Tuesday, February 10, 2015

వ్రాత ఒక కళ

వ్రాత ఒక కళ
వ్రాత ఒక కళ. చక్కగా అందరికి అర్థమయ్యేలా వ్రాయగలగడం ఒక అదృష్టం.  అది కొంతమందికే సాధ్యం . కొoతమంది వ్రాత వాళ్ళతో బాగా పరిచయం ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమౌతుంది. మిగిలిన వాళ్లకు చచ్చినా అర్థంకాదు.  
ఒక డాక్టరు చాల కష్టపడి మొదటిసారిగా  పుట్టింటికి వెళ్ళిన వాళ్ళ ఆవిడికి ప్రేమలేఖ వ్రాశాడట. అది అర్థం కాక చదివిoచుకోడానికి ఆమె వెంటనే మెడికల్ షాపు దగ్గరికి పరుగెత్తిందట.
ఒక ఊరిలో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు . వాళ్ళకు పెళ్లిళ్ళు అయి అత్తవారిoటికి వెళ్లి పోయారు. కొన్నేళ్ళ తరువాత మళ్ళా ఒకసారి కలుసుకున్నారు .
ఒకావిడ మిగిలినవాళ్ళతో మా ఆయన ఏదైనా  వ్రాస్తే ఎవ్వరికి అర్థం కాదే అంది . రెండో ఆవిడ మీ ఆయన కొoత నయం . కనీసం ఆయన వ్రాత ఆయనకైన అర్థం అవుతుంది. మా ఆయన వ్రాస్తే ఆయనకే అర్థం కాదు అంది . ఇక  మూడో  ఆవిడ  మీ వాళ్ళిద్దరూ కొంత నయమేనే మా ఆయన వ్రాత ఆయన్ని పుట్టించిన బ్రహ్మకు కూడ అర్థం కాదు అంది.
ఒక డాక్టర్ రోగికి నాలుగు మందులు వ్రాశాడు . వెంటనే కొని తెమ్మన్నాడు. ఎన్ని షాపులు తిరిగినా మూడు మందులే దొరికాయి . నాల్గోది దొరకలేదు. అందరు తమదగ్గర లేదంటున్నారు.  తిరిగి తిరిగి విసిగి వేసారి రోగి చివరికి  డాక్టర్ దగ్గరకొచ్చి అయ్యా! మూడు మందులే దోరికాయి ఎంత ప్రయత్నిoచినా నాల్గోది దొరకలేదు అన్నాడు. అది మందు కాదయ్యా నా సంతకం అన్నాడు డాక్టర్ తాపీగా.
ఇక వ్రాత గురించి ఒక చక్కని సంస్కృత పద్యం ఉంది. అదేమిటంటే
వాచయతి నాన్య లిఖితం
లిఖితమనేనాపి వాచయతి నాన్య:
ఆయమపరోsస్య విశేష:
స్వయమపి లిఖితం స్వయం న వాచయతి 

ఒకడున్నాడు  ఇతరులు  వ్రాసింది తాను చదవలేడు. ఇక తాను వ్రాసింది ఇతరులెవరు చదవలేరు. ఇ౦కొక విశేషమేంటంటే తాను స్వయంగా  వ్రాసింది తానే చదవలేడు.      ***

No comments: