శ్రీ నేమాని కోదండ రామారావు గారి కిరాతార్జునీయ- అనువాదం –
ఒక సమీక్ష
డాక్టర్ . చిలకమర్తి
దుర్గాప్రసాదరావు
ఒకనాడు శ్రీ నేమాని
సోమయాజులుగారు అమెరికా నుంచి నాకు ఫోను చేసి మా నాన్నగారు కిరాతార్జునీయకావ్యాన్ని
తెనిగించారు, దానికి
మీరు సమీక్ష వ్రాయాలని అడిగినప్పుడు నాకు కలిగిన ఆనందాశ్చర్యాలకవధులు లేవు.
ఆనందానికి కారణం, వారి తండ్రి గారితో నాకు చాల సంవత్సరాలుగా
పరిచయమున్నా వారు గణిత అధ్యాపకులు, గొప్ప పండితులు, సాహితీవేత్తలు గానే నాకు
తెలుసు గానీ కవిగా తెలియదు. వారు కూడ నాకెప్పుడు చెప్పలేదు . అందుకని అది
తెలుసుకోగానే ఆనందం కలిగింది . ఇక ఆశ్చర్యం ఎందుకంటే కిరాతార్జునీయాన్ని
తెనిగించినందుకు. అదొక ప్రౌఢకావ్యం . రచన నారికేళపాకం. ఒక పట్టాన అర్థం కాదు.
ఇక కిరాతార్జునీయం
పదునెనిమిది సర్గలతో కూడిన మహాప్రబంధం . ప్రతిసర్గలోని చివరి శ్లోకంలోను ‘లక్ష్మీ’ అనే పదం ఉండడం చేత దీనికి లక్ష్మీపదలాంఛనం
అనే మరొక పేరుంది.
కావ్యం ఇతివృత్తం అనుసరించి
మూడు రకాలుగా ఉంటుంది. కేవల కల్పిత కథ ఒకరకం. అది కృత్రిమ రత్నం. రామాయణ, మహాభారతాల్లో ఉన్న కథ
అప్పటికప్పుడు గనుల నుండి తీసిన రత్నం వంటిది. ఇక రామాయణ, మహాభారత కథలకు కవి తన
ప్రతిభను జోడించి రచించే కావ్యాలు సానపెట్టిన జాతిరత్నాల వంటివి. కిరాతార్జునీయం
అటువంటి సానలదీరిన జాతిరత్నం. భారవి భారతంలో ఉన్న
చిన్నఘట్టాన్ని ఆధారంగా తీసుకుని తన ప్రతిభతో వర్ణనలు జోడించి ఈ కావ్యం రచించాడు.
జూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న
పాండవులకు వ్యాసమహర్షి రాబోయే యుద్ధానికి కావలసిన అస్త్రశస్త్రాలను సమకూర్చుకోమని
చెపుతాడు . అర్జునుడు పాశుపతాస్త్రం పొందడానికి హిమాలయాలకు వెళ్లి
శివుని గురించి తపస్సు చెయ్యడం, అతని భక్తిని పరీక్షించడానికి శివుడు
కిరాతరూపంలో అక్కడకు చేరుకోవడం, ఒక్క వరాహం విషయంలో వారి ఇద్దరి మధ్య వివాదం
చెలరేగడం, అది
యుద్ధంగా పరిణమించడం, శివుడు అర్జునుని పరాక్రమానికి మెచ్చి అతనికి
పాశుపతాస్త్రాన్ని ప్రసాదించడంతో కథ ముగుస్తుంది. భారవి ఈ చిన్న కథకు వర్ణనలను
జోడించి 18సర్గల మహాకావ్యంగా రూపొందించాడు.
1.
మొదటి సర్గలో 46 శ్లోకాలు , వ్యాసాగమనమనే రెండవ సర్గలో
59 శ్లోకాలు, మూడవ
సర్గలో 60 శ్లోకాలు, శరద్వర్ణనమనే నాల్గవ సర్గలో 38 శ్లోకాలు, హిమవద్వర్ణనమనే ఐదవ సర్గలో 52 శ్లోకాలు, యువతీప్రస్థానమనే ఆరవ
సర్గలో -47 శ్లోకాలు, ఏడవ సర్గలో 40 శ్లోకాలు, సురాంగనావిరహమనే ఎనిమిదో
సర్గలో 57శ్లోకాలు, సురసుందరీ సంభోగ వర్ణనమనే తొమ్మిదో సర్గలో 78
శ్లోకాలు, అర్జున
విలోభన ప్రత్యాఖ్యానమనే పదో సర్గలో 63 శ్లోకాలు , ఇంద్ర సమాగమమనే పదకొండవ
సర్గలో 81శ్లోకాలు, ఈశ్వరాభిగమనమనే పన్నెండవ సర్గలో 54శ్లోకాలు, దూతవాక్యమనే పదమూడవ సర్గలో
71 శ్లోకాలు , పదునాల్గవ సర్గలో 65 శ్లోకాలు , అర్జునాభిగమనమనే పదునైదవ
సర్గలో 53 శ్లోకాలు , యుద్ధవర్ణనమనే పదహారవ సర్గలో 64శ్లోకాలు, కిరాతార్జునయుద్ధమనే
పదునేడవ సర్గలో 64 శ్లోకాలు, చివరిదైన ధనంజయాస్త్రలాభమనే పదునెనిమిదవ సర్గలో 48
శ్లోకాలు ఉన్నాయి చొప్పున మొత్తం 1051శ్లోకాలున్నాయి.
ఇక కవి గారు అవసరాన్ని
బట్టి ఒక్కొక్క శ్లోకానికి రెండేసి, మూడేసి తేటగీతులు, కందపద్యాలు, వృత్తాలు, అలాగే ఐదు, ఆఱు పాదాల వృత్తాలను, కూడ ఉపయోగించారు. వ్రాసినవి
ఎన్ని పద్యాలైన వాటిని ఒకే పద్యంగా పరిగణించారు. మొత్తం మీద మూలంలో ఉన్న
శ్లోకాల కన్న అనువాద పద్యాల సంఖ్య చాల ఎక్కువ .
ఇక సాహిత్య క్షేత్రంలో
అనువాద ప్రక్రియ చాల కష్టమైన పని . ఎందుకంటే మనం స్వేచ్ఛగా ఎంత దూరమైనా
సునాయాసంగా నడచిపోగలం. కాని మన ముందు ఒకరు నడిచి వెళ్ళిన అడుగుల్లో
క్రమం తప్పకుండా అడుగులు వేసుకుంటూ నడవమంటే నడవడం చాల కష్టమైన పని.
అలాగే ఏ కవైనా స్వతంత్రంగా
ఒక కావ్యం వ్రాయాలనుకుంటే సులభంగా వ్రాయగలడు. భావ ప్రకటనకు అతనికి
పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది. కాని ఇతరులు వ్రాసిన కావ్యాన్ని అనువదించడం చాల కష్టం.
అనువాదంలో కర్తకు ఎటువంటి స్వాతంత్ర్యం ఉండదు. మూలంలోని భావం ఏమాత్రం అనువాదంలో
రాకపోయినా, స్పష్టత
లేక పోయినా, విమర్శకులు
సతాయిస్తారు . కాబట్టి అనువాదం ఒక కత్తి మీద సాము వంటిది. అందులోనూ సంస్కృత కావ్యాన్ని
తెనుగులోనికి అనువదించడం సాహసంతో కూడిన పని. తెనుగు పద్యంలో యతి, ప్రాసల బెడద ఉంటుంది.
అనివార్యంగా కొన్ని పదాలు వాడవలసిన అగత్యం ఏర్పడుతుంది. నైషధాన్ని అనువదించిన
శ్రీనాథ మహాకవికే విమర్శలు తప్ప లేదు. ఇక భారవి కూడ హర్షునితో ఇంచుమించు
సమానుడే. అతని కావ్యాన్ని అనువదించడం సులభం కాదు. ఇక కవిత్రయం అనువదించిన
భారతం సంగతి వేరు. రాజరాజనరేంద్రుడు నన్నయ్య గారిని భారతం అనువదించమని అడగలేదు . భారతబద్ధనిరూపితార్థము
తెనుగునరచియింపుమధిధీయుక్తి మెయిన్ అని
సారాంశం మాత్రమే వ్రాయమని కోరడం జరిగింది. ఇక నైషధ కావ్యాన్ని
శ్రీనాథ మహాకవి అనువదించి మెప్పిస్తే వీరు భారవి
కిరాతార్జునీయాన్ని అనువదించి మూల కర్త ఉద్దేశ్యాన్ని నిర్దిష్టంగా, నిర్దుష్టంగా తెలుగులోకి రప్పించి, మెప్పించి
కృతకృత్యులయ్యారు. మూలగ్రంథం చదువుతోoటే ఎటువంటి అనుభూతి కలుగుతుందో, అనువాదంలో కూడ అటువంటి రసానుభూతినే అందించ గలగడం ఒక విశేషం
. కొన్ని అనువాద విశేషాలను పరిశీలిద్దాం . నాకు తెలిసినంత వరకు కిరాతార్జునీయాన్ని
తెలుగుపద్యాల్లో పూర్తిగా అనువదించినవారు
లేరు. వీరే ప్రథములు .
ఇక ప్రతికవికి ఒక్కొక్క
ప్రత్యేకత ఉంటుంది.
ఉపమా కాళిదాసస్య, భారవే రర్థగౌరవమ్ |
దండినః పదలాలిత్యం, మాఘే సన్తి త్రయోగుణాః ||
అని పెద్దల మాట. దీన్ని
బట్టి భారవి కవిత అర్థగౌరవానికి ప్రసిద్ధి .
అర్థగౌరవం అంటే అల్పమైన అక్షరాల్లో
అనల్పమైన అర్థాన్ని ఇమడ్చడం.
“అతివీర్యవతీవ భేషజే, బహురల్పీయసి
దృశ్యతే గుణః” అని కవి స్వయంగా
చెప్పుకున్నాడు.
“అల్ప వచనాలలోన ననల్పమైన
అర్థబాహుళ్య మొప్పె “ (2-27) ఇది అనువాదం .
ఔషధపు గుళిక చాల చిన్నది
గానే ఉంటుంది , కాని
దాని శక్తి చాల ఎక్కువ. హోమియోపతి మాత్ర కండచీమ తలకాయ కన్న చిన్నదిగా ఉన్నా కొండంత
రోగాన్ని పోగొట్టగల గుణం దానిలో ఉంది. అలాగే భారవి పలుగులు చిన్నవిగా ఉన్నా ఎంతో
గంభీరమైన భావాన్ని కలిగి ఉంటాయి.
ఇక రచయిత ఈ
కావ్యానువాదానికి పూనుకోవడమే సాహసాల్లో కెల్ల గొప్ప సాహసం. కొన్ని అనువాదాలు
పరిశీలిద్దాం . స్థాలీపులాకన్యాయంగా భారవి కావ్యం లోని ఒక ముఖ్యమైన శ్లోకం చూద్దాం.
సహసా విదధీత న క్రియా
మవివేకః పరమాపదాం పదమ్ |
వృణతే హి విమృశ్యకారిణం
గుణలుబ్ధాః స్వయమేవ సమ్పదః ॥ ౨.30॥
అనే శ్లోకభావాన్ని
“విను మాలోచనలేక కార్యముల నావేశమ్ముతోఁ జేయుచో
ఘనమౌ నష్టము దుఃఖమున్ గలుఁగు లోకంబందు
యోచించు కార్యనిరూఢాత్ముఁడు సౌఖ్యమొందు” నని చాల సరసంగా అనువాదం
చెయ్యడం వీరి ప్రతిభకు నిదర్శనం .
భారవి వర్ణనలు చాల
గొప్పవి. హిమాలయపర్వత
వర్ణనలో యమకం, , ముక్తపదగ్రస్తం
లాంటి శబ్దాలంకారాలు విరివిగా ప్రయోగించాడు .
అనువాదంలో కవి మూలంలోని
భావాన్ని చాల సరసంగా, స్పష్టంగా చెప్పడం కోసం శబ్దాలంకారాల జోలికి పోకుండా
భావాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు (5-8) ఇది ఆయన రసజ్ఞాతకు ఒక
నిదర్శనం .
పృథుకదమ్బ-కదమ్బకరాజితం
గ్రథితమాల-తమాలవనాకులమ్ |
లఘుతుషారతుషారజలచ్యుతం
ధృతసదాన-సదాననదన్తినమ్ (5-9)
అలాగే సకలహంసగణం, శుచిమానసం , సకలహం, సగణం, శుచిమానసం (5-13)
దివ్యస్త్రీణాం {5-23} , సనాకవనితం నితంబరుచిరం
(5-27) వంటి ముక్తపదగ్రస్తాలు ఎన్నో ఉన్నాయి. వీరు రసహీనమైన శబ్దాలంకారాల కోసం
ప్రాకులాడకుండా భావసౌందర్యానికే చోటివ్వడం ముదావహం .
ఇక కాళిదాసు దీపశిఖను , భారవి గొడుగును , మాఘుడు గంటను చాల బాగా
వర్ణించారని ప్రతీతి . అందుకే ఈయనను చత్రభారవి అని పిలుస్తారు.
ఉత్ఫుల్లస్థలనలినీ-వనాదముష్మా
దుద్ధూతః సరసిజసమ్భవః పరాగః |
వాత్యాభిర్వియతి వివర్తితః సమన్తా
దాధత్తే కనకమయాతపత్రలక్ష్మీమ్ ||
5-39 ||
శ్లోకానికి అందమైన చిన్న కందపద్యం
రచించారు. ఇది ఈ కవిగారి అర్థగౌరవానికి కూడ ఒక ఉదాహరణ.
కన సుడిగాలికి వెసనెగి
రిన కమలరజంబు పెద్దవృత్తమురీతిన్
జని గగనమండలమ్మునఁ
గనకమయంబైన గొడుగు కరణిన్ దోచెన్ ||
కందము ||
5-39
భారవి
అర్ధాంతరన్యాసాలంకాన్ని ప్రయోగించడంలో నిపుణుడు.
రాత్రిరాగమలినాని
వికాసం
పఙ్కజాని రహయన్తి
విహాయ |
స్పష్టతారకమియాయ
నభః శ్రీ
ర్వస్తుమిచ్ఛతి
నిరాపది సర్వః ॥ 9-16 ||
అనువాదం చూడండి.
పద్మములు
వికాసంబు కోల్పడియె కాంతి
వాని విడి
తారకావళి పైనఁబడియె
సహజమిదిలోకమందున
సర్వజనులు
నాపదలు లేనిచోటకే
యరిగెదరుగ || తేటగీతి ||
జీవహింస చేసి ధనం సంపాదించే
వాడు సకలపాపాలకు నిలయుడు అనే భావాన్ని ఎంత చక్కగా వివరించారో చూడండి .
అభిద్రోహేణ
భూతానా
మార్జయన్ గత్వరీః
శ్రియః |
ఉదన్వానివ
సిన్ధూనా
మాపదామేతి
పాత్రతామ్ ॥ 11-21 ॥
ఈ శ్లోకానికి
జీవహింసను
జేయుచుఁ చెలఁగి చంచ
లమగు సిరుల
నార్జించు నథముడు బరగ
నన్ని నదులకు
సాగరమాశ్రయముగ
నైనగతి
నన్నిపాపాల కాశ్రయమగు || తేటగీతి ||
అలాగే హితం మనోహారి చ
దుర్లభం వచ:
అనే భారవి మాటల్లో గల
సారాంశాన్ని “క్రన్నన విడి యప్రియంబని మనమ్మున దాచగ రాదు వార్తలన్” అని మనోహరంగా తెనిగించారు
.
అలాగే అనార్యసంగమాద్వరం
విరోధోsపి సమం మహాత్మభి: అనే వాక్యాన్ని అలాగే శమీతరుం
శుష్కమివాగ్ని రుచ్ఛిఖ: అనే
వాక్యాన్ని “మేదినిని శుష్క మార్ద్ర శమీ
తరువును నగ్ని దహియించు విధమున (1-౩౨) అలాగే
పరాభవోsప్యుత్సవ ఏవ మానినామ్
(2-41)
న మహానిచ్ఛతి భూతి మన్యత:
అనే శ్లోకాల భావాన్ని
రాబట్టడానికి రెండు చంపకమాలల్ని వ్రాయడం బట్టి ఆయన ములకర్త భావాన్ని రాబట్టడంలో
ఎక్కడ రాజీ పడలేదని తెలుస్తోంది (2-18)
న తితిక్షా సమమస్తి సాధనమ్ (2-43) అనే మూలానికి
శాంతశీలత మరి
భవిష్యత్తునందు
గూడ నుపకారి – శాంత యుతుని
శత్రువు తనంతతానే నాశనము
నొందు-(2-43) అనే అనువాదం ప్రశంసనీయం .
మోహం విధత్తే విషయాభిలాష: అనే భారవి పలుగులకు
కాంక్ష మిక్కిలి భ్రమలకు
కారణంబు అనే అనువాదం అమృతోపమం .(3-13)
నాల్గవ సర్గలో
పశ్చిమరాత్రి గోచరాత్ అనే పదాన్ని రాత్రి
ముప్పావు గతింప (4-౧౬) అనడం చాల బాగుంది.
సరస్వతి ఎలా ఉండాలో భారవి
మాటల్లో తెలుసుకుందాం.
వివిక్తవర్ణాభరణా సుఖశ్రుతిః
ప్రసాదయన్తి
హృదయాన్యపి ద్విషామ్ |
ప్రవర్తతే
నాకృతపుణ్యకర్మణాం
ప్రసన్న
గమ్భీరపదా సరస్వతీ ॥ 14-3 ॥ అనువాదం
పరగ సుస్పష్ట వర్ణరూపంబు కలది
యెలమి వినువేళ సౌఖ్యము నీయగలది
శత్రుహృదయమ్మునైనఁ బ్రసన్నరీతి
తోడ నాకట్టుకొనునట్టి వాడి కలది
యర్థగౌరవపదయుక్తి నలర రమ్య
మైన వాగ్ధాటి లోకంబులోన మిగుల
పుణ్య మొనరించు వారికి గణ్యరీతి
లభ్యమగుచుండు స్వచ్ఛజలంబు రీతి
ఇక 15 వ సర్గలో:
న నోననున్నో నున్నోనో నానా నానాననా నను |
నున్నోऽనున్నో ననున్నేనో నానేనా నున్ననున్ననుత్ ॥ 15-14 ॥ అనే శ్లోకాన్ని
పలురకమ్ములుగానున్న ప్రమథులార
చెలఁగి నీచునిచేఁ బరాజితుఁడు దలప
నరుఁడు గాదిఁక నీచుల నరసి వారి
బలిమిచేత నొగి పరాజితులను జేయు
వాడుగూడ మనుష్యుఁడుకాడు మీరు
చెలఁగి నీచులచేఁ బరాజితులు మరియు
భీతితోడను బరుగులు వెట్టుచున్న
వారు మిమ్మేమి బిరుదాన పలుక వలయు || తేటగీతి ||
ఎవరి స్వామి తలప నిల పరాజితుఁడుకా
డరయ వారిఁ జూచి సరయరీతి
వడి పరాజితులుగ భావింపఁగా రాదు
గొప్పబాధలో రగులు నరునికి
బాధ కల్గఁజేయువాని నిర్దోషిగాఁ
దలఁపరా దతండు దులువ తలఁప || ఆటవెలది || అనువదించారు.
అలాగే ఒక అనులోమవిలోమ శ్లోకానికి
వారి అనువాదం పరిశీలించండి
దేవాకానిని
కావాదే వాహికాస్వస్వకాహి వా |
కాకారేభభరే
కాకా నిస్వభవ్యవ్యభస్వని ॥ 15-25 ॥
శ్లోకానికి
మదధారల్ కురిపించునట్టి గజసంపన్నుండు గర్వోన్నతా
స్పదుఁడై శత్రులనెల్ల వాయసగతిన్ భావించి నిత్యమ్ము నె
మ్మది కాకాయని పిల్చుచుండు నికర మ్మౌత్సాహులన్ ధీరులన్
మది నుత్సాహములేని భీరుల నొకేమాటన్ దగన్ బిల్చుచున్ || మత్తేభము || ఇది అనువాదం.
యత్ర వేదా: అవేదా:
అన్నారు తత్త్వవేత్తలు . వేదాలు కూడ భగవంతుని చెప్పలేక పోయాయట .
అర్జునుడు శివునిపై
ప్రయోగించిన బాణాలు అతనికి తగలకుండానే వ్యర్థమయ్యాయట
అది వివరిస్తూ భారవి
అగోచరే వాగివ చోపరేమే,
శక్తిః శరాణాం
శితికణ్ఠకాయే ॥ 17-11 ॥
వాఙ్మానసా
గోచరమగు బ్రహ్మ
విషయమందున చక్కని వేదవాక్కు
వ్యర్థమైనట్లు పార్థుని బాణచయము
వడి త్రిలోచనుఁ బైనను వ్యర్థమయ్యె ---
నని ఆయన అనువదించడం .
జగతి పుణ్యాత్ములకుఁ దపస్సమృతమయము 12-4 అనే మాటలు ఆయన అనువాద
పటిమకు మచ్చు తునకలు .
ఇక మహాకవి, పండితప్రకాండులు , గణితశాస్త్రజ్ఞులు నైన శ్రీ
నేమాని కోదండ రామారావు గారు అనువదించిన
కిరాతార్జునీయకావ్యాన్ని ఆసక్తితో ఆమూలాగ్రం పరిశీలించాను. చదవడం సంపూర్ణంగా
చదివినా గ్రంథ విస్తర భీతిచేత అన్ని పద్యాల సోయగాలను ప్రస్తావించలేక పోతున్నందుకు మన్నించమని
కోరుతూ, వారు ఇంకా ఎన్నో కావ్యాలు రచించే శక్తి యుక్తులు ఆ పరాత్పరుడు
ప్రసాదించాలని కోరుకుంటూ, తెలుగుసాహిత్యం ఉన్నంతకాలం ఈ కావ్యం నిలవాలని
నిలుస్తుందని విశ్వసిస్తూ, ఇటువంటి మహత్తరమైన కావ్యాన్ని సమీక్షించే అదృష్టం
నాకు కలుగజేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కావ్యాన్ని చవినందు వల్ల నాకు
కలిగిన రాసోద్రేకాన్ని అణచుకోలేక నేను సమర్పించే ఈ పద్యసుమాన్ని సహృదయంతో స్వీకరించమని
కోరుతూ...
.
నీ కవితాస్రవంతిని మునింగి తరించితి
గాంగనిర్ఝరీ
సేకము, హైమవారిపరిషిక్తధునీకము, నవ్యమంజు మా
ధ్వీకము, శారదాభగవతీ
వినివేదితమైనవాఙ్నమో
వాకము, గాదె నీ కవనవైఖరి
మత్ప్రియమిత్ర రత్నమా!
విధేయుడు,
చిలకమర్తి దుర్గాప్రసాద
రావు,
భాషాప్రవీణ , వేదాంతవిద్యాప్రవీణ,
ఎం . ఏ (సంస్కృతం ); ఎం .ఏ ( తెలుగు);
ఎం.ఏ ( తత్త్వశాస్త్రం ) & పిహెచ్. డి ( సంస్కృతం).
విశ్రాంత ఆచార్యుడు
Cell. 9897959425