Monday, September 2, 2024
తెలుసుకుందాం-2 Let us know-2 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
తెలుసుకుందాం-2
Let us know-2
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
సాధారణంగా మన ఇళ్ళల్లో జరిపే ఉపనయనకార్యక్రమంలో ఒక వింత ఆచారాన్ని మనం గమనిస్తూ ఉంటాం . అదేంటంటే బ్రహ్మచారులను భోక్తలుగా పిలుస్తాం. ఆ సమయంలో వారి సరసన బ్రహ్మోపదేశం జరుప బోయే వటునికి కూడ అన్నం వడ్డిస్తాం కానీ ఆ వ్యక్తి పూర్తిగా తినేవరకు ఉండనివ్వం . చాల కంగారు పెట్టి కడుపునిండా పూర్తిగా తినకుండానే విస్తరి ముందు నుంచి లేపేస్తాం. పప్పు అన్నం తింటుండగానే వెంటనే పెరుగు వడ్డించి కంగారు పెడతాం. బాహ్యంగా చూస్తే అది తప్పు అనిపిస్తుంది. చాల వింతగా కూడ కనిపిస్తుంది. పూర్తిగా అన్నం తినకుండానే లేపేయడం వింతే కదా మరి! కానీ ఆచారంలో ఉండేటటు వంటి ఆంతర్యాన్ని గమనిస్తే అది సబబే అనిపిస్తుంది. “ స్థితస్య గతి: చింతనీయా” అనేది మన సనాతనధర్మం. అంటే ఒక ఆచారం ఉంటే దాని ఆశయం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఇందులో ఉండే అంతరార్థాన్ని మనం తెలుసుకుందాం. ఇక ఉపనయనం తరువాత బ్రహ్మచారిగా ఉన్న ఆ వ్యక్తి గురుకులానికి విద్య కోసం వెళ్తాడు. వాడికి తిండి మీద ఎక్కువ దృష్టి ఉండకూడదు. అంటే తినకూడదని కాదు ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి, బ్రతకడం కోసమే తినాలి, కాని రుచులపై ధ్యాస నిలుపకూడదు . ఇది అలవాటు చేయడం కోసం అతన్ని ముందుగానే విస్తరి నుంచి లేపెస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే విద్య ఒక తపస్సు లాంటిది . “తద్ధి తపస్తద్ధి తప:” అని వేదవాక్యం.
దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిలో ఆహార నియంత్రణ ఒకటి. అందుకే వశిష్ట మహర్షి దిలీపునితో నందినీ ధేనువును సేవించే విధానాన్ని తెలుపుతూ ఇలా అంటాడు .
వన్యవృ త్తి రిమాం శశ్వదాత్మాను గమనేన గాం
విద్యామభ్యసనేనైవ ప్రసాదయితుమర్హసి
ఓ రాజా ! నువ్వు కందమూల ఫలాలు మాత్రమే
తింటూ అభ్యాసం చేత విద్యను వశపరచుకున్నట్లుగా ఈ గోవును వెంటపడి అనుసరిస్తూ ప్రసన్నం చేసుకో. దిలీపుడు చక్రవర్తి . ఏదైనా తినగలడు. ఏదైనా తనదగ్గరకు తెప్పించుకోగల శక్తి గలవాడు. ఐనప్పటికీ కందమూలఫలాలే సేవించమని గురువు నిర్దేశించడం మనం గమనిస్తాం. చదువు తపస్సులాంటిది కాబట్టి విద్యార్థి రుచులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎంత అవసరమో అంతే తినాలి. ఈ సందర్భంగా పూర్వకాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఒక కథను కూడ మనం గమనిద్దాం . ఒక గురుకులంలో గురువు పాఠాలు చెప్పేవారు . ఆ ఊరిలో ఉన్న కొంతమంది పెద్దలు చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి రొజూ భోజనం పెట్టేవారు . ఒక వ్యక్తి ప్రతిరోజు ఒక ఇంటిలో భోజనం చేస్తూ ఉండేవాడు . అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒక రోజున ఆ కుర్రవాడు భోజనం చేస్తూ అమ్మగారు ! ఈ రోజు వట్టి గోంగూరముద్ద వడ్డించారు . రుచీ పచీ లేదు . ఏమీ బాగా లేదoడి అన్నాడు . అప్పుడామె నాయనా! నువ్వు రేపటి నుంచి మా ఇంటికి రావక్కర్లేదని చెప్పింది. అదేంటమ్మా అనడిగాడు . నాయనా! నేను రొజూ నీకిదే వడ్డిస్తున్నాను . నువ్వు కలుపుకుని తినేసి వెళ్లి పోయేవాడివి. ఏనాడు ఇదేంటని అడగలేదు . ఇప్పుడు నీ దృష్టి రుచుల పైకి పోయింది . చదువు మీద లేదు . మా ఇంటిలో భోజనం చదువు కోసం వచ్చేవాళ్ళకే గాని రుచుల కోసం వచ్చేవాళ్ళకు కాదని చెప్పి పంపేసింది . ఇందులో ఉండే తాత్పర్యాన్ని మనం గ్రహించాలి.
ఇక మేం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు హాస్టల్స్ లో అన్ని పదార్థాలు చాల అద్భుతంగా ఉండేవి . మేము కొంతమంది పరీక్ష రోజుల్లో ఒకే item తో సరిపెట్టుకోవాలని నియమం పెట్టుకునే వాళ్ళం. దానివల్ల ఆహారం కొంత నియంత్రిoచడంద్వారా ఎక్కువసేపు చదివే అవకాశం దక్కేది . ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన వైదిక సంస్కృతీసాంప్రదాయాలు బ్రహ్మచారి కాబోయే ఆ వ్యక్తిని భోజనం దగ్గర కంగారు పెట్టే ఆచారాన్ని అమలు చేసింది . ఇదీ అంతర్యం . ఆహా! వైదికసంస్కృతీ సాంప్రదాయాలు ఎంత గొప్పవి!
ఒక్క విషయం గమనించాలి . ఆహారం తినొద్దని కాదు. కేవలం రుచులపైకి దృష్టి సారించకూడదని మాత్రమే అని గ్రహించాలి.
<><><>
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment