అనుభవాలు - జ్ఞాపకాలు-6
డాక్టర్ . చిలకమర్తి
దుర్గాప్రసాదరావు.
నేను
1972 లో పదో తరగతి పాసయ్యాను. 59% మార్కులు వచ్చాయి. నాకు పరీక్షలని
కూడ ఆలోచించకుండా మా అమ్మా, నాన్న మా తాతయ్య
గారి షష్టిపూర్తి కార్యక్రమానికి వెళ్లారు.
నేనే ఎలాగో ఒంటరిగా ఉండి పరీక్ష వ్రాశాను. వాళ్ళు వెళ్ళకుండా ఉంటే ఇంకా ఎక్కువ మార్కులు
వచ్చేవేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. ఇక పై చదువు చదవాలి. మా నాన్న గారు ‘నిన్ను కాలేజీలో
చదివించలేన్రా’ అని చెప్పేశారు. ఆ నాటి పరిస్థితులలా ఉండేవి . ఏమి చెయ్యాలో
ఆలోచిస్తూ ఉన్నాను . ఒకసారి మా ఇంటికి మా తెలుగు మాస్టారు శ్రీ ఆకెళ్ళ సూర్యప్రకాశరావు
గారు వచ్చారు . ఆయనంటే నాకే కాదు , మా నాన్న గారెకి కూడ గురుభావమే ఉండేది . ఆయన మా నాన్నగారితో వీడికి తెలుగు బాగా అబ్బు తుంది,
పాలకొల్లులో కొత్తగా కాలేజీ పెట్టారు. అక్కడ చేర్పించండి అన్నారు. నాకు మాత్రం physics
అంటే చాల ఇష్టం. దానికి కారణం హైస్కూల్లో
శ్రీ గోటేటి కనకలింగేశ్వరరావు (GKL) గారు చాల ఆసక్తికరంగా సైన్సు పాఠాలు చెప్పేవారు . ఎప్పుడు అవకాశం ఉంటే
అప్పుడు laboratory కి
తీసి కెళ్ళి అన్నీ వివరిస్తూ ఉండేవారు. సైన్సులో మార్కులు కూడ
పరవా లేదు, 65% వచ్చాయి . మొత్తం మీద ఆ కోరిక నెరవేరలేదు. పాలకొల్లు శ్రీక్షీరా
రామలింగేశ్వరస్వామి ఓరియంటల్ కళాశాలయే ఖాయం అయ్యింది. అది శ్రీ
క్షీరారామలిoగేశ్వరస్వామివారి కృపాకటాక్షవీక్షణాల వలన అప్పుడే ఏర్పడింది.
ప్రారంభంలో గుడిలోనే వెనుక పాఠాలు చెపుతూ ఉండేవారు . శ్రీ అత్యం నరసింహ మూర్తి అనే
మహనీయుడు (M.A New York) ఆ
కళాశాలను ప్రారంభించిన వారిలో ఒకరు . భాషాప్రవీణ
ఎంట్రన్సు పాఠాలు చెప్పడానికి శ్రీ మండలీక వేంకటరావుగారు సాయంకాల సమయంలో వచ్చేవారు.
వారు సాయంకాలం ప్రైవేట్లు చెప్పుకుంటే ఆనాడే కొన్ని వందలు సంపాదించ గలిగే వారు.
కానీ వారన్నీ వదులుకుని మాకు ఉచితంగా పాఠాలు చెప్పేవారు వారి ఋణం మేమెన్ని జన్మలెత్తినా తీర్చుకో లేనిది. వారు పెట్టిన
జ్ఞానభిక్షతో భీమవరం D.N.R college లో Entrance వ్రాసి పాసయ్యాక ప్రిలిమినరీ
లో చేరాం. మాది రెండో బ్యాచ్ . శ్రీ లంక విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం గారు
ప్రిస్సిపాల్ . సాధారణంగా మన పెద్దలు పురాకృత సుకృతం అని ఒక మాట అంటూ ఉంటారు .
అదేమిటో మాకు ఆ నాడే తెలిసింది . అప్పుడే శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మ గారు (మహాకవి
, మూర్తీభవించిన అంధ్రసరస్వతి), శ్రీ వేదుల సుందరరామశాస్త్రి గారు (భాష్యాంతవైయాకరణి,
శ్రీ తాతా రాయడుశాస్త్రి గారి శిష్యులున్ను) అధ్యాపకులుగా నియమితులయ్యారు. ఒకరు తెలుగువ్యాకరణం,
సాహిత్యం, రెండోవారు సంస్కృత వ్యాకరణం, సాహిత్యం చెప్పేవారు . ఇద్దరూ ఇద్దరే ఎటువంటి పుస్తకాపేక్ష లేకుండా ఏ
విషయాన్నైనా బోధించడమే వారి వృత్తి, ప్రవృత్తి కూడ.
ఆ
రోజుల్లో నేను మా కాలేజీ గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు ఒక పద్యం చెప్పేవాణ్ణి.
మహిమున్వాగనుశాసనుండు
సృజియింపన్ కుండలీంద్రుండు త
న్మహనీయస్థితిమూలమై
నిలువ శ్రీనాథుండు ప్రోవన్మహా
మహులై
సోముడు, భాస్కరుండు వెలయింపన్ సొంపువాటిల్లు
నీ
బహుళాంధ్రోక్తిమయ
ప్రపంచమున తత్ప్రాగల్భ్యమూహించెదన్ .
ఇది
ఆంధ్రసారస్వతం పుట్టుక, వికాసాలను ప్రపంచంతో పోలుస్తూ భట్టుమూర్తి చెప్పిన పద్యం.
ఇది
నేను మా కలాశాల పుట్టుక వికాసాలకన్వయించేవాణ్ణి.
ఇక వాగనుశాసనులు
శ్రీ అత్యం నరసింహ మూర్తి గారు ఆయన న్యూయార్కులో M.A చదువుకున్న వ్యక్తి. అప్పుడప్పుడు
మా దగ్గర కొచ్చి చదువు యొక్క గొప్పతనం, ఇంకా ఎన్నో విషయాలు చెపుతూ ఉండేవారు. రెండో
వారు కుండలీంద్రులు. ఆయనే మండలీక వారు . ఆయన లేక పోతె కాలేజీయే లేదు . ఇంట్లో
కొంతమంది పిల్లలకు భోజనం కూడ పెట్టి చదువు
చెప్పిన సందర్భాలెన్నో. ఇక మూడవ వారు
శ్రీనాథులు ప్రిన్సిపాల్ శ్రీ లంక విశ్వేశ్వర సుబ్రహ్మణ్యం గారు. ఆ తరువాత సోముడు శ్రీ మల్లంపల్లి వారు, భాస్కరులు శ్రీ సుందరరామశాస్త్రి గారు. శ్రీ లంక విశ్వేశ్వర
సుబ్రహ్మణ్యం గారు శ్రీనాథుడు , కాదంబరి చెప్పేవారు. శ్రీ మల్లంపల్లి వారు మహాకవి
. సూరి మరపించి అభినవసూరిగా పేరు పొందిన గొప్ప
పండితులు. వారు తెలుగు ప్రబంధాలు , వ్యాకరణం చెప్పేవారు. శ్రీ
సుందరరామశాస్త్రి గారు సిద్ధాంతకౌముది , భారవి చెప్పేవారు . ఆ తరువాత నియమితులైన డాక్టర్
శ్రీపాద కృష్ణమూర్తి గారు , శ్రీ సోమంచి సత్యనారాయణ గారు సంస్కృతకావ్య, నాటకాలు, శ్రీ వీరుభొట్ల
కుటుంబసత్యనారాయణ గారు ఆహోబలపండితీయం, ఆధునికకావ్యాలు, శ్రీ V.ప్రభాకరం
గారు సంస్కృతవ్యాకరణం చెప్పేవారు . వారు అందరు సంస్కృతాంధ్రభాషల్లో
నిష్ణాతులు కావడంతో బాటుగా ఒక్కొక్కరు ఒక్కొక్కశాస్త్రంలో పరిపూర్ణమైన
ప్రజ్ఞాపాటవాలు గలవారు. అందరు విద్యార్థులను సుతనిర్విశేషంగా ప్రేమించేవారు.
సాధారణoగా
ఓరియంటల్ కళాశాలల్లో సoస్కృతాంధ్రభాషల్లోను, వివిధశాస్త్రాల్లోను ఆరితేరినవారు కనిపిస్తారు. కాని
ఆంగ్లభాషాభిజ్ఞులు చాల అరుదుగా కనిపిస్తారు. అటువంటి అరుదైన వారిలో శ్రీపాద వారు
ఒకరు. ఏ పుస్తకం వెలువడినా అది ఆయన ముందుగా చదివేవారు .
అందుకే మా మిత్రుడు సాంబశివరావు ఆయన గురించి
చెపుతూ
పుస్తకంబును మునుముందు ముట్టువారు
పరగనొజ్జలు మనకు శ్రీపాద వారు అనేవాడు.
వీరికి మరో
ముఖ్యమైన విశేషమేమంటే వారికి ఇంచుమించు ఆధునిక కవులందరితోను ముఖ్యంగా శ్రీయుతులు నారాయణరెడ్డి,
బాలగంగాధరతిలక్ వంటి కవులతో స్నేహసంబంధాలున్నాయి. అందుకేనేమో ఆధునిక
తెలుగుకవితారీతులు ఆయనకు కరతలామలకాలు. అటు నన్నయ్య గారి నుండి ఇటు
నారాయణరెడ్డి గారి వరకు అందరి కవితారీతులు ఆయన
అలవోకగా వివరించేవారు. ప్రాచీన
సాహిత్యాన్ని ఎంత ఆసక్తికరంగా బోధించే వారో ఆధునిక సాహిత్యాన్ని కూడ అంతే
ఆసక్తికరంగా బోధించే వారు. ప్రతిపద్యాన్ని రసానుగుణంగా చదివేవారు. ఇక
ఆంధ్రసాహిత్యచరిత్ర ఏ గ్రంథo చూడకుండానే
అలవోకగా డిక్టేట్ చేసేవారు. మాకు
చాల ఆశ్చర్యంగ ఉండేది.
ఇక
రాత్రి వేళల్లో మేము చదువుతున్నామో లేక సినిమాలకు , షికార్లకు
పోతున్నామో తెలుసుకోడానికి తరచుగా వస్తూ ఉండేవారు. తప్పు చేస్తే తిట్టే వారు కాదు.
మృదువుగా మందలి౦చేవారు.
యాస్కమహర్షి ఉపాధ్యాయుని లక్షణాలు
వివరిస్తూ ‘ ఆచరతీతి ఆచార్య:’ ,
‘ఆచారం గ్రాహయతీతి ఆచార్య:’ , ‘ ఆచినోతి అర్థానితి ఆచార్య:’ అంటారు . ఈ మూడు లక్షణాలు మా కళాశాల అధ్యాపకుల్లో పుష్కలంగా ఉన్నాయి.
ఇక శ్రీ అత్యంవారికి , అద్దేపల్లి వారికి , రేపాకవారికి సంబంధించిన సత్రాల్లో భోజనం
చేస్తూ ఉండేవాళ్లం . కొన్ని సమయాల్లో అన్నదాన సమాజంలోను , దేవస్థానంలోను కూడ భోజనం చేసే వాళ్లం.
ఇక విద్యార్థులు మాటకొస్తే అందరు వివిధ
ప్రాంతాలనుంచి వచ్చిన వాళ్ళే . తినడం చదువుకోవడం తప్ప వేరే పని లేదు . అప్పుడప్పుడు
మాత్రం సినిమాలు చూసే వాళ్ళం .
కుల, మత, వర్గ, ప్రాంతీయభేదం
లేకుండా కలసిమెలసి ఉండేవాళ్లం . అందరు సహ విద్యార్థినుల పట్ల సోదరభావంతో చాల
మర్యాదగా ప్రవర్తించే వాళ్ళం.
ఇక ఒక్కొక్క విద్యార్థిలో ఒకొక్క
ప్రత్యేకత ఉండేది. మల్లాది సాంబశివరావు ఉండేవాడు . ఏ భావాన్నైనా ఏ పద్యంలోనైనా ఇమడ్చ గల సమర్థుడు. ఏ పద్యం నుంచైనా ఒక విశేషార్థాన్ని రాబట్టగల ప్రజ్ఞాశాలి. గోరస
సుబ్రహ్మణ్యాచార్యులు అనే మరొక మిత్రుడు ఉండేవాడు. తెలుగు వ్యాక రణంలో నిధి. ప్రపంచంలో
ఉన్న బాలవ్యాకరణ ప్రతులను ఒకవేళ ఎవరైనా కనబడకుండా దాచేసినా అప్పచెప్పగల ధీశాలి. అతను కొన్ని సందేహాలడిగితే
అధ్యాపకులే చాల ఆలోచించి గాని సమాధానం చెప్పలేకపోయే వారు. వరదా రామలింగం మరొక మిత్రుడు.
పొరుగూరి నుంచి సగం దూరం బస్సులోను, సగం దూరం నడిచీ వచ్చేవాడు . ఆ రోజుల్లోనే సంస్కృతంలో
శ్లోకాలు, నాటక రచనలు చేసేవాడు . సుభద్రరావు ఇంకొక మిత్రుడు. ఎప్పుడు
పుస్తకాల్లోనే మునిగి తేలేవాడు. ఇక గంటి ముత్యాలరావు మరొక మిత్రుడు. ఎంత అల్లరి చేసే
వాడో అంత కంటే బాగా చదివే వాడు. ఒకసారి కాలేజీకి చేరువలో ఒక పెద్ద సభ జరుగుతోంది . అతను
కూడ వెళ్ళాడు . సభ జరుగుతుండగా మధ్యలో లేచి స్టేజ్ దగ్గరకు వెళ్లి ‘గంటి ముత్యాల రావు
అనే బాలుడు తప్పిపోయాడు’ అని announcement చేయించి తాపీగా తన సీట్లోకొచ్చి ముసిముసి నవ్వులు
నవ్వుకుంటు కూర్చున్నాడు. పాపం! వాళ్ళు కార్యక్రమం ఆపి, ఎంతో సమయం announcements చేసి చేసి ఎప్పటికీ తప్పిపోయిన పిల్లవాడు దొరక్క
పోవడంతో మళ్ళీ తమ కార్యక్రమం కొనసాగించు కున్నారు . ఇక అనిపెద్ది. జగన్నాథ శాస్త్రి మరొక
మిత్రుడు . ఆధునిక కవిత్వం కోసమే పుట్టాడా అన్నట్లు శ్రీశ్రీ గారినే ఆరాధిస్తూ అవే
చదువుతో ఉండేవాడు. ఆధునిక కవితా రీతులపై మంచిపట్టు సంపాదించాడు . మరొక మిత్రుడు
గారపాటి ధర్మారావు . అతను అప్పటికే వివాహితుడు మాతో పాటు పోటాపోటీగా చదివేవాడు.
ఇంకా చాల మంది ఉన్నారు . వాళ్ళ గురించి ప్రస్తావించ లేకపోతున్నందుకు
చింతిస్తున్నాను .
ఇక అల్లరి విషయంలో అందరు ఆరితేరిన వారే . అది అందరిని
అలరించేదిగా ఉండేది గాని ఎవరినీ నొప్పించే
విధంగా ఉండేది కాదు.
ఒకసారి ఒకరి పుట్టినరోజు వచ్చింది.
దీపాలార్పడం కార్యక్రమాల్లో ఒక భాగం. కొవ్వొత్తులు కొనాలి . డబ్బు దండగ . ఒకరికి ఒక ఐడియా వచ్చింది . మా దగ్గరున్న ‘
స్టౌ’ తీసుకొచ్చి ఒకసారి వెలిగించారు .
మళ్ళీ ఆర్పేసి మరొక సారి వెలిగించి ఆర్పేశారు. అది ఇరవై ఏళ్ళ పండుగ కాబట్టి
సరిపోయింది. ఒకటి అటు ఇటు ఐతే కొంచెం ఇబ్బంది అయ్యేది .
ఇక శివరాత్రికి పిల్లలం అందరం క్షీరారామలింగేశ్వరుని
సేవల్లో పాల్గొనే వాళ్ళం. ఆ రోజుల్లో అక్కడ చదవడం వల్లనే శ్రీయుతులు రావూరి వేంకటేశ్వర్లు, వెంపరాల
సూర్యనారాయణ శాస్త్రి , మంగళంపల్లి బాలమురళీకృష్ణ , తుమ్మల సీతారామమూర్తిచౌదరి, ఆచార్య
తూమాటి దొణప్ప , దాసరి నారాయణ రావు , అల్లు రామలింగయ్య , రావు గోపాలరావు , శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం వంటి పండితులను,
సుప్రసిద్ధకళాకారులను స్వయంగా చూసే భాగ్యం కల్గింది . నేను కేవలం కొంతమంది మిత్రుల
గురించే ప్రస్తావించాను. మా ముందు మా తరువాత ఎంతోమంది ఎన్నో ఉన్నతమైన చదువులు
చదివారు. అక్కడ చదువుకున్న విద్యార్థులందరు ఎన్నెన్నో ఉన్నతస్థానాలు పొందారు. అవన్నీ చెప్పాలంటే అదొక మహాభార(త)మే అవుతుంది.
ఇక ఆర్ధికమైన ఇబ్బందులు, కష్టాలు ఎన్నున్నా ఆ రోజులు మఱపురానివి, , మఱువలేనివి.
నా అభిప్ర్రాయ ప్రకటనలో ఎవరినైనా నొప్పిస్తే మన్నించ ప్రార్థన.
<><><>
.