Wednesday, August 17, 2022

నేటి భారతం

 

                            నేటి భారతం

                                                                         Dr. Chilakamarthi DurgaprasadaRao.

                                                                                9897959425     

                                                                              dr.cdprao@gmail.com

       కలిస్తే నిలుస్తాం  విడిపోతే పడిపోతాం’ అన్నది ఆర్యోక్తి.


చెట్టపట్టాలేవేసుకుని దేశస్థులంతా నడువవలెనోయ్

అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నీ  మెలగవలెనోయ్

అన్నారు మహాకవి శ్రీగురజాడ. ఒకప్పుడు మన భరతజాతి అన్నదమ్ముల వలె కలసి మెలసి  మహాత్ముని అడుగుజాడల్లో నడిచి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసాయుతంగా పారద్రోల  గలిగింది. కానీ ఎం లాభం ? స్వతంత్రం సిద్ధించి ముప్పాతిక ఏళ్లయినా  స్వాతంత్ర్యఫలితాల్ని మనం పూర్తిగా పొందలేకపోతున్నాం . రోజు రోజుకి నిరుద్యోగం, నిరక్షరాస్యత, అవినీతి, అరాచకత్వం, అసూయాద్వేషాలు, ప్రాంతీయభేదాలు, మతవై షమ్యాలు  పెచ్చుపెరిగిపోతున్నాయి. మహాత్ముని మాటలకు వక్రభాష్యం చెపుతున్నారు.  ఎలాగో చూడండి .

చెడు అనుకుము  చెడు వినకుము

 చెడు కనకు మటంచు నొక్కి చెప్పిన గాంధీ

చెడు  చేయకంచు చెప్పెనె ?

చెడు చేయగ నేల మాకు  సిగ్గున్ ఎగ్గున్

 అంటు ఎన్నో  చెడ్డపనులు చేస్తూ ఇలా సమర్థించు కుంటున్నారు.

  నేటి నల్ల దొరలకంటె ఆనాటి   తెల్లదొరలే మేలనిపిస్తు న్నారు . అందుకే నేనన్నానొకప్పుడు .  

తెల్లదొరలేగ నిప్పుడు

 నల్లదొరలె  దేశముందు నయవంచకులై  

కొల్లంగొట్టుచు  దేశము

తెల్లదొరలె నయమటం చులు తెలిపిరి మనకున్ .

అన్ని విలువల్నీ డబ్బుతో కొనేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే

అమ్ముడు పోవని వస్తువు

ఇమ్మహి  కనబడదు ని క్కమిది  తెలియవలెన్ 

 సొమ్మోక్కటున్న యీ దే

శమ్మున కొనలేని వస్తుజాలము కలదే

అంటే అతిశయోక్తి కాదు.

 కులదురభిమానం , మతదురభిమానం జాతీయ సమైక్యాన్ని దెబ్బతీస్తున్నాయి.   

కులము మతమ్మను  రెండే

లమానములిపుడు కావు గుణములు ఈ

కులమతవైషమ్యము గొ

గొడ్డలిపెట్టుగ దేశమంతటను వ్యాపించెన్

 అందుకే అంటున్నాను కలిస్తే నిలుస్తాం విడిపోతే పడి పోతాం.

ఇక సత్యం వద’ అనే మాటకు  ఒత్తు తగిలించి  సత్యాన్ని వధిస్తున్నారు.   ‘ధర్మం చర’ అని ధర్మాన్ని పాటించమంటే ‘చర’ అనే పదానికి వేరో అర్థం  లాగి ధర్మాన్ని మింగేస్తున్నారు. ఆనాడు వందేమాతరం అని గొంతెత్తి అరిస్తే  ఇప్పుడు ‘వంద ఏమాత్రం’ అని వేలకువేలు  గుంజుకుంటున్నారు.  

ఒకప్పుడు తెల్లదొరలు  హిందూ ముస్లిం, ఉత్తర దక్షిణ ఆర్య, ద్రావిడ భేదాలు మనలో  కల్పించి మన ఐక్యతను విచ్ఛిన్నం చేసి తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటే నల్లదొరలైన  మనవారు కూడ  అదే బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు కుల,  మత, జాతి, ప్రాంతీయ భేదం రెచ్చ గొట్టి జాతిని విచ్ఛిన్నం చేస్తున్నారు. ప్రజలు వారు  చూపించే తాత్కాలికమైన ప్రలోభాలకు లోనై మన సంస్కృతిని వ్యక్తిత్వాన్ని మరచి  ఆడమన్నట్లు ఆడుతూ , పాడమన్నట్లు పాడుతూ ఉన్నారు.  ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే మన జాతి మనుగడ అనుమానాస్పదమే.  కాబట్టి మనమంతా మనసా,  వాచా, కర్మణా ఏకం కావలసిన  తరుణం ఆసన్నమైంది. దుష్టశక్తులతో  కలసికట్టుగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. అందుకోసం మనలో గల సంకుచితమైన  ప్రాంతీయ తత్వాన్ని, భాషా తత్వాన్ని, జాతి, మత, బేధాలు విడిచిపెడదాం.  కులాన్ని గోడలకు, మతాన్ని మందిరాలకూ మాత్రమె   పరిమితం చేద్దాంద్దాం.  జాతి, కుల, మత, ప్రాంతీయ దురభిమానాలను విడిచిపెడితే  ఎటువంటి దుష్టశక్తి నైనా ఎదిరించి  నిలబడ గలుగుతాం . ఆనాడే వ్యక్తి సంక్షేమంతో పాటు దేశసంక్షేమం కూడ సాధించే వీలు కలుగుతుంది.  ముఖ్యంగా నేటి విద్యావంతులైన యువత నవసమాజనిర్మాణానికి కంకణం కట్టుకోవాలి. విద్యార్థులు నవ సమాజ నిర్మాతలురా;  

విద్యార్థులు  దేశభావి  నిర్ణేతలురా  అన్న  మహాకవి మాటల్ని సార్థకం చేయాలి. పనులు ప్రయత్నిస్తే  సిద్ధిస్తాయిగాని  కేవలం ఉఉహాగానాలతో సిద్ధించవు. .  అందువల్ల నేడు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థులు, మేధావులు ఈ లక్ష్య సాధనకు కృషి చేస్తామని  త్రివర్ణపతాకప్రతిష్ఠ  ఇనుమడింప చేస్తామని  లక్ష్యం  సిద్ధించే వరకు వదలి పెట్టమని ప్రతిజ్ఞ చేద్దాం.

                Arise and awake stop not.

                   Till the goal is reached

అనే   వివేకానందుని మాటలు తారక మంత్రంగా జపించి, ఆచరించి, సాధించి, తరలించాలని కోరుతూ సేవ మాత్రమె దీనికి సాధనంగా భావిస్తున్నాను.

నాఉద్దేశంలో  దేశసేవ ఇలా ఉండాలి.

బ్రతికున్న వారికంటెను

మృతి చెందిన వారె చాల మేలనిపించే .

 స్థితి నేడున్నది  యీదు

  స్థితినిర్ములనమె దేశ సేవయనదగున్.

                జై భారత్.

 

 

 

Friday, August 5, 2022

శనగపల్లి వారి వివేకానందుడు (కావ్యసమీక్ష)

 

            శనగపల్లి వారి  వివేకానందుడు

(కావ్యసమీక్ష)

Dr. Chilakamarthi. Durgaprasada Rao

3/106, Premnagar, Dayalbagh, Agra.

9897959425

dr.cdprao@gmail.com


స్వామి వివేకానంద అనే పద్య కావ్యాన్ని  శ్రీ శనగపల్లి సుబ్బారావు గారు రచించారు. ఈయన ఒంగోలు వాస్తవ్యులు. బహు భాషాకోవిదులు,  బహు గ్రంథకర్త , కవి, విమర్శకులు , గ్రంథాలయోద్యమసేవానిరతులు, సాంఘిక సాంస్కృతిక సేవాభిలాషి. ఈయన ఆంధ్ర , ఆంగ్ల , హిందీ భాషలలో ప్రవీణులు. వారు ఈ కావ్యాన్ని శ్రీ వెలగా. వెంకటప్పయ్యగార్కి అంకితం చేశారు. స్వామి వివేకానంద  151 పద్యాలతో కూడిన రసవత్తర మైన  ఖండకావ్యం.  ఈ కావ్యం యొక్క ప్రథమ ముద్రణ ప్రతులన్నీ ఆనతి కాలంలోనే అయిపోయాయి. మరల రెండవ పర్యాయం ఈ కావ్యాన్ని ముద్రించారు. ఈ గ్రంథం  రాసిలో చిన్నదైనా వాసిలో మిన్న.  పండిత ప్రకాండులు  (తెలుగు శాఖాధ్యక్షులు సి.యస్ .ఆర్ శర్మ కళాశాల , ఒంగోలు) శ్రీ యుతులు మల్లెల వేoకట సుబ్రహ్మణ్య శర్మగారు, మధురకవి మల్లవరపు జాన్ గారు, విద్యావాచస్పతి, మహామహోపాధ్యాయ , సాహిత్యాచార్య , మహాకవి మార్తాండ, వేదాంత పారీణ, కళాప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీ శివశంకర స్వామీజీ, శ్రీ ఈమని దయానంద, శ్రీ గొల్లపూడి ప్రకాశరావు వంటి మహామహుల అభినందనలు, ఆశీస్సులను అందుకున్న గొప్ప కావ్యం .  కవి, వివేకానందుని జననం మొదలుకొని నిర్యాణం వరకు గల అన్ని సన్నివేశాలు ఇందులో  రసవత్తరంగా పొందుపరిచారు. 

ఈ కావ్యం రెండు భాగాలుగా విభజింపబడింది. మొదటిభాగంలో వివేకానందుని పుట్టుక, బాల్యం , గురుసమాగమం , గురుబోధ, విద్యాభ్యాసం , తండ్రి మృతి , కుటుంబంలో ఇక్కట్లు , కాళీ మాతను ప్రార్థించడం, రామకృష్ణుని ఆలోచన , గురుదేవుని నిర్యాణం , వివేకానందుని దేశపర్యటన మొదలైన అంశాలు కవి వర్ణించారు.  రెండవభాగంలో స్వామి విదేశపర్యటన, పునరాగమనం , మఠస్థాపన , మరోపర్యాయం విదేశాలకు వెళ్ళడం, తిరిగి రావడం , తల్లి కోరిక , అంత్య ప్రార్థన , నిర్యాణం మొ|| అంశాలు చక్కగా వర్ణించారు కవి. ఈ కావ్యం గణబద్ధం , కావ్యగుణబద్ధం కూడా. ఎన్నో అలంకారాలు, రీతులు , జాతీయాలు, తెనుగు నుడికారాలతో ఈ కావ్యరచన చాల చక్కగా సాగింది . స్థాలీ పులాక న్యాయంగా కొన్ని పరిశీలిద్దాం .

వివేకానందుని జననం, జనన సాఫల్యం  కవి ఎంత చక్కగా వర్ణించారో చూడండి .

 

బాలభాస్కరు పగిదిగ భారతాన

 వెల్గులీనగ నల్దెసల్ విజ్ఞుడనగ

తొలగి చీకటి జాతికి తోడుకాగ

జాతి రత్నము ప్రభవించె జగతి యందు.

 

ఆయనను అజ్ఞానాంధకారాన్ని రూపుమాపే సూర్యునిగ వర్ణించి  అవతార ప్రయోజనాన్ని సూచన ప్రాయంగా తెలియజేయడం కవి ప్రతిభకు నిదర్శనం .  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నవిధాన నరేంద్రుడు చిన్నతనం నుండి చురుకుగాను, దానశీలిగాను , జీవకారుణ్య౦ కలిగిన వ్యక్తిగాను , ఏకసంధాగ్రాహిగాను, ఆధ్యాత్మికచింతనపరునిగాను, అంధ విశ్వాసాల్ని ఖండించే హేతువాదిగాను రచయిత వర్ణించారు . రామకృష్ణుని ఉపదేశం వలన నరేంద్రుడు పొందిన అనుభూతిని కవి ఎంత రమణీయ౦గా వర్ణి౦చారో పరికించండి .

లోకము చీకటాయె పరలోకము తోడుత నేకమాయె ము

ల్లోకములెల్ల బాసి మదిలో జనులందరి వీడు మాడ్కి న

న్నీకడ బంది జేసెదర?నిక్కము దెల్పుడు స్వామివర్య! నా

కాకడ తల్లిదండ్రులును నక్కయు(దమ్ములునెల్లరుండగన్(పద్యం -41)

రామకృష్ణుడు నరేంద్రుకు బోధలు చేస్తూ, గురుశుశ్రూష , మక్రోధాదిఅరిషడ్వర్గాన్ని

జయించాలని, ఫలితం ఆశి౦చకుండా  పనిచెయ్యాలని, పరకా౦తలపట్ల మాతృభావాన్ని ప్రదర్శిస్తూ మసలు కోవాలని , పరద్రవ్యాన్ని ఆశి౦చకూడదని,  సకలజనులను ప్రేమిస్తూ, దీనజనులను సేవిస్తూ, జీవితం సార్ధకం చేసుకోవాలని చేసిన ఉపదేశాలు   ఆధ్యాత్మిక శిష్యులెల్లరకు శిరోధార్యాలు , హృద్యాలు, నిరవద్యాలు ,  ఆచరణ సాధ్యాలున్ను .

    స్వామి భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల గొప్పదనం ప్రపంచానికి, చాటి చెప్పడానికి మొట్ట మొదటిసారిగా చికాగో నగరానికి వెళ్ళినప్పుడు ఆయన గొప్పదనం తెలియక ఎవరు ఆదరించలేదు.  ఆ సమయంలో ఆ మహనీయుడను భవించిన కష్టాలు చదివితేనే చాలు కన్నులు చెమరుస్తాయి.

కలవారి యిండ్లలో కాలూను స్థితి లేక

               నత్యంత క్షుద్బాధ ననువించి.

ధూళిదూసరితమ్ముతో దోచు దేహాన

               నుమ్మినూయగ దుష్టులిమ్ముగాను

కొందఱు దూషింపనెందఱో తలుపులన్

             బిగియించి పొమ్మని నిగిడి తిట్ట

హృదయకంపనమున్ సహింప లేకను దాను                  

             నాయాసభరమున నడుగు నొకటి

వేయజాలక ముందుకు వేగిరమ్ము

             భరతవేదాంతనిధి పెనుభారమునను

దిక్కులేకను దైవమ్ము దిక్కు జూచి

              కూలె  గాలివానకు చెట్టు కూలి నట్టు. (1౦8)       

అంటూ స్వామిని భరతవేదాంతనిధిగా వర్ణించడం చాల మనోజ్ఞంగా  ఉంది.

వీరు అమెరికా సోదర సోదరీ మణులార! అని ప్రారంభించి చేసిన బోధలను కవి  

చాల సంగ్రహంగా వర్ణించారు. వేదాంతం అనేది సర్వ ధర్మాలలోను గొప్పదని మనిషి సత్యవాక్కులతో, చిత్తశాంతితో , ఆత్మ సంశోధన చెయ్యాలని, ప్రార్థనలు , కర్మలు  చిత్తశుద్ధికి తోట్పడతాయని, ఆత్మజ్ఞానమే అసలైన జ్ఞానమని, మానవులు హెచ్చుతగ్గులు , భేదాల రొచ్చు వదలి, దీనజన పోషణనమే దీక్షగా స్వీకరించాలని, సనాతన హిందూ ధర్మమే లోకకళ్యాణానికి బంగారు బాటలు వేస్తుందని అనర్గళంగా ఆంగ్లభాషలో ప్రసంగించారు.  ఉపన్యాసానికి ముందు ఆయనను హేళన చేసిన వారే ఉపన్యాసం విని మిన్నంటే హర్ష ధ్వానాలు చేశారు.     కొంతమంది    కుహనా మేధావులు తలలు వంచుకున్నారు.

ఆ తరువాత ఆయనకు సకల దేశాలు స్వాగతం పలికాయి. ఆయన వారి ఆహ్వానాన్ని స్వీకరించి సనాతన భారతీయ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశారు. భారతమాత ముద్దుబిడ్డడైన వివేకానందునకు యావద్భారతం చాల ఋణ పడి ఉంది. ఇది ఋషి ఋణం . ఈ ఋణం తీరాలంటే మనమంతా ఆయన బోధలను ఆచరణలో పెట్టాలి.

ఇంకా ఈ కావ్యంలో ఎన్నో విషయాలున్నాయి . వ్యాస విస్తర భీతితో విడుచుచుంటి. మొత్తం మీద ఈ కావ్యం ఆధ్యాత్మిక విషయాలకు, కావ్య విశేషాలకు నిలయం . ఈ గ్రంథాన్ని రచించిన శనగపల్లి సుబ్బారావుగారు  కవిగా కృతార్థులయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి మరెన్నో కావ్యాలు వీరి కలం నుండి వెలువడాలని, ఆ శక్తి యుక్తులు భగవంతుడు వారికనుగ్రహించాలని కోరుకుంటున్నాను.

జయంతి తే సుకృతిన: రససిద్దా: కవీశ్వరా: .

                              స్వస్తి.