Tuesday, December 31, 2024

అమ్మకథ - విహంగ వీక్షణాత్మక సమీక్ష- డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

                                                                         అమ్మకథ

విహంగ వీక్షణాత్మక సమీక్ష

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

 (మదర్ తెరిసా జీవితం – గేయ రూపంలో...)

ఆంగ్ల మూలం Kathryn Spink రచించిన ‘ మదర్ తెరిసా’ ( ప్రామాణిక జీవిత చరిత్ర )

తెలుగు గేయానువాదం :  చిటిప్రోలు వేంకట రత్నం .

 

                            మహాభారతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు.

సువర్ణ పుష్పాం పృథివీం  చిన్వంతి పురుషా: త్రయ:

శూరశ్చ కృతవిద్యశ్చ యశ్చ జానాతి సేవితుం

ఈ పుడమి తల్లి పూచే బంగారు పుష్పాలను ముగ్గురే ముగ్గురు అనుభవించ గలుగుతున్నారట . ఒకడు శూరుడు , రెండోవాడు విద్యావంతుడు , ఇక మూడోవాడు సేవాధర్మం తెలిసినవాడు.   శూరుడు ఈ భూమిని జయించి సుఖాలు పొందుతాడు. విద్యావంతుడు విద్యవల్ల లభించే జ్ఞానంతో సుఖాలు పొందుతాడు . ఇక మూడోవాడు   ప్రజలకు సేవలు చేసి తన  సేవల ద్వారా ప్రజలు పొందిన ఆనందాన్ని చూసి అది తన ఆనందంగా భావించి  తద్ద్వారా ఆనందానుభూతి పొంది తరిస్తాడు. మొదటి వారిద్దరూ పొందే ఆనందం కన్నా మూడోవాడు పొందే ఆనందం  చాల గొప్పది మాత్రమే  కాక ఉన్నతమైనది కూడ  . ఎందుకంటే శూరుడు పొందే ఆనందంలో కొద్దో, గొప్పో హింసకు చోటు ఉంది. ఇక విద్యావంతుడు పొందే ఆనందంలో హింసకు చోటు లేకపోయినా అది తన వరకే పరిమితం . ఇక సేవా ధర్మం తెలిసినవాడు పొందే ఆనందంలో లోకహితం కూడ అంతర్లీనంగా దాగి ఉంది . అందుకే ఇది అన్నిటి కన్నా మిన్న. తన  ఆనందం కన్న ఇతరులు పొందే ఆనందాన్ని తన ఆనందంగా భావించ గలగడం సర్వోన్నతం కదా!

అటువంటి సేవా ధర్మాన్ని అవలంబించి ‘లోక పునీత’ ఐన  వారిలో ‘మదర్ తెరిసా’ ఒకరు. ఆమె దివ్య చరిత్రను Kathryn Spink అనే మహనీయురాలు ఆంగ్లంలో రచించగా ఆ రచనకు ముగ్ధుడై ఆ గ్రంథాన్ని  గేయ కావ్యంగా తెనుగులో అనువదించిన నా మిత్రుడు శ్రీ చిటిప్రోలు వేంకటరత్నం గారు చాల ధన్యులు.

మూల గ్రంథం ‘మదర్ తెరిసా’ కు సంబంధించిన అనేక సంఘటనలతో నిండిన చరిత్ర మాత్రమే. దాన్ని రసరాగరంజితం చేసి కావ్యంగా మలచిన ఘనత చిటిప్రోలు వారికే దక్కింది.    

ఇక ఉత్తమశ్లోకస్య చరితముదాహరణ మర్హతి       అన్నట్లుగా అటువంటి గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర రచనకు అర్హమైనది. ఆమె ఆచరణ పూర్వకం గా

నేర్పిన సేవాధర్మం  అందరికి ఆదర్శం అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

న కర్మణా న ప్రజయా ధనేన

త్యాగేనైకేనామృతత్వమానశు:  అంటుంది ఉపనిషత్తు .

మానవుడు కర్మలవలన గాని, సంతానం వలన గాని, ధనం వలన గాని అమృతత్వం  పొందలేడు . కేవలం త్యాగం వలన మాత్రమే అమృతత్వా న్ని పొందగలుగుతున్నాడని ఆ మాటల కర్థం. ఈ మాటకు ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలిచే వ్యక్తుల్లో ‘మదర్ తెరిసా’ ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు . ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్నట్లుగా ఏ దేశంలోనో జన్మించి ఈ దేశానికి వచ్చి దేశంలోని అన్నార్తులను, రోగార్తులను  ఆదుకున్న  ఆమె ధన్య చరిత .     ఆమె చరితను గేయంగా రూపొందించి  తెలుగు జాతికి అందించిన మా మిత్రుడు శ్రీ చిటిప్రోలు వేంకటరత్నం ధన్యుడు.  

ఇక ఇది అనువాద గ్రంథం. సాహిత్య క్షేత్రంలో అనువాద ప్రక్రియ  చాల కష్టమైన పని. ఎందుకంటే మనం స్వేచ్ఛగా ఎంత దూరమైనా సునాయాసంగా నడచి పోగలం. కాని మన ముందు ఒకరు నడిచి వెళ్ళిన  వారి అడుగుల్లో  క్రమం తప్పకుండా అడుగులు వేసుకుంటూ నడిచి వెళ్ళ మంటే  అలా నడవడం చాల కష్టమైన పని. పట్టు మని పది అడుగులు కూడ వేయలేం .

అలాగే ఏ కవైనా స్వతంత్రంగా ఒక కావ్యం వ్రాయాలనుకుంటే  సులభంగా వ్రాయగలడు. భావ ప్రకటనకు  అతనికి పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. కాని ఇతరులు వ్రాసిన కావ్యాన్ని అనువదించడం చాల కష్టం. అనువాదంలో రచయితకు ఎటువంటి స్వాతంత్ర్యం ఉండదు. మూలంలోని భావం  ఏమాత్రం అనువాదంలో రాకపోయినాస్పష్టత లేక పోయినావిమర్శకులు సతాయిస్తారు . కాబట్టి అనువాదం కత్తి మీద సాము వంటిది. అందుకే  భారతీయ సంప్రదాయంలో కవికి ఎంత గౌరవ, ఆదరాలు ఉన్నాయో అనువాద కర్తకు కూడ అంతే గౌరవ, ఆదరాలున్నాయి. .  అందులోనూ  ఒక ఆంగ్ల కావ్యాన్ని తెనుగులోనికి అనువదించడం సాహసంతో కూడిన పని. ఆంగ్ల భాషా మర్యాదలు వేరు , ఆంధ్ర భాష మర్యాదలు వేరు.  ఇక కవిత్రయం అనువదించిన భారతం సంగతి వేరు. రాజరాజనరేంద్రుడు నన్నయ్యగారిని భారతం అనువదించమని అడగలేదు. . భారతబద్ధనిరూపితార్థము తెనుగున రచియింపుమధిక ధీయుక్తి మెయిన్  అని సారాంశం మాత్రమే వ్రాయమని కోరడం జరిగింది.         నిజంగా కవిత్రయం యథా మూలం అనువదించి ఉంటే మరో విధంగా ఉండేది. ఇంత రమణీయంగా  ఉండేది కాదేమో అని నాకు అనిపిస్తుంది.  కాని ఇక్కడ రచయిత   శ్రీ వేంకటరత్నం గారు  పాఠకునకు మూల గ్రంథం  చదువుతోoటే ఎటువంటి అనుభూతి కలుగుతుందోఅనువాదంలో  కూడ అటువంటి రసానుభూతినే అందించ గలగడం ఒక విశేషం . నేను మూల గ్రంథం చదవలేదు గాని నాకు మాత్రం  ఇది అనువాదంగా అనిపించలేదు . స్వతంత్ర రచనగానే తోచింది . అటువంటి అనుభూతినే నాకు కలిగించింది. ఇది కవి ప్రతిభకు ఒక నిదర్శనం. రచనా శైలి అలతి యలతి పదజాలంతో శిష్ట వ్యావహారికంలో ఉన్నతమైన పర్వతం నుంచి జాలువారుతున్న మహానదిలా  అనిపించింది .

ఇక మాహత్వాత్, భారవత్త్వాచ్చ మహాభారత ముచ్యతే అన్నట్లుగా   ఇది రాశి లోను వాసి లోను కూడ చాల పెద్ద గ్రంథం. సుమారు 800లకు పై బడిన   విశాలమైన పుటలతో కూడిన గ్రంథం . ఇందులో 1. గుప్త నిధి  2.  దైవేచ్ఛ 3. జనం నడిమి ధ్యానులు 4. చంద్రమండలంపై  పేదలు. 5. దృక్కోణాల కలబోత 6.  దైవ పితృత్వాధీనమైన మానవ సౌభ్రాత్రంకోసం 7. గుర్తింపు కాన్క 8. శాంతి సాధక కార్యాలు 9. సడి లేని తుఫాను 10. బాధ్యతల బదిలీ 11. ప్రేమను బట్టి తీర్పు 12. స్వస్థలమైన దైవ సన్నిధికి 13. ‘పునీతత్త్వం’ వైపు అడుగులు 14.  బహిరంగీకరణం పవిత్రతా వినాశకం అనే పదునాలుగు ప్రకరణాలతో బాటుగా రెండు అనుబంధాలు కూడ ఉన్నాయి.

 

కవి ఈ  పదునాలుగు అధ్యాయాల్లో ఆమె యొక్క జీవిత విశేషాలు , సేవా విశేషాలు, కార్యకలాపాలు, తాత్త్విక   బోధనలు, ఆమె పొందిన పురస్కార విశేషాలు, ఆమె గురించి పలువురు చేసిన ప్రశంసలు , ఆమె ప్రభావానికి లోనై సమాజ సేవలందిస్తున్న వారి సేవా విశేషాలు తన ప్రతిభతో  మాత్రా గణ బద్ధంగా, కవితా గుణ బద్ధంగా పొందుపరిచారు . నేనీ రచన చేయడంలో ఉద్దేశం ‘తెరిసా మాత’  గొప్పదనాన్ని పాఠకులకు తెలియ పరచడమే గాని క్రైస్తవ మత ప్రచారం కాదని స్పష్టంగా పేర్కొన్నారు.  

ఒక్క మాటలో చెప్పాలంటే ఇది విశ్వ ప్రేమ రసాత్మకమైన (universal love), కవితా కంచుకం ధరించిన ‘మదర్ తెరిసా’ జీవిత విశేష సర్వస్వం.  ఒక గొప్ప వ్యక్తి చరిత్రను వర్ణించిన ఈ గ్రంథాన్ని  మరొక గొప్ప వ్యక్తికి అంకితం చెయ్యడం మరో విశేషం . రచయిత ఈ కావ్యాన్ని ‘తెరిసా మాత’ కంటే ముందే భారతదేశానికి వచ్చి తన వైద్య వృత్తి  ద్వారా నిరుపేదలైన  రోగులకు సేవలందించిన డాక్టర్ మేరీ గ్లౌరీ గారికి అంకితం చేశారు.

ఈ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత  ఆచార్య  డాక్టర్. వెన్నా వల్లభ రావు గారు, ఆచార్య డాక్టర్. పోలె ముత్యం గారి వంటి ఇరువురు విద్యాధికులు  అభినందన పూర్వకమైన  సమీక్షలు  వ్రాయడం  బంగారానికి పరిమళం కూడ  తోడు కావడమే అనిపిస్తుంది.

 ఈ కావ్యాన్ని చదివిన ప్రతివ్యక్తి  ప్రార్థన చేసే పెదవులకన్నా , సాయం చేసే చేతులు మిన్న (Helping hands are nobler than praying lips)     అనే ‘మదర్ తెరిసా’ గారి జీవిత ఆశయాన్ని ఆకళింపు చేసుకుని తదనుగుణంగా ప్రవర్తిస్తూ తమ జీవితాలను  సమాజ సేవకే అంకితం చేస్తారని నమ్ముతూ ఇంతటి ఉత్తమోత్తమ కావ్యాన్ని సమాజానికి అందించిన  నా ప్రియ మిత్ర రత్నమైన  వేంకటరత్నాన్ని మన సారా అభినందిస్తూ .....

డాక్టర్ . చిలకమర్తి . దుర్గాప్రసాద రావు.   

 

   

No comments: