Saturday, February 28, 2015

బాలకృష్ణుని పసిడి పలుకులు

బాలకృష్ణుని పసిడిపలుకులు

బాలకృష్ణుడు చదువుసంధ్యలు మానేసి గోపకులతోను, గోపికలతోను తిరుగుతున్నాడని ఎవరో యశోద చెవిలో ఊదేరు. ఆమె వెంటనే కృష్ణునికి కబురు పెట్టింది. క్షణాల్లోనే అమ్మ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు కృష్ణుడు.
కృష్ణ! నువ్వు చదువు కోవయ్యా!  అంది. (కృష్ణ ! త్వం పఠ)
అమ్మా ! ఏం చదవను అన్నాడు . ( కిం పఠామి?)
నాయనా! శాస్త్రం చదువుకోరా ! అంది . (నను రే శాస్త్రం)
అమ్మా ! దానివల్ల ఏం తెలుస్తుంది ? అన్నాడు. (కిము  జ్ఞాయతే?)
తత్త్వం తెలుస్తుంది నాయనా! అంది . (తత్త్వం)
ఎవరి తత్త్వం తెలుస్తుందమ్మా! అన్నాడు (కస్య?)
భగవంతుని తత్త్వం రా నాయనా! అంది (విభో:)
ఆయనెవరమ్మా? అన్నాడు ఏమి తెలియని అమాయకుడిలా ( స క:?)
ఆయన ఈ ముల్లోకాలకు ప్రభువు నాయనా!  అంది  ( త్రిభువనాధీశశ్చ )
దానివల్ల లాభం ఏo టమ్మా!అన్నాడు. (తేనాపి  కిం?)
అదేంట్రా! జ్ఞానం, జ్ఞానం వల్ల భక్తి, భక్తి వల్ల వైరాగ్యం కలుగుతాయి అంది .  (జ్ఞానం భక్తి రథో విరక్తి:)
సరేనమ్మా !  ఆ వైరాగ్యం వల్ల ఏమిటి ప్రయోజనం? అని అడిగాడు. (అనయా కిం?)
నీకు ముక్తి లభిస్తుంది బాబూ! అంది .( ముక్తిరేవాస్తు తే )
అవన్నీ నాకెందుకమ్మా! పాలు, పెరుగు, వెన్న లాంటివేమైన ఉంటే చెప్పు. అవన్నీ కమ్మగా ఆరగిస్తాను (దధ్యాదీని భజామి)
అని యశోదతో పలికిన కృష్ణుని మాటలు మిమ్మల్ని రక్షించుగాక అని భక్తాగ్రేసరుడైన  బిళ్వమంగళుడు చాల రసవత్తరమైన శ్లోకాన్ని రచించాడు.
నిజమే! చదువులు మనలాంటి సామాన్యులకు గాని స్వయంగా  జ్ఞాన స్వరూపుడు, వేదవేద్యుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడైన  ఆయనకెందుకు ? ఇక
వేదైశ్చ సర్వై రహమేవ వేద్య:
వేదాంతకృద్వేదవిదేవ చాహం ( భగవద్గీత )
  అని ఆయనే స్వయంగా తన గురించి ప్రకటించుకోవడం అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ కృష్ణుడు  తన పరతత్త్వాన్ని /నిజస్వరూపాన్ని వాళ్ళమ్మకు చెప్పకుండానే చెప్పినట్లు  మనం భావించాలి.
కృష్ణ ! త్వం పఠ కిం పఠామి? నను రే శాస్త్రం కిము జ్ఞాయతే ?
తత్త్వం కస్య ? విభో: స క: ? త్రిభువనాధీశశ్చ తేనాపి కిం?
జ్ఞానం భక్తి రథో విరక్తి రనయా కిం? ముక్తిరేవాస్తు తే
దధ్యాదీని భజామి మాతురుదితం కృష్ణస్య పుష్ణాతు వ:     
                             *******


No comments: