డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
పూర్వం
మన పెద్దవారు ‘పెదవి దాటితే పృథివి దాటుతుంది’ అనేవారు . ఎందుకో తెలిసేది కాదు. సంస్కృతంలో ఒక
సూక్తి ఉంది . అదేంటంటే ‘శతం వద, ఏకం మా
లిఖ’
వంద మాట్లాడు కానీ ఒక్కటి కూడ వ్రాయకు అని . ఎందుకంటే ఎన్ని మాట్లాడినా అవన్నీ గాలిలో కలిసిపోతాయని ఏ ఒక్కటి వ్రాసినా అది
స్థిరంగా ఉండి పోతుందని వారి అభిప్రాయం . కాని అది ఒకప్పటి మాట. ఇప్పుడు ఏమి మాట్లాడినా అది కూడ స్థిరంగానే ఉండి
పోతోంది electronic media
దయవల్ల .
అందుకని
ఈ రోజుల్లో ప్రతివ్యక్తి పూర్వం కంటే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ఏ వ్యక్తినీ
అనవసరంగా నిందించకూడదు. అది చాల ప్రమాదకరం. ఈ విషయంలో సంత కబీర్ ఒక మాట అంటారు .
ప్రస్తుత విషయంలో ఈ విషయం ప్రస్తావించడం
అప్రస్తుతం కాదు .
दुर्बल को न सतायि(ई)ये जाकी मोटा हाय
मुई खाल की सांस सो सारा भस्म हो जाय దుర్బల్ కో న సతాయి(ఇ)యే, జా కీ
మోటా హాయ్; ముఈ ఖాల్ కీ సాంస్ సో, సార భస్మ హో జాయ్ .
దీని అర్థం నాకు తెలిసినంత వరకు చెపుతాను . నాకు హిందీ లో
పరిజ్ఞానం చాల తక్కువ.
ఏమయ్యా ! నువ్వు బలగర్వంతోనో ,అధికార గర్వంతోనో నీ కంటే బలహీనుని ఎప్పుడు నిందించకు. అతడు
బలహీనుడైనా అతని ఊపిరికి ( ఉసురు) చాల బలం ఉంది. ప్రాణం లేని (గాలి) తిత్తినుంచి వెలువడే గాలి ఇనుమును కరిగిస్తోoది.
ఇక ప్రాణమున్న అభాగ్యుని ఊపిరి (ఉసురు) నీ వంశాన్ని దహిస్తుంది జాగ్రత్త సుమా!
అంటారు.
అతను భయం చేతనోగౌరవంతోనో నిన్నేమీ
అనలేక పోవచ్చు . కాని ఆతని ఉసురు మాత్రం నీ
వంశాన్ని దహిస్తుంది సుమా . పూర్వం రాక్షసుల
వలన మునులు పొందిన బాధయే (ఉసురై) రాక్షసుల నాశనానికి కారణమైంది .
అందువల్ల మనం అనవసరంగా ఎవరినీ
నిందించ కూడదు. ఒకవేళ విమర్శించవలసి వస్తే విషయాన్నే విమర్శించాలి
గాని అది వ్యక్తిగత నింద కాకూడదు .
వ్యక్తిగతంగా నిందిస్తే అది తాత్కాలికంగా మనకు ఏమీ అనిపించక పోయినా కాలాంతరంలో
ప్రభావం చూపిస్తుంది. మనదేశంలో ఎవరైనా తప్పుచేస్తే విమర్శించే హక్కు ప్రతి వాడికీ
ఉంది, కాని నిందించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. ఇక మనం జాగ్రత్తగా సమాజాన్ని
పరిశీలిస్తే ఇతరులు బాధపడుతుంటే ఆనందించడమనే ప్రవృత్తి నానాటికి పెరుగుతోంది.
కొంతమంది బాధపెట్టి కూడ ఆనందిస్తున్నారు .
దూరదర్శన్ లలో వచ్చే కొన్ని సీరియల్స్ ఈ తత్త్వాన్ని పెంచి
పోషిస్తున్నాయి. ఈ పాశవికమైన ఆనందం సమాజానికే
చాల ప్రమాదకరం. పూర్వం మన పెద్దల నడవడి చూడండి . అపవిత్రమైన ఆలోచనకు కూడ
అవకాశమిచ్చేవారు కాదు. దీపం ఆరిపోయింది అనడానికి బదులు కొండెక్కింది అనేవారు.
బియ్యం అయిపోయాయి అనే బదులు బియ్యం నిండుకున్నాయి అనేవారు . తిట్టేటప్పుడు కూడ నీ
అమ్మ కడుపు బంగారం గాను ఎంత పని చేశావయ్యా ! , నీ ఇల్లు బంగారం గాను ఏమిటమ్మా ఈ
పని అని మందలించే వారు. ఎటువంటి సమాజం ఎలా మారి పోతోంది? ఎక్కడికి పోతోంది? ఇక క్షమించరాని తప్పు చేసి నప్పుడు కూడ మృదువుగా
ఓరి! నీ పెళ్ళాం తాడు తెగా అనే తిట్టేవారు .
శ్రీనాథ మహాకవి ఒక చోట అంటాడు . ‘పంచవదనుని కను జేగురించెనేని
తక్షణoబున తమయాండ్ర త్రాళ్ళు తెగవె’
అని తిడతాడొక చోట . ఎవరినైనా
మందలించినా వేమనగారి మందలింపులా వారి మనస్సు నొచ్చుకోకుండా వారిలో మార్పు తెప్పించే
విధంగా ఉండాలి. ఉదాహరణకు లోభిని మందలిస్తూ ఇలా అంటారు వేమన .
గొడ్డుటావు పిదుక కుండ గొంపోయిన
పండ్ల నూడ దన్ను పాలనిడదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
అలాగే మరొక చోట ,
లోభివాని చంప లోకంబు లోపల
మందు లేదు వేరు మాకు లేదు
పైకమడిగినంత భగ్గునపడి చచ్చు
ఒకవేళ ఇది లోభి విన్నా నొచ్చుకోడు సరిగదా, వేమన గారిని లోలోపలే మెచ్చుకుంటాడు .
అలాగే తన సోమ్మ పట్ల ఒక లాగ ఇతరుల సొమ్ము
పట్ల మరో లాగ ప్రవర్తించే వాళ్ళు చాల మంది ఉంటారు .
వాళ్ళ గురించి ఎంత అందంగా చెపుతున్నాడో చూడండి.
పాలసంద్రమందు పవళించు వేలుపు
గొల్లలిండ్ల పాలు కోర నేల?
ఎదుటివారి సొమ్ము లెల్లవారికి తీపి
విశ్వదాభిరామ వినుర వేమ!
కాబట్టి మనం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని
ఎవరిని నిందించకూడదు. ఒక వేళ చెడ్డవారిని మంచి మార్గంలో పెట్టాలనుకుంటే మృదువుగా చెప్పాలి.
ఇక నిందించే వాడు మాత్రమే కాదు ఆ నిందను విని సమర్థించే
వాడు నిందించేవాని కన్న ఎక్కువ పాపాన్ని పొందుతాడని కాళిదాసు అంటాడు .
న కేవలం యో మహతోsపభాషతే
శృణోతి తస్మాదపి య: స పాపభాక్
(కుమారసంభవం) .
పరులను నిందించకు, ప్రమాదాన్ని కొని తెచ్చు కోకు
<><><>
No comments:
Post a Comment