నిముషాలు కూడ మాట్లాడలేకపోయారు. ఆ యా కంపెనీలవారు నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్లి పోయారు . ఆ విషయం అలా ఉంచుదాం . ఇంతకీ వారు ఆశించిన విధంగా అభ్యర్థులు ప్రతిభ కనపరచక పోవడానికి కారణం పరిశీలిస్తే రెండు విషయాలు మనం గమనించగలం .  ఒకటి విద్యార్థులు ఏ విషయాన్నైనా అర్థం చేసుకోకుండా బట్టీపట్టడం, రెండు ఏ  విషయాన్నైనా లోతుగా తెలుసుకోకుండా పైపైకి మాత్రమె  చదవడం అని నాకనిపించింది.
మన సంస్కృతి ఏ విషయాన్నైనా అర్థం చేసుకునే చదవాలనీ అర్థం చేసుకోకుండా చదివితే ఆ చదువు వ్యర్థమని భావించింది .
స్వయంగా వేదమే:  
ఉతత్వ పశ్యన్నదదర్శ వాచం
ఉతత్వశృణ్వన్ న శృణోత్యేనాం
ఉతో త్వస్మై తన్వం విసశ్రే
జాయేవ పత్యు: ఉశతీ సువాసా
  
అర్థజ్ఞానం లేని వాడు చూస్తున్నా చూడనట్లే , వింటున్నా విననట్లే . ఎవడు అర్థం చేసుకుంటూ చదువుతాడో అట్టివానికి భర్తకు భార్య ఎటువంటి దాపరికం లేకుండా వశమౌతు౦దో సరస్వతి అలాగే వశమౌతు౦ది అని అర్థం చేసుకుచదివేవాణ్ణి  ప్రశంసించడమే కాకుండా ,
స్థాణురయం భారహార: కిలాభూదధీత్య
వేదం న విజానాతి యోsర్థం యోsర్థజ్ఞ: 
ఇత్సకలం భద్రమశ్నుతే నాకమేతి జ్ఞానవిధూతపాప్మా
యద్ గృహీత మవిజ్ఞాతం నిగదేనైవ శబ్ద్యతే
అనగ్నావివ శుష్కే0ధౌ న తజ్జ్వలతి కర్హిచిత్

ఎవడు అర్థం తెలుసుకోకుండా బండగా వేదం వల్లెవేస్తాడో అటువంటివాడు
బరువుమోస్తున్న స్తంభం లాంటి వాడు . ఎవడు వేదాన్ని అర్థం చేసుకుంటూ చదువుతాడో అట్టివాడు సకల శుభాలు పొందుతాడు . జ్ఞానం
చేత పాపాలు నశించి స్వర్గసౌఖ్యాలనుభవిస్తాడు. అలా కాకుండా  ఎవడు అర్థం చేసుకోకుండా కేవలం వల్లె వేస్తాడో అగ్ని లేని బూడిదపై వేసిన ఎండు కర్రల వలే అవి మండవు అని  అర్థం చేసుకోకుండా చదివేవాణ్ణి నిందించింది.

ఇక రెండో విషయానికొస్తే అవి పై పై చదువులు .
ఏ విషయాన్నైనా లోతుగా చదవాలి, కేవలం  పై పై న చదవడం కాదు .
అబ్ధిర్ లంఘిత ఏవ వానరభటై: కింత్వస్య గంభీరతా
ఆపాతాళ నిమగ్న పీవరతనుర్జానాతి మంథాచల:
  అంటాడు  సంస్కృత కవి మురారి తన అనర్ఘ రాఘవం అనే నాటకంలో .
కోతులు సముద్రాన్ని దాటాయి కాని ఆ సముద్రం లోతు వాటికేం తెలుసు! . ఆ సముద్రంలో పూర్తిగా మునిగిన మంథర పర్వతానికే  ఆ లోతు తెలుసు అంటాడు .     
కాబట్టి ప్రతివ్యక్తి ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించి చదవాలి . అందుకే ప్రారంభదశలో వంద పుస్తకాలు చదివేకంటే ఒక పుస్తకం వంద సార్లు చదవడం మంచిది . వందపేజీలు చదవడం కంటే ఒక పేజీ వందసార్లు చదవడం మేలు . వంద లైన్లు చదవడం కంటే ఒక లైను వంద సార్లు చదవడం ఉత్తమం .


No comments: