కవితలపల్లకి
(కవితా సంపుటి)
రచయిత: శ్రీ వోలేటి నరసింహారావు
అభినందన మందారమాల
Dr. Chilakamarthi DurgaprasadaRao,
3/106, Premnagar, Dayalbagh, Agra.
ఉదయంతు శతాదిత్యా: ఉదయంత్విందవశ్శతం
న వినా కవివాక్యేన నశ్యత్యాభ్యంతరం తమ:
అన్నారు మన పెద్దలు . వందలకొలది సూర్యబింబాలుదయించొచ్చు, వందలకొలది చంద్రబింబాలుదయించొచ్చు. కానీ మానవుని హృదయాంతరాళాల్లో దాగిన అజ్ఞానమనే చీకటి కవి మాటలవల్ల మాత్రమే తొలగుతుంది. మరో మార్గం లేదు. అంటే వందలకొలదీ సూర్యచంద్రులు చెయ్యలేని పని కవి తన కలం(సిరాబొట్టు)తో సాధిస్తాడు . అందుకేనేమో A drop of ink makes a hundred million think అన్నారు . సాధారణంగా కవి తలలో ఉన్న భావాలే కవితలరూపంలో బయటికొస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక శ్రీ వోలేటి. నరసింహారావుగారు ఆధునిక కవులలో ఒకరు. ఈయన ప్రముఖ హోమియోవైద్యుల్లో కూడ ఒకరు. అటు మందుల ద్వారా మనుషుల శారీరక అనారోగ్యాన్ని , ఇటు కవితల ద్వారా మానసిక మాలిన్యాన్ని తొలగించగల సవ్యసాచి.
శ్రీ వోలేటివారి వంశం సాహిత్యరంగంలోను , కవితారంగంలోను ఎంతో ప్రసిద్ధి వహించిందనే సంగతి సాహిత్యలోకానికంతా తెలిసిందే . జంట కవులుగా ప్రసిద్ధిపొంది, ఆంధ్ర దేశాన్ని రసప్లావితం చేసిన వేoకటపార్వతీశ్వరకవులో శ్రీ వోలేటి పార్వతీశంగారొకరు, రెండవ వారు శ్రీ బాలాంత్రపు వేoకటరావు గారు . వారిరువురు తమ కవితా సౌరభాలతో అఖిలాంధ్రదేశాన్ని ఉర్రూతలూగించారు. . ‘అచట పుట్టిన చిగుఱురుకొమ్మైన చేవ’ అన్నట్లుగా ఆ వంశంలో జన్మిచిన నరసింహారావుగారు రసవత్తరమైన ఎన్నో కవితాఖండికలను సాహిత్యలోకానికందించడం తెలుగువారికందిన మరో అదృష్టం. వీరు తెలుగులోనే కాక ఆంగ్ల, హిందీభాషల్లో కూడ మరెన్నో కవితలను వెలయించారు. ఈయన సాహిత్యకృషి ఒక ఎత్తైతే హోమియోవైద్యశాస్త్రంలో వీరు రచించి ముద్రించిన గ్రంథాలు మరో ఎత్తు .
ఇక వీరి కవితాస్రవంతిలో ‘మేలు కొనుమా’ ‘జ్ఞాన భండారం’ ‘తపన’ , ‘ప్రేమ’ ‘ఉద్యమం’, 1991, మామగారి ఆకస్మికమరణం, పొదుపు, వారసత్వం, బాలల ఆవేదన, ఆరతి, నా ఎద ఒక గుడి, ఆత్మార్పణం, బాల్యం , ఓ యువత , వసంతకోయిల , సేవ, వారసత్వం, వాస్తవమ్ము, విరహం, శేషప్రశ్న , ప్రేయసి, నేను నిన్ను తల చాక, చందమామలో మచ్చ, ఆటం బాంబు శాంతి ఆత్మలోశాoతి, ప్రణయమనేది ఒకవిత్తు, మొదలైన శీర్షికలతో కవితలు కనిపిస్తున్నాయ్. ప్రాచీన కవితారీతులకు సంబంధించిన గణబద్ధమైన, కవితాగుణబద్ధమైన రచనలు కూడ కనిపిస్తున్నాయి.
స్థాలీపులాక న్యాయంగా కొన్ని కవితలు పరిశీలిద్దాం .
1. ‘మేలుకోనుమా’ అనే కవితాఖండికలో సంతులవాణి ప్రకటమైoదని, శక్తిహీనులైన జీవులకు నిజమైన భక్తిద్వారాలు తెరుచుకున్నాయని, మేలుకొమ్మని హితబోధ చేశారు.
2. “జ్ఞాన భాండారం “ అనే కవితలో సంసారసుఖంకోసం పశువులా ప్రవర్తిం చవద్దని, నీలోదాగియున్న ఆత్మసుఖాన్ని మేల్కొల్పి ఫలితం పొందమని ఉద్బోధించారు.
“ఆత్మజ్ఞానం పొంది పరమాత్మ దర్శించు నరజన్మమందుకే నరుడా!” అని స్పష్టం చేశారు.
చైతన్యరహితమైన వస్తువులు శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేవని ఆత్మసుఖమే గొ ప్పసుఖమని అది సద్గురువు అనుగ్రహం వల్లనే కలుగుతుందని స్పష్టం చేశారు.
3. ‘తపన’ అనే ఖండికలో తాను వట్టి కోరికల పుట్టనని తనకు దర్శనభాగ్యం కలగ జెయ్యమని భగవంతునకు మొరపెట్టు కున్నారు.
4. ‘ప్రేమ’ అనే కవితలో ప్రేమ విశ్వానికి కేంద్ర బిందువని, అది దివ్యమైనదని, అదే సత్యమని చెప్పడం ద్వారా ప్రేమయెక్క గొప్పదనాన్ని చాటి చెప్పేరు.
5. ఉద్యమం అనే కవితలో మనిషి ప్రయత్నం చేస్తే ఎన్ని అడ్డంకులైనా అధిగమించి లక్ష్యం చేరుకోగలడని ఎన్ని ఆటంకాలెదురైనా ప్రయత్నం మానకుడదని “పడుతూ లేస్తూ ఉన్నా ప్రయత్నం మానకు” అని హితం చెప్పారు. .
6. మరో కవితలో “జననం నీది కాదు మృత్యువు నీది కాదు మధ్యస్థ జీవితం మాత్రం నీదని “ చెబుతూ నీ జీవన దృక్పథానికి ప్రేమ ఓజస్సు కావాలని ప్రేమను జీవన సౌoదర్యహేతువుగా వర్ణించారు.
రచయిత రాధాస్వామి సంప్రదాయాను యాయి కావడం వల్ల ఆ సిద్ధాంత సారాంశాన్ని ఒక మాటలో వివరిస్తూ “దొరకె నీకు నరశరీరము, స్వామి యిలలో వెలసి యుండగ’ అనే మాటల్లో సంక్షిప్తంగా మానవుడే మోక్షార్హుడని , సద్గురువే మోక్షప్రదాతయని స్పష్టం చేశారు.
7. ఒక ఖండికలో “నా కులము మిన్నని
టెక్కు చేసెదవు నేడు పోయిన
రేపు రెండు
నిన్ను తలచు వారెవరురా” అని కులదురభిమానాన్ని మృదువుగా దుయ్యబట్టారు.
‘పొదుపు’ అనే కవితలో పొదుపు చెయ్యడం సౌభాగ్యానికి , వ్యర్థం అనర్థానికి దారి తీస్తుందని వివరించారు.
‘వారసత్వం’ అనే కవితలో ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వాన్ని
మన సంస్కృతిగా అభివర్ణించారు.
‘బాలల ఆవేదన’ అనే ఖండికలో బాలలను జాతిప్రగతికి ముఖ్యులుగా వర్ణించారు. అతి ప్రేమ మాకొద్దండీ, అతి క్రోధం భరించ లేమండి , తగు శ్రద్ధనే చూపండి.
ప్రేమముర్తులుగా నిలపండి అని పిల్లలే పెద్దలకు హితబోధ చెయ్యడం ఈ కవితలో విశేషం .
‘ఆరతి’ అనే ఖండికలో భక్తి అనే వత్తితో ప్రేమ అనే జ్యోతిని వెలిగించాలని హితం పలికారు.
‘నా ఎద ఒక గుడి’ అనే ఖండికలో ప్రేమ జీవకోటిని పెరగనిస్తుందని ద్వేషం జీవకోటిని తెగటారుస్తుందని ద్వేషాగ్ని తెగటార్చి ప్రేమాగ్నిని రగుల్కొల్పమని హెచ్చ రించారు.
‘ఆత్మార్పణం’లో లోకోపకారం కోసం ఆత్మార్పణ చేసుకునే మబ్బుల్ని మహాత్ముల హృదయాలతో పోల్చడం కవి ప్రతిభకు ఒక నిదర్శనం.
మేఘం వర్షంతో కరుగుతుంది మహాత్ముడు దయావర్షంతో కరిగిపోతాడని వర్ణించారు. ‘బాల్యం’ అనే కవితలో ‘బాల్యమా! బాల్యమా! ఒక సారి తిరిగిరా
అంటు బాల్యాన్ని హద్దులులేని ఆకాశాగంగతో పోల్చడం మనోజ్ఞమైన భావన.
‘యువత’ అనే కవితలో యువత పురోగమనానికి యోగ్యతాపత్రమని చెప్పడం చాల బాగుంది. ‘వసంతకోయిల’లో వసంతానికి కోయిలకు అవినాభావాన్ని చెప్పడం సొగసుగా ఉంది.
‘సేవ’ అనే కవితలో సేవ కర్మఫలాన్ని విచ్ఛిన్నం చేసి భగవంతుని దరికి చేరుస్తుందని ఉద్బోధించారు. వారసత్వం
సేవఅనే కవితలో “ఉషారుగా ఉండవలసిన వయస్సులో
ఉసూరుమంటూఉంటావెందుకు ?
నిషా కావలసిన వయస్సులో
విషాదాన్ని పాతరెయ్యి అనే మాటలు;
చిక్కని ఇక్కట్ల వడిలో
చేజారిన ముచ్చట్ల ఒరిపిడిలో
జీవిత చరమాంకపు బడిలో
బాల్యజీవితపు ఓనమాలు
దిద్దుకోవాలనుంది
బాల్యమా ఒక్కసారి తిరిగిరా. అంటారు.
ఇలాగే ప్రతి కవిత ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇంతటి ప్రతిభాపాటవాలున్న వీరు సామాన్య వ్యక్తిగా మనమందు మసలడం చూస్తే “కొండ అద్దమందు కొంచెమై యుండదా! “ అన్న మన వేమన్న మాట అక్షరాల నిజమనిపిస్తుంది. వీరి కలం నుంచి మరెన్నో సమాజహితమైన కవితలు వెలువడాలని ఆ నేర్పును , ఓర్పును, కూర్పును వారికి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ నా మనసులోని ఈ నాలుగుమాటలు చెప్పే అవకాశాన్ని నాకు కల్పించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ......
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
9897959425.