Tuesday, March 10, 2015

వేల్యుయేషన్ - ప్రహసనం

వేల్యుయేషన్ - ప్రహసనం
హాభారతంలో కర్ణుని మరణానంతరం అర్జునుడు నేనే కర్ణుణ్ణి చంపగాలిగాను అని  తన పరాక్రమం గురించి చాల గొప్పగా  చెప్పుకుంటున్నప్పుడు కృష్ణుడు అర్జునునితో నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవుచేతన్ అంటూ కర్ణుని చావుకి ఇంకా ఎన్నెన్నో కారణాలు వివరించాడు . ఇక ఆ కర్ణుని చావు సంగతలా ఉంచితే నేటి విద్యాప్రమాణాలు చచ్చిపోడానికి కూడ ఎన్నెన్నో కారణాలున్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది వేల్యుయేషన్ విధానం. ముఖ్యంగా తల్లిదండ్రులకు. విద్యార్థులకు, చివరికి ప్రభుత్వానికి మార్కులమీదున్న శ్రద్ధ జ్ఞానం మీద లేక పోవడమే ప్రథాన కారణం .
ఇక వేల్యుయేషన్ అనేది విద్యార్థి అర్హతకు ఒక ప్రమాణమే అయినా అది సమగ్రం కాదు. అందులోనూ  కొన్ని విద్యాసంస్థల్లో వేల్యుయేషన్ చెయ్యడానికి సమగ్రమైన ఖచ్చితమైన నియమనిబంధనలు  లేవు. ఒకవేళ అవి  ఏర్పరచినా కొంతమంది పాటించడం లేదు.   అంతే కాకుండా కొన్ని విద్యాసంస్థలు ఇంత శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలని, లేకపోతే అధ్యాపకుడు సమాధానం చెప్పుకోవాలనే  నిబంధనలు విధిస్తూ ఉపాధ్యాయులను తీవ్రమైన వత్తిడికి గురి చేస్తున్నారు . విద్యాసంస్థలలో విద్యాప్రమాణాలు పెరగడానికి తగిన ఏర్పాట్లు లేకపోయినా ఉత్తీర్ణతశాతంపై వత్తిడి తెస్తూoడడం వలన  వేల్యుయేషన్ స్థాయి దిగజారిందనడంలో ఎటువంటి సందేహం లేదు.         
ఒక పరీక్షలో ఆవుకెన్ని కాళ్లుంటాయని ప్రశ్న ఇచ్చారు. ఒక విద్యార్థి ఒక కాలని వ్రాశాడు. వాడికో మార్కు వేశారు.  మరో విద్యార్థి రెండని వ్రాశాడు వాడికి రెండు మార్కులిచ్చారు. ఇంకో విద్యార్థి మూడని వ్రాశాడు . వాడికి మూడు మార్కులు వచ్చాయి . ఒక తెలివైన విద్యార్థి మాత్రం నాలుగని వ్రాయడంతో  అతనికి పూర్తిగా నాలుగు మార్కులు లభించాయి . ఇదేం న్యాయం? అని ఎవరో ప్రశ్నిస్తే అసలు ఆవుకు కాళ్ళున్నాయనే అందరు  వ్రాశారు గాని కాళ్లుండవని ఎవరు వ్రాయలేదు కదా! అది మనకు చాలు అని పేపర్లు దిద్దుతూ ఆ అల్పసంతోషి  సమాధానం చెప్పాడు.
అలాగే ఒక సందర్భంలో దశరథుని కుమారుడెవరనే ప్రశ్నకు సమాధానంగా ఒక విద్యార్థి రాముడు అని వ్రాయడానికి బదులుగా భీముడు అని వ్రాశాడు. ఆ ప్రశ్నకు మూడు మార్కులు . ఒక అక్షరం తప్పు కాబట్టి ఒక మార్కు తగ్గించి రెండు మార్కులు వెయ్యడం జరిగింది .
ఇప్పుడు వేల్యుయేషన్లో  కొన్ని కొన్ని కొత్త కొత్త  విధానాలు వచ్చాయి. వాని ప్రకారం విద్యార్థి వ్రాతను బట్టి  అతని బుర్రలో దూరి, అభిప్రాయాన్ని గ్రహించి మార్కులు వెయ్యాలి. దీంతో విద్యార్థి వ్రాతకు తిరుగే లేకుండా పోయింది . ఎoదుకంటే  ఏది వ్రాసినా కరెక్టే ఎలా వ్రాసినా కరెక్టే .       
ఇక ఒకసారి పరీక్షల్లో బృహదీశ్వరాలయం ఎక్కడుoదనే ప్రశ్నకు ఒక విద్యార్థి పూరి అని సమాధానం  వ్రాశాడు, మరో విద్యార్థి కొంచెం మార్చి వ్రాస్తే బాగుంటుందని చపాతీ అని వ్రాశాడు . పేపరు దిద్దే వ్యక్తికి ఎవరికి మార్కులు వెయ్యాలో తెలియలేదు. ఏమండీ! ఈ ప్రశ్నకు ఒకడు పూరి అని మరొకడు చపాతి అని సమాధానం వ్రాశారు . ఎవరికి మార్కులెయ్యాలి? అని   ప్రక్కనున్న వ్యక్తిని అడిగాడు.  ఆయన కొంత సేపు ఆలోచించి  పూరి, చపాతి ఏదైతే ఏంటి, ఆ రెండు గోధుమపిoడి నుంచి తయారయ్యేవే కదా ! రెండింటికీ మార్కులు వేసెయ్యండి అన్నాడు తాపీగా. ఇవన్ని హాస్యంగా కనిపిస్తున్నా మొత్తం మీద వేల్యుయేషన్ స్థాయి పూర్వం కంటే నేడు చాలవరకు  దిగజారిoదనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరో ముఖ్యవిశేషమేమిటంటే విద్యార్థికి రావలసిన మార్కుల కంటే ఎక్కువ మార్కులే లభిస్తుoడడo వల్ల  ఎటువంటి సమస్యలు  తలెత్తడం లేదు. కాని అర్హుణ్ణి  అనర్హునిగా భావించడం వల్ల కలిగే నష్టం కంటే  అనర్హుణ్ణి అర్హునిగా ప్రకటించడం వల్ల కలిగే నష్టం చాల ఎక్కువ. దీనివల్ల నిజంగా అర్హతకలవాళ్లకి తీరని అన్యాయమే జరుగుతోంది . దీనికందరు బాధ్యులే. కాబట్టి దీనికి పరిష్కారమార్గం  ఆలోచించి అనుసరించకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదముంది. ఉపాధ్యాయుడు ఎవరి వత్తిడికి లొంగకుండా నియమబద్ధంగా వ్యవహరిoఛినప్పుడే పరిస్థితి మెరుగౌతుంది. తల్లిదండ్రులు కూడ కేవలం వారి పిల్లల మార్కుల మీదే కాకుండా వారి జ్ఞానం మీదకూడ శ్రద్ధ వహిస్తే మరికొంత మెరుగౌతుంది . అలాగే ప్రభుత్వం రాసి కన్నా వాసికే ఎక్కువ  విలువిస్తే ఇంకొంత మెరుగౌతుంది. ఇక విద్యార్థి మార్కులతోబాటుగా విషయాన్ని అర్థం చేసుకోడానికి కూడ ప్రయత్నం చేస్తే ఈ సమస్యకు పూర్తిగా  పరిష్కారం లభిస్తుంది. ముందు ముందు అటువంటి మంచిరోజులొస్తాయని ఆశిద్దాం .   

No comments: