Tuesday, November 26, 2024

అనుభవాలు -జ్ఞాపకాలు-5 by డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 అనుభవాలు -జ్ఞాపకాలు-5

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

అది 1975. నేను పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వరస్వామి ఓరియంటల్ కళాశాలలో  భాషాప్రవీణ  ఎంట్రన్సు, ప్రిలిమినరీ పూర్తి చేసి ఫైనల్ మొదటి సంవత్సరం చదువుతున్నాను .  ఒక రోజున నా పేరుతో  కాలేజీకి ఒక పెద్ద కవరు వచ్చింది . నాకెవరూ ఉత్తరం కూడ వ్రాయరు , కవరు వచ్చిందేమిటా అనుకున్నాను .  From address చూస్తే ఆంధ్రవిశ్వవిద్యాలయం అని ఉంది. To address చూస్తే నా పేరు, కేరాఫ్ Principal అని ఉంది. మా ప్రినిపాల్ గారు శ్రీ లంక విశ్వేశ్వరసుబ్రహ్మణ్యం గారు. స్వయంగా వారే కవరు తెరిచి చూశారు .  నేను భాషాప్రవీణ ప్రిలిమినరీలో యునివర్సిటీ ఫస్టు రావడం చేత నన్ను అంధ్రవిశ్వవిద్యాలయం Board of Studies కి  విద్యార్థి ప్రతినిధిగా నియమించినట్లు,   మీటింగుకు ఫలానా తేదీన రమ్మని ఆ ఉత్తరంలో సారాంశం. ఆ కవర్లో  పది, పదిహేను ఉత్తరాలు కూడ ఉన్నాయి.  తీరా అవన్నీ చదివితే ఫలానా పుస్తకం సిలబస్ లో పెట్టించండి  అని ఎంతో మంది పంపిన వివరాలున్నాయి . నా కేమీ అర్థం కాలేదు .

నా కీ అవకాశం వచ్చినందుకు మా కళాశాల అధ్యాపకులు సహచర మిత్రులు అందరు కూడ చాల సంతోషించారు.  అప్పుడు నా వయస్సు 18. నాకు pants కూడ లేవు. నిక్కర్లే ఉండేవి. నిక్కర్లతో యూనివర్సిటీకి వెళ్ళడమెలా అని ఆలోచిస్తున్న నాకు మా మిత్రుడు, సహాధ్యాయి  శ్రీ ముసునూరి పేరయ్య శాస్త్రి ఒరేయ్ , ప్యాంటులు లేవని గాబరా పడకు   అని తన జత ఒకటి నాకు ఇచ్చాడు. మేమిద్దరం పొట్టి వాళ్ళం, అతని బట్టలే నాకు సరిపోతాయి . నేను కూడ ఒక జత అప్పటి కప్పుడే  కుట్టించుకున్నాను. అంతలో మీటింగుకు హాజరు కావలసిన రోజు రానే వచ్చింది. నేనొక్కణ్ణే విశాఖపట్టణం బయలుదేరాను. జీవితంలో అదే మొదటి దూర ప్రయాణం . నా మనస్సులో ఆనందం, ఆందోళన రెండు ఒకేసారి చోటు చేసుకున్నాయి. ఆనందం ఎందుకంటే విశ్వవిద్యాలయం చూసే అవకాశం వచ్చినందుకు . ఆందోళన ఎందుకంటే ఏమీ తెలియని నాకు ఆ మీటింగులో పాల్గొనవలసి వస్తున్నందుకు. ఆ రోజుల్లో రైల్లో ప్రయాణం చాల కష్టంగా ఉండేది . చాల మెల్లగా నడిచేవి పాసింజరులు ఎక్స్ ప్రెస్సులు  కూడ.  తిరుపతిలో గుండు కొట్టిస్తే పూరీ చేరేటప్పటికి జుట్టు వచ్చేస్తుంది , టోపీ ఖర్చు మిగులుతుందని కూడ అనుకునేవారు కొంతమంది . ఎలాగో రైలెక్కి  విశాఖ చేరుకున్నాను.

ఇక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రవేశించగానే నేను పొందిన అనుభూతి ఇప్పటికీ మఱువలేను. అది శ్రీ యుతులు  C.R.రెడ్డి , సర్వేపల్లి . రాధాకృష్ణన్, V.S.కృష్ణ వంటి మహనీయులు తీర్చిదిద్దినది.   అక్కడ చదువుకునే అవకాశం కూడ వస్తే బాగుంటుంది అనుకున్నాను ఆ భాగ్యం నాకు తరువాత దక్కింది. ఇక ఆనాటి Board of Studies సమావేశంలో పెద్ద పెద్ద వారంతా  పాల్గొన్నారు . వారెవరినీ నేనెఱుగను . పేరు అడుగుదామంటే ఏమనుకుంటారో అని భయం . ఒక dumb spectator లా ఉండిపోయాను . Board of Studies చైర్మన్ గా వచ్చిన వారు శ్రీ మానాప్రగడ. శేషసాయి గారని, వారు విజయనగరం కళాశాల ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారని తెలిసింది . వారంతా ఎన్నో విషయాలపై ఆంగ్లంలో చర్చించుకున్నారు. అవన్నీ పూర్తిగా నా కర్థం కాక పోయినా కొన్ని అర్థం అయ్యాయి. కాని నాకు మాట్లాడే ధైర్యం, చొరవ  కలగలేదు. కొన్ని పుస్తకాలు syllabus లో పెట్టమని నేను కూడ సభ్యులను అడిగాను. అవి వారు అనుమతించారో లేదో కూడ నాకు తెలియలేదు . మీటింగు అయిన తరువాత నాకు T.A& D.A రూపంగా కొంత సొమ్ము ఇచ్చారు. అదెంతో గుర్తు లేదు గాని ఎక్కువ మొత్తమే అనిపించింది . మొత్తం మీద ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణ ప్రవేశ అనుభవాలను , సమావేశపు జ్ఞాపకాలను ఇప్పటికీ మరిచిపోలేను.

                    <><><>

Friday, November 22, 2024

ఉదారచరితులు vs దారచరితులు. by డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 

ఉదారచరితులు vs దారచరితులు

(చమత్కారం కోసమే )

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

మనుషులు ఉదారచరితులు,  దారచరితులు అని రెండు రకాలు.

అయం నిజ: పరో వేతి గణనా లఘుచేతసాం  

ఉదారచరితానాం తు వసుధైక కుటుంబకం  

 అని భర్తృహరి మాటలు . ఇందులో మొదటి రెండు పాదాలు  దార చరితులకు,  చివరి రెండు  పాదాలు  ఉదార చరితులకు వర్తిస్తాయని  నా అభిప్రాయం . ఉదార చరితుల   లక్ష్యం ఎలా ఉంటుందంటే వారు ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావిస్తారు. ఇక  ‘దార’ అంటే భార్య . దార చరితులు అంటే భార్యే చరిత్రగా గలవారు.   వారికి వారి  కుటుంబమే ప్రపంచం . దార చరితులంటే కేవలం  భార్య మాట మాత్రమే  వినేవారు. ఆమె ఏం చెపితే  అదే చేసేవారు. భార్య మాట వినడం తప్పని నా అభిప్రాయంగా భావించకండి. భార్య మాట వినడం తప్పు కాదు. కానీ దానికో పధ్ధతి ఉంటుంది. విన వలసినవి వినాలి . విన కూడనివి విన కూడదు . అలా  కాకుండ ఆమె ‘క’ అంటే ‘క’ , ‘కి’ అంటే ‘కి’ అని వాదించే వారు, అలా ప్రవర్తించే వారు మనకు కొంత మంది కనిపిస్తారు . వీరిని hen pecked husbands అంటారు .  ఇక మొదటి వారికి అంటే ఉదార చరితులకు  ప్రపంచం అంతా ఒక కుటుంబం . వీరికి అంటే దార చరితులకు మాత్రం వారి కుటుంబమే వారికి ప్రపంచం. కుటుంబం తప్ప వేరే ప్రపంచం ఏదీ లేదు.  ఇక ప్రతి వారు తాము ఉదార చరితులుగా ఉండాలో లేక దార చరితులుగా మిగిలి పోవాలో  ఎవరికి వారే స్వయంగా నిర్ణయించు కోవాలి.

                                             <><><>

 

 

Wednesday, November 20, 2024

శ్రీ సుబ్రహ్మణ్య శతకము. రచన :- పేరి వేంకట సూర్యనారాయణ మూర్తి సమీక్ష : డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

 

శ్రీ సుబ్రహ్మణ్య శతకము

రచన :- పేరి వేంకట సూర్యనారాయణ మూర్తి (అప్పాజీ)

సమీక్ష : డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాదరావు.

అందరిచేత ముద్దు ముద్దుగా అప్పాజీ పేరుతో  పిలవబడే సూర్యనారాయణమూర్తి నాకు M.A.లో సహాధ్యాయి. ఉద్యోగం వేరువేరు ప్రదేశాల్లో చేస్తున్నా ఇంటర్ బోర్డు పుణ్యమా అని నాటి నుంచి కొన్ని దశాబ్దాల వరకు  మేమిద్దరం సంవత్సరానికి ఒకటి రెండుసార్లు విధిగా కలుసుకునే వాళ్లం.  మా స్నేహం ఎటువంటి దనగా  అతను పలకరిస్తే నేను పులకరిస్తాను. అలాగే నేను పలకరిస్తే ఆతను  పులకరిస్తాడు. మావి పులకరింతతో కూడిన పలకరింపులు . పలకరింపులతో  కూడిన పులకరింతలు . మా మిత్రుడు సామాన్యుడు కాదు, గురుకులక్లిష్టుడు. అందువల్ల నాకు చాల ఇష్టుడు . గురువుల దగ్గర , తండ్రిగారి దగ్గర సంస్కృతాంధ్ర భాషలు చక్కగా చదివినవాడు. సైన్సు లోను గణితంలోను కూడ చాల గట్టివాడని ఆయన బాల్యమిత్రులు చెప్పగా విన్నాను. అతనిలో నాకు నచ్చిన మరో మంచి గుణం పితృభక్తి , పెద్దలపట్ల విధేయత. ఇక ‘పేరి’ అనేది పండిత వంశానికి పర్యాయపదం .  ఎన్నో శాస్త్రాల్లో పేరు మోసిన ఉద్దండ పండితులు ఆ వంశంలో జన్మించారు. “అచట పుట్టిన చిగుఱుకొమ్మైన చేవ” అన్న పెద్దన్న గారి వచనం ఉండనే ఉంది. ఇతను కూడ పాండిత్యంలో ఈ కాలం వాళ్ళ కెవ్వరికీ  తీసిపోడు.

నాకు మంచి అధ్యాపకునిగా   మాత్రమే తెలుసు . ఈ మధ్యనే  ఎన్నో కవితలు కూడ వ్రాస్తున్నాడు. ఎంతో మంది కవి పండితులతో అతనికి పరిచయం ఉంది .

                       ఇక వేదపురుషుని నుండి  షడంగాలు పుట్టినట్లుగా వేదవేద్యుడైన పరమేశ్వరుని నుండి షణ్ముఖుడుద్భవించాడు. ఈయన కారణజన్ముడు. తండ్రిని మించిన తనయుడు . వినాయకుడు తండ్రికి తగ్గ తనయుడైతే ఈయన తండ్రిని మించిన తనయుడు. ఆయన కొన్ని సందర్భాల్లో తండ్రికి కూడ ఉపదేశం చేసినట్లు  పురాణాలు పేర్కొంటున్నాయి. తండ్రికి సాధ్యం కాని తారకుని వధ అతనికి సాధ్యమైంది . అందుకే ఆయన కారణ జన్ముడు. 

ఇక మా మిత్రుడు  రచించిన శ్రీ సుబ్రహ్మణ్య శతకము  ఈ మధ్య నా కంటపడింది. వృత్తాలు వ్రాసే వ్యక్తి కందపద్యాలు ఎంచుకున్నాడు. బహుశా ఆయన స్కందుడు (కందస్వామి) కాబట్టి కందాన్ని ఎంచుకుని ఉండవచ్చు.  ఇది వందకు పైగా అందమైన కందపద్యాలతో స్కందుని స్తుతిస్తూ హృదయానందం చేకూరుస్తోంది . భక్తి భావాలు రేకెత్తించేదిగా ఉంది. ప్రతిపద్యం లోను  సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆయన నెరవేర్చిన కార్యాలు  గుర్తుకొచ్చే విధంగా వివిధ నామాలతో స్తుతిస్తూ వ్రాయడం ఒక విశేషం .    ‘సోమరసేష్ట’, ‘సోరగరూప’  వంటి  వినూత్న ప్రయోగాలు కూడ శతకంలో ఉన్నాయి.  ఈ శతకంలో అనేకమైన పేర్లతో వల్లీనాథుడు కొలువున్న క్షేత్రాలన్నీ  జ్ఞప్తికి తీసుకొచ్చారు.   

ఆయన తండ్రికే సలహాలిచ్చే తనయుడని చెప్పుకున్నాం . దానికి సంబంధించిన ఒక చమత్కార మైన కథ ఇది.

కుమారస్వామి తన తండ్రియైన పరమశివుని దగ్గఱకెళ్లాడుఏరాఎందుకొచ్చావు? పనేంటి? అన్నాడాయన . నాన్నాఅమ్మకి కోపం వచ్చింది.  నీ నెత్తి మీదున్న గంగను వెంటనే విడిచి పెట్టెయ్యి అన్నాడుపార్వతికి ఎందుకు కోపమొచ్చిందో శివునికర్థమయ్యిందిగంగ పార్వతికి సవతి కదా అందుకే అయి ఉంటుంది అనుకున్నాడుసరే లేరాఆవిడ ఎప్పటి నుంచో నా నెత్తి మీద కూర్చుందిఇప్పుడు ఎక్కడ వదలాలి? ఎలా వదలాలినువ్వే చెప్పు అన్నాడువెంటనే ఆవేశంతో కుమారస్వామి ఆఱు ముఖాలు   ఇలా చెయ్యి నాన్నా అన్నాయట. ఆఱు ముఖాలు ఒకసారే 'అంభోధి', 'జలధి', 'పయోధి' , 'ఉదధి', 'వారాన్నిధి', 'వారిధి', ఇలా వివిధ పదాలతో ఒకే అర్థం వచ్చేలాగ "సముద్రంలో వదిలెయ్యి నాన్నా!" అని సమాధానం చెప్పాయట

అంబా కుప్యతి తాత!మూర్ధ్ని విధృతా గంగేయ ముత్సృజ్యతాం

విద్వన్ షణ్ముఖ! కా గతిర్మమ చిరం మూర్ధ్ని స్థితాయావద

కోపావేశవశాదశేషవదనైప్రత్యుత్తరం దత్తవాన్

అంభోధిర్జలధి:పయోధిరుదధిర్వారాన్నిధిర్వారిధి:

ఆ విషయం అలా ఉంచుదాం . ఈ కావ్యంలో 132 కందపద్యాలున్నాయి. అన్ని స్తుతి పరాలే . ఆ పద్యాలను నేను పొందుపరచడం లేదు . ఇక అక్కడక్కడ ఒకటి రెండు దోషాలు దర్శనమిచ్చాయి . దానికి కారణం నా అజ్ఞానం గాని , అతని అనవధానత గాని  లేక అవి ముద్రారాక్షసాలు గాని కావచ్చు.     ఏది యేమైనా “నడచుచు నుండువారి చరణంబులకే కద! రాళ్ల తాకుడుల్” అన్న సామెత లాగ    దోషాలు    వ్రాసే వాళ్ళకే వస్తాయి గాని ఏమీ వ్రాయని నాలాంటి వాళ్ళ కెందుకొస్తాయి?

ఈ గ్రంథం విద్యాధికులైన  శ్రీ తోపెల్ల. బాలసుబ్రహ్మణ్యశర్మగారి ఆధ్వర్యవంలో జరిగిన పండితసభలో ఆవిష్కారింపబడటం మరో విశేషం . ఇది భగవద్భక్తులకు ముఖ్యంగా శివకుమార భక్తులకు నిత్య పారాయణ గ్రంథంగా ఉపయోగపడుతుంది  అనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఈయన మరెన్నో గ్రంథాలు రచించి ఆంధ్ర సారస్వతానికి పుష్టిని తుష్టిని చేకూర్చాలని ఆశిస్తూ ---

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

 

 

Tuesday, November 19, 2024

పెదవి దాటితే పృథివి దాటుతుంది. డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

 

పెదవి దాటితే పృథివి దాటుతుంది

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

పూర్వం మన పెద్దవారు ‘పెదవి దాటితే పృథివి దాటుతుంది అనేవారు . ఎందుకో తెలిసేది కాదు. సంస్కృతంలో ఒక సూక్తి ఉంది . అదేంటంటే ‘శతం వద, ఏకం  మా లిఖ’

వంద మాట్లాడు కానీ ఒక్కటి కూడ వ్రాయకు అని . ఎందుకంటే  ఎన్ని మాట్లాడినా అవన్నీ  గాలిలో కలిసిపోతాయని ఏ ఒక్కటి వ్రాసినా అది స్థిరంగా ఉండి పోతుందని వారి అభిప్రాయం . కాని అది ఒకప్పటి మాట.  ఇప్పుడు ఏమి మాట్లాడినా అది కూడ స్థిరంగానే ఉండి పోతోంది electronic media దయవల్ల .

      అందుకని ఈ రోజుల్లో ప్రతివ్యక్తి పూర్వం కంటే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ఏ వ్యక్తినీ అనవసరంగా నిందించకూడదు. అది చాల ప్రమాదకరం. ఈ విషయంలో సంత కబీర్ ఒక మాట అంటారు . ప్రస్తుత విషయంలో ఈ  విషయం ప్రస్తావించడం అప్రస్తుతం కాదు .

दुर्बल को न सतायि(ई)ये जाकी मोटा हाय

मुई खाल की सांस सो सारा भस्म हो जाय దుర్బల్ కో న సతాయి(ఇ)యే, జా కీ మోటా హాయ్; ముఈ ఖాల్ కీ సాంస్ సో, సార భస్మ హో జాయ్ .

దీని అర్థం నాకు తెలిసినంత వరకు చెపుతాను . నాకు హిందీ లో పరిజ్ఞానం చాల తక్కువ.

ఏమయ్యా ! నువ్వు బలగర్వంతోనో ,అధికార గర్వంతోనో  నీ కంటే బలహీనుని ఎప్పుడు నిందించకు. అతడు బలహీనుడైనా అతని ఊపిరికి ( ఉసురు) చాల బలం ఉంది.  ప్రాణం లేని (గాలి) తిత్తినుంచి వెలువడే గాలి  ఇనుమును కరిగిస్తోoది. ఇక ప్రాణమున్న అభాగ్యుని ఊపిరి (ఉసురు) నీ వంశాన్ని దహిస్తుంది జాగ్రత్త సుమా! అంటారు.

అతను భయం చేతనోగౌరవంతోనో  నిన్నేమీ అనలేక పోవచ్చు . కాని ఆతని  ఉసురు మాత్రం నీ వంశాన్ని దహిస్తుంది సుమా .   పూర్వం రాక్షసుల వలన మునులు పొందిన బాధయే (ఉసురై) రాక్షసుల నాశనానికి కారణమైంది .         

  అందువల్ల మనం అనవసరంగా ఎవరినీ

నిందించ కూడదు. ఒకవేళ విమర్శించవలసి వస్తే విషయాన్నే విమర్శించాలి గాని అది వ్యక్తిగత నింద కాకూడదు  . వ్యక్తిగతంగా నిందిస్తే అది తాత్కాలికంగా మనకు ఏమీ అనిపించక పోయినా కాలాంతరంలో ప్రభావం చూపిస్తుంది. మనదేశంలో ఎవరైనా తప్పుచేస్తే విమర్శించే హక్కు ప్రతి వాడికీ ఉంది, కాని నిందించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. ఇక మనం జాగ్రత్తగా సమాజాన్ని పరిశీలిస్తే ఇతరులు బాధపడుతుంటే ఆనందించడమనే ప్రవృత్తి నానాటికి పెరుగుతోంది. కొంతమంది బాధపెట్టి కూడ ఆనందిస్తున్నారు .

దూరదర్శన్ లలో వచ్చే కొన్ని సీరియల్స్ ఈ తత్త్వాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ  పాశవికమైన ఆనందం సమాజానికే చాల ప్రమాదకరం. పూర్వం మన పెద్దల నడవడి చూడండి . అపవిత్రమైన ఆలోచనకు కూడ అవకాశమిచ్చేవారు కాదు. దీపం ఆరిపోయింది అనడానికి బదులు కొండెక్కింది అనేవారు. బియ్యం అయిపోయాయి అనే బదులు బియ్యం నిండుకున్నాయి అనేవారు . తిట్టేటప్పుడు కూడ నీ అమ్మ కడుపు బంగారం గాను ఎంత పని చేశావయ్యా ! , నీ ఇల్లు బంగారం గాను ఏమిటమ్మా ఈ పని అని మందలించే వారు. ఎటువంటి సమాజం ఎలా మారి పోతోంది? ఎక్కడికి పోతోంది?  ఇక క్షమించరాని తప్పు  చేసి నప్పుడు కూడ మృదువుగా

ఓరి! నీ పెళ్ళాం తాడు తెగా అనే తిట్టేవారు .

శ్రీనాథ మహాకవి ఒక చోట అంటాడు . ‘పంచవదనుని కను జేగురించెనేని

తక్షణoబున  తమయాండ్ర త్రాళ్ళు తెగవె’  అని తిడతాడొక చోట  .  ఎవరినైనా మందలించినా వేమనగారి మందలింపులా వారి మనస్సు నొచ్చుకోకుండా వారిలో మార్పు తెప్పించే విధంగా ఉండాలి. ఉదాహరణకు లోభిని మందలిస్తూ ఇలా అంటారు వేమన .

గొడ్డుటావు పిదుక కుండ గొంపోయిన 

పండ్ల నూడ దన్ను పాలనిడదు

లోభివాని నడుగ లాభంబు లేదయా 

విశ్వ దాభిరామ వినుర వేమ!

అలాగే మరొక చోట ,

లోభివాని చంప లోకంబు లోపల

మందు లేదు వేరు మాకు లేదు

పైకమడిగినంత భగ్గునపడి చచ్చు

విశ్వదాభిరామ వినుర వేమ!

ఒకవేళ ఇది లోభి విన్నా నొచ్చుకోడు  సరిగదా, వేమన గారిని లోలోపలే మెచ్చుకుంటాడు . అలాగే  తన సోమ్మ పట్ల ఒక లాగ ఇతరుల సొమ్ము పట్ల మరో లాగ ప్రవర్తించే వాళ్ళు చాల మంది ఉంటారు .

వాళ్ళ గురించి ఎంత అందంగా చెపుతున్నాడో చూడండి.

పాలసంద్రమందు పవళించు వేలుపు

గొల్లలిండ్ల పాలు కోర నేల?

ఎదుటివారి సొమ్ము లెల్లవారికి తీపి  

విశ్వదాభిరామ వినుర వేమ!

కాబట్టి మనం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరిని నిందించకూడదు. ఒక వేళ చెడ్డవారిని మంచి మార్గంలో పెట్టాలనుకుంటే మృదువుగా చెప్పాలి.

ఇక నిందించే వాడు మాత్రమే కాదు ఆ నిందను విని సమర్థించే వాడు నిందించేవాని కన్న ఎక్కువ పాపాన్ని పొందుతాడని కాళిదాసు అంటాడు .

న కేవలం యో మహతోsపభాషతే

శృణోతి తస్మాదపి య: స పాపభాక్

(కుమారసంభవం)  .

పరులను నిందించకు, ప్రమాదాన్ని కొని తెచ్చు కోకు   

<><><>

 

Thursday, November 7, 2024

కవితలపల్లకి (కవితా సంపుటి) రచయిత: శ్రీ వోలేటి నరసింహారావు అభినందన by Dr. Chilakamarthi DurgaprasadaRao,


 కవితలపల్లకి

(కవితా సంపుటి)

రచయిత: శ్రీ వోలేటి నరసింహారావు

 

అభినందన మందారమాల

Dr. Chilakamarthi DurgaprasadaRao,

3/106, Premnagar, Dayalbagh, Agra.

 

ఉదయంతు శతాదిత్యా: ఉదయంత్విందవశ్శతం

న వినా కవివాక్యేన  నశ్యత్యాభ్యంతరం తమ:

అన్నారు మన పెద్దలు . వందలకొలది సూర్యబింబాలుదయించొచ్చు,  వందలకొలది  చంద్రబింబాలుదయించొచ్చు. కానీ మానవుని హృదయాంతరాళాల్లో దాగిన  అజ్ఞానమనే చీకటి కవి మాటలవల్ల మాత్రమే తొలగుతుంది. మరో మార్గం లేదు. అంటే వందలకొలదీ సూర్యచంద్రులు చెయ్యలేని పని కవి తన కలం(సిరాబొట్టు)తో  సాధిస్తాడు . అందుకేనేమో A drop of ink makes a hundred million think అన్నారు .  సాధారణంగా కవి తలలో ఉన్న భావాలే కవితలరూపంలో  బయటికొస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక శ్రీ వోలేటి. నరసింహారావుగారు ఆధునిక కవులలో ఒకరు. ఈయన ప్రముఖ హోమియోవైద్యుల్లో కూడ ఒకరు. అటు మందుల ద్వారా మనుషుల శారీరక అనారోగ్యాన్ని , ఇటు కవితల ద్వారా మానసిక మాలిన్యాన్ని తొలగించగల  సవ్యసాచి.

శ్రీ వోలేటివారి వంశం సాహిత్యరంగంలోను ,  కవితారంగంలోను  ఎంతో ప్రసిద్ధి వహించిందనే సంగతి సాహిత్యలోకానికంతా తెలిసిందే . జంట కవులుగా ప్రసిద్ధిపొంది, ఆంధ్ర దేశాన్ని రసప్లావితం చేసిన వేoకటపార్వతీశ్వరకవులో శ్రీ వోలేటి పార్వతీశంగారొకరు, రెండవ వారు శ్రీ బాలాంత్రపు వేoకటరావు గారు . వారిరువురు తమ కవితా సౌరభాలతో  అఖిలాంధ్రదేశాన్ని ఉర్రూతలూగించారు. . ‘అచట పుట్టిన చిగుఱురుకొమ్మైన చేవ’ అన్నట్లుగా ఆ వంశంలో జన్మిచిన నరసింహారావుగారు రసవత్తరమైన ఎన్నో కవితాఖండికలను సాహిత్యలోకానికందించడం  తెలుగువారికందిన  మరో అదృష్టం.  వీరు తెలుగులోనే కాక ఆంగ్ల, హిందీభాషల్లో కూడ మరెన్నో కవితలను  వెలయించారు. ఈయన సాహిత్యకృషి ఒక ఎత్తైతే  హోమియోవైద్యశాస్త్రంలో వీరు రచించి  ముద్రించిన గ్రంథాలు మరో ఎత్తు .

ఇక వీరి కవితాస్రవంతిలో ‘మేలు కొనుమా’  ‘జ్ఞాన భండారం’ ‘తపన’ , ‘ప్రేమ’ ‘ఉద్యమం’, 1991, మామగారి ఆకస్మికమరణం, పొదుపు, వారసత్వం, బాలల ఆవేదన, ఆరతి, నా ఎద ఒక గుడి, ఆత్మార్పణం, బాల్యం , ఓ యువత , వసంతకోయిల , సేవ, వారసత్వం, వాస్తవమ్ము, విరహం, శేషప్రశ్న , ప్రేయసి, నేను నిన్ను తల చాక, చందమామలో మచ్చ, ఆటం బాంబు శాంతి ఆత్మలోశాoతి, ప్రణయమనేది ఒకవిత్తు,  మొదలైన శీర్షికలతో కవితలు కనిపిస్తున్నాయ్. ప్రాచీన కవితారీతులకు సంబంధించిన గణబద్ధమైన, కవితాగుణబద్ధమైన రచనలు కూడ కనిపిస్తున్నాయి.

 

స్థాలీపులాక న్యాయంగా కొన్ని కవితలు పరిశీలిద్దాం .

 

1.                  ‘మేలుకోనుమా’ అనే కవితాఖండికలో సంతులవాణి ప్రకటమైoదని, శక్తిహీనులైన జీవులకు నిజమైన భక్తిద్వారాలు తెరుచుకున్నాయని, మేలుకొమ్మని హితబోధ చేశారు.      

2.                    “జ్ఞాన భాండారం “ అనే కవితలో సంసారసుఖంకోసం పశువులా ప్రవర్తిం చవద్దని, నీలోదాగియున్న ఆత్మసుఖాన్ని మేల్కొల్పి ఫలితం పొందమని ఉద్బోధించారు.

“ఆత్మజ్ఞానం పొంది పరమాత్మ దర్శించు నరజన్మమందుకే నరుడా!” అని స్పష్టం చేశారు.   

చైతన్యరహితమైన వస్తువులు శాశ్వతమైన సుఖాన్ని  ఇవ్వలేవని ఆత్మసుఖమే గొ ప్పసుఖమని అది సద్గురువు అనుగ్రహం వల్లనే కలుగుతుందని   స్పష్టం చేశారు.

3.                  ‘తపన’ అనే ఖండికలో తాను వట్టి కోరికల పుట్టనని తనకు దర్శనభాగ్యం కలగ జెయ్యమని భగవంతునకు మొరపెట్టు కున్నారు.

4.                  ‘ప్రేమ’ అనే కవితలో ప్రేమ విశ్వానికి కేంద్ర బిందువని, అది దివ్యమైనదని, అదే సత్యమని చెప్పడం ద్వారా ప్రేమయెక్క గొప్పదనాన్ని చాటి చెప్పేరు.

5.                  ఉద్యమం అనే కవితలో మనిషి ప్రయత్నం చేస్తే ఎన్ని అడ్డంకులైనా అధిగమించి లక్ష్యం చేరుకోగలడని ఎన్ని ఆటంకాలెదురైనా ప్రయత్నం మానకుడదని “పడుతూ లేస్తూ ఉన్నా ప్రయత్నం మానకు” అని హితం చెప్పారు.  .

6.                  మరో కవితలో “జననం నీది కాదు మృత్యువు నీది కాదు మధ్యస్థ జీవితం మాత్రం నీదని “ చెబుతూ నీ జీవన దృక్పథానికి ప్రేమ ఓజస్సు కావాలని ప్రేమను జీవన సౌoదర్యహేతువుగా వర్ణించారు.

  రచయిత రాధాస్వామి సంప్రదాయాను యాయి కావడం వల్ల ఆ సిద్ధాంత సారాంశాన్ని ఒక మాటలో వివరిస్తూ “దొరకె నీకు నరశరీరము, స్వామి యిలలో వెలసి యుండగ’ అనే మాటల్లో సంక్షిప్తంగా   మానవుడే మోక్షార్హుడని , సద్గురువే మోక్షప్రదాతయని స్పష్టం చేశారు.

7.                   ఒక ఖండికలో “నా కులము మిన్నని

టెక్కు చేసెదవు నేడు పోయిన

రేపు రెండు

నిన్ను తలచు వారెవరురా” అని  కులదురభిమానాన్ని మృదువుగా దుయ్యబట్టారు.       

‘పొదుపు’ అనే కవితలో పొదుపు  చెయ్యడం సౌభాగ్యానికి , వ్యర్థం అనర్థానికి దారి తీస్తుందని వివరించారు.

‘వారసత్వం’ అనే కవితలో  ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వాన్ని

మన సంస్కృతిగా అభివర్ణించారు.

‘బాలల ఆవేదన’ అనే ఖండికలో బాలలను జాతిప్రగతికి ముఖ్యులుగా వర్ణించారు. అతి ప్రేమ మాకొద్దండీ, అతి క్రోధం భరించ లేమండి , తగు శ్రద్ధనే చూపండి.

ప్రేమముర్తులుగా నిలపండి  అని పిల్లలే పెద్దలకు హితబోధ చెయ్యడం ఈ కవితలో విశేషం .

‘ఆరతి’ అనే ఖండికలో భక్తి అనే వత్తితో ప్రేమ అనే జ్యోతిని వెలిగించాలని  హితం పలికారు.

‘నా ఎద ఒక గుడి’ అనే ఖండికలో ప్రేమ జీవకోటిని పెరగనిస్తుందని ద్వేషం జీవకోటిని తెగటారుస్తుందని ద్వేషాగ్ని తెగటార్చి ప్రేమాగ్నిని  రగుల్కొల్పమని హెచ్చ రించారు.

‘ఆత్మార్పణం’లో  లోకోపకారం కోసం ఆత్మార్పణ చేసుకునే  మబ్బుల్ని మహాత్ముల హృదయాలతో పోల్చడం కవి ప్రతిభకు ఒక నిదర్శనం.

మేఘం వర్షంతో కరుగుతుంది మహాత్ముడు దయావర్షంతో  కరిగిపోతాడని వర్ణించారు. ‘బాల్యం’ అనే కవితలో ‘బాల్యమా! బాల్యమా! ఒక సారి తిరిగిరా

అంటు బాల్యాన్ని హద్దులులేని ఆకాశాగంగతో పోల్చడం మనోజ్ఞమైన భావన.    

 

 ‘యువత’ అనే కవితలో యువత పురోగమనానికి యోగ్యతాపత్రమని చెప్పడం  చాల బాగుంది. ‘వసంతకోయిల’లో వసంతానికి కోయిలకు అవినాభావాన్ని చెప్పడం సొగసుగా ఉంది.

‘సేవ’ అనే కవితలో సేవ కర్మఫలాన్ని విచ్ఛిన్నం చేసి భగవంతుని దరికి చేరుస్తుందని ఉద్బోధించారు. వారసత్వం

సేవఅనే కవితలో  “ఉషారుగా ఉండవలసిన వయస్సులో

ఉసూరుమంటూఉంటావెందుకు ?

నిషా కావలసిన వయస్సులో

విషాదాన్ని పాతరెయ్యి  అనే మాటలు;

చిక్కని ఇక్కట్ల వడిలో

చేజారిన ముచ్చట్ల ఒరిపిడిలో

జీవిత చరమాంకపు బడిలో

బాల్యజీవితపు ఓనమాలు

దిద్దుకోవాలనుంది

 బాల్యమా ఒక్కసారి తిరిగిరా. అంటారు.

ఇలాగే ప్రతి కవిత ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

ఇంతటి ప్రతిభాపాటవాలున్న వీరు సామాన్య వ్యక్తిగా మనమందు మసలడం చూస్తే “కొండ అద్దమందు కొంచెమై యుండదా! “ అన్న మన వేమన్న మాట అక్షరాల నిజమనిపిస్తుంది.   వీరి కలం నుంచి మరెన్నో సమాజహితమైన కవితలు వెలువడాలని ఆ నేర్పును , ఓర్పును, కూర్పును వారికి  భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ నా మనసులోని ఈ నాలుగుమాటలు చెప్పే అవకాశాన్ని నాకు కల్పించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ......

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

9897959425.