Friday, September 14, 2012

సమయం విలువ


సమయం విలువ
చిలకమర్తి లక్ష్మీ కుమారి
Ch. Lakshmi kumari , M.A
3/106, Premnagar,
Dayalbagh, Agra-282005, UP

" కన్ను తెరిస్తే జననం
కన్ను మూస్తే మరణం
రెప్పపాటే కదా! జీవితం "
అన్నారు ఒక సుప్రసిద్ధ కవి. ఇది నూటికి నూఱు పాళ్లు యథార్థమే. ఈ స్వల్పమైన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే మనం తెలుసుకోవలసింది ఒకటుంది. అదే సమయం విలువ.
ప్రపంచంలో ఎన్నో విలువైన వస్తువులున్నాయి. కాని అన్నిటికంటే విలువైన వస్తువు సమయం. ఇది అందరికి తెలిసిన విషయమే అయినప్పటికి, దీన్ని గురించి ఎవరు పెద్దగా పట్టించుకున్నట్లు కనపడరు. భారతీయ సంస్కృతి కాలాన్ని దైవ స్వరూపంగా భావించింది. భగవంతుడు ఎంత ఉన్నతుడో కాలం కూడ అంతే ఉన్నతమైనదీ, విలువైనదీని . మనం ఏ వస్తువునైన పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోవచ్చు. డబ్బు పోతే మరల కొంత కాలానికి కూడ బెట్టుకోవచ్చు. కాని కాలాన్ని కోల్పోతే తిరిగి పొందడం అసాధ్యం . అందుకే
క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప
సాధ్యమే మానవున కిలాచక్రమందు" అంటారు శ్రీ జాషువ మహాకవి. ఒక్క మాటలో చె ప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏరంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే . కాలం అనేది మనం ఆపితే ఆగదు . కాబట్టి ఏ సమయంలో ఏపని చెయ్యాలో ఆ సమయం లో ఆపని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే . 'ఆలస్యాదమృతం విషం' అన్నట్లు ఎప్పుడు ఏపని చెయ్యాలో అప్పుడాపని చెయ్యక పోతే లాభం మాట అటుంచి నష్టం కూడ కలిగే అవకాశం ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోడం అంటే కాలంతో పాటు నడుస్తూ కర్తవ్యాన్ని నిర్వర్తిం చడమే.
మనలో చాలామంది నాకు తీరికదొరకటం లేదు, లేకపోతే ఎన్నో సాధించేవాడినని అంటూ ఉంటారు. ఈ అభిప్రాయం సరైనది కాదు. కాలం అందరికి సమానమే, అది తెలుసుకొని పొదుపుగా వాడు కుంటే గొప్ప వాళ్లు అవుతారు. లేకపోతే సామాన్యులు గానే మిగిలిపోతారు. ప్రపంచంలో గొప్పవాళ్లయిన వ్యక్తుల చరిత్రలు పరిశీలించి చూడండి. వాళ్లందరూ ప్రతి నిమిషాన్ని పొదుపుగా వాడు కున్నవాళ్లే.
అందువల్లే శ్రీ శంకరాచార్యులు, ఏసుక్రీస్తు, వివేకానందస్వామి మొదలైన మహాపురుషులు తమ స్వల్పవయస్సు లోనే శరీరాన్ని చాలించినప్పటికి, ఉన్న సమయం లోనే ఎన్నో కార్యాలను సాధించ గలిగారు. వీరిలో ఆథునిక కాలానికి చెందిన శ్రీ వివేకానందస్వామి 39 సం||5 మాసముల 14 రోజులలోనే తనువు చాలించినప్పటికి ఎన్నో కార్యాలు సాధించిన కర్మయోగి. ఆయన మన యువతకు సందేశమిస్తూ " ఓ యువకులారా! భావిభారత నిర్మాతలు, నిర్ణేతలు మీరే. మీ ఆలోచనలను నిరాశావాదం నుండి ఆశావాదం వైపునకు మళ్లించండి. ఇనుపకండరాలు ఉక్కునరాలు కలిగిన యువత మనకు కావాలి, యువజనులైన మీరు నీరీక్షణతో పొద్దుపుచ్చే దు:స్థితిని విడనాడండి. కాలం విలువ తెలుసుకోండి. వట్టి మాటలతో కాలం వృ ధా చేయవద్దు " అన్నారు. దీన్ని బట్టి వివేకానందుని అభిప్రాయంలో సమయం విలువ ఎంత మహోన్నతమైనదో తెలుస్తోంది. సమయం సద్వినియోగం చేసుకోవడమంటే పొదుపుగా వాడుకోవడమేనని ఇంతకు ముందే అనుకున్నాం. పొదుపు చేసే మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
. మన జీవితంలో సగభాగం నిద్రలోనే గడిచిపోతోంది. మనం సగటు ఎనిమిది నుండి పది గంటలకాలం నిద్రకి ఖర్చు చేస్తున్నాం. సాధారణంగా నిద్రకి ఆరు గంటల సమయం చాలు. ఈ విధంగా నాలుగు గంటల సమయం మనం ఆదా చేయవచ్చు. ఈ విధంగా నెల మొత్తం మీద 120 గంటలు ఆదా చేయగలుగుతాం. ఆలా చేస్తే నెలకి ఐదు రోజులకాలం అదనంగా లభించినట్లవుతుంది. కొంతమంది పగలు కూడ రెండు మూడు గంటలు పడుకుంటారు. వారు పగటి నిద్ర మానేస్తే కొంత సమయం ఆదా చేయవచ్చు . ఆ సమయం మరో మంచిపనికి ఖర్చు చెయ్యవచ్చు. ఇక్కడ గమనించవలసిన మరో ముఖ్య విషయముంది. రాత్రి పన్నెండు గంటలకు ముందు తీసుకునే ఒక గంట విశ్రాం తి పన్నెండు గంటల తరువాత తీసుకునే రెండు గంట ల విశ్రాంతితో సమానమని వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు
2. సమయం విలువను కాల రాచే మరొక జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి . పరీక్షలొస్తున్నాయి చదవడం మొదలె ట్టమని బుద్ధి చెబుతుంది . ఏమీ పరవాలేదు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు మాటే వింటాం. బుద్ధి చెప్పింది వినం. అందుకే ఈ అనర్థం . కాబట్టి ప్రతి వ్యక్తి మనసును అదుపులో ఉంచుకుంటే సోమరి తనాన్ని జయించొచ్చు.
3. దినచర్యను ప్రణాళికాబద్ధంగా వ్రాసుకోవడం ద్వారా సమయం ఆదా చెయ్య వచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ పనులు పూర్తిచేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక చోటికి వెళ్లేటప్పుడు అక్కడ చే యవలసిన పనులన్నీ ఒ క కాగితం మీద వ్రాసుకుని ఉంచుకుంటే అన్నీ ఒక్కసారి పూర్తి చేసుకోవచ్చు.
4 . నేటి యువత విజ్ఞానం కన్న వినోదానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. వినోదం జీవితంలో ఒక భాగం కావచ్చు గా‌ని కేవలం వినోదమే జీవితం కాకూడదు. కాని నేటి యువతీ యువకులు ఆ రెంటికి మధ్య గల తేడా గమనించలేక పోతున్నారు. విజ్ఞానం వేరు. వినోదం వేరు. విజ్ఞానాన్ని వినోదాత్మకంగా అందించడం అందుకోవడం తప్పు లేదుగాని వినోదమే‌ విజ్ఞానం అనుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పు. కాని నేటి యువత వినోదాన్నే విజ్ఞానంగా భావిస్తున్నారు. వీటికి తోడు ప్రైవేటు టి. వి. ఛానళ్లు కూడ వినోదానికి విజ్ఞానమనే రంగు పులిమి యువతీయువకుల అమూల్యమైన కాలాన్ని హరిస్తున్నాయి. ఉదాహరణకు ఒకగొప్ప వ్యక్తి బొమ్మ చూపించి అతని పేరు, వివరాలు ప్రశ్నించి విజేతలకు బహుమతులు ఇవ్వడంలో తప్పేమీ లేదు . ఆలా కాకుండ సినిమాల్లో నటించే కొంతమంది నాయికానాయకుల పేర్లు చెప్పి వారు నటించిన మొదటి చిత్రం చెప్పమని కోరుతూ ఆకర్షణీయమైన బహుమతులు ఎర చూపిస్తే అది యువత అమూల్యమైన కాలాన్ని హరించడమే అవుతుంది. కాబట్టి నేటి యువత వివేకంతో దేనికెంత సమయాన్ని కేటాయించాలో తెలుసుకుని తగిన విధంగా ప్రవర్తిస్తే ప్రగతి సాధించగలం.
5 . విద్యార్థులు పాఠ్యాంశాలను క్రమబద్ధంగా చదవడం వల్ల కూడ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. పరీక్షలొచ్చే వరకు పుస్తకాలు తీయకుండ అవి దగ్గరకొచ్చాక విశ్రాంతి లేకుండ చదివి చదివి పరీక్షల్లో కళ్లు తిరిగి పడి పోయి భవిష్యత్తు నాశనం చేసుకున్న వాల్లెంతమందో ఉన్నారు. అందువల్ల విద్యార్థులు ముందునుంచే సమయం విలువ గుర్తించాలి.
6 . మనలో కొంతమంది ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంతసేపు మాట్లాడాలో గమనించరు. ఎదుటివారి ఇబ్బందులు అసలు పట్టించుకోరు. ఒకాయన మరొక వ్యక్తిని సుమారు రెండు గంటల సే పు వాయించాక 'అయ్యా! మీతో మాట్లాడాక నాకు తల నొప్పి పోయిందండి ' అన్నాడు . రెండో ఆయన దానికి సమాధానంగ 'అయ్యా! అదెక్కడికీ పోలేదు. నాకు చుట్టుకుంది ' అన్నాడు. పరేంగితావగాహి జ్ఞానమే పాండిత్యం అన్నారు పెద్దలు. ఇతరుల మనోభిప్రాయం తెలుసుకు తదనుగుణంగా నడుచుకోవడమే పాండిత్యం గాని కేవలం శాస్త్రాలు బట్టీపట్టడం కాదు.
7 . ధ్యానం , యోగాభ్యాసం ఏకాగ్రతను పెంచుతాయి కాబట్టి వాటిద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని , ఎక్కు వ పనులు సాధించే సామర్థ్యాన్ని పొందవచ్చు.
8. రేపు చెయ్యవలసిన పని ఈ రోజు , నేడు చెయ్యవలసిన పని ఇప్పుడు చెయ్యమని పెద్దలు చెబుతున్నారు. అలా చేస్తే సమయం ఆదా అవుతుంది. అలాగే మనం చేసుకోగల చిన్న చిన్న పనులకు గూడ ఇతరులపై ఆధారపడి వాళ్లకోసం ఎదురుచూడడం మంచిది కాదు.అలాగే ఏ పనైన , మొదలు పెట్టి చేస్తోంటే పూర్తవుతుంది గాని ఆ లోచిస్తూ కూర్చుంటే ఎప్పటికీ పూర్తి కాదు. నడక ప్రారంభిస్తే చీమకూడ కొంతకాలానికి చేరవలసిన గమ్యం చేరుకుంటుంది. నడవకపోతే వేగంగా వెళ్లే గరుత్మంతుడు కూడ ఒక్కడుగు ముందుకెయ్యలేడు. అందువల్ల ఆలోచన కన్నా ఆచరణ మిన్న. సమయం విలువ బాగా తెలిసింది కాబట్టే మన భారతీయ సంస్కృతి శుభకార్యాలకు ఒక ముహూర్తాన్ని నిర్ణయించి కాల యాపనకు తావు లేకుండ చేసింది.
ఇంత వరకు సమయం విలువ , ఆ సమయాన్ని పొదుపు చేసే విధానం గురించి కొంచెం తెలుసుకున్నాం. ఇంత కంటే ఎక్కువ చెప్పడం మీ కాలాన్ని హరించడమే అవుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం . సమాజ ప్రగతికి బాటలు వేద్దాం.

సమయం విలువ తెలియ జేసే ఒక చక్కని కవితతో నా వ్యాసం ముగిస్తాను. రచయిత పేరు మీకు తెలియజెయ్యలేక పోయినందుకు చింతిస్తున్నాను.

ఒక సంవత్సరం ఎంత విలువైనదో
పరీక్షలో తప్పిన విద్యార్థి నడుగు
ఒక రోజు ఎంత విలువైనదో
ఒకటో తేదీన జీతం రాని వాణ్ణడుగు
ఒక గంట ఎంత విలువైనదో
క్షణమొక యుగంగా గడిపిన ప్రేమికుడినడుగు
ఒక నిముషం ఎంత విలువైనదో
రైలు మిస్సయిన ప్రయాణికుడినడుగు
ఒక సెకను ఎంత విలువైనదో
యాక్సిడెంట్లో ప్రాణాలు దక్కిన వాణ్ణడుగు
............

No comments: