Monday, September 9, 2024

ఆత్మాధిక్య౦ -ఆత్మన్యూనత Superiority vs Inferiority) డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

  ఆత్మాధిక్య౦ -ఆత్మన్యూనత       

(Superiority vs Inferiority)

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

ఈ సృష్టిలో భిన్నత్వం ఉంటే ఉందేమో గాని ఎక్కువ తక్కువ అనే తారతమ్యం మాత్రం లేదు. ఎందుకంటే ఏ జీవికి ఆ జీవే ప్రత్యేకమైనది . దానికంటే ఎదీ తక్కువ కాదు ఏదీ ఎక్కువ కాదు .   oతువులు చేసుకున్న అదృష్టమేమిటంటే వాటిలో ఈ Superiority, Inferiority భేదం లేదు.  అన్నీ కలిసే ఉంటాయి . ఏదైనా ఆహారం దొరికినప్పుడే తమ వంతుకోసం పోట్లాడుకుంటాయి, తరువాత అన్ని  కలిసి మెలిసి జీవిస్తాయి. మనిషికే ఈ మాయరోగం . ఒకడు అందరికంటే నేనే గొప్పవాణ్ణి అని గర్వంతో పొంగిపొతూ ఉంటే మరొకడు నేను ఎందుకు పనికి రాని వాణ్ణి అని వేదనతో క్రుంగిపోతూ ఉంటాడు . అటు పొంగిపోవడం ఎంత తప్పో క్రుంగి పోవడం కూడ అంటే తప్పు. Superiority, inferiority ఈ రెండు ప్రమాదకరమే. కాని ఈ ఇద్దరిలో Superiority complex ఉన్నవాడు కొంతనయం , తన గొప్పదనం నిరూపి౦చుకోడానికి  అప్పుడప్పుడు కొన్ని మంచిపనులు చేస్తూ ఉంటాడు . ఇక    inferiority complex ఉన్న వాడు రోజు రోజుకీ క్రుంగి కృశి౦చి, నశించి  పోవడం కన్న ఏదీ సాధించలేడు . అందువల్ల తల్లి దండ్రులు ఈ రెండు దుర్గుణాలు పిల్లలకంట కుండ  పెంచాలి . అందుకే అన్నారేమో శ్రీ జాషువా గారు

తలిదండ్రులెపుడు బిడ్డలకు( దెల్పగ రాదు

కులగోత్రములు వాని గొప్పదనము

చదివి౦పగా రాదు చాదువులయ్యలు పాఠ

శాలలలోన కులాల గొడవ” అని .

ఇక ఈ సృష్టిలో పనికి రానిదంటు ఏదీ లేదు పనికిరానివాడంటు ఎవరూ లేరు .

అమంత్రమక్షరో నాస్తి నాస్తి మూలమనౌషధం

అయోగ్య: పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ:

అన్నారు పెద్దలు .

అమంత్రమక్షరో నాస్తి

ఒక గురువుదగ్గర ఇద్దరు శిష్యులు న్నారు . గురువు ఒకడికి ‘శం’ ఒక అక్షరం మంత్రం గా ఉపదేశించాడు మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అంటే మననం చేయడం వల్ల రక్షిస్తుంది అని అర్థం . వాడు  ఆ మంత్రాన్ని  జపిస్తూ కొన్ని శక్తులు సాధించాడు.  తత్ఫలితంగా ఆకాశంలో ప్రయాణం చేసే శక్తి సంపాదించాడు . అలాగే గురువు మరోశిష్యుడికిఠ౦’ అని  మరొక అక్షరం మంత్రోపదేశం చేశాడు.  వాడు   ‘‘ఠ౦’’ ఠ౦’ అని జపిస్తూ ముందు వాడిలాగానే  కొన్ని శక్తులు సాధించి ఆకాశంలో తేలిపోయే మహిమ సంపాదించాడు . ఒక రోజు ఇద్దరు ఆకాశంలో కలుసుకున్నారు . వాళ్లకు ఒకరి గురించి మరొకరికి తెలుసుకోవాలనే కోరిక పుట్టింది .  ఒరేయ్ ! గురువు గారు నీకేం చెప్పేర్రా? అన్నాడొకడు , నీకేం చెప్పేరో ముందు చెప్పరా!  అన్నాడు మరొక్కడు

నాకు ‘శం’ అని చెప్పార్రా అన్నాడొకడు . నాకుఠ౦’ అని చెప్పెర్రా అన్నాడు రెండోవాడు . రెండు కలిపితే ‘శంఠ౦’ ఐంది. ఓసి మనిద్దరికీ చెప్పింది ఇదిట్రా అన్నారు ఇద్దరు ఒకేసారి. వాళ్ళు అనడం ఆకాశం నుంచి పడిపోడం ముడ్డి పగలడం క్షణాల్లో జరిగిపోయింది . అంతవరకు వాళ్లకి ఆ మంత్రం పైన విశ్వాసం ఉంది ఆ విశ్వాసం వల్ల తాము  సాధించిన శక్తితో వారు ఆకాశంలో సంచరించే స్థాయికెదిగారు విశ్వాసం కోల్పోయిన వెంటనే నేలపై చతికిలపడ్డారు . 

నాస్తి మూలమనౌషధం :

పూర్వం ఒక రాజాస్థానంలో వైద్యనియామకం చేయ వలసిన అవసరం ఏర్పడింది . మంత్రి ఒక ప్రకటన చేస్తూ ఫలానా రోజున వైద్యనియామకం జరుగుతుంది, అభ్యర్థులు తమకు తెలిసిన పనికి రాని మొక్కలు తీసుకురమ్మని కోరాడు . రాజాస్థానంలో వైద్యుడు కావడమంటే ఎంతో పెట్టి పుట్టాలి అభ్యర్థులు కొంతమంది వందలాది మొక్కల్ని సేకరించి తెచ్చారు . కొంత మంది ఏభై , నలభై , ముప్పై , ఇరవై , పది ఇలా తెచ్చారు. ఇకడు మాత్ర౦ చేతులూపుకు౦టు వచ్చాడు. వాణ్ణి చూసి అందరు నవ్వేరు . మాంత్రికూడ ఆశ్చర్య పోయాడు . అక్కడున్న ఆస్థానవైద్యుడు వట్టి చేతులతో వచ్చిన వాడితో “ ఏమయ్యా ! ఇంత మంది ఎన్నో పనికి రాని  మొక్కలు తెస్తే, నువ్వు ఒక్కటి కూడ తేలేదు. నీకీమీ కనిపి౦చలేదా! లేక సోమరితనమా ! అని అడిగాడు . దానికి సమాధానంగా ఆవ్యక్తి రెండు చేతులు జోడిస్తూ “అయ్యా ! ఔషధంగా పనికిరాని  మొక్కంటు నాకేం కనిపించ లేదు, నన్ను మన్నించండి” అన్నాడు . ఆ వైద్యుడు    నిన్ను మన్ని౦చడం కాదయ్యా! ఆస్థానంలో ప్రధానవైద్యునిగా నియమిస్తున్నాం అని చెప్పి మిగిలిన వారిని వెనక్కి పంపించేశాడు . కాబట్టి మనం తెలుసుకోవడంలో లోపం గాని వైద్యానికి పనికి రాని  మొక్కంటు ఏదీ లేదు . మొక్కలలో ఉండే ఔషధ గుణాలు పిల్లలకు పరిచయం చెయ్యడానికే వినాయకచవితి మొదలైన వ్రతాల్లో ఏకవింశతిపత్రపూజ (21మొక్కలు) మొదలైనవి ప్రవేశపెట్టారు . ఆ మొక్కలు మనిషికి నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో వ్యాధులకు మందులుగా పని చేస్తాయి  కాని భక్తుల దృష్టి మనుషులకొచ్చే ఇడుముల మీద కన్నా  నైవేద్యం పెట్టె కుడుముల  మీదే ఉండడం శోచనీయం .  సరే !   ఆ విషయం అలా ఉంచుదాం .

అయోగ్య:  పురుషో నాస్తి :

ఈ సృష్టిలో ఎందుకు పనికిరాని వాడంటు ఎవరు లేరు . మనీషా ( బుద్ధి బలం)   ఉన్నవాడే మనీషి . తరువాత మనిషి అయ్యాడు. ఇప్పుడు మనీ money  , షి she ఈ రెండు  ఉన్నవాణ్ణే మనిషిగా చూస్తున్నారు. ఇది శోచనీయం . కాబట్టి ప్రతి వ్యక్తీ గొప్పవాడే . కాని వాడెందుకు పనికొస్తాడో తెలుసుకోగలిగిన వాడు ఎవడు లేడు . ఈ సమాజంలో చాల గొప్పవారుగా పేరుపొందిన కొంతమంది మహనీయుల జీవితాలు పరిశీలిస్తే  బాల్యంలో చాల మంది అంతంత మాత్రంగా ఉన్న వారే. కాబట్టి ప్రతివ్యక్తిలో ఉండే అభిరుచులను జాగ్రత్తగా     గుర్తించి తదను గుణ౦గా వారిని తీర్చి దిద్దితే అందరు మహనీయులౌతారు . మనిషిని మనిషిలా పెంచండి . ఎవరి అభిప్రాయాలు  ఎవరి మీద రుద్దకండి . స్వయంగా ఆలోచించుకో నివ్వండి . తానె స్వశక్తితో ,  స్వయంగా మహనీయు డౌతాడు .                <>><><>

 

 

 

 

No comments: