Wednesday, July 20, 2022

సంస్కృతసాహిత్యంలో రిపార్టీ కవితా ప్రక్రియ

 

           సంస్కృతసాహిత్యంలో రిపార్టీ కవితా ప్రక్రియ

                                 ( Repartee in Sanskrit Literature)

                                              డాక్తర్.చిలకమర్తి దుర్గాప్రసాదరావు

                                                    dr.cdprao@gmail.com

                                                                                                  9897959425

 

సంస్కృతసాహిత్యం ఆకాశం కంటే విశాలమై౦ది, సముద్రం కంటే లోతై౦ది . ఎ౦దుకంటే  సంస్కృతసాహిత్యం అన్ని ప్రాచీనసాహిత్య ప్రక్రియలకు నిధి అవడమే కాకుండా అన్ని ఆధునికసాహిత్యప్రక్రియలకు కూడ మాతృకగా కనిపిస్తోంది. అది ప్రాచీనంలో ప్రాచీనం ఆధునికంలో ఆధునికం . ఇక ఆంగ్ల సాహిత్యంలో Repartee అనే ఒక సాహిత్య ప్రక్రియ ఉంది . రిపార్టీ అంటే  Ready reply అని A witty reply అని Talk characterized by clever and witty replies. ‘అని నిర్వచిస్తారు.

 

సాధారణంగా మానవులలో ఇతరులను ఆక్షేపించే స్వభావం ఎక్కువగా కనిపిస్తుంది . ఏదో వంక పెట్టుకుని ఎక్కడో అక్కడ ఎవరో ఒకరిని ఆక్షేపిస్తూనే ఉంటారు . ఆక్షేపణలు  సహించలేని వాళ్ళు తగిన సమాధానం చెబుతూనే ఉంటారు .   

ఈ ఆక్షేపణ ముఖ్యంగా మూడు స్థాయిల్లో ఉంటుంది . కొంతమంది వేళాకోళంగా ఇతరులను ఆక్షేపిస్తూ ఉంటారు, వారి మనస్సుల్లో ఎటువంటి చెడు ఉద్దేశం ఉండదు. మరికొంత మంది మనస్సులో ఒకటి పెట్టుకుని ఇతరులను ఆక్షేపిస్తూ ఉంటారు. మరికొంతమంది సూటిగా కఠినంగా ఆక్షేపిస్తారు . ఎవరు ఏస్థాయిలో, ఎంత మోతాదులో , ఏ విధంగా ఆక్షేపిస్తే వారికి ఆ స్థాయిలో అంతే మోతాదులో ఆ విధంగా సమాధానం చెప్పడం Repartee అనుకోవచ్చు  . ఈ విధంగా మృదువు , కఠినం , అతికఠినంగా చేసే ఆక్షేపణలు దానికి తగిన సమాధానాలు సంస్కృత సాహిత్యంలో కోకొల్లలు . అవి ఎలా ఉంటాయో స్థాలీపులాక న్యాయంగా కొన్నిటిని పరిశీలిద్దాం .

 

                                ఆది దంపతులైన  పార్వతీ పరమేశ్వరుల చిలిపి సంభాషణలు , వేలాకోలాలు జగత్ప్రసిద్ధాలు . పార్వతి వాస్తవానికి అచలపుత్రికే అయినా చలచిత్తం కలది. చాల చిలిపిది. ఒకనాడు సరదాగా తన   భర్తను ఒక ఆటపట్టిద్దామనుకుంది . కాని ఆయన తనకంటే  తెలివైన వాడని మాత్రం ఊహించలేక పోయింది పాపం.  ఏమండి ! నాకు అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు . నాకున్నట్లుగా మీకు అమ్మానాన్నలెక్కడున్నారో చూపించండి అంది కొంటెగా. శివుడు దానికి సమాధానంగా  ఓహో అదా ! నాకు అత్తా మామ ఇద్దరూ ఉన్నారు . నాకున్నట్లుగా నీకు అత్తా మామలు ఎక్కడున్నారో చూపించు  అన్నాడు నవ్వుతూ. ఏ౦ చూపిస్తుంది వెంటనే ఉడుక్కుంటూ బుoగమూతి పెట్టి ఆయన ఒడిలోకి  వంగి వాలిపోయి ఉంటు౦దని ఊహిద్దాం. ఈ విధంగా పార్వతి కొంటె ప్రశ్నకు తగిన సమాధానం చెప్పిన ముక్కంటి మాటలు మనల్ని రక్షించుగాక

 

క్వ  తిష్ఠత: తే పితరౌ మమేవే త్యపర్ణయోక్తే పరిహాసపూర్వం

క్వ వా మమేవ శ్వశురౌ తవేతి తామీరయన్ సస్మితమీశ్వరోsవ్యాత్

 

ఇప్పుడు ఎంతో స్నేహం గల ఇద్దరు యువతులమధ్య వేళాకోళం (ఆక్షేపణ సమాధానం ) ఎంత అందంగా ఉంటుందో చూద్దాం.

 

                                                   ఒకసారి శివకేశవులిద్దరూ తమ భార్యలతో ఒక చోట సమావేశమయ్యారు. ఒక ప్రదేశంలో శివకేశవులులిద్దరూ కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు. మరొక ప్రదేశంలో   లక్ష్మీపార్వతులు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. పార్వతి లక్ష్మితో  ఏమమ్మా! చంచలమైనదానా! నిన్నోమాటడుగుతాను సమాధానం చెబుతావా? అంది . సరే అడగవమ్మా! శివుని పెళ్ళామా! అoది లక్ష్మి . మీనాన్న ఎవరు? అంది పార్వతి . వెంటనే లక్ష్మి సముద్రుడు అని సమాధానం చెప్పింది. వెంటనే పార్వతి ఊరుకోవమ్మా! ఎవరు నమ్ముతారు. నీళ్లకెక్కడైన పిల్లలుపుడతారా! నేను నమ్మను గాక నమ్మను అంది. ఓహో! సరేలే!  నువ్వు నమ్మకపోతేమానెయ్యి. పర్వతాలకు పిల్లలు పుట్టగాలేంది సముద్రానికి మాత్రం పిల్లలు పుట్టరా ఏంటిఅంది . అది    ఎవరు నమ్ముతారో వాళ్లే ఇది  కూడా నమ్ముతారులే అని లక్ష్మి సమాధానం చెప్పింది . నువ్వు పర్వతం కూతురవైనప్పుడు నేను సముద్రం కూతుర్ని ఎందుకు కాకూడదు అని లక్ష్మి సమాధానం లోని అంతరార్థం.

ఈ విధంగా పరస్పరం వేళాకోళాలాడుకుoటున్న లక్ష్మీపార్వతుల సరససల్లాపాలను వింటూ హరిహరులు లోలోపల ఎంతో  ఆనందిస్తున్నారట . అటువంటి ఆ శివకేశవుల ఆనందం మన విఘ్నాలు పోగొట్టి మనలను రక్షించుగాక అని ఒక కవి అందమైన శ్లోకం వ్రాశాడు.

 

లోలే! బ్రూహి కపాలికామిని ! పితాకస్తే? పతి: పాథసాం

క: ప్రత్యేతి జలాదపత్యజననం? ప్రత్యేతి య: ప్రస్తరాత్

ఇత్థం పార్వతిసింధురాజసుతయోరాకర్ణ్యవాక్చాతురీo

సంస్మేరస్య  హరేర్హరస్య చ ముదో నిఘ్నంతు విఘ్నం తు వ:  

    

ఇవి కేవల వేలాకోలపు మాటలు వానికి తగిన సమాధానాలు .ఇపుడు కొంచె0 మోతాదు మించిన ఆక్షేపణలు దానికి తగిన సమాధానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం

 

                                                                  మనం ఎంత గొప్ప వాళ్లమైనా కావొచ్చు గాని ఇతరుల్ని కించపరిస్తే అది మనకు ముప్పు తెచ్చి పెడుతుందిఒక్కొక్కప్పుడు మన అస్తిత్వానికే ప్రమాదం తెచ్చి పెడుతుందిఆత్మశ్లాఘ ఎంత ప్రమాదమో పరనింద అంతకంటే ఎక్కువ ప్రమాదం.అందువల్ల మనం ఎంత ఉన్నతంగా ఉన్నామో అంత అణకువగా కూడ ఉండడం నేర్చు కోవాలిలేకపోతే సమాజమే మనకి గొప్ప గుణ పాఠం చెబుతుంది. ఇతరుల్ని కించపరిస్తే కల్గే నష్టాన్ని ఒక సంస్కృత కవి ఎంత చక్కగా వివరించాడో స్వయంగా చూడండి.

ఒకరోజు లక్ష్మి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న పార్వతి ఇంటికి వెళ్లిందిపార్వతి, ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టిందిలక్శ్మి ఆ పరిసరాలన్నీ పరికించిందిపార్వతికి లక్ష్మికున్నంత ఐశ్వర్యం లేదు, డాబు లేదుపరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయిలక్ష్మికి అనుకోకుందా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది.

"భిక్షార్థీ స క్వ యాత:?” అని చిన్న ప్రశ్న వేసిందిమీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది కాని లక్ష్మి అలా అనలేదుఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మాఅంది.  శివుడు ఆది భిక్షువు కదాలక్ష్మి ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది. పార్వతి కి ఈ ప్రశ్న చాల బాధ కల్గించింది . ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుందిగాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం సహించలేదు కదాకాని ఏంచేస్తుందిఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదుఅలాగని సరిపెట్టుకుని ఊరుకోనూలేదుఏదో సమాధానం చెప్పాలిఎంచెప్పాలికొంచెం ఆలోచించింది.

"సుతను బలిమఖే " అంది. 'బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మాఅని సమాధానంఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తలతిరిగి పోయిందిబలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు తనభర్త శ్రీమహావిష్ణువువామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే ' మా ఆయనే కాదు మీ ఆయన కూడా ముష్టివాడేమా ఆయనకన్నా మీ ఆయనే దారుణం. కేవలం మూడడుగుల నేలకోసం ముష్టివాడయ్యాడు అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసిందిలక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుందిమళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయిందిరెండో ప్రశ్న వేసింది.

తాండవం క్వాద్య భద్రే! అనడిగిందిఅమ్మామీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడుఅని దానర్థంమీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని లక్ష్మి మాటల్లోని అంతరార్థంఅప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది.

మన్యే బృందావనాంతే అందిబృందావనంలో అనుకుంటున్నానమ్మాఅని ఆ మాటలకర్థంబృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడుశివుడు కాదు. ' మా ఆయనే కాదు మీఆయన కూడ నాట్యం చేస్తాడుఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడుఅని సమాధానంపార్వతి సమాధానం ఇంత పదునుగా ఉంటుందని లక్ష్మి ఊహించలేదుఆమెకు మతిపోయినంతపనయిందిఏలాగో సంబాళించుకుందిఈ సారి తనకు ఇబ్బంది లేని విధంగా మాట్లాడాలనుకుంది.

క్వనుచ మృగ శిశు: ? అని మరో ప్రశ్న వేసిందిమీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మాఅని అర్థంలక్ష్మి కొడుకు మన్మథుడు చాల అందగాడుపార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరంలేదు. ' మా అబ్బాయి చాల అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపిఅని లక్ష్మి ఆక్షేపణలోని అభిప్రాయం . పార్వతి చాల నొచ్చు కుందికాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దుపార్వతి మెదడులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసిందివెంటనే అంది.

నైవ జానే వరాహం అని .“ ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మాఎక్కడున్నాడో తెలీదుఅందిమా అబ్బాయిది ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!అని పార్వతి సమాధానం లోని చమత్కారంఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించిందికొంతసేపటికి ఎలాగో తేరుకుందిఈసారి జాగ్రత్త్తగా తనకు ఎదురుదెబ్బ తగలని విధంగ పార్వతికి దెబ్బకొట్టాలనుకుందిఅటు ఇటు కాసేపు చూసింది.

బాలేకచ్చిన్న దృష్ట : జరఠ వృషపతి: ? అనడిగింది. ' మీ వాహనం, అదే ఆ ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మాఅని ప్రశ్న. ' మాది గరుడ వాహనం విమానాల్లో వలే ఆకాశంలో తిరుగుతాంమీరు నేలపై తిరుగుతారుమీ వాహనం ముసలి ఎద్దుఅది కదల్లేదు మెదల్లేదుఅని ఆక్షేపంమేం పై స్థాయి వాళ్లం మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపుఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతిఅందుకే వెంటనే అందుకుంది.

"గోప ఏవాస్య వేత్తా " అంది. ' ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మాపో మీఆయన్నే అడుగుఅని చిన్న చురక అంటించిందిమా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడుమీకంటే మేమే ఎక్కువ అని పార్వతి ఆంతర్యంఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయిందితిన్నగా జారుకుంది.

నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేళాకోళంగా జరిగిన సంభాషణఇందులో నిందగాని వెక్కిరింపుగాని ఏమాత్రంలేవుఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఒక కవి లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడుఇందులో నీతి ముఖ్యం గాని ప్రశ్నలు సమాధానాలు ముఖ్యం కాదు. వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన సంభాషణ మనందరిని రక్షించుగాక అని చమత్కరించాడోకవిఇంత సరసమైన భావాన్ని తనలో దాచుకున్న ఈ శ్లోకం చదవండి.

 

భిక్షార్థీ స క్వ యాత: ?సుతను బలిమఖే " తాండవం క్వాద్య భద్రే ?

మన్యే బృందావనాంతే క్వను చ మృగశిశు:? నైవ జానే వరాహం

బాలే కచ్చిన్న దృష్టజరఠవృష పతి:? గోప ఏవాస్య వేత్తా

లీలాసంలాపఇత్థం జలనిధిహిమవత్కన్యయోత్రాయతాం న :

 

 

                                 పెళ్లంటే కొంతమందికి నూఱేళ్ల పంటమరి కొంతమందికి నూఱేళ్ల వంట . ఇంకా కొంతమందికి నూఱేళ్ల  పెంటఒకాయన తన స్నేహితునితో ' ఒరేయ్! నేను ఇంటికి వెళ్లే దాక నా భార్యాపిల్లలు భోజనమేచెయ్యరుఅన్నాడటఆ స్నేహితుడు చాలసంబరపడిపోతూ ' అబ్బానువ్వంటే నీ భార్యాపిల్లలకు ఎంత ప్రేమరానువ్వు నిజంగా చాల అదృష్ట వంతుడివిఅని మెచ్చుకున్నాడట.  వెంటనే వాడు ప్రేమాకాదు దోమాకాదుఇంటికెళ్లి నేనే వంటచెయ్యాలిఅన్నాడట తాపీగానిజానికి మానవజీవితానికి వంటకి అవినాభావసంబంధం ఉంది.  కాబట్టి ఎంతటి బంగారు పళ్లేనికైనా గోడచేర్పు ఎలా అవసరమో ఎంతటి గొప్పమగాడికైనా వంట నేర్పు కూడ అంతే అవసరం

 ఒక విధంగా ఆలోచిస్తే దమయంతి  ఇంద్రాది దేవతలందర్ని త్రోసిరాజని సామాన్యుడైన నలమహారాజునే పెళ్లి చేసుకోడానికి  అలాగే ద్రౌపది పాండవుల్లో అందరికంటే భీముణ్ణే ఎక్కువగా ఇష్ట పడడానికి కారణం  వారికి గల  పాకశాస్త్ర ప్రావీణ్యమే అని అనిపించక మానదు.   ఏది ఏమైన వంటపనిలో  పురుషుడు భార్య వెనుక ఒదిగే ఉంటున్నాడువంట చెయ్యనంటే జీవితంలో మిగిలేది పెంటే.

వంట పేరుతో తమ  జీవితాల్ని పెంట పాలు చేసుకున్న ఒక జంట మధ్య  జరిగిన వాగ్వివాదం   ఇక్కడ పొందుపరచ బడింది.  సరదాగా చదువుకుని ఆనందించండిఇది చదివేక వంటరాని వారు కొద్దో గొప్పో వంట నేర్చుకోండికనీసం వంటచేసేవారికి సహాయసహకారాలు అందజెయ్యండి.

 

ఒకాయన  పాపం ఎప్పుడూ ఇంట్లో  ఆయనే వంట చేసేవాడుఅనుకోకుండా ఒకరోజు పొరుగూరు వెడుతూ ఆపని భార్యకు పురమాయించాడుఆమె అయిష్టంగానే తలూపింది

తిరిగి తిరిగి ఎప్పటికో ఇంటికి చేరుకున్నాడుకడుపు నకనక లాడుతోందివంటచేశావాఅన్నాడువెంటనే 'నో'' అందిఅసలే ఆకలితో ఉన్నాడేమో ఒళ్లు మండి పోయింది.

పాపాత్మురాలావంట ఎందుకుచెయ్యలేదే అన్నాడు.

ఏంటి నేను పాపాత్మురాలనాకాదు మీనాన్నే పాపాత్ముడు అంది.

ఏమే తప్పుడుదానా ఏంటి వాగుతున్నావు అన్నాడు.

ఆ పదం  మీఅమ్మకి మీచెల్లి కి వర్తిస్తుంది నాక్కాదు అంది.

వెంటనే ఈ ఇంట్లోంచి బయటికి పోవే  అన్నాడు .

 ఇది నీ ఇల్లు కాదు పొమ్మనడానికి నీకు హక్కు లేదంది.

భగవంతుడా నాకు కనీసం చావునైన  ప్రసాదించవయ్యా అన్నాడు .

ఆవిడ కూడ తక్కువదేమీకాదు. 'మీలో తప్పుంటే మీరు పోతారు నాలో తప్పుంటే నా మాంగళ్యం పోతుంది అనేంతటి  గొప్ప ఇల్లాలు .   అందుకే  ఏమీ తడుముకోకుండా  నాకంత అదృ ష్టమా అంది.   ఇంతటి భీకరమైన వాగ్వివాదం తనలో పొందుపరచుకున్న ఈ మనోహర శ్లోకం చదవండి.

 

 : పాకం న కరోషి పాపినికథం పాపీ త్వదీయపితా

రండే జల్పసి కిం? తవైవ జననీ రండా త్వదీయా స్వసా

 నిర్గచ్ఛ త్వరితం  గృహాద్బహిరితో నేదం త్వదీయం గృహం

హాహా ! నాథ ! మమాద్య  దేహి మరణం తావన్న  భాగ్యోదయ:

 

కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు వారిమనస్సు నొచ్చుకోకుండా

మాట్లాడగలగడం ఒక కళ. అది అందరు నేర్చుకోవాలి .                                     ............................

 

 

1.     History of Sanskrit Literature.

By Sri Malladi Suryanarayana Sastry.

2.     SankaranarayaNa Dictionary

3.     KuvalayaanandaM by Appayya Dikshita .

4.     Subhaashita ratna bhaaMdaagaaram

5.     Sanskrit magazines.