Wednesday, November 19, 2014

లక్ష్మీపార్వతుల సరససల్లాపం

లక్ష్మీపార్వతుల సరససల్లాపం

కసారి శివకేశవులిద్దరూ తమ భార్యలతో ఒక చోట సమావేశమయ్యారు. ఒక ప్రదేశంలో శివకేశవులులిద్దరూ కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు. మరొక ప్రదేశంలో   లక్ష్మీపార్వతులు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు.
పార్వతి లక్ష్మితో  ఏమమ్మా! చంచలమైనదానా! నిన్నోమాటడుగుతాను సమాధానం చెబుతావా? అంది . సరే అడగవమ్మా! శివుని పెళ్ళామా! అoది లక్ష్మి . మీనాన్న ఎవరు? అంది పార్వతి . వెంటనే లక్ష్మి సముద్రుడు అని సమాధానం చెప్పింది. వెంటనే పార్వతి ఊరుకోవమ్మా! ఎవరు నమ్ముతారు. నీళ్లకెక్కడైన పిల్లలుపుడతారా! నేను నమ్మను గాక నమ్మను అంది. ఓహో! సరేలే!  నువ్వు నమ్మకపోతేమానెయ్యి. పర్వతాలకు పిల్లలు పుట్టగాలేంది సముద్రానికి మాత్రం పిల్లలు పుట్టారా ఏంటి? అంది . అది    ఎవరు నమ్ముతారో వాళ్లే ఇది  కూడా నమ్ముతారులే అని లక్ష్మి సమాధానం చెప్పింది . నువ్వు పర్వతం కూతురవైనప్పుడు నేను సముద్రం కూతుర్ని ఎందుకు కాకూడదు అని లక్ష్మి సమాధానం లోని అంతరార్థం.
ఈ విధంగా పరస్పరం వేళాకోళాలాడుకుoటున్న లక్ష్మీపార్వతుల సరససల్లాపాలను వింటూ హరిహరులు లోలోపల ఎంతో  ఆనందిస్తున్నారట . అటువంటి ఆ శివకేశవుల ఆనందం మన విఘ్నాలు పోగొట్టి మనలను రక్షించుగాక అని ఒక కవి అందమైన శ్లోకం వ్రాశాడు.
లోలే! బ్రూహి కపాలికామిని ! పితాకస్తే? పతి: పాథసాం
క: ప్రత్యేతి జలాదపత్యజననం? ప్రత్యేతి య: ప్రస్తరాత్
ఇత్థం పార్వతిసింధురాజసుతయోరాకర్ణ్యవాక్చాతురీo

సంస్మేరస్య  హరేర్హరస్య చ ముదో నిఘ్నంతు విఘ్నం తు వ:                   

No comments: