Thursday, September 4, 2025

త్యాగరాజ కీర్తనలు – పురుషకార వైభవం-సమీక్షకులు: డాక్టర్.చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

 

 

త్యాగరాజ కీర్తనలు – పురుషకార వైభవం

(ఒక విహంగవీక్షణాత్మకసమీక్ష)

గ్రంథరచయిత్రి : శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల రాజ్యలక్ష్మి,  ఎం.ఏ, ఎం.ఫిల్

సమీక్షకులు: డాక్టర్.చిలకమర్తి దుర్గాప్రసాదరావు .

M.A (Sanskrit), M.A (Telugu), M.A (Philosophy) & Ph. D (Sanskrit)

 

          నా సహాధ్యాయిని మరియు సోదరీమణి  అయిన శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల రాజ్యలక్ష్మి గారు రచించిన “త్యాగరాజ కీర్తనలు - పురుషకార వైభవం” అనే గ్రంథం ఆమూలాగ్రం చదివాను. ఇది పన్నెండు అధ్యాయాలతో కూడిన విమర్శనాత్మకమైన గ్రంథం .

ఈ గ్రంథంలో స్వగతం మరియు ఉపసంహారం కాకుండా పన్నెండు అధ్యాయాలున్నాయి .   

1.                  మొదటి అధ్యాయంలో  ‘తెలుగులో పద కవిత్వం’ ; రెండవ  అధ్యాయంలో  ‘పద కవిత్వ క్రమ పరిణామం’ ,  మూడవ అధ్యాయంలో   వాగ్గేయకార లక్షణం – వాగ్గేయకారులు, నాలుగవ అధ్యాయంలో  ‘త్యాగయ్య- జీవితవిశేషాలు’ ఐదవ అధ్యాయంలో , ‘త్యాగయ్యపై రామదాసు ప్రభావం, ఆరవ అధ్యాయంలో   ‘ భక్తి – శరణాగతి’  , ఏడవ అధ్యాయంలో  ‘పురుష కారం – ఆవశ్యకత, ఎనిమిదవ అధ్యాయంలో   ‘ త్యాగయ్య కీర్తనల్లో లక్ష్మీ పురుషకారత్వం , తొమ్మిదవ అధ్యాయంలో  త్యాగయ్య కీర్తనల్లో ఆచార్యపురుషకారత్వం , పదవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలో  జానపద గేయ రీతులు,  పదకొండవ అధ్యాయంలో,  త్యాగయ్య కీర్తనలలో భాషా విశేషాలు , పన్నెండవ అధ్యాయంలో  త్యాగయ్య కీర్తనల్లో సందేశం

పొందుపరిచారు .  ఆ తరువాత ఉపసంహరంలో  అన్నీ సమన్వయం చేశారు.  

ఇక ధర్మ, అర్థ,  కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాల్లో మోక్షం సర్వశ్రేష్ఠ౦.  అందుకే అది పరమపురుషార్థమై౦ది . మానవుడు తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం వల్లనే అది సిద్ధిస్తుంది. అందుకే  ఆపస్తంబ మహర్షి ‘ఆత్మలాభాన్న పరం విద్యతే కించిత్’ అనే మాటల్లో  మానవుడు తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం కంటే  ఉన్నతమైన పరమార్థం మరొకటి లేదన్నారు  . ఈ   మోక్ష ప్రాప్తికి,   కర్మభక్తి, జ్ఞానం అనే   మూడు మార్గాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే , మోక్షమనే  సామ్రాజ్యం,  కర్మ, జ్ఞానం, భక్తి అనే ముక్కాలి పీటపై నిలిచి ఉంది .   ఇక,  కర్మలు ఎన్నో విధాలుగా ఉన్నాయి , వాటికి పరిమితి లేదు అవి అనంతములు . అంతే కాక,  కర్మలు ఎంతో ధనవ్యయంతో ముడి పడ్డాయి , అందరు ఆచరించ లేరు . కర్మకాండకు ఎన్నో నియమ నిబంధనలు కూడ ఉన్నాయి . యజ్ఞ, యాగాది కర్మలు అన్ని కులాల వారు ఆచరి౦చలేరు. కర్మకాండకు వయోపరిమితి , ఆశ్రమ నిబంధనలు  ఎన్నో ఉన్నాయి . పోనీ ఎలాగో కష్టపడి కర్మల నాచరి౦చినా, కర్మల వలన పొందేది ఏదీ శాశ్వతం కాదు .  ఇక జ్ఞానం  విషయానికొస్తే అది అందరికీ అందుబాటులో ఉండదు . జ్ఞాన ప్రాప్తికి నిత్యా నిత్య వస్తు వివేకం కావాలి  . లౌకిక సుఖాల పట్ల పారలౌకిక సుఖాల  పట్ల వైరాగ్యం కావాలి .  శమం,  అంటే ఇంద్రియ నిగ్రహం,  దమం అంటే మనో నిగ్రహం , ఉపరతి, అంటే కర్మఫల త్యాగం,   ‘తితిక్ష’  అంటే శీతోష్ణ , సుఖదు:ఖాది ద్వాలను  సహించగలగడం; ‘శ్రద్ధ’ అంటే శాస్త్ర వాక్యాలపట్ల, గురు  వాక్యాలపట్ల అచంచలమైన విశ్వాసం , ‘సమాధానం’ అంటే, ఎటువంటి ఏమరుపాటు లేని నిశ్చలమైన మనస్సు  మొదలైన గుణాలు అలవరచుకోవాలి  . ‘ముముక్షుత్వం’ అంటే మోక్షం పట్ల తీవ్రమైన కోరిక కలిగి ఉండాలి . ఇవన్నీ అలవాటు చేసుకోవడం  అంత సులభమేమీ కాదు . అందువల్లనే మోక్ష సాధనాల్లో భక్తి,   చాల గొప్పదని శ్రీ శంకరుల వంటి  మహాజ్ఞాని స్వయంగా అంగీకరించారు.  అంతేగాక మనకు,  భగవంతుడు మానవజన్మ ప్రసాదించినందుకు ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం భక్తి మార్గంలో ప్రయాణం చేసేవారికి  పుష్కలంగా లభిస్తోంది . ప్రతివ్యక్తి, తన   భక్తి భావాలను  ప్రకటి౦చు కోవడానికి ఎన్నో మార్గాలున్నాయి.

అందుకే భక్తాగ్ర గణ్యులలో ఒకరైన పోతనగారు,

నీ పాద కమలసేవయు

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం తాపార భూతదయయును

తాపస మందార! నాకు దయసేయగదే!   అని వేడుకున్నారు. ఇక భక్తి, జ్ఞాన, కర్మలు ఒకదాని కంటే, మరొకటి వేరుగా లేవు . ఏ ఒక్కటి మిగిలిన రెంటిని విడిచి ఉండదు. కర్మ,   భక్తి జ్ఞానాల్ని ;   భక్తి,   కర్మ జ్ఞానాల్ని ; జ్ఞానం,  భక్తి కర్మలను విడిచి పెడితే అవి సమగ్రాలు అనిపించుకోలేవు.   అంతేగాక ఈ భక్తి,

శ్రవణం , కీర్తనం , స్మరణం , పాదసేవనం , అర్చనం , వందనం,  దాస్యం , సఖ్యం , ఆత్మనివేదనం అని తొమ్మిది విధాలుగా  కనిపిస్తోంది. ఈ తొమ్మిది మార్గాల్లో ఎవరికి  వీలైన మార్గాన్ని వారు అనుసరించి,  తరించిన మహనీయులు ఎందరో మనకు కనిపిస్తున్నారు. ఇక భక్తిలో ‘కీర్తనం’ అనేది  ఒక ముఖ్య మైన అంశం .

  ‘కీర్తనం’ అంటే భగవంతుని గుణ, గణాలను నోరార, కీర్తించడం.    ఇక  ‘కీర్తన’ ద్వారా తాము తరించి, జాతిని మొత్తం తరింప చేసిన వాగ్గేయకారులు ఎంతోమంది మన పవిత్ర భారత దేశంలో జన్మించారు . వారిలో శ్రీ త్యాగరాజ స్వామి ఒకరు.

ఇక ఈ గ్రంథ రచయిత్రి,  శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, మొదటి అధ్యాయంలో పద కవిత్వం యొక్క ఆవిర్భావ వికాసాలను చక్కగా వివరించారు. పదానికి సంగీతం జోడిస్తే కీర్తన అవుతుందని వివరించారు .

రెండవ అధ్యాయంలో ‘పద కవిత’ యొక్క క్రమ పరిణామాన్ని వివరించారు. ఆ సందర్భంలో సంకీర్తనాచార్యులైన    క్షేత్రయ్య , అన్నమయ్య, పురందరదాసు, సారంగపాణి , రామదాసు మొదలగువారి గొప్పదనాన్ని ప్రస్తావించారు.

మూడవ అధ్యాయంలో వాగ్గేయకారుల కవిత లక్షణాల్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తూ,

సంస్కృత వాగ్గేయకారులైన జయదేవుడు, లీలాశుకుడు , నారాయణ తీర్థులు, కృష్ణమాచార్యులు, అన్నమాచార్యులు, చిన తిరుమలాచార్యులు, చిన్నన్న, క్షేత్రయ్య, కంచర్ల గోపన్న, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి మొదలగువారి ప్రతిభను కొనియాడారు. అంతేగాక తమిళంలో ఆళ్వార్లు , నాయన్మారుల యొక్క పద కవితా విశేషాలను, కన్నడంలో సుప్రసిద్ధుడైన పురందరదాసు గొప్పదనాన్ని పరిచయం  చేశారు.

నాల్గవ, అధ్యాయంలో త్యాగరాజ స్వామి జీవిత విశేషాలను వివరిస్తూ ఆయనకు లభించిన శ్రీరామ సాక్షాత్కారం, క్షేత్ర పర్యటన, ఆయన రచించిన  కృతులు,  ఆయన సిద్ధి పొందడం, ఆయన ఆరాధన ఉత్సవ విశేషాలు కళ్ళకు కట్టినట్లుగా

అభివర్ణించారు.

ఐదవ అధ్యాయంలో త్యాగరాజుపై రామదాసు ప్రభావాన్ని సోదాహరణంగా తులనాత్మకంగా వివరించారు.

ఆరవ అధ్యాయంలో భక్తికి, పరాకాష్ఠ రూపమైన శరణాగతి స్వరూపాన్ని           వేద, పురాణ , ఇతిహాస, ద్రావిడ ప్రబంధాలతో బాటుగా; శ్రీ రామానుజాచార్యుల వారి అభిప్రాయాలను కూడ మేళవించి    శరణాగతి యొక్క ప్రాముఖ్యాన్ని  ప్రామాణికంగా నిరూపించారు.  

“ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ

అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ:”  

అనే భగవానుని ప్రతిజ్ఞ, ఆయన మనకు ప్రసాదించిన అభయ దానం   సర్వ జన విదితమే కదా !  

              ఏడవ అధ్యాయంలో పురుష కారం యొక్క ప్రాముఖ్యాన్ని చర్చించారు.  మనం,  మన కంటే చాల ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ద్వారా పనులు జరిపించుకోవాలంటే అతనికి చాల ఇష్టులు , సన్నిహితులు ఐన వారిని ఆశ్రయించడం,  లోక సహజమైన విషయం . ఆధ్యాత్మిక విషయంలో కూడ ఇదే పరిపాటి. అయ్య మనసు కంటే, అమ్మ మనసు సుతి మెత్తనిది.   కాబట్టి,  అమ్మ ను అడిగి ఆమె ద్వారా అయ్య వలన పనులు చేయించుకోవడం సర్వసామాన్యం. అందుకే “ నను బ్రోవమని చెప్పవే,  సీతమ్మ తల్లి” అని భక్తులు ముందుగా అమ్మవారిని పొగిడి  ఆమె ద్వారా తమ కోరికలు తీర్చుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఎంతైనా,  స్త్రీ మూర్తి,  సద్య:ప్రసాదిని కదా!        

ఎనిమిదవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలో రామునకు సీతమ్మ , విష్ణువునకు లక్ష్మిపురుష కారం అనే విషయాన్ని కూలంకషంగా చర్చించారు.

తొమ్మిదవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలో ఆచార్య పురుష కారం అనే అంశాన్ని వివరిస్తూ భగవద్భక్తుల ద్వారా భగవానుని ఆశ్రయించాలని వివరించారు. భగవంతుని కన్నా భక్తుడే,  సులభ గ్రాహ్యుడని  అదే సులభమైన మార్గమని వివరించారు .  పదవ  అధ్యాయం లో త్యాగరాజ కీర్తనలలోని జానపద గేయ రీతుల్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదకర్తల రచనలలో గ్రాంథిక , శిష్ట వ్యావహారిక , వ్యావహారిక కీర్తనలను పేర్కొని

వాటి యొక్క సర్వజన ఆమోదకత్వాన్ని నిరూపించారు . త్యాగ రాజ స్వామి రచించిన కీర్తనలలోని ఆచార, వ్యవహారాలను,

సంప్రదాయాలను, దేశి రాగ రీతులను విశ్లే షించారు.

పదునొకండవ అధ్యాయంలో త్యాగయ్య కీర్తనలలోని భాషావిశేషాలను

వివరించారు.

పన్నెండవ అధ్యాయంలో త్యాగ రాజ స్వామి తన కీర్తనల ద్వారా ప్రజలకు అందించిన  సందేశాన్ని అందమైన మాటలలో పొందుపరచి వీనులకు  విందు చేకూర్చారు.

ఇంకా ఈ గ్రంథంలో ఎన్నెన్నో విశేషాలున్నాయి . అవన్నీ పాఠకులు స్వయంగా చవివి తెలుసుకోవాలి.  ఈ గ్రంథం ఆమె సునిశితమైన  ప్రజ్ఞకు , వేద, వేదాంగ, వేదాంత శాస్త్ర జ్ఞానానికి , రాగ, తాళ లయాత్మకమైన  సంగీత శాస్త్ర అవగాహనకు దర్పణం అనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఇటువంటి అద్భుతమైన గ్రంథాన్ని సమాజానికి అందించిన ఆమెను మనసారా అభినందిస్తూ , ఆమె కంటే వయస్సులో కొంచెం పెద్దవాడిని కావడం వల్ల ఆశీర్వదిస్తూ.......

చిలకమర్తి దుర్గాప్రసాదరావు.