Friday, August 5, 2022

శనగపల్లి వారి వివేకానందుడు (కావ్యసమీక్ష)

 

            శనగపల్లి వారి  వివేకానందుడు

(కావ్యసమీక్ష)

Dr. Chilakamarthi. Durgaprasada Rao

3/106, Premnagar, Dayalbagh, Agra.

9897959425

dr.cdprao@gmail.com


స్వామి వివేకానంద అనే పద్య కావ్యాన్ని  శ్రీ శనగపల్లి సుబ్బారావు గారు రచించారు. ఈయన ఒంగోలు వాస్తవ్యులు. బహు భాషాకోవిదులు,  బహు గ్రంథకర్త , కవి, విమర్శకులు , గ్రంథాలయోద్యమసేవానిరతులు, సాంఘిక సాంస్కృతిక సేవాభిలాషి. ఈయన ఆంధ్ర , ఆంగ్ల , హిందీ భాషలలో ప్రవీణులు. వారు ఈ కావ్యాన్ని శ్రీ వెలగా. వెంకటప్పయ్యగార్కి అంకితం చేశారు. స్వామి వివేకానంద  151 పద్యాలతో కూడిన రసవత్తర మైన  ఖండకావ్యం.  ఈ కావ్యం యొక్క ప్రథమ ముద్రణ ప్రతులన్నీ ఆనతి కాలంలోనే అయిపోయాయి. మరల రెండవ పర్యాయం ఈ కావ్యాన్ని ముద్రించారు. ఈ గ్రంథం  రాసిలో చిన్నదైనా వాసిలో మిన్న.  పండిత ప్రకాండులు  (తెలుగు శాఖాధ్యక్షులు సి.యస్ .ఆర్ శర్మ కళాశాల , ఒంగోలు) శ్రీ యుతులు మల్లెల వేoకట సుబ్రహ్మణ్య శర్మగారు, మధురకవి మల్లవరపు జాన్ గారు, విద్యావాచస్పతి, మహామహోపాధ్యాయ , సాహిత్యాచార్య , మహాకవి మార్తాండ, వేదాంత పారీణ, కళాప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీ శివశంకర స్వామీజీ, శ్రీ ఈమని దయానంద, శ్రీ గొల్లపూడి ప్రకాశరావు వంటి మహామహుల అభినందనలు, ఆశీస్సులను అందుకున్న గొప్ప కావ్యం .  కవి, వివేకానందుని జననం మొదలుకొని నిర్యాణం వరకు గల అన్ని సన్నివేశాలు ఇందులో  రసవత్తరంగా పొందుపరిచారు. 

ఈ కావ్యం రెండు భాగాలుగా విభజింపబడింది. మొదటిభాగంలో వివేకానందుని పుట్టుక, బాల్యం , గురుసమాగమం , గురుబోధ, విద్యాభ్యాసం , తండ్రి మృతి , కుటుంబంలో ఇక్కట్లు , కాళీ మాతను ప్రార్థించడం, రామకృష్ణుని ఆలోచన , గురుదేవుని నిర్యాణం , వివేకానందుని దేశపర్యటన మొదలైన అంశాలు కవి వర్ణించారు.  రెండవభాగంలో స్వామి విదేశపర్యటన, పునరాగమనం , మఠస్థాపన , మరోపర్యాయం విదేశాలకు వెళ్ళడం, తిరిగి రావడం , తల్లి కోరిక , అంత్య ప్రార్థన , నిర్యాణం మొ|| అంశాలు చక్కగా వర్ణించారు కవి. ఈ కావ్యం గణబద్ధం , కావ్యగుణబద్ధం కూడా. ఎన్నో అలంకారాలు, రీతులు , జాతీయాలు, తెనుగు నుడికారాలతో ఈ కావ్యరచన చాల చక్కగా సాగింది . స్థాలీ పులాక న్యాయంగా కొన్ని పరిశీలిద్దాం .

వివేకానందుని జననం, జనన సాఫల్యం  కవి ఎంత చక్కగా వర్ణించారో చూడండి .

 

బాలభాస్కరు పగిదిగ భారతాన

 వెల్గులీనగ నల్దెసల్ విజ్ఞుడనగ

తొలగి చీకటి జాతికి తోడుకాగ

జాతి రత్నము ప్రభవించె జగతి యందు.

 

ఆయనను అజ్ఞానాంధకారాన్ని రూపుమాపే సూర్యునిగ వర్ణించి  అవతార ప్రయోజనాన్ని సూచన ప్రాయంగా తెలియజేయడం కవి ప్రతిభకు నిదర్శనం .  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నవిధాన నరేంద్రుడు చిన్నతనం నుండి చురుకుగాను, దానశీలిగాను , జీవకారుణ్య౦ కలిగిన వ్యక్తిగాను , ఏకసంధాగ్రాహిగాను, ఆధ్యాత్మికచింతనపరునిగాను, అంధ విశ్వాసాల్ని ఖండించే హేతువాదిగాను రచయిత వర్ణించారు . రామకృష్ణుని ఉపదేశం వలన నరేంద్రుడు పొందిన అనుభూతిని కవి ఎంత రమణీయ౦గా వర్ణి౦చారో పరికించండి .

లోకము చీకటాయె పరలోకము తోడుత నేకమాయె ము

ల్లోకములెల్ల బాసి మదిలో జనులందరి వీడు మాడ్కి న

న్నీకడ బంది జేసెదర?నిక్కము దెల్పుడు స్వామివర్య! నా

కాకడ తల్లిదండ్రులును నక్కయు(దమ్ములునెల్లరుండగన్(పద్యం -41)

రామకృష్ణుడు నరేంద్రుకు బోధలు చేస్తూ, గురుశుశ్రూష , మక్రోధాదిఅరిషడ్వర్గాన్ని

జయించాలని, ఫలితం ఆశి౦చకుండా  పనిచెయ్యాలని, పరకా౦తలపట్ల మాతృభావాన్ని ప్రదర్శిస్తూ మసలు కోవాలని , పరద్రవ్యాన్ని ఆశి౦చకూడదని,  సకలజనులను ప్రేమిస్తూ, దీనజనులను సేవిస్తూ, జీవితం సార్ధకం చేసుకోవాలని చేసిన ఉపదేశాలు   ఆధ్యాత్మిక శిష్యులెల్లరకు శిరోధార్యాలు , హృద్యాలు, నిరవద్యాలు ,  ఆచరణ సాధ్యాలున్ను .

    స్వామి భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల గొప్పదనం ప్రపంచానికి, చాటి చెప్పడానికి మొట్ట మొదటిసారిగా చికాగో నగరానికి వెళ్ళినప్పుడు ఆయన గొప్పదనం తెలియక ఎవరు ఆదరించలేదు.  ఆ సమయంలో ఆ మహనీయుడను భవించిన కష్టాలు చదివితేనే చాలు కన్నులు చెమరుస్తాయి.

కలవారి యిండ్లలో కాలూను స్థితి లేక

               నత్యంత క్షుద్బాధ ననువించి.

ధూళిదూసరితమ్ముతో దోచు దేహాన

               నుమ్మినూయగ దుష్టులిమ్ముగాను

కొందఱు దూషింపనెందఱో తలుపులన్

             బిగియించి పొమ్మని నిగిడి తిట్ట

హృదయకంపనమున్ సహింప లేకను దాను                  

             నాయాసభరమున నడుగు నొకటి

వేయజాలక ముందుకు వేగిరమ్ము

             భరతవేదాంతనిధి పెనుభారమునను

దిక్కులేకను దైవమ్ము దిక్కు జూచి

              కూలె  గాలివానకు చెట్టు కూలి నట్టు. (1౦8)       

అంటూ స్వామిని భరతవేదాంతనిధిగా వర్ణించడం చాల మనోజ్ఞంగా  ఉంది.

వీరు అమెరికా సోదర సోదరీ మణులార! అని ప్రారంభించి చేసిన బోధలను కవి  

చాల సంగ్రహంగా వర్ణించారు. వేదాంతం అనేది సర్వ ధర్మాలలోను గొప్పదని మనిషి సత్యవాక్కులతో, చిత్తశాంతితో , ఆత్మ సంశోధన చెయ్యాలని, ప్రార్థనలు , కర్మలు  చిత్తశుద్ధికి తోట్పడతాయని, ఆత్మజ్ఞానమే అసలైన జ్ఞానమని, మానవులు హెచ్చుతగ్గులు , భేదాల రొచ్చు వదలి, దీనజన పోషణనమే దీక్షగా స్వీకరించాలని, సనాతన హిందూ ధర్మమే లోకకళ్యాణానికి బంగారు బాటలు వేస్తుందని అనర్గళంగా ఆంగ్లభాషలో ప్రసంగించారు.  ఉపన్యాసానికి ముందు ఆయనను హేళన చేసిన వారే ఉపన్యాసం విని మిన్నంటే హర్ష ధ్వానాలు చేశారు.     కొంతమంది    కుహనా మేధావులు తలలు వంచుకున్నారు.

ఆ తరువాత ఆయనకు సకల దేశాలు స్వాగతం పలికాయి. ఆయన వారి ఆహ్వానాన్ని స్వీకరించి సనాతన భారతీయ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశారు. భారతమాత ముద్దుబిడ్డడైన వివేకానందునకు యావద్భారతం చాల ఋణ పడి ఉంది. ఇది ఋషి ఋణం . ఈ ఋణం తీరాలంటే మనమంతా ఆయన బోధలను ఆచరణలో పెట్టాలి.

ఇంకా ఈ కావ్యంలో ఎన్నో విషయాలున్నాయి . వ్యాస విస్తర భీతితో విడుచుచుంటి. మొత్తం మీద ఈ కావ్యం ఆధ్యాత్మిక విషయాలకు, కావ్య విశేషాలకు నిలయం . ఈ గ్రంథాన్ని రచించిన శనగపల్లి సుబ్బారావుగారు  కవిగా కృతార్థులయ్యారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి మరెన్నో కావ్యాలు వీరి కలం నుండి వెలువడాలని, ఆ శక్తి యుక్తులు భగవంతుడు వారికనుగ్రహించాలని కోరుకుంటున్నాను.

జయంతి తే సుకృతిన: రససిద్దా: కవీశ్వరా: .

                              స్వస్తి.

 

 

 

 

 

  

No comments: