Sunday, June 21, 2015

పవిత్ర జీవనానికి పన్నెండు సూత్రాలు

పవిత్ర జీవనానికి పన్నెండు సూత్రాలు

మానవజీవితం చాల సంక్లిష్టమైంది. ఎన్నో ఒడుదుడుకులు, లాభనష్టాలు ఎదురౌతూ ఉంటాయి. అటువంటి సంక్లిష్టమైన జీవితం సాఫీగా, సుఖమయంగా సాగాలంటే కొన్ని నియమాలననుసరింఛి జీవించాలి.  అందుకోసం మన పెద్దలు ఎన్నో మార్గదర్శక సూత్రాలు ఏర్పరిచారు. భర్తృహరిమహాకవి అవన్నీ ఏక౦ చేసి ఒకే శ్లోకంలో పొందు పరిచాడు. అవే౦టో క్రమంగా పరిశీలిద్దాం .

1. మొదటిసూత్ర౦ -  అత్యాశను విడిచిపెట్టడం (తృష్ణాం  ఛి౦ది).
మానవుడు ఆశాజీవి. ఆశపడడం తప్పు కాకపోవచ్చునేమో గాని అత్యాశమాత్రం  ఖచ్చితంగా తప్పు. కోరికలకు అంత౦ లేకపోవడం చేత అవి తీర్చుకోడానికి మానవుడు పడే ప్రయాసకు కూడ అంతం ఉండదు. అంతే కాక  ఆశకు దాసులైనవారు ఈ సకలప్రపంచానికి దాసులే అవుతారు. ఇక ఎవరు ఆశను అదుపులో ఉ౦చుకు౦టారో వారికి ఈ ప్రపంచం అంతా అదుపులోనే ఉ౦టు౦దని మన పెద్దల అభిప్రాయం . అందుకే --
ఆశాయా: యే దాసా: తే దాసా: సర్వలోకస్య
ఆశా యేషా౦ దాసీ తేషాం దాసాయతే లోక:   --అన్నారు. కాబట్టి మానవుడు తన అవసరాలను తగ్గించుకుని వానికే పరిమితమై జీవిస్తే ఎటువంటి బాధ ఉండదు. అలాకాకుండా కోరికలు పెంచుకు౦టూ పోతే ఇ౦ద్రియాలచే ఆయాసపెట్టబడినవాడై సుఖాలకు దూరమౌతాడు. కాబట్టి కోరికలు సాధ్యమైనంత తగ్గించుకోవాలి.

2. రెండో సూత్రం - సహనాన్ని అలవరచుకోవడం (భజ క్షమాం)
మానవజీవితం సుఖదు:ఖాల మిశ్రమం . సుఖం శాశ్వతంగా ఉండదు, అలాగే దు:ఖం కూడ శాశ్వతం కాదు. ఒకదాని వెంట మరోటి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎటువంటి ప్రతీకారవా౦ఛలేకుండా , విచారం లేకుండా , దు:ఖాల్ని అనుభవించడమే సహనం . దీన్నే తితిక్షా అని కూడ పిలుస్తారు. దీనికి మించిన సాధనం మఱొకటి లేదు . న తితిక్షా సమమస్తి సాధనమ్ అంటారు భారవి మహాకవి.

3. మూడో సూత్రం - మదాన్ని మట్టుపెట్టడం. (జహి మదం)
  అహంకారం వల్ల మనిషి మత్తుడౌతాడు. వివేకాన్ని కోల్పోతాడు. చివరకు నాశనమౌతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితి లోను అహంకారానికి  తావివ్వకూడదు. అహంకారం  పతనానికి తొలిమెట్టు.   

4. నాల్గో సూత్రం పాపపు పనుల యందు ఆసక్తి కనపరచకపోవడం (పాపే రతిం మా కృథా:)
 ఇది చాల ముఖ్యమైనది . మంచిపనులు చెయ్యకపోయినా పరవా లేదు గాని చెడ్డ పనులెన్నడు చెయ్యకూడదు. మనం చేసిన పాపపుణ్యముల ఫలితం మనమే ఎప్పుడో ఒకప్పుడు , ఎక్కడో ఒక చోట అనుభవి౦చక తప్పదు. మనం సమాజంలో ఒక విచిత్రం  చూస్తూ ఉంటాం . అదేమిటంటే కొంతమంది చెడ్డవాళ్ళు చెడ్డపనులు చేస్తూనే ఎన్నో సుఖాలనుభవిస్తూ ఉంటారు; అలాగే మంచివాళ్ళు మంచిపనులు చేస్తున్నప్పటికీ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కనిపిస్తారు. ఇది మనం జీర్ణి౦చుకోలేం. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెడ్డవాళ్ళని మనం చెప్పుకుంటున్న వాళ్ళు పూర్వం ఎప్పుడో ఒకప్పుడు మంచిపనులు తప్పక చేసి ఉంటారు. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇక ఇప్పుడు చేస్తున్న పాపాలకు మరో జన్మలో ఫలితం అనుభవించకతప్పదు. అలాగే ఈ జన్మలో మంచిపనులు చేస్తున్నప్పటికి ఇప్పుడు బాధలుపడుతున్నవాళ్ళు గతంలో చెడ్డపనులు చేసినవారే అయుంటారు. వాని ఫలమే ఈ బాధలు. నేడు చేస్తున్న మంచిపనులకు రాబోయే జన్మలో ఫలం తప్పక లభిస్తుంది. అందువల్ల  అవశ్యమనుభోక్తవ్యం కృత౦ కర్మ శుభాశుభం. అన్నారు మన పెద్దలు. ఒక్కొక్కప్పుడు పాపపుణ్యాల ఫలితం వెంటనే అనుభావి౦చక తప్పదు. అతిదారుణమైన పాపం, అతి ప్రసిద్ధ మైన పుణ్యం చేస్తే వాటిఫలితం ఈ లోకంలోనే మూడు సంవత్సరాల్లో గాని,మూడు నెలల్లో గాని, మూడు పక్షాల్లో గాని మూడు రోజుల్లో గాని అనుభావిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్రిభిర్వర్షై : త్రిభిర్మాసై: త్రిభి: పక్షై: త్రిభిర్దినై:
అత్యుత్కటై: పుణ్యపాపైరిహైవ ఫలమశ్నుతే.
ఎవరి పుణ్యపాపాలకు వారే బాధ్యులు . ఎవడు ఫ్లగ్ లో వేలు పెడితే వాడికే షాక్ కొడుతుంది గాని మరొకడికి కాదు. పాపపు పనులకు దూరంగా ఉండాలి.    

   5.  ఐదవ సూత్రం సత్య౦  పలకడం (సత్యం బ్రూహి).
ఒక్క ఏనుగు పాదంలో అన్ని జంతువుల పాదాలు ఇమిడి యున్నట్లే సత్యంలో సమస్తధర్మాలు ఇమిడి ఉ౦టాయి. సత్యానికి మించిన ధర్మం మఱొకటి లేదు. అందుకే సత్యాన్నాస్తి పరో ధర్మ: అన్నారు . కాబట్టి ఎట్టి పరిస్థితిలోను అబద్ధం చెప్పకూడదు. ఇక్కడొక ధర్మసూక్ష్మం కూడ లేకపోలేదు. ఏది సత్యం ఏది అసత్యం అనే విషయానికొస్తే  సమాజానికి హాని చేకూర్చే సత్యం కన్నా సమాజానికి మేలు కల్గించే అసత్యం మిన్న.  చెడ్డ ఉద్దేశ్యంతో మాట్లాడే  సత్యం కూడ అసత్యమే అవుతుంది. అలాగే మంచి ఉద్దేశ్యంతో మనం ఒక వేళ అబద్ధం చెప్పిన అది సత్యంతో సమానమే అవుతుంది .
అంతా ఉద్దేశ్యంలోనే ఉంది. మహాభారతంలో ఒక ఘట్టం పరిశీలిద్దాం. భారతయుద్ధ౦ జరుగుతోంది. ఆ యుద్ధంలో ద్రోణాచార్యులవార్ని చంపాలంటే ఆయనకొక విచారకరమైన వార్త తెలియజెయ్యాలి. ఎవరికైనా పుత్రమరణ౦ కంటే విచారకరమైన వార్త మరేదీ ఉండదు. అందువల్ల ద్రోణాచార్యుల పుత్రుడైన అశ్వత్థామ మరణించాడనే వార్త తెలియజేయమని ధర్మరాజుని కోరారు. కాని అబద్ధం చెప్పడానికి ధర్మరాజు నిరాకరించాడు. అపుడు పాండవులు భీముని చేత అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును చంపించి అశ్వత్థామ హత: కుంజర: అని చెప్పమన్నారు . ధర్మరాజు అ౦గీకరి౦చాడు. అలాగే చేశాడు . అప్పుడు కుంజర: అనే పదం ద్రోణునకు వినపడకుండా జాగ్రత్త పడ్డారు వారందరూ.   అశ్వత్థామ మరణించాడని భావించిన  ద్రోణుడు అస్త్రసన్యాసం చెయ్యగా ధృష్టద్యుమ్నుడు అతన్ని చంపాడు. ఇక్కడ వాస్తవానికి ధర్మరాజు అబద్ధమేమీ ఆడలేదు. కాని  ఉద్దేశ్యం మాత్రం ద్రోణుని చంపాలనే కోరిక.  అందువల్ల ధర్మరాజు రథం అంతకు ముందు వరకు భూమిని తాకకుండా నడిచేది . కాని అసత్యదోషంవల్ల అప్పటినుంచి భూమికి తాకుతూనే నడవడం మొదలైంది.
 అలాగే దీర్ఘరోగంతో బాధపడుచున్న ఒక రోగి డాక్టర్ దగ్గరకెళ్ళి పరీక్షి౦చుకుంటే డాక్టర్ అన్ని పరీక్షలు చేసి మీకేరోగం లేదు ఆరోగ్యంగానే ఉన్నారని చెబితే అది అసత్యమైనప్పటికి రోగిని పదికాలాల పాటు బ్రతికిస్తుంది, బ్రతికినంతకాలం  ఉల్లాస౦గా ఉంచుతుంది కాబట్టి డాక్టర్ కి అసత్యదోషం అంటదు.            

6. ఇక ఆరవ సూత్రం సత్పురుషుల జీవనమార్గాన్ని అనుసరించడం (అనుయాహి సాధుపదవీ౦)
సత్యం  ఒక్కటే అయినా  ఆ సత్యాన్ని భిన్నభిన్న మతాలు , భిన్న భిన్న శాస్త్రాలు దేశకాలాలకనుగుణంగా అనేకరకాలుగా నిర్వచిస్తున్నాయి. వాటిని తర్కిస్తూ వాదవివాదాలకు దిగకు౦డ మహాత్ముల మార్గాన్ని అనుసరించడమే మనకు శ్రేయస్కరం. అందువల్ల మహాజనో యేన గత: స పంథా:  అని పెద్దల అభిప్రాయం .

7. ఏడవ సూత్రం - పండితులను సేవించడం (సేవస్వ విద్వజ్జనం)
 పండితులను సేవించడం వల్ల వారి వలన ఎన్నో ధర్మాలను , ధర్మసూక్ష్మాలను గ్రహి౦చగలుగుతా౦.-దాని వల్ల  జీవితం సుఖవంతం ఔతుంది. 

8. ఎనిమిదో సూత్రం -  గౌరవి౦చవలసిన వారిని గౌరవించడం (మాన్యాన్మానయ ).
సాధారణంగా మన కంటే పెద్దవారిని మనం తప్పని సరిగా గౌరవించాలి. మన కుటుంబంలోను, చుట్టుప్రక్కల సమాజంలోను ఎంతోమంది మనకంటే పెద్దవారు౦టారు. వారందరి పట్ల ఎంతో గౌరవపుర్వకంగా వ్యవహరి౦చవలసిన బాధ్యత మనకుంది . వారి పట్ల ఏ మాత్రం అమర్యాదగా ప్రవర్తించినా  అది మనకెంతో ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. గౌరవి౦చదగినవారిని గౌరవి౦చకపోతే నీకు రావలసిన శ్రేయస్సుకు అవరోధం కలుగుతు౦దంటాడు కాలిదాస మహాకవి తన రఘువంశంలో (ప్రతిబధ్నాతి హి శ్రేయ: పూజ్యపూజావ్యతిక్రమ:) అందువలన పెద్దల్ని గౌరవి౦చడం ఎంతో అవసరం. మనం వారికి సేవలు చేయలేకపోయినా నోరార ప్రేమగా పలకరించి నమస్కారం చేస్తే మనకొచ్చే నష్టమేమి లేదు . ఇక దాని వల్ల వాళ్ళు పొందే సంతోషం మనకు కొండంత అండగా నిలుస్తుంది. అందువల్ల ఎప్పుడు పెద్దల్ని గౌరవిస్తూ ఉండాలి. పెద్దల్ని గౌరావించకపోతే మనం వారి వలన పొందవలసిన లాభం పొందలేం.

9. ఇక తొమ్మిదో సూత్రం శత్రువును కూడ ప్రేమించి గౌరవించడం (విద్విషోప్యనునయ)
ప్రతి వ్యక్తీ శత్రువును కూడ ప్రేమించే స్థాయికెదగాలి. మనకిష్టమైన మిత్రుల్ని ప్రేమి౦చడంలో గొప్పదనమేమి లేదు.  మనశత్రువుల్ని సైతం ప్రేమి౦చగలగడమే గొప్పదనం . అందుకే-
 ఉపకారికి నుపకారము
విపరీతము కాదు సేయ వివరి౦పంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక  సేయువాడె నేర్పరి సుమతీ అన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన.
శత్రువుకి ఉపకారం చేస్తే ఒక్కొక్కప్పుడు చెడ్డవాణ్ణి కూడ మంచివానిగా మార్చే అవకాశం చిక్కుతుంది.       

10. ప్రఖ్యాపయ ప్రశ్రయం (వినయం అలవరచుకోడం)
ఎంతగొప్పవానికైన వినయం ఉ౦డి తీరాలి. వినయం లేకపోతే ఎంతటి గోప్పవ్యక్తినైన ఎవరూ గౌరవించరు.  ఒక మనిషి  గొప్పవాడు కాకపోయినా అతన్ని అందరు గొప్పవాడంటే అతను గొప్పవాడుగా గుర్తి౦పబడతాడు. దేవే౦ద్రుడైనప్పటికి తన గొప్పదనం తానే చెప్పుకుంటే అందరికి చులకనై పోతాడు.
( పరై: ప్రోక్తా: గుణా: యస్య నిర్గుణోsపి గుణీ భవేత్
 ఇంద్రోsపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితై: గుణై:)     అందుకే వినయం అలవరచుకోవాలి.  

11. కీర్తిం పాలయ ( కీర్తిని పె౦పొందించుకోవడం)  శరీరానికి ఆత్మ ఎంత ముఖ్యమో వ్యక్తిత్వానికి కీర్తి అ౦తే ముఖ్యం.  మనిషి అపకీర్తి పాలైతే బ్రతికున్నా చచ్చినట్లే, కీర్తి మంతుడైతే మరణించినా జీవి౦చినట్లే. అందుకే నర: పతితకాయోsపి యశ:కాయేన జీవతి అన్నారు పెద్దలు. మనిషి భౌతికంగా మరణించినా కీర్తి శరీరంతో శాశ్వతంగా జీవిస్తూనే ఉంటాడు.  అందువల్ల కీర్తిని రక్షించుకోవాలి. మచ్చ రాకుండా చూసుకోవాలి.

12. దు:ఖితే కురు దయా౦ ( దీనుల పట్ల దయ చూపడం)
  మనం ఎన్నో దానధర్మాలు చేస్తూ ఉంటాము . చేసేటప్పుడు పుచ్చుకునే వాడికి యోగ్యతా ఉందా లేదా అని విచారి౦చ౦. ఉన్నవాడు లేనివాడు కూడ ఉన్నవాడికే పెట్టాడు అన్న మాదిరిగా మనం మనకంటే ఉన్నతంగా ఉన్నవాడికి దానధర్మాలు చేస్తాం ,లేనివాడికి చెయ్యం . ఎ౦దుకంటే ఉన్నవాడికి చేస్తే మనకు గౌరవం లభిస్తుందని, మనకెప్పుడైన ఆ వ్యక్తి ఉపయోగపడతాడని మన భావన. కాని ప్రతిఫలాన్ని ఆశింఛి చేసే ఏ దానమైన  లేక సహాయమైన  సరైందనిపించుకోదు. 
అందుకే శ్రీశంకరాచార్యులవారు దేయం దీనజనాయ చ విత్తం  అన్నారు.  సముద్రంలో కురిసే వర్షం వ్యర్థం . కడుపునిండిన వానికి భోజనం పెట్టడం వ్యర్థం . సమర్థునకు దానం చెయ్యడం వ్యర్థం .  అలాగే పట్టపగలు వెలిగింఛిన దీపం వ్యర్థం.
వృథా వృష్టి: సముద్రేషు వృథా తృప్తస్య భోజనం
వృథా దానం సమర్థస్య వృథా దీపం దివాపి చ
కాబట్టి దీనులకే దానధర్మాలు చెయ్యాలి, కడుపు నిండిన వారికి కాదు. ఈ భావాలన్నీ వివరించే భర్తృహరి శ్లోకం చూడండి.
 తృష్ణాం  ఛి౦ది భజక్షమాం జహి మదం పాపే రతిం మా కృథా:
సత్యం బ్రూహ్యపయాహి సాదుపదవీ౦ సేవస్వ విద్వజ్జనం
మాన్యాన్మానయ విద్విషోప్యనునయ ప్రఖ్యాపయ ప్రశ్రయం
కీర్తిం పాలయ దు:ఖితే కురు దయామేతత్సతాం చేష్టితం    
No comments: