Wednesday, July 20, 2022

పలకరిస్తేనే చాలు పులకరిస్తారు

 

పలకరిస్తేనే చాలు పులకరిస్తారు

 

డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

9897959425

 

ఈ మధ్య ఒకావిడ వాళ్ళ ఇoట్లోఉంటున్న  కుటుంబ సభ్యుల వివరాలు చెబుతూ మా ఇంట్లో మా ఆయన పిల్లలు కాకుండా రెండు డస్ట్ బిన్స్ కూడ ఉన్నాయండి అంది. అది నాకు అర్థంకాక డస్టుబిన్సు ఏoటమ్మా అన్నాను . మీకు తెలియదా ఇద్దరు ముసలోళ్ళు, ఒకరు అత్త మరొకరు మామ అoది. అదీ నేడు సమాజంలో పెద్దవారికున్న గౌరవం. తమ జీవితమంతా తమ సంతానం సుఖం కోసం త్యాగం చేసిన వారు నేడు నిరాదరణకు గురౌతున్నారు. ఇది అమానుషం . చాల మంది ఇంట్లో పెద్దవారిని ఉంచుకోవడం లేదు . ఒకవేళ కొంతమంది ఇష్టంలేకపోయినా సమాజానికి భయపడి  పెద్దవాళ్ళను ఇంట్లో ఉoచుకున్నా తమపిల్లల్ని వాళ్ళ దగ్గరకు చేరనివ్వడం లేదు. వీళ్ళ మాటలు విన్నా వీళ్ళతో కాలం గడిపినా పిల్లల చదువు పాడై పోతుందనే భ్రమలో ఉన్నారు . తమ పిల్లల్ని వారికి దూరంగా ఉంచుతున్నారు. దానివల్ల పిల్లలకు పెద్దలకు మధ్య దూరం రాను రాను పెరిగిపోతోంది. ఇక పెద్దవారైన అమ్మమ్మ తాతయ్యలు పిల్లలకు చెప్పే మాటలు, కథలు ఎంతో విజ్ఞానాన్ని , లోకజ్ఞానాన్ని కలిగిస్తాయి. పిల్లల్ని వారినుండి దూరం చేస్తే వారికి కలిగే నష్టాన్ని ఎవరు పూరించలేరు. పెద్దవారి వలన పిల్లలుపొందే  లాభాన్ని వివరించే   మహాభారతంలోని ఒక చిన్న అంశం పరిశీలిద్దాం . భీమమహారాజు కూతురైన దమయంతి నిషధదేశరాజైన నలుణ్ణి ప్రేమించింది. నలుడు కూడ ఆమెను ప్రేమించాడు. తండ్రి తనకుమార్తె దమయంతికి స్వయంవరం     ప్రకటించాడు. నలుడు మిగిలిన రాజకుమారులతో  పాటుగా ఇంద్రుడు, అగ్ని, వరుణుడు , యముడు మొదలైన దేవతలు కూడ ఆమెను పెళ్లి చేసుకోవడానికి స్వయంవరానికి వచ్చారు. ఆ దేవతలు తమలో ఒకరిని దమయంతి వరించేలాగ దమయంతికి నచ్చచెప్ప మని  సాక్షాత్తు నలుణ్ణే  దమయంతి వద్దకు రాయబారిగా  పంపించారు. నలుడు దేవతల కోరికను కాదనలేక ఆమెను  చేరుకొని ఆ  నలుగురిలో ఒకర్ని వరించ మని వారి మాటగా  ఆమెను కోరాడు . ఆమె తాను నలుణ్ణి తప్ప వేరొకర్ని వరించనని అతని ముందే ఖచ్చితంగా చెప్పేసింది . నలుడు తానేమీ చెయ్యలేక ఆ విషయం దేవతలకు చెప్పేశాడు. కాని దేవతలు తమ ప్రయత్నం విరమించు కోలేదు. అంతలో  స్వయంవరసమయం రానే వచ్చిది . నలునితో బాటుగా ఆ నలుగురు దేవతలు వచ్చి  కూర్చున్నారు. అతని ప్రక్కనే కూర్చున్నారు. అతని వేషంలోనే కూర్చున్నారు. దమయంతికి ఏమీ తోచలేదు . ఐదుగురిలో అసలైన నలుడు  ఎవరో తెలియలేదు. మనసులోనే పరిపరివిధాల విలపించింది. ఆమెకొక ఉపాయం తట్టింది. అసలైన నలుణ్ణి గుర్తించి మెడలో దండ వేసి వరించింది. ఆ తరువాత ఆమె చెలులు అమ్మా! దమయంతీ ! నువ్వు నలమహారాజును ఎలా గుర్తిoచగలిగావమ్మా? అని ప్రశ్నించారు . ఆమె సమాధానం చెపుతూ  నా చిన్నతనంలో మామ్మ , తాత  నాకు కథలు చెపుతూ దేవతలకు చెమటపట్టదని, రెప్పపాటు ఉండదని చెప్పారు. వారు చెప్పిన కథలు నాకు గుర్తుకొచ్చాయి. ఆ ఐదుగురిలో చెమటపట్టిన శరీరం, రెప్పపాటు  కలిగిన ఒక వ్యక్తిని గమనిoచాను. అతనిమెడలో స్వయంవరమాల వేశాను అంది . చూశారా! ఆమె ఎప్పుడో చిన్నప్పుడు విన్న అమ్మమ్మ కథ ఆమెను పెను ఆపద నుంచి ఎలా రక్షించిందో!

పెద్ద వాళ్ళు మన నుoచి  ఏమీ ఆశించరు, ఒక్క పలకరింపు తప్ప. మనం ప్రేమతో పలకరిస్తే చాలు వారు ఆనందంతో పులకరిస్తారు. ఆ మాత్రంకూడా మనం చెయ్యలేకపోవడం సిగ్గు చేటు. మనం పెద్దవారిని చేరదీసి ఆదరించకపోతే మనం పెద్దయ్యాక మనకు అదేగతి పడుతుంది. ఇందులో ఎటువంటి సందేహంలేదు.  

కుటుంబంలో గృహస్థుడు మంచి కొడుకుగానేకాదు, మంచి అల్లుడుగా  కూడ  పేరు తెచ్చుకోవాలి. అలాగే గృహిణి మంచికూతురుగానే కాదు మంచి కోడలిగా కూడ పేరు తెచ్చుకోవాలి. నేను ప్రపంచంలోనున్న ప్రసిద్ధమైన మతగ్రంథాలు ఇంచు మించుగా చదివేను. అన్ని మతాలూ దేవుణ్ణి నమ్మవు

కాని పాపపుణ్యాలను , వాటి ఫలితాలను చాల వరకు నమ్ముతాయి. అందువల్ల భగవంతుడున్నాడో లేడో నేను ఖచ్చితంగా చెప్పలేను గాని పాపం , పుణ్యం అనేవి మాత్రం ఉన్నాయి. అవి మనల్ని కట్టి కుడుపుతాయి. మంచైనా చెడైనా చేసినవాడు  అనుభవించక తప్పదు. నేను Flug లో వేలు పెడిత నాకే shock కొడుతుంది , మరొకడికి కాదు. పెద్దవాళ్లను ఆదరిద్దాం , ఆదర్శ జీవితానికి బంగారు బాటలు వేద్దాం.    ఈ సందర్భంగా ఒక గొప్పకవి రచించిన, గుండెల్ని పిండేసే, అద్భుతమైన మినీకవిత మీకు అందిస్తాను.  కవి పేరు చెప్పలేకపొతున్నం దుకు నన్ను మన్నించాలి.

ఆనాడు ఏడిపించాడు

అన్నం తినడానికి   

ఈనాడూ... ఏడిపిస్తున్నాడు

అన్నం పెట్టడానికి  

                                                <><><><>

No comments: