అభినందనమందారమాల
ఉదయంతు శతాదిత్యా: ఉదయంత్వి౦దవశ్శతం
న వినా కవివాక్యేన నశ్యత్యాభ్యంతరం తమ:
వందమంది సూర్యులు ఉదయి౦చు గాక, వందమంది చంద్రులు ఉదయి౦చు గాక, మనిషి
హృదయా౦రాళాల్లో దాగిన అజ్ఞానం కవి మాటల వల్ల మాత్రమే తొలగిపోతుంది, ఇంకో మార్గం
లేదు. కవి పలుకులకు అంతటి శక్తి ఉంది. కవి సమాజంలో నెలకొన్న అజ్ఞానాన్ని
తొలగించడానికి తన ఆలోచనల్ని అక్షరబద్ధం చేసి ఆయుధంగా ఉపయోగిస్తాడు. అవి
సమాజాన్ని ఆలోచి౦చేలా చేస్తాయి. ఆ పని కవి మాత్రమే చేయగలడు. మరొకరికి సాధ్యం కాదు
. ఎందుకంటే కవి కలంనుంచి జాలువారిన ఒక్క సిరాచుక్క కొన్ని లక్షల మందిని
ఆలోచించేలా చేస్తుంది. ఆంగ్లమహాకవి
బైరన్ మాటల్లో చెప్పాలంటే.
But words are
things; and a small drop of ink
Falling, like dew
upon a thought, produces
That which makes thousands,
perhaps millions think.
(Byron-Don Juan, canto III, st.88)
అందువల్ల సమాజాన్ని కవి మాత్రమే మార్చగలడు.
అతనికి సాధ్యం కాని దేదీ లేదు .
“ఈ వ్యవస్థ మారదనే వాదానికి తావు లేదు, రాక్షసవృక్షం సైతం రంపానికి లొంగుతుంది”
అంటారొక ఆధునిక కవి.
ఇక సాహిత్యప్రక్రియల్లో శతకప్రక్రియ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్షరాల్ని
పొదుపుగా వాడుకుంటూ చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెప్పే సౌలభ్యం ఇందులో ఉంది.
అంతే గాక తిక్కన వంటి ఎంతో మంది మహాకవులు ముందుగా శతకరచనను చేపట్టి కవిగా
పేరుతెచ్చుకుని ఆపై కావ్యాలను వెలయించిన వారే.
ఆధునిక కాలంలో భక్తిజ్ఞానవైరాగ్యాలను ప్రబోధించే ఎన్నో శతకాలు వెలువడు తున్నాయి
. అటువంటి శతకాల్లో ‘శ్రీ కాడుమల్లేశ్వరశతకం’ ఒకటి. కవి ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యం గారు.
ఈయన విజ్ఞానశాస్త్రంలో ప్రఖ్యాతి గాంచిన మహా మనీషి. వీరు, మా గురుదేవులైన శ్రీ వేదుల
సుందరరామశాస్త్రిగారి కుమారులు. శ్రీ వేదుల సందరరామశాస్త్రి గారు విశ్వ విఖ్యాత
వ్యాకరణశాస్త్రపండితులు శ్రీ తాతా రాయుడు శాస్త్రి గారి అంతేవాసి. భాష్యాంతవైయాకరణి
, ఉత్తమఅధ్యాపకులు, కవి, పండితులు, బహుగ్రంథకర్త. ఇక సుబ్రహ్మణ్యం గారి విషయానికొస్తే
ఇంతటి కవితాశక్తి వీరికి ఎలా అబ్బి౦దనేది అందరికి ఆశ్చర్య౦ కలిగించే విషయమే.
శ్రీ సుందరరామ శాస్త్రి గారి కుమారులుగా జన్మించడం, వారినుండి సాహితీ వారసత్వం
పొందడం ఒక కారణమైతే ‘చతురకవిత్వతత్త్వపటుసంపద ఒక్కరి సొమ్ము గాదు భారతి
దయ’ అన్న కనుపర్తి అబ్బయామాత్యుని పలుకులు మరొక కారణం కావచ్చు. అంతేగాక
కవితాకన్య ముక్తికా౦త ఎవరినెప్పుడు వరిస్తారో ఎవరికీ తెలియదు. ఈ గ్రంథానికి మరో
విశేషముంది. ఇది రెండవ సంపుటం. స్తోత్రప్రియుడైన ఆ కాడు మల్లేశ్వరస్వామియే మరోసారి
ఈ శతకాన్ని
కోరి వ్రాయి౦చుకున్నట్లుగా తోస్తుంది.
ఛందోబద్ధములైన
పద్యసుమముల్ సంసేవనా చిత్తమున్
ముందుంచన్ జని నిన్ను దేవళమునన్ మ్రొక్కంగ నేబోవ నా
యందున్ కల్గె వినూత్న భావమొక దివ్యాదేశమై యొప్పి నా
కందెన్ నేను మరిన్ని పద్యములు వ్రాయన్ కాడుమల్లేశ్వరా
! 3
మొదటి వంద పద్యాలకు తనివి తీరక మరల మరల ఈయన స్తుతులు వినాలనే కోరికతో ఈ
రచనకు పురిగొల్పడం బట్టి చూస్తే ఆ స్వామికి ఈ భక్తునిపై ఎంత దయ, వాత్సల్యాలు
ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. రచయిత స్వయంగా ఈవిషయాన్ని ప్రస్తావించడ౦
గమనార్హం.
సాధారణంగా ప్రతి రచనలోను కవిహృదయం ఎంతో కొంత ప్రతిఫలిస్తుంది. ఇక శతకరచన
మాటకొస్తే నూటికి నూరుపాళ్ళు కవిహృదయం ప్రతి ఫలిస్తుందనడంలో ఎటువంటి సందేహం
లేదు. కవి భక్తి జ్ఞాన వైరాగ్య భావాలను వెదజల్లడంతో బాటుగా సమకాలీన సమస్యలను, ఆ
సమస్యలకు పరిష్కార ముద్రను కూడ సూచించారు.
భగవంతుడొక్కడే అని ఆయన్ని అనేక పేర్లతో వ్యవహరిస్తున్నారని ఏకం సద్విప్రా: బహుదా
వదంతి అని ఋగ్వేదం ఘోషిస్తోంది. ఆ వైదిక భావాన్ని చాల అందంగా ఈ క్రింది పద్యంలో
పొందుపరచి మతసామరస్యానికి మంచి మార్గం ఏర్పరిచారు.
నీవే రాముడ వీవె
కృష్ణుడనగ న్నిన్నీశు డంద్రందరున్
నీవే
బుద్ధుడ వీవె సాయివి మరి న్నీవే గదా యేసువున్!
నీవే
యొక్కడ విందరన్న నిజము న్నేనాడు గుర్తింతురో!
నీవే సర్వమనంగ కొల్తును
సదా నిన్ కాడుమల్లేశ్వరా ! 40
దేశ క్షేమానికై తను మన ప్రాణాల్ని అర్పిస్తున్న జవానుల సేవల్ని స్తుతిస్తూ వారు కర్తవ్య విధిలో
మరణిస్తే వారికి ముక్తి ప్రసాదింపుమని కోరడం వీరి దేశభక్తికి ఒక మంచి ఉదాహరణ.
దేశక్షేమము గోరి
రక్షణ విధిన్ ధ్యేయంబుగా నిల్పి తా
లేశంబైనను
ప్రాణభీతి యనగన్ లేకుండగా శత్రులన్
దేశంబావల
తర్మిగొట్టి తన యాధిక్యమ్ము కర్తవ్యమున్
సౌశీల్యంబును చాటు యోధునకిదే ‘జై’ కాడు
మల్లేశ్వరా ! 15
స్వజనంబెల్లర దూరముంచియు మహాసంగ్రామముల్
పోరి దే
శ జనక్షేమము
గోరి ముందుజని నిస్స్వార్ధంబుగా పోరియున్
నిజ
కర్తవ్యము నిర్వహించు విధిలో నీ సన్నిధిన్ జేరగా
విజయంబొందిన కీర్తి సద్గతుల నీవే కాడు మల్లేశ్వరా
! 16
ఈ లోకంలో హింసా ప్రవృత్తితో పేట్రేగి పోతున్న దుష్టులనుపేక్షిం పవలదని వారిని
భస్మీపటలం చెయ్యమని శివునితో మొరపెట్టు కొన్న ఈ పద్యం ఎంతో హృదయంగమంగా
ఉంది.
కైలాసంబున
వాసముండి జగతిన్ కాలాగ్నిరుద్రుండవై
యేలా
యూరక నుందు వయ్య తగునే యింకన్నుపేక్షింప! నీ
ఫాలాగ్నిన్
రగిలించి భస్మమొనరింపన్ జెల్లు హింసాత్ములన్
జాలింజూపగ
పాత్రులౌదురె గిరీశా! కాడుమల్లేశ్వరా ! 14
మాతృభాషలో విద్యను బోధించడం వల్ల చాల ప్రయోజనాలున్నాయని, అదే వాక్సతికి నిజమైన
సేవ అని ప్రకటి౦చే ఈ పద్యం వారికి మాతృ భాషపట్ల వారికి గల అపారమైన ప్రేమను
సూచిస్తోంది.
మంచిన్
బెంచుచు మాతృభాషను సుసంపన్నంబు గావించి నీ
పంచన్
చేరిన పిల్లలందరకు నీ భాషన్ ప్రబోధించి సే
వించ
న్నేర్పుచు నోర్పుతో సుజనతన్ వేనోళ్ళ బోధించి ప్రే
మించన్
వాక్సతి గొల్చు భాగ్యమదె సుమ్మీ కాడుమల్లేశ్వరా !
43
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వృద్దాశ్రమాలకు తోలెయ్యకుండా ఇంటిలోనే వారిని ఉంచుకొని
ప్రేమతో చూడడం ఉత్తమమైన ధర్మమని దాన్ని మించిన ధర్మం మరొక్కటి లేదని ఆ విధంగా
ఆచరించే వాడే ధన్యుడని చెప్పినపద్యం నేటి సమాజానికి ఎంతో కనువిప్పు
కలగజేస్తుంది.
వృద్ధాప్యంబున
తల్లిదండ్రులను సేవింపంగ లేమంచు నా
పద్ధర్మంబుగ
వేరె యాశ్రమములం బంపంగ యోచించియున్
సద్ధర్మంబు
స్ఫురింపగా తనదు స్వస్థానంబు నన్నుంచి తా
శ్రద్ధన్ జూపిన వాడు ధన్యుడు గిరీశా! కాడుమల్లేశ్వరా ! 12
దేశం సుసంపన్నం కావాలంటే ద్వేషం ,అసూయ,క్రోధం మొదలైన దుర్గుణాలు విడనాడాలని
ఈ జగత్తులో ఉండే జనులలో ఆదుర్గుణాలు లేకుండా చెయ్యమని వేడుకుంటున్న ఈ పద్యం
చాల హృద్యంగా ఉంది.
జగతిన్
ద్వేషమసూయక్రోధములు సంజాతమ్ములై యుండగన్
ప్రగతిన్
పొందగ నౌనె! దేశము సుసంపన్నంబు గానౌనె! కా
దుగదా!
కూడని చర్యలన్ కుటిల విద్రోహప్రయత్నంబులున్
జగమందెల్ల హరించి గావుమము నీశా! కాడుమల్లేశ్వరా ! 33
కవి సందర్భానుసారంగా ఎన్నో జాతీయాలను, నుడికారాలను ప్రయోగించారు. ఇవన్నీ ఆయన
భాషా పటిమకు నిదర్శనాలు. తలతాకట్టు , కప్పల్తక్కెడ, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు
, నివురు గప్పిన నిప్పు మొదలైన ప్రయోగాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ప్రతి పద్యం ఉక్తి
వైచిత్రితో ఒక ప్రత్యేకమైన సౌందర్యాన్ని సంతరించుకుంది. కవి ఎన్నో సామాజిక అంశాలమీద
తమ దృష్టిని సారించడం వల్ల వైవిధ్యం గోచరిస్తోంది. ప్రతి సామాజిక దురాచారాన్ని తీవ్రంగా
ఖండించడం వల్ల నైశిత్యం కనిపిస్తోంది. ప్రతి పద్యంలోను నేడు సమాజంలో దిగజారుతున్న
విలువలపట్ల ఆయన పొందిన మనస్తాపం ప్రతిబింబిస్తోంది. సూచించిన పరిష్కారముద్రల
వల్ల కావ్యప్రయోజనం కూడ నెరవేరినట్లే. మతం కంటే ధర్మమే గొప్పదన్న విషయాన్ని
వివరిస్తూ మతమౌఢ్యాన్ని దుయ్యబట్టేరు. సద్గతులకు బాటవైచుకొని ధార్మిక బుద్ధిని
పాదుకొల్పమని హితంచెప్పడం ఆయన ధర్మతత్పరతకు ఒక ఉదాహరణ. ప్రతిపద్యంలోను
దిగజారుతున్న విలువలపట్ల ఆయన పొందిన ఆవేదన తొంగి చూస్తోంది. కొన్ని పద్యాల్లో
పరిష్కారం కనిపిస్తోంది. మరికొన్ని పద్యాల్లో అది సమాజానికే వదిలేసినట్లుగా అనిపిస్తోంది. ఈ
శతకంలో ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. అవన్నీ వివరిస్తే మరో పెద్ద గ్రంథం అవుతుంది. ఈ
శతకం ఆంధ్ర సాహిత్య చరిత్ర పుటలలో, విశిష్య శతక సాహిత్య పుటలలో శాశ్వతస్థానాన్ని
సంపాదిస్తుందని ఆశిస్తున్నాను. వీరి కల౦ నుంచి మరెన్నో కావ్యాలు వెలువడి సమాజ
కళ్యాణానికి
తోడుపడాలని ఆశిస్తున్నాను.
మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి వంటి విద్యాధికులు ఈ శతకాన్ని సమీక్షించారు.
ఈ శతకంపై నా అభిప్రాయాలను వ్యక్తీకరించుటకు అవకాశం ప్రసాదించిన వారికి నా
కృతజ్ఞతలు.
-- డా|| చిలకమర్తి
దుర్గా ప్రసాద రావు
Bhashapraveena,
Vedanta Vidyapraveena
M.A. (Sanskrit), M.A. (Telugu), M.A. (Philosophy)
Ph.D. (Sanskrit)
Retd. Reader & Head, Dept. of Sanskrit
ANR College, Gudivada (A. P.)
No comments:
Post a Comment