Thursday, December 4, 2014

సానలుదీరిన జాతి రత్నం -- అభిజ్ఞానశాకుంతలం

                                         సానలుదీరిన జాతి రత్నం -- అభిజ్ఞానశాకుంతలం

                                                                                                   Dr. Chilakamarthi.Durgaprasada Rao

మన ఆలంకారికులు ఇతివృత్తాన్ని బట్టి కావ్యం మూడువిధాలుగా పేర్కొన్నారు. ఒకటి ప్రఖ్యాతం.  రెండు ఉత్పాద్యం. మూడు మిశ్రo.  రామాయణమహాభారతాది ఇతిహాసాలు ప్రఖ్యాతాలు. కేవలం కవి కల్పించినవి ఉత్పాద్యాలు. అలాకాకుండ రామాయణమహాభారతాల్లోని కథను స్వీకరించి కవిప్రతిభను జోడించి కూర్చినవి మిశ్రములు.ఈ మూడింటిలో మిశ్రమమే చాల మేలైనదని పెద్దల అభిప్రాయం. ఈ విషయాన్నే రామరాజభూషణుడు తన వసుచరిత్రలో  ప్రకటించాడు.

కేవల కల్పనాకథలు కృత్రిమరత్నములాద్యసత్కథల్
వావిరిపుట్టురత్నములవారిత సత్కవికల్పనా విభూ
షావహపూర్వవృత్తములు సానలుదీరిన జాతిరత్నముల్
కావుననట్టి మిశ్రకథగా నొనరింపుము నేర్పు పెంపునన్  

 దీన్ని బట్టి కాళిదాసమహాకవి రచించిన 'అభిజ్ఞానశాకుంతలం'  సానలుదీరిన జాతిరత్నమే అవుతుంది. కాళిదాసు మహాభారతపద్మపురాణాల్లోంచి  తీసుకున్న  కథకు కొన్ని మార్పులు చేసి అద్భుతమైన నాటకాన్ని రచించాడు.
ఆయన చేసిన మార్పులేమిటో చూద్దాం.

౧. మహాభారతంలో దుష్యంతుడు వేటకై అడవికి  వెళ్లి అక్కడ కణ్వమహర్షి ఆశ్రమంలో ప్రవేశిస్తాడు.  అక్కడ ఒంటరిగా ఉన్న శకుంతలను చూస్తాడు. అభిజ్ఞానశాకుంతలంలో  దుష్యంతుడు వేటకై ఒక మృగాన్ని తరుముకుంటూ పోయి కణ్వుని ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ    తన సఖులతో మొక్కలకు నీరుపోస్తున్న శకుంతలను చూస్తాడు.

౨. మహాభారతంలో శకుంతలే తన జన్మవృత్తాంతాని స్వయంగానే దుష్యంతునికి తెలియజేస్తుంది. శాకుంతలంలో ఆమె సఖులు దుష్యంతునికి  వివరిస్తారు.

౩.  అనసూయాప్రియంవదలు మహాభారతంలో లేరు. ఇక నాటకంలో  శకుంతల మనోభావాలు ప్రేక్షకులకు తెలియజెయ్యడానికి అమెను  దుష్యంతునితో కలపడానికి వారిద్దరిని కాళిదాసు ప్రవేశపెట్టాడు.

౪. మహాభారతంలో దుర్వాసశాపవృత్తాంతం లేనేలేదు. కాళిదాసు దాన్ని ప్రవేశపెట్టి  ఒక కీలకమైన అంశంగా మలిచాడు.

౫.  మహాభారతంలో రాజు లోకాపవాదానికి భయపడి శకుంతలను భార్యగా స్వీకరించడానికి తిరస్కరించాడు. కాని నాటకంలో శాపవృత్తాంతాన్ని ప్రవేశపెట్టి రాజులోని  లోపాన్ని సవరించాడు.

౬. మహాభారతంలో గజవృత్తాంతం లేదు.  కాళిదాసు దాన్ని ప్రవేశపెట్టి రాజు ఆశ్రమం వైపునకు ఆకర్షితుడయేలా చేశాడు

౭.  కాళిదాసు నాటకంలో జరుగబోయే సంఘటనల గురించి ప్రేక్షకుల్లో  ఉత్కంఠ ఉంటుంది. కాని మహాభారతకథలో అటువంటి ఉత్కంఠకు అవకాశం  తక్కువ.

౮. మహాభారతంలో - రాజు  కణ్వాశ్రమంలో శకుంతలను గాంధర్వవివాహం చేసుకుంటాడు. ఆమెకు    కుమారుడు కలుగుతాడు. అతనికి ఆఱు సంవత్సరాలు వస్తాయి.  అప్పుడు కణ్వుడు శకుంతలను దుష్యంతుని వద్దకు పంపుతాడు. కాని నాటకంలో శకుంతల గర్భవతిగా ఉన్నప్పుడే కణ్వుడు శకుంతలను దుష్యంతుని వద్దకు పంపుతాడు.  

౯. నాటకంలో రాజు శకుంతలకు తన ఉంగరాన్ని ఇచ్చినట్లుగా వర్ణింపబడింది. ఇది నాటకానికే చాల కీలకమైన అంశం ' అభిజ్ఞానేన జ్ఞాతా శకుంతలా యస్మిన్ తత్ అభిజ్ఞాన శాకుంతలమ్' . ఏ నాటకంలో శకుంతల ఆనవాలుచే గుర్తింపబడిందో ఆ నాటకమే అభిజ్ఞానశాకుంతలం. ఈ  కీలకమైన ఘట్టం మహాభారతంలో లేదు.

౧౦. నాటకంలో కాళిదాసు శకుంతలాదుష్యంతుల విరహావస్థను  చాల అందంగా వర్ణించి నాటకాన్ని రసాత్మకం చేశాడు.  శృంగారం రెండు విధాలు . సంయోగ శృంగారం . రెండు విప్రలంభ శృంగారం. విప్రలంభం అంటే వియోగం . అది  ఉంటేగాని శృంగారానికి పుష్టి చేకూరదు.  మహాభారతంలో  ఇటువంటి విరహావస్థ స్పష్టంగా కనిపించదు. ఇదంతా కాళిదాసు ప్రతిభయే..

౧౧.  నాటకంలో రచయిత కాళిదాసు మనోభిప్రాయాలు అక్కడక్కడ స్పష్టంగా మనకు గోచరిస్తాయి.  మహాభారతంలో వీటికి అవకాశం తక్కువ.

౧౨. మహా భారతకథలోని   నాయకునిలో ఎన్నో దోషాలు కనిపిస్తాయి. కాని నాటకంలో కాలిదాసు తన ప్రతిభతో తొలగించాడు.

మహాభారత కథ ఒక శిల అనుకుంటే అభిజ్ఞానశాకుంతలం  ఒక శిల్పం .అదేవిధంగా మహాభారతం అప్పుడే గని నుండి త్రవ్వి  తీసిన రత్నమనుకుంటే అభిజ్ఞాన  శాకుంతలం సానపట్టిన జాతిరత్నం..                    .
     No comments: