Saturday, September 1, 2012

త్రి 'డి' ఎఫెక్ట్


త్రి 'డి' ఎఫెక్ట్
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు
3/106ప్రేమ నగర్, దయాల్బాగ్, ఆగ్రా
91+9897959425

వ్యక్తిత్వ వికాసం మూడు విధాలు. మొదటిది శారీరకవికాసం . రెండోది మానసికవికాసం. మూడోది ఆధ్యాత్మిక వికాసం. ఈ మూడు ఉంటేనే మనిషి వ్యక్తిత్వం పరిపూర్ణ మైనట్లు. అంతేగాని ఏ ఒక్కటి పరిపూర్ణ వ్యక్తిత్వమనిపించుకోదు. పరిపూర్ణ వికాసానికి త్రి 'డి' లకు ఎంతో విడదీయరాని సం బంధం ఉంది. ఆ త్రి 'డి' లలో మొదటి 'డి' అమ్మ ఒడి . రెండో " డి" వీధిబడి. మూడో ''' డి ''' దేవుని గుడి. అమ్మ ఒడి శారీరకవికాసానికి . వీధిబడి మానసికవికాసానికి, దేవునిగుడి ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేస్తున్నాయి.

అమ్మ ఒడి: అప్పుడే పుట్టిన పాపాయికి అమ్మఒడి ఒకస్వర్గం . విగళితవేద్యాంతరమైన ఆనందాన్ని కల్గించే ఒక పూలపాన్పు. తల్లి లాలన దివ్యానుభూతిని కల్గించే సమ్మోహన మంత్రం. అమ్మఒడి శారీరకవికాసం చేకూర్చడం తో బాటుగా మానసిక ఆధ్యాత్మిక వికాసాలకు కావలసిన పునాదులు వేస్తుంది. అందుకే మన సంస్కృతి తల్లిని తొలి గురువుగ పేర్కొంది. అందుకే మనం 'మాతృదేవో భవ' అని తల్లిని తొలి గురువుగా గౌరవిస్తున్నాం. పిల్లవాడు స్కూల్లో చెప్పే విషయాలు అర్థం చేసుకోడానికి కావలసిన ప్రాథమికజ్ఞానాన్ని తల్లి ముందుగానే సమకూరుస్తుంది. ఉపనిషత్తులు కూడ 'మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద' అని గురువులందరిలో తల్లికే పెద్దపీట వేశాయి. శివాజీ, వి వేకానందుడు, గాంధి మొదలైన మహాత్ములు తమ ప్రగతికి తమ తల్లులే కారణమని సగర్వంగా పేర్కొన్నారు . అటువంటి తల్లి నేడు ఏదో వంకతో బిడ్డలను దూరం చేసుకుంటోంది. పిల్లలు తల్లి ఒడికి లాలనకు రాను రాను దూరమౌతున్నారు. ఒక మహా పురుషుని మాటల్లో చెప్పాలంటే నేటి తరం పిల్లవాడు అమ్మ చస్తే ఏడవడు గాని ఆయా చస్తే ఏడుస్తాడట. ఈ దుస్థితి నుంచి నేటి తరం తల్లులు ఎంత త్వరగా బయట పడితే అంత మంచిది. దానికి అనుసరించవలసిన మార్గాలు ఎవరి కి వారే వెదుక్కోవాలి.

వీధిబడి: ఇక రెండవ 'డి' వీధి బడి. పిల్లవాడు తల్లి ఒడిలోంచి తిన్నగా వీధిబడిలోకి ప్రవేశిస్తాడు. వీథిబడిలో పిల్లవాడు భాష , సంస్కృతి, విజ్ఞానం, వివేకం, లోకజ్ఞానం ఎన్నో నేర్చుకుంటాడు. అటువంటి వీథిబడులు నేడు మితి మీరిన ఆంగ్లభాషావ్యామోహం వల్ల నిరాదరణకు గురౌతున్నాయి. కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్నాయి. ఆంగ్ల భాష నేర్చుకోవడం అవసరమే కాని మాతృభాషను విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ''ఇంగ్లీషును కాటుకగా దిద్దుకోగాని ఒళ్లంతా పూసుకోకు నల్లబడతవు " అన్నారొక మహనీయుడు. ఇది అక్షరాలా నిజం. అంతేకాక ప్రపంచంలో ఇంచుమించు అన్ని దేశాల్లోను ప్రాథమికస్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతోంది మనదేశంలో తప్ప. ఇక తల్లి దండ్రులు తమ ఆర్థిక స్తోమతను కూడ లెక్క చెయ్యకుండ పిల్లల్ని ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. పై పై మెరుగులకే పట్టం కడుతున్నారు. నేటి విద్యావిధానం గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే మంచి అధ్యాపకులు ఒకచోట ఉంటే మంచి పిల్లలు మరొక చోట ఉన్నారు. లక్ష్మి ఆనందంతో ఒక ప్రక్క నాట్యం చేస్తోంటే మరో ప్రక్క సరస్వతి విచారంతో ఏడుస్తోంది. వీథి బడుల్లోనే వేరొక ప్రక్క కులమతాలు విలయతాండవం చేస్తున్నాయి. పసి హృదయాలను విషపూరితం కావిస్తున్నాయి.

'' తలిదండ్రులెపుడు బిడ్డలకు తెల్పగరాదు
కులగోత్రములు వానిగొప్పదనము
చదివింపగా రాదు చదువులయ్యలు పాఠ
శాలలలోన కులాలగొడవ''
అని శ్రీ జాషువ వంటి మహనీయులెందఱో వాపోయినా ఈ కులమతవైషమ్యాలవల్ల ఎంతో మంది అన్యాయంగా బలౌతూనే ఉన్నారు.

దేవుని గుడి: ఇక మూడవ 'డి' దేవుని గుడి. ఇది ఆధ్యాత్మిక వికాసానికి తోట్పడుతుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. కాని ఇది కూడ తన పవిత్రతను మెల్లమెల్లగా కోల్పోతోంది. ప్రపంచసాహిత్యంలోనే మొట్టమొదటిదైన ఋగ్వేదం ''ఏకం సద్విప్రా: బహుధా వదంతి" అంటోంది. అంటే సత్యపదార్థం ఒక్కటేనని దాన్ని తత్త్వవేత్తలు అనేకరకాలుగా అభివర్ణిస్తున్నారని అర్థం. మతంలోని ఈ మౌలికమైన విలువను ప్రక్కకునెట్టి మందిరాలు మతద్వేషాన్ని రేకెత్తించే కేంద్రాలుగా మారుతున్నాయి. భక్తుల హృదయాలను సంకుచితం చేస్తున్నాయి. సాధారణంగ మనుషుల్ని కలిపేది మతమైతే మనుషుల్ని విడదీసేది రాజకీయం. ఇప్పుడు మతంలో రాజకీయం చోటుచేసుకోవడం చేత ఆయా మతాలవాళ్లందరూ ఒక్కటై ఇతరమతస్థులను ద్వేషిస్తున్నారు. చులకన చేస్తున్నారు. ఇతర మతాలను ద్వేషించే వారికి వాళ్ల మతం గురించే ఏమీ తెలియదు ఇక ఇతర మతాల గురించి ఏమి తెలుస్తుంది? తెలిసే ప్రసక్తే లేదు. విజ్ఞతతో ఆలోచిస్తే, మానవవునితో బాటే మానవత్వం పుట్టింది. మతం ఆ తర్వాతెప్పుడో పుట్టింది. కాని ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడన్నట్లు మతాలు మానవత్త్వాన్ని కాలరాచే విధంగా మారడం శోచనీయం. ప్రతి మతానుయాయి తన మతాన్ని సంపుర్ణంగా విశ్వసించడంతో బాటుగా ఇతరమతాలలోని విలువల్ని ఆకళింపుచేసుకోవాలి. తమ మతాల్ని అనుసరించడం సదాచారమైతే ఇతర మతాల్ని గౌరవించడం సంస్కారం అవుతుంది. ఆచార్య సి. నారాయణరెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే:

" హరిలొ రంగ హరి అంటూ అడుగడుగున దరువేసే
జియ్యరు విప్లవగీతికి చిందేస్తే కొత్తదనం
ఈశ్వర్ అల్లా ఒకరని ఎన్నాళ్లని ప్రసంగాలు
ముల్లాలు శివస్తుతులు వల్లిస్తే కొత్తదనం
గుడిమసీదు ఒకటేనని గొప్పలు చెప్పకు సి నా రె
పరమవైదికుడు ఖురాను ప్రవచిస్తే కొత్తదనం.
అమ్మ ఒడి, వీథి బడి, దేవుని గుడి అనే ఈ మూడు 'డి' లు కొద్దో గొప్పో అన్నీ కలుషితమయ్యే ఉన్నాయి. మానవప్రగతి ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంది. అందువల్ల వీటి స్థితి మెరుగుపఱుచుకో వలసిన అవసరం ఎంతైనా ఉంది . కాబట్టి ప్రతి వ్యక్తి మానవత్వపు విలువల్ని పెంపొందించుకుని కులం గోడలకి, మతం మందిరాలకి పరిమితం చేసుకుని తాను కర్తవ్యానికంకితమైన నాడే ఈ సమస్యకు కొంతపరిష్కారం లభిస్తుంది . అటువంటి మంచి తరుణం త్వరలో వస్తుందని ఆశిద్దాం . ఆతృతతో ఎదురు చూద్దాం.

లోకాస్సమస్తా: సుఖినో భవంతు

No comments: