Monday, October 28, 2024

అనుభవాలు – జ్ఞాపకాలు- 4 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

 

అనుభవాలు – జ్ఞాపకాలు-4

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు.

ఇది సుమారు  పుష్కరకాలం క్రితం నాటి అనుభవం . నాకు చిన్నప్పటి నుంచి కాశ్మీరు చూడాలనే కోరిక ఉండేది. బహుశ కుమారసంభవంలో కాళిదాస మహాకవి  చేసిన హిమాలయ వర్ణన కారణం ఐయుండవచ్చు.  కానీ    చూస్తాననే ఊహ గాని,   చూడగలననే నమ్మకం గాని  నాకు ఎప్పుడు లేవు. నేను All India Oriental Conference(A.I.O.C)కి సభ్యుణ్ణి . రెండేళ్ల కొకసారి భారతదేశంలో కొన్ని కొన్ని చోట్ల సమావేశాలు  జరుగుతూ ఉంటాయి. అంతకు ముందే ఎన్నో ప్రదేశాల్లో నేను  సభల్లో పాల్గొన్నాను.  2012 లో కాబోలు ఆ సభలు శ్రీనగర్ లో జరుగుతాయని ముందుగానే తెలిసింది. నేను The views of kalidasa on Education అనే అంశంపై ఒక పరిశోధన వ్యాసం వ్రాశాను . నా అదృష్టవశాత్తు అది select అయ్యింది . నేనెప్పుడైతే ఈ విషయం చెప్పేనో  మా కుటుంబ సభ్యులందరూ తాము కూడ వస్తామన్నారు. అందరు బయలుదేరి ముందుగా జమ్మూ చేరుకొని ఆ తరువాత శ్రీనగర్ చేరాం. కాశ్మీరును  ఏమని వర్ణించగలం! ఒక్కమాటలో చెప్పాలంటే అది భూతలస్వర్గం. దాని శిరోభూషణం శ్రీనగర్ . అది భారత దేశానికే శిరోభూషణం. నిజంగా శ్రీలకు నిలయం, అంటే సకల సంపదలకు నిలయ మన్న మాట. ఇక శ్రీ నగర్ విశ్వవిద్యాలయంలో కాన్ఫరెన్సు మొదలైంది . సమావేశాలు జరుగుతున్నప్పుడు కాక  తీరిక సమయాల్లో  చాల ప్రదేశాలు చూడడం జరిగింది. అక్కడ పుణ్య స్థలాల్లో మోసాలు జరిగేవి కావు . నేనొకవ్యక్తిని అడిగితే “ అయ్యా! ఇక్కడ దొంగతనాలు మోసాలు ఉండవండి. కావాలంటే పది రూపాయలు ఎక్కువ అడిగి తీసుకుంటారు, దానికి తగ్గట్టుగా మీకు సేవలు అందిస్తారు” అన్నాడు . ఒకవేళ మేము ప్రయాణీకులను మోసం చేస్తే మాకు ప్రభుత్వం విధించే జరిమానాలు,  శిక్షలు చాల  తీవ్రంగా ఉంటాయండి అన్నాడు.

ఇక చిన్నప్పుడు Dal lake is the most beautiful among the lakes in Kashmir అని పదే పదే చదువుకోవడం వలన అందులో ఉండాలనే తలంపు కూడ కలిగింది. Dal lake లో సుమారు రెండు రోజులున్నాము. అక్కడ    వాళ్ళు అందించిన సౌకర్యాలు, సదుపాయాలూ అద్భుతంగా ఉన్నాయి.    ఆ నౌకల్లోనే (పడవల్లోనే) పెద్ద పెద్ద  భవనాల్లో లాగానే అన్ని సౌకర్యాలు ఉంటాయి. Dal lake లోనే చాల దుకాణాలు ఉంటాయి. పడవల్లో వెళ్లి కావలసినవి కొనుక్కోవచ్చు . ఒకరోజు ఉదయం గదుల్లోంచి ప్రభాతపుటెండ కోసం బయటికి వచ్చాము . ఇంకా చాల మంది అక్కడున్నారు. ఆ పడవ యజమాని, నేను  ఏవో మాట్లాడుకుంటున్నాం. మాటల మధ్యలో ఎలా ఉన్నాయండీ మా arrangements అన్నారాయన .  చాల బాగున్నాయండి అన్నాను నేను. ఎలా ఉంది కాశ్మీరు అన్నారాయన . చాల బాగుందండీ excellent అన్నాను. ఆ తరువాత నన్ను provoke చెయ్యడానికో ఏమో తెలియదు గాని paradise అనే మాట అతని నోటినుండి వచ్చింది. నేను paradise of India అన్నాను అప్రయత్నంగా No, Pakistan అన్నాడు . నేను గతుక్కుమన్నాను . ఆ ప్రక్కనున్న మరొక పడవ యజమాని నా వాలకం కనిపెట్టాడో ఏమో తెలియదు గాని కొంత నయం, మేం స్వతంత్రులమండి , మా కెవరితోను సంబంధం లేదు అన్నాడు, నన్ను సమాధాన పరచడానికా అన్నట్లుగా . అంతే! నాకు గాలి తీసేసినంత పనైంది. ప్రక్కనే ఉండి అంతా వింటున్న మా అబ్బాయి ఏమీ మాట్లాడకు నాన్నా! అని నన్ను సమాధాన పరిచాడు . మా ఆనందమంతా ఐదు సెకన్లలో మటుమాయమైoది. ఇంతకూ ఇది ఇప్పటి మాట కాదు సుమండీ .  ఎప్పుడో పుష్కర కాలం పైమాటి  మాట. నేను మరల ఎప్పుడు అక్కడకు వెళ్ళలేదు గాని ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేక పోవడం అన్ని రాష్ట్రాలతో పాటు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందుతూ  ఉండడం చాల ముదావహం.  

Thursday, October 17, 2024

అనుభవాలు – జ్ఞాపకాలు-3 డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

అనుభవాలు – జ్ఞాపకాలు-3

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

                      నాకెందుకో ఇద్దరు వ్యక్తుల్ని తలుచుకుంటే మనస్సులో చాల అసూయ కలుగుతుంది. ఒకరు శ్రీ అబ్దుల్ కలాం గారు, రెండోవారు రతన్ టాటా గారు . ఏమి జీవితం!  ఎంత త్యాగనిరతి!  ఎటువంటి దేశభక్తి! ఎంతటి నిష్కళంకవ్యక్తిత్వం వీరిద్దరిదీ!  ఇద్దరూ భారతమాత ముద్దుబిడ్డలే, ధన్యజీవులే. భర్తృహరి ఒక మాట అంటాడు.

స జాతో యేన జాతేన యాతి వంశ: సమున్నతిం

పరివర్తిని సంసారే మృత: కో వా న జాయతే ?   

     ఎవని పుట్టుకచేత వంశమంతా పావనమౌతుందో అతని పుట్టుకే సార్థకం, అదే నిజమైన పుట్టుక. పుట్టలోని చెదలు పుట్టవా! గిట్టవా! అన్నట్లుగా ఎంతమంది పుట్టడం లేదు, ఎంతమంది చావడం లేదు, ఎంతమంది పెక్కుమార్లు చస్తూ పుడుతూ ఉండడం లేదు!

 ప్రస్తుతం నేనిచ్చిన క్రమంలో ద్వితీయుడైనా ఆర్థికంగా దేశానికి పరిపుష్టిని; దానధర్మాది సేవలద్వారా తుష్టిని చేకూరుస్తూ దేశప్రగతికి తోడ్పడిన అద్వితీయుడు  శ్రీ  రతన్ టాటా గారు. వారి గురించి ప్రస్తావిస్తాను.

నేనెప్పుడు విశాఖపట్టణం వెళ్ళినా కొంతమంది గురువులు,  మిత్రులు కనిపిస్తారనే ఆశతో నేను చదువుకున్న ఆంధ్రవిశ్వవిద్యాలయ సంస్కృత విభాగానికి వెళ్ళడం పరిపాటి . సుమారు  రెండు మూడేళ్లకు పూర్వం (తేదీ సరిగా గుర్తు లేదు ) విశాఖ వెళ్ళినప్పుడు అనుకోకుండా సంస్కృత విభాగానికెళ్ళాను. వెళ్ళాక తెలిసింది ఆ రోజు పుర్వవిద్యార్థుల సమావేశ శుభదినమని. ఆచా ర్య K. గాయత్రీదేవి గారు నన్ను కూడ లోపలికి రమ్మని పిలిచారు. కార్యక్రమంలో నేను కూడ పాల్గొన్నాను. సాయంకాలం విద్యార్థులను address చెయ్యడానికి శ్రీ రతన్ టాటా వస్తున్నారని చెప్పారు.  నా ఆనందానికి అవధులు లేవు . ఎందుకంటే నా లాంటి వాడికి అటువంటి వ్యక్తిని చూడడమే కష్టసాధ్యం. ఇక  ఆయనే స్వయంగా వస్తున్నారంటే        

 ఎంత అదృష్టం! ఆయన రావడానికి ఒక గంట ముందే అక్కడికెళ్ళి కూర్చున్నా. సాయంకాలం సమయానికి ముందే ఆయనొచ్చారు. సమారు ముప్పై ఐదు, నలభై  నిముషాల పాటు  అద్భుతంగా ప్రసంగించారు. సభ వేలాది మందితో కిక్కిరిసి ఉంది. ప్రతి విద్యార్థి  కదలకుండా వారి సందేశం విన్నారు. వారు నా బోటివానికి కూడ సులభంగా అర్థమయ్యే Simple English లో ప్రసంగించారు. మనం పురాణాల్లో దధీచి , కర్ణుడు మొదలైన వారిని గురించి వింటాం .     

   శ్రీ రతన్ టాటా గారి దయ దాతృత్వం గమనిస్తే అవన్నీ నిజమే అనిపిస్తాయి. ఆయన దేశ ప్రజలకు చేసిన సేవలు అందరికీ పరిచితాలే . ఇక నాకున్న  సాంకేతిక జ్ఞానం చాల స్వల్పం కావడం వల్ల దూరం నుంచి  వారి ఫొటోలు కొన్ని   తీసుకో గలిగానే, గాని వారి సందేశం రికార్డు చేసుకోలేకపోయాను. నిజంగా ఆయన ధన్యజీవి. ఆయన మనదేశంలో పుట్టినందుకు మనమందరం ధన్యులం.

వారి మరణ వార్త విని నేను ఇవన్నీ గుర్తుకు తెచ్చుకున్నాను . ఇవన్నీ మీకు పంచే నా  ప్రయత్నమే ఇది

                  <><><>

 

Wednesday, October 16, 2024

అనుభవాలు -జ్ఞాపకాలు -1&2

 

అనుభవాలు -జ్ఞాపకాలు -1

చిలకమర్తి దుర్గాప్రదాదరావు

ఒకరోజు మా గురువర్యులు శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మగారు మహాభారతం పాఠం చెపుతున్నారు. అది నన్నయగారి పాఠ్యభాగం .

అందులో “సుందరి! నాకోడండ్రుర

యందభ్యర్హితవు నీవు” అనే పద్యం చెపుతున్నారు. 

నేను లేచి గురువుగారూ ! కోడండ్రు అంటే సరిపోతుంది కదండీ! కోడండ్రురు అని బహువచనంపై మరల బహువచనం ఎందుకు? అన్నాను .

వారు దానికి సమాధానంగా ఆయనకు కోడళ్ళు ఒకరా ఇద్దరా. 108 మంది కదా!  అందుకే వేసుంటాడులే అన్నారు . ఆయన పాఠప్రవచనం అంత సరసంగా ఉండేది .  అలాగే ఒకచోట సంఖ్యము అనే పదం వచ్చింది. సంఖ్యం అంటే యుద్ధం . ఆ విషయం direct గా చెప్పకుండా , సఖ్యానికి సున్న పెడితే సంఖ్యమేగా అన్నారు . వారి బోధన అంత సరసంగా ఉండేది.

అనుభవాలు -జ్ఞాపకాలు -1

చిలకమర్తి దుర్గాప్రదాదరావు

ఒకరోజు మా గురువర్యులు శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మగారు మహాభారతం పాఠం చెపుతున్నారు. అది నన్నయగారి పాఠ్యభాగం .

అందులో “సుందరి! నాకోడండ్రుర

యందభ్యర్హితవు నీవు” అనే పద్యం చెపుతున్నారు. 

నేను లేచి గురువుగారూ ! కోడండ్రు అంటే సరిపోతుంది కదండీ! కోడండ్రురు అని బహువచనంపై మరల బహువచనం ఎందుకు? అన్నాను .

వారు దానికి సమాధానంగా ఆయనకు కోడళ్ళు ఒకరా ఇద్దరా. 108 మంది కదా!  అందుకే వేసుంటాడులే అన్నారు . ఆయన పాఠప్రవచనం అంత సరసంగా ఉండేది .  అలాగే ఒకచోట సంఖ్యము అనే పదం వచ్చింది. సంఖ్యం అంటే యుద్ధం . ఆ విషయం direct గా చెప్పకుండా , సఖ్యానికి సున్న పెడితే సంఖ్యమేగా అన్నారు . వారి బోధన అంత సరసంగా ఉండేది.

                                           అనుభవాలు – జ్ఞాపకాలు -2

 నేను ఆంధ్రవిశ్వవిద్యాలయాలో M.A సంస్కృతం చదువుకుంటున్నరోజుల్లో (1978-80) ఒకే బిల్డింగులో ఒక సంవత్సరం ఉదయం తెలుగుశాఖ మరో సంవత్సరం ఉదయం సంస్కృతశాఖ చొప్పున పని చేసేవి.     ఒకనాడు  సాయంత్రపు వేళ నేను మా డిపార్టుమెంటు ముందున్న చెట్టు క్రింద కూర్చుని ఏదో చదువుకుంటున్నాను. అప్పుడు ఒకాయన అక్కడకు వచ్చారు. ఏమయ్యా! నన్ను జోగారావు దగ్గరకు తీసుకెళ్ళగలవా? అని అడిగారు . ఆయన చాల పెద్దవారు. తప్పకుండా తెసికెళతానండీ, ఇంతకీ మీరెవరూ? తమరి పేరేమిటి ? అని అడిగాను . నన్ను గంటి. జోగిసోమయాజి  అంటారు అన్నారాయన . అది వినగానే నాకు కళ్ళు తిరిగి క్రిందపడ్డంత పనైంది. అప్పటికే ఆయన గురించి నాకు బాగా తెలుసు , ఆయన మన తెలుగు వారందరికీ  భాషాశాస్త్ర పితామహులు. నేను భాషాప్రవీణ చదువుతున్నప్పుడు ఆయన  గ్రంథం గురించి కొంత విన్నాను. కాని నాకు తెలియందల్లా ఒక్కటే, అయన అప్పటికి సజీవులై ఉన్నారనేది . నేను వెంటనే ఆనందంతో ఆయన చెయ్యి పుచ్చుకున్నాను. మెల్లమెల్లగా నడుచుకుంటూ చేరువలో ఉన్న ఆచార్య జోగారావుగారి ఇంటికి బయలుదేరాం. వారితో నడుస్తున్నంత సేపు తెలుగు భాషాశాస్త్రానికి వారు చేసిన , చేస్తున్న సేవలకు సంబంధించిన ఎన్నో ఎన్నెన్నో  విషయాలు తెలియజేశారు . కొంతసేపటికి వారి ఇంటికి చేరాం. కాని ఆ సమయంలో ఆచార్య జోగారావుగారు పై అంతస్తులో ఉన్నారు. అది అక్కడున్న ఇనుప నిచ్చెన సహాయంతో ఎక్కాలి .

ఆ విషయం వీరికి చెప్పేను. నన్ను అక్కడికే తీసుకెళ్ళు అన్నారాయన. ఇద్దరు పైకి చేరాం . తీరా అక్కడకు వెళ్ళాక జోగారావుగారు నాతో “ ఏమయ్యా ! ఎంతపని చేశావ్! ఆయనెవరో నీకు తెలుసా! అన్నారు. ఇప్పుడే తెలిసిందండి వారు మీ గురువుగారని అన్నాను . నాకు చెపితే నేనే క్రిందకు వచ్చేవాణ్ణిగా,  ఎంతపొరబాటు జరిగింది  అన్నారు . ఆయనే స్వయంగా తనను మీ దగ్గరకు తీసికెళ్ళమన్నారండీ అన్నాను. ఆ తరువాత వారటు నేనిటు కదిలాం .  ఈ విధంగా వారితో గడిపింది ఐదు నిముషాలే అయినా వారి కలయిక జీవితానికి సరిపోయే ఆనందాన్నిచ్చింది. అది మీతో పంచుకోవాలనేదే ఈ చిన్న ప్రయత్నం .               

Monday, October 14, 2024

బ్రహ్మశ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మగారిశిష్యకోటి రచించిన గురుస్తుతి

 

బ్రహ్మశ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మగారిశిష్యకోటి రచించిన

గురుస్తుతి

సేకరణ:- చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

  మా గురుదేవులైన శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు సంస్కృతాంధ్ర, అంగ్లభాషలలో గొప్ప పండితులు,  మహాకవి, ఉత్తమోత్తమ అధ్యాపకులున్ను. వారు ఎన్నో ప్రాచ్య విద్యాకళాశాలల్లో(oriental colleges) అధ్యాపకునిగా  పనిచేశారు . వరంగల్లు లోని S.V.S.A కళాశాలలో PRINCIPAL గా కూడ పనిచేశారు. ఆంధ్రజాతీయకళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయం మొదలైన గొప్ప విద్యాసంస్థలలో Member Of Council కౌన్సిల్ సభ్యుని గాను , Member of Senate సెనేట్ సభ్యునిగానూ, Member of Acadamic Council  అకాడమిక్ కౌన్సిల్ సభ్యుని గాను  ఎన్నో హోదాలలో  భాషాసేవ చేశారు . ఆ నాడు మహాత్ముని అడుగుజాడల్లో అందరు విదేశావస్తువులను బహిష్కరిస్తే వీరు ఆంగ్లభాషను కూడ బహిష్కరిం చారని కొందరు పెద్దలు చెప్పగా విన్నాను. ఇక మల్లంపల్లివారిది పండిత వంశం . తాత, ముత్తాతల నాటి నుండి ఎంతోమంది గొప్ప కవులుగా పండితులుగా ప్రసిద్ధి పొందారు . మా గురుదేవులు మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు బహు గ్రంథకర్త .  ఎన్నో ఖండకావ్యాలు వెలయించి హరితకవి అనే పేరు పొందారు. ఉత్తరనైషధం  రచించి అభినవ శ్రీనాథ అనే బిరుదు పొందారు. ఉత్తమమనుసంభవం  రచించి అభినవపెద్దన గా పేరొందారు .  కాంచీఖండం  రచించి ఆంధ్రకాంచీఖండచతురానన అనే బిరుదు కైవశం చేసుకున్నారు.  తెలుగువ్యాకరణాన్ని అనితరసాధ్యమైన రీతిలో బోధించి అభినవ సూరి అని ప్రశంసలందుకున్నారు .

వారి శిష్యులలో ప్రముఖులు, భీమవరం D.N.R కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసిన శ్రీ N.V.K సుబ్బరాజు గారు ‘ సూరి మఱపించి అభినవ సూరియైన భర్గరూపగురుల కభివందనములు ‘ అని వారిని ప్రశంసించడం ఇందుకు నిదర్శనం . 

ఇక సంస్కృత , తెనుగుసాహిత్యాల్లో వారు చదువని గ్రంథం ఇంచుమించుగా లేదని చెప్పొచ్చు . నేను పాలకొల్లులోని  శ్రీక్షీరారామలింగేశ్వర సంస్కృతకళాశాలలో చదువుతున్నప్పుడు మా కందరికి  వ్యాకరణం, సాహిత్యం బోధించేవారు . వ్యాకరణాన్ని సాహిత్యంలాగా ఆసక్తికరంగా బోధించడం వారి ప్రత్యేకత. ఇక సాహిత్యం విషయానికొస్తే, సాహిత్యానికి సంబంధించిన ఆయా అంశాలు చెప్పేటప్పుడు  తన్మయులై స్వయంగా రసప్రవాహంలో ఓలలాడుతూ విద్యార్థులను కూడ రసప్రవాహంలో ముంచెత్తేసేవారు.

                                        ఈ మధ్య వారి కుమార్తె, మా సోదరి శ్రీమతి కాళహస్తీశ్వరి వారి శిష్యులు వ్రాసిన కొన్ని పద్యాలను నాకు పంపించారు . వ్రాసిన వారెవరో నాకు తెలియదు.

ఆమె పంపిన కాగిత ప్రతి శిథిలమైనది కావడం వల్ల  నా కర్థమైనంత వరకు వాటిని సేకరించి ఇందులో పొందుపరుస్తున్నాను. ఇవి రచించిన వారి పేర్లు చెప్పలేకపోతున్నందుకు నన్ను     

క్షమించ ప్రార్థన.

బహుశ ఇవి వారు   వరంగల్లు లోని S.V.S.A కళాశాలలో PRINCIPAL గా  పనిచేసిన కాలంలో వారి శిష్యులు వ్రాసినవి కానోపును. ఎవరైనా తెలియజేస్తే వారి పేర్లు పొందుపరచెదను. నా అవగాహన లోపం వల్ల దొర్లిన తప్పులు కూడ సవరించు కొందును.

ఇట్లు

వారి శిష్య పరమాణువు

చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 

1.                 శ్రీమత్కాకతిసార్వభౌమహృదయశ్రీ భావభాగ్యోదయ

 శ్రీ మూలమ్మగు నోరుగల్లు కవితా సీమంతినీ హాసమై

మీ మూలమ్మున  వెల్గుచున్నది గదా! మేమా వెలుం గుం గనన్

భూమిం బుట్టితిమంచు పల్కవలెనే పూజ్యార్హ వాగ్ధోరణిన్

2.                 గేయకవిత్వలోకమును గేలి యొనర్చు భవత్ప్రబంధముల్  

ప్రాయవయస్కులైన కవిపండితముఖ్యుల ధర్మ దృష్టికిన్  

సాయముగా వెలుంగు శిరసా మనసా కొనియాడు తీరులై

ప్రాయమురాని చిన్ని కవిపండిత దృష్టి కగోచరమ్ముములై

3.                 పలువురు శిష్యులుండుటయె భాగ్యవిశేషముగా దలంచు ని

శ్చల మధురార్ద్ర చిత్తులగు సద్గురుముఖ్యులు మీరలిత్తఱిo

దెలుగు ప్రబంధవర్ణనలు దివ్యకథాకవి మార్గ మూ

ర్తులనగనొప్పుమీ హృదయతోయద కావ్యకలా ప్రబంధమై

4.                 ప్రౌఢ కవితాపితామహుల్ పలికినట్లు

పలుకబడిన యుత్తర నైషధలలిత రచ

నాదులకతాన వీరేశ్వరాఖ్యులగుచు

సర్వ సంస్కృతాంధ్ర కవీంద్రుల గర్వ రేఖ

లుదయమయ్యెనవ్యాంధ్ర శుభోదయమున

5.                 కవిసమ్రాట్టులుకొందఱుoడిరనగా గమ్మత్తదేమంచు స

త్కవి కావ్య ప్రభుతా క్రియా మధురతా తాత్పర్య భావమ్ముతో         

   కవిలోకమ్మును గాంచినాడ కవినా కావ్యమ్ము నా మీరగున్

కవిసమ్రాట్టను పేరు మీకు వలదే ! కాకున్న లేకుండే బో.

6.                 కాంచీఖండమొకొకోక్కచో కఠినమై కన్పించినంగాని దీ

పించుం దివ్య కథామరంద కలనా ప్రీతాత్ములై పాఠకుల్

కాంచీ ఖండకవిత్వమార్గములతో ...............

.........................................................      

7.                 ఉత్తరనైషధీయరచనోత్తమమార్గము కాంచువాడు లో

కోత్తరభావభక్తుడయి ఉతమసత్కథచూచి కల్పనా

యత్తమనస్కుడై మధురసామృతధారల తృప్తి పొందడే

మెత్తని చిత్తమిట్టిదన మేలును పొందుచు కీడు వీడుచున్

8.                శ్రీరఘువంశసత్కథయు చిక్కని పాకమునం బడెన్ భవ

ఛ్రీరమణీయ హస్తమున తీర్పులు దిద్దిన కాళిదాసు లో

నారసి చూడ జూడ గననయ్యెడు నెట్లన భావమాధురీ

భావమనస్కుడై తెలుగు పండితకోటికి పుజనీయుడై     

9.                భరతుని గన్న తల్లి కథ భావన చేసి మహూత్తమంబుగా

పరగు విధాన చెప్పిన భవత్కవితా విలసత్సు హి మాలయం

బరయ శకుంతలా రమణి యామెకు తోచని ధర్మముండునే

గురుజనభక్తి బందురునకు సుతయై ధరపై చెలంగుతన్

10.            నానావిధ కవితాధా

రానుభవస్రష్టలైనయాంధ్రకవీంద్రుల్

గానము చేయరెసుందర   

 భానుమతీ, ఋషిచరిత్ర పద్యములెల్లన్

 <><><>