Tuesday, September 4, 2012

సాక్షాద్రామాయణాత్మనా


సాక్షాద్రామాయణాత్మనా

డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
3/106ప్రేమనగర్, దయాల్ బాగ్, ఆగ్రా
91+9897959425

వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేద: ప్రాచేతసాదాసీత్సాక్షాద్రామాయణాత్మనా
వేదవేద్యుడైన పరమాత్మ దశరథునకు పుత్రుడై జన్మించగా వేదం వాల్మీకి లేఖిని నుండి రామాయణంగా అవతరించిందని పెద్దల అభిప్రాయం. ఇది నూటికి నూఱుపాళ్లు నిజం అని నిరూపించారు శ్రీవిశ్వనాథసత్యనారాయణ గారు. వారి రామాయణం వేదతత్త్వ ప్రతిపాదకం, సర్వోత్కృష్టం అని చెప్పవచ్చు. ఆయన తమ కావ్యంలో అవకాశం వచ్చినప్పుడల్లా రాముని పరమతత్త్వంగా వర్ణిస్తూ వచ్చారు. రాముణ్ణి ఇంచుమించు గ్రంథమంతా 'ప్రభువు' అనే మహోన్నతమైన పదం తోనే పేర్కొనడం ఒకవిశేషం.

ఇక అప్పుడే పుట్టిన రాముణ్ణి వర్ణిస్తూ 'వడ్లగింజముల్లంతటి స్వామి' అన్నారు. ఇది వింటే 'నీవారసూకవత్తన్వీ ' అనే వేదవాక్యం గుర్తు రాక మానదు. అలాగే నీళ్లల్లో చిందులాడే రాముణ్ణి తల్లి కౌసల్య ముద్దుగా మందలిస్తూ '' తండ్రీ! నారాయణ! ఏమి మీ పని '' అంటుంది. ఇక్కడ 'నారాయణ' అనే పదం సాభిప్రాయవిశేషణమే కాదు సార్ధకవిశేషణం కూడ. ఇక ప్రస్తుత విషయానికొద్దాం.
శ్రీ రామచంద్రమూర్తి అరణ్యంలో సంచరిస్తూ అహల్య రాయిగా పడి ఉన్న ప్రాంతానికి చేరాడు. ఆయన చేరువకు రాగానే రాయి క్రమ క్రమంగా స్త్రీ స్వరూపం దాల్చింది. విశ్వనాధవారు ఆ ఘట్టాన్ని చాల మనోహరంగా వర్ణించారు. ఆ వర్ణనలో కవిత్వంతో పాటు ఎన్నో తాత్వికవిషయాలు కూడ పొందుపరిచారు. తత్త్వం తెలిస్తే గాని వారివర్ణనలోని సహజత్వం మనకు అవగతం కాదు.
వైదికమతం ప్రకారం ఆత్మనుంచి ఆకాశం పుట్టింది. ఆకాశం నుంచి వాయువు పుట్టింది. వాయువు నుంచి అగ్ని పుట్టింది. అగ్ని నుంచి నీరు పుట్టింది. ఇక నీటి నుంచి భూమి పుట్టింది . అలాగే భూమి నుంచి మొక్కలు, మొక్కల్లోంచి అన్నం, అన్నం శరీరం లోకి వెళ్లి వీర్యంగా మారి స్త్రీలో ప్రవేశించి పురుషుడు (జీవుడు) గా పుట్టడం జరుగుతోంది. ఇది వైదికపరమైన సృష్టి క్రమం.
అయమాత్మన: ఆకాశ: సంభూత:, ఆకాశాద్వాయు:, వాయోరగ్ని:, అగ్నేరాప:, అద్భ్య: పృథివీ, పృథివ్యా: ఓషధయ:, ఓషధీభ్యో అన్నం, అన్నాత్పురుష: ( తైత్తిరీయ ఉపనిషత్తు - /)

ఆకాశం యొక్క గుణం శబ్దం. ఆ శబ్దాన్ని గ్రహించే ఇంద్రియం చెవి. వాయువు యొక్క లక్షణం స్పర్శ. దాన్ని గ్రహించే ఇంద్రియం చర్మం . వాయువు ఆకాశం నుంచి పుట్టడం వల్ల వాయువులో శబ్దం, స్పర్శ రెండూ ఉన్నాయి. అగ్ని యొక్క గుణం రూపం. రూపాన్ని గ్రహించే ఇంద్రియం కన్ను. అగ్ని వాయువు నుండి పుట్టడంవల్ల దానిలో శబ్దం, స్పర్శ, రూపం అనే మూడు గుణాలు ఉన్నాయి. నీటి యొక్క లక్షణం రుచి. రుచిని గ్రహించే ఇంద్రియం నాలుక. అగ్ని నుండి నీరు పుట్టడం వల్ల నీటిలో శబ్దం, స్పర్శ, రూపం, రుచి అనే నాలుగు గుణాలు ఉన్నాయి. భూమి లక్షణం గంధం, అంటే వాసన. వాసనను గ్రహించే ఇంద్రియం ముక్కు. భూమి నీటి నుండి పుట్టడం వల్ల భూమిలో శబ్దం, స్పర్శ, రూపం, రుచి , వాసన అనే ఐదు లక్షణాలు ఉన్నాయి. అలాగే శబ్దాన్ని వినగల చెవి, స్పర్శను గ్రహించగల చర్మం, రూపాన్ని చూడగల కన్ను, రసాన్ని ఆస్వాదించగల నాలుక, వాసన తెలుసుకోగల ముక్కు కూడ నిద్రాణంగా సూక్ష్మ రూపంలో దాగి ఉన్నాయి. అందుకే రామచంద్రమూర్తి శరీరపు సువాసనలు అల్లంత దురం నుండి వ్యాపించగానే అరాయికి స్పర్శ జ్ఞానం కల్గింది. ఆ విషయాన్ని ' ప్రభు మేని పైగాలి పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చె' అని వర్ణించారు విశ్వనాథ వారు.
ఆయన మరికొంత సమీపానికి వచ్చాడు. ఆయన కాలిసవ్వడికి రాతికి చెవులు మొలిచాయట. అంటే వినికిడి శక్తి ప్రారంభమయింది. ఆ విషయాన్ని ' ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు మొలిచె ' అంటారు విశ్వనాథ . ఆ రామచంద్ర ప్రభువు శరీరం సహజపరీమళభరితం ఆ పరిమళం సోకగానే ఆ రాతికి ఘ్రాణేంద్రియం జాగృతమయింది. ఈ విషయాన్ని ' ప్రభు మేని నెత్తావి పరిమళించినతోన అశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందె ' అన్నారు విశ్వనాథ. ఆ రామచంద్రమూర్తి మరింత దగ్గరకు వచ్చాడు. వెంటనే ఆ రాతికి కళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని ' ప్రభు నీలరత్న తోరణమంజులాంగంబు
కనవచ్చి రాతికి కనులు కలిగె ' అని అభివర్ణించారు విశ్వనాథ.
ఇంద్రియాలు స్థూలమైనవి. ఇంద్రియాలకు మూలమైన శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేవి తన్మాత్రలు. ఇవి సూక్ష్మమైనవి. ఇక వీటన్నింటికి కారణభూతమైన ఆత్మ సూక్ష్మాతిసూక్ష్మమైనది. ఆ రామచంద్రమూర్తి చాల దగ్గరకు వచ్చి ఆతిథ్యం స్వీకరించగానే రాయిగానున్న ఆమె హృదయంలో ఉపనిషత్తులన్నీ రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చాయట. పరమపురుషుడు వేదవేద్యుడు. ఈ విషయం
'వేదైశ్చ సర్వై: రహమేవ వేద్య:
వేదాంతకృద్వేదవిదేవ చాహం'( ౧౧/౧౫ అని గీతావచనం వివరిస్తోంది. అలాగే 'నా వేదవిన్మనుతే తం బృహంతం( తైత్తిరీయ బ్రాహ్మణం -/-౧౨-/ ) అనే వాక్యం వేదవేత్తకాని వాడు ఆ పమాత్మను సంపూర్ణంగా తెలుసుకోలేడు అని చెబుతోంది. అదే విధంగా ఉపనిషత్తులు కూడ ముక్తకంఠంతో పరతత్త్వాన్నే అభివర్ణిస్తున్న్నాయి. ఆ సంగతి ' తం త్వౌపనిషదం పురుషం పృచ్ఛామి (బృహదారణ్యక ఉపనిషత్తు ౩/-౨౬) మొదలైన వాక్యాలవల్ల స్పష్టంగ తెలుస్తోంది.
దీన్ని బట్టి వేదాలు వేదసారాంశములైన ఉపనిషత్తులన్నీ ముక్తకంఠంతో పరమపురుషుణ్ణే ప్రతిపాదిస్తున్నాయి.
ఇంతటి మహత్తరమైన వేదార్థాన్ని వివరించిన శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం లోని ఈ రమణీయమైన పద్యాన్ని పరికిం చండి.
సీసం :- " ప్రభు మేని పైగాలి పై వచ్చినంతనే
పాషాణమొకటికి స్పర్శ వచ్చె
ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే
శిలకొక్కదానికి చెవులు మొలిచె
ప్రభు మేని నెత్తావి పరిమళించినతోన
అశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందె
ప్రభు నీలరత్న తోరణమంజులాంగంబు
కనవచ్చి రాతికి కనులు కలిగె
||వె || ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీక
రించినంత హృదయనుపల వీధి
ఉపనిషద్వితానమొలికి శ్రీరామ భ
ద్రాభిరామమూర్తియగుచుతోచె.

ఉపయుక్త గ్రంథములు:
. శ్రీమద్రామాయణ కల్పవృక్షం
. వాల్మీకి రామాయణం
. తైత్తిరీయ ఉపనిషత్తు-
. బృహదారణ్యక ఉపనిషత్తు
. భగవద్గీత

No comments: