Monday, October 14, 2024

బ్రహ్మశ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మగారిశిష్యకోటి రచించిన గురుస్తుతి

 

బ్రహ్మశ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మగారిశిష్యకోటి రచించిన

గురుస్తుతి

సేకరణ:- చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

  మా గురుదేవులైన శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు సంస్కృతాంధ్ర, అంగ్లభాషలలో గొప్ప పండితులు,  మహాకవి, ఉత్తమోత్తమ అధ్యాపకులున్ను. వారు ఎన్నో ప్రాచ్య విద్యాకళాశాలల్లో(oriental colleges) అధ్యాపకునిగా  పనిచేశారు . వరంగల్లు లోని S.V.S.A కళాశాలలో PRINCIPAL గా కూడ పనిచేశారు. ఆంధ్రజాతీయకళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయం మొదలైన గొప్ప విద్యాసంస్థలలో Member Of Council కౌన్సిల్ సభ్యుని గాను , Member of Senate సెనేట్ సభ్యునిగానూ, Member of Acadamic Council  అకాడమిక్ కౌన్సిల్ సభ్యుని గాను  ఎన్నో హోదాలలో  భాషాసేవ చేశారు . ఆ నాడు మహాత్ముని అడుగుజాడల్లో అందరు విదేశావస్తువులను బహిష్కరిస్తే వీరు ఆంగ్లభాషను కూడ బహిష్కరిం చారని కొందరు పెద్దలు చెప్పగా విన్నాను. ఇక మల్లంపల్లివారిది పండిత వంశం . తాత, ముత్తాతల నాటి నుండి ఎంతోమంది గొప్ప కవులుగా పండితులుగా ప్రసిద్ధి పొందారు . మా గురుదేవులు మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు బహు గ్రంథకర్త .  ఎన్నో ఖండకావ్యాలు వెలయించి హరితకవి అనే పేరు పొందారు. ఉత్తరనైషధం  రచించి అభినవ శ్రీనాథ అనే బిరుదు పొందారు. ఉత్తమమనుసంభవం  రచించి అభినవపెద్దన గా పేరొందారు .  కాంచీఖండం  రచించి ఆంధ్రకాంచీఖండచతురానన అనే బిరుదు కైవశం చేసుకున్నారు.  తెలుగువ్యాకరణాన్ని అనితరసాధ్యమైన రీతిలో బోధించి అభినవ సూరి అని ప్రశంసలందుకున్నారు .

వారి శిష్యులలో ప్రముఖులు, భీమవరం D.N.R కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసిన శ్రీ N.V.K సుబ్బరాజు గారు ‘ సూరి మఱపించి అభినవ సూరియైన భర్గరూపగురుల కభివందనములు ‘ అని వారిని ప్రశంసించడం ఇందుకు నిదర్శనం . 

ఇక సంస్కృత , తెనుగుసాహిత్యాల్లో వారు చదువని గ్రంథం ఇంచుమించుగా లేదని చెప్పొచ్చు . నేను పాలకొల్లులోని  శ్రీక్షీరారామలింగేశ్వర సంస్కృతకళాశాలలో చదువుతున్నప్పుడు మా కందరికి  వ్యాకరణం, సాహిత్యం బోధించేవారు . వ్యాకరణాన్ని సాహిత్యంలాగా ఆసక్తికరంగా బోధించడం వారి ప్రత్యేకత. ఇక సాహిత్యం విషయానికొస్తే, సాహిత్యానికి సంబంధించిన ఆయా అంశాలు చెప్పేటప్పుడు  తన్మయులై స్వయంగా రసప్రవాహంలో ఓలలాడుతూ విద్యార్థులను కూడ రసప్రవాహంలో ముంచెత్తేసేవారు.

                                        ఈ మధ్య వారి కుమార్తె, మా సోదరి శ్రీమతి కాళహస్తీశ్వరి వారి శిష్యులు వ్రాసిన కొన్ని పద్యాలను నాకు పంపించారు . వ్రాసిన వారెవరో నాకు తెలియదు.

ఆమె పంపిన కాగిత ప్రతి శిథిలమైనది కావడం వల్ల  నా కర్థమైనంత వరకు వాటిని సేకరించి ఇందులో పొందుపరుస్తున్నాను. ఇవి రచించిన వారి పేర్లు చెప్పలేకపోతున్నందుకు నన్ను     

క్షమించ ప్రార్థన.

బహుశ ఇవి వారు   వరంగల్లు లోని S.V.S.A కళాశాలలో PRINCIPAL గా  పనిచేసిన కాలంలో వారి శిష్యులు వ్రాసినవి కానోపును. ఎవరైనా తెలియజేస్తే వారి పేర్లు పొందుపరచెదను. నా అవగాహన లోపం వల్ల దొర్లిన తప్పులు కూడ సవరించు కొందును.

ఇట్లు

వారి శిష్య పరమాణువు

చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 

1.                 శ్రీమత్కాకతిసార్వభౌమహృదయశ్రీ భావభాగ్యోదయ

 శ్రీ మూలమ్మగు నోరుగల్లు కవితా సీమంతినీ హాసమై

మీ మూలమ్మున  వెల్గుచున్నది గదా! మేమా వెలుం గుం గనన్

భూమిం బుట్టితిమంచు పల్కవలెనే పూజ్యార్హ వాగ్ధోరణిన్

2.                 గేయకవిత్వలోకమును గేలి యొనర్చు భవత్ప్రబంధముల్  

ప్రాయవయస్కులైన కవిపండితముఖ్యుల ధర్మ దృష్టికిన్  

సాయముగా వెలుంగు శిరసా మనసా కొనియాడు తీరులై

ప్రాయమురాని చిన్ని కవిపండిత దృష్టి కగోచరమ్ముములై

3.                 పలువురు శిష్యులుండుటయె భాగ్యవిశేషముగా దలంచు ని

శ్చల మధురార్ద్ర చిత్తులగు సద్గురుముఖ్యులు మీరలిత్తఱిo

దెలుగు ప్రబంధవర్ణనలు దివ్యకథాకవి మార్గ మూ

ర్తులనగనొప్పుమీ హృదయతోయద కావ్యకలా ప్రబంధమై

4.                 ప్రౌఢ కవితాపితామహుల్ పలికినట్లు

పలుకబడిన యుత్తర నైషధలలిత రచ

నాదులకతాన వీరేశ్వరాఖ్యులగుచు

సర్వ సంస్కృతాంధ్ర కవీంద్రుల గర్వ రేఖ

లుదయమయ్యెనవ్యాంధ్ర శుభోదయమున

5.                 కవిసమ్రాట్టులుకొందఱుoడిరనగా గమ్మత్తదేమంచు స

త్కవి కావ్య ప్రభుతా క్రియా మధురతా తాత్పర్య భావమ్ముతో         

   కవిలోకమ్మును గాంచినాడ కవినా కావ్యమ్ము నా మీరగున్

కవిసమ్రాట్టను పేరు మీకు వలదే ! కాకున్న లేకుండే బో.

6.                 కాంచీఖండమొకొకోక్కచో కఠినమై కన్పించినంగాని దీ

పించుం దివ్య కథామరంద కలనా ప్రీతాత్ములై పాఠకుల్

కాంచీ ఖండకవిత్వమార్గములతో ...............

.........................................................      

7.                 ఉత్తరనైషధీయరచనోత్తమమార్గము కాంచువాడు లో

కోత్తరభావభక్తుడయి ఉతమసత్కథచూచి కల్పనా

యత్తమనస్కుడై మధురసామృతధారల తృప్తి పొందడే

మెత్తని చిత్తమిట్టిదన మేలును పొందుచు కీడు వీడుచున్

8.                శ్రీరఘువంశసత్కథయు చిక్కని పాకమునం బడెన్ భవ

ఛ్రీరమణీయ హస్తమున తీర్పులు దిద్దిన కాళిదాసు లో

నారసి చూడ జూడ గననయ్యెడు నెట్లన భావమాధురీ

భావమనస్కుడై తెలుగు పండితకోటికి పుజనీయుడై     

9.                భరతుని గన్న తల్లి కథ భావన చేసి మహూత్తమంబుగా

పరగు విధాన చెప్పిన భవత్కవితా విలసత్సు హి మాలయం

బరయ శకుంతలా రమణి యామెకు తోచని ధర్మముండునే

గురుజనభక్తి బందురునకు సుతయై ధరపై చెలంగుతన్

10.            నానావిధ కవితాధా

రానుభవస్రష్టలైనయాంధ్రకవీంద్రుల్

గానము చేయరెసుందర   

 భానుమతీ, ఋషిచరిత్ర పద్యములెల్లన్

 <><><>

No comments: