Saturday, August 15, 2015

రాజు+యోగి=రాజయోగి

రాజు+యోగి=రాజయోగి
                                            చిలకమర్తి దుర్గాప్రసాదరావు

వులు చాల ప్రతిబావంతులు ఏదైనా ఒక వస్తువును మరో ఏవస్తువుతోనైనా పోల్చగల నేర్పరులు. ఇక్కడ ఒక రాజును యోగితో పోల్చడం జరిగింది. పోలికలో వైవిధ్యం పెద్దగా లేదుగాని, పోల్చడంలోనే ఉంది.  సాధారణంగా యోగి లక్షణాలుగల రాజును రాజయోగి అని, యోగులలో గొప్పవానిని యోగీశ్వరుడని పిలవడం పరిపాటి. కాళిదాసు అంటాడు పప్ర చ్ఛ కుశలం రాజ్ఞే రాజ్యాశ్రమమునిం  ముని: .   ఆశ్రమానికి మునియైన వసిష్ఠుడు రాజ్యమనే ఆశ్రమానికి మునియైన దిలిపునికుశలమడిగాడట. ఈయన ఇక్కడ మునైతే ఆయన అక్కడముని . కాని ఇది అలా కాకుండా కొంత విలక్షణ0గా కన్పిస్తోంది. అదెలాగో చూడండి.
యోగాభ్యాసానికి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులని ఎనిమిది మెట్లు ఉన్నాయి.
1.       యమ:  అహింస ( శారీరకంగాగాని మానసికంగా గాని 
  దేన్నీ హింసించకుండా ఉండడం ), సత్యం (సత్యం మాట్లాడడం), అస్తేయం ( దొంగతనం చేయకుండుట), బ్రహ్మచర్యం ( బ్రహ్మచర్యదీక్ష), అపరిగ్రహం (ఉచితంగా ఏ వస్తువును ఇతరులనుండి తీసుకొనకుండుట) అనే ఐదిటిని యమాలు అంటారు. ఇవి యోగాభ్యాసానికి కావలసినవి. ఇది బహిరంగ (external) సాధనం .
ఇక్కడ రాజు పక్షంలో త్వద్బాణేషు యమ: అని చెప్పడం చేత  నీ బాణాల్లో యముడు ఉంటాడు, అంటే అవి శత్రువులను సంహరిస్తాయని చీల్చి చెండాడతాయని అర్థం.
2. నియమ:     యోగిపరంగా నియమాలు:  శౌచం ( బాహ్యంగా, ఆభ్యంతరంగా శుచిగా ఉండడం), సంతోషం ( ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం), తపస్సు, స్వాధ్యాయ౦ (వేదాలు చదవడం), ఈశ్వరప్రణిధానం ( అంతా భగవంతునికి సమర్పించడం) ఇవి నియమాలు . ఇది బహిరంగ (external) సాధనం.  
ఇక రాజు పరంగా చూస్తే జయేషు నియమ:  నీ విజయాలు నియమంతో ఉంటాయి, ధర్మవిరుద్ధంగా ఉండవని అర్థం
3. ఆసనం: ఇక ఆసనం అంటే యోగి పరంగా స్థిరసుఖం ఆసనం అంటారు స్థిరసుఖమాసనంఅని పతంజలి. అంటే స్థిరంగా కూర్చుని ధ్యాన౦ చేసుకోవడానికి  సుఖంగా ఉండే భంగిమ. ఇది కూడ బహిరంగ ( external)సాధనమే. 
ఇక రాజుపరంగా ప్రాప్తే స్థిరం చాసనం నీకు సింహాసనం దక్కితే అది స్థిరంగా ఉ౦టు౦దని  అర్థం.
 4. ఇక నాల్గోది ప్రాణాయామం. తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయో: గతి విచ్ఛేద: ప్రాణాయామ: . ఆసనం లభించిన తరువాత
ఉచ్ఛ్వానిశ్వాసల నడకని నిలుపుచెయ్యడమే ప్రాణాయామం .
ఇది పూరకం, కుంభకం, రేచకం అని  మూడు విధాలు. పూరకం అంటే గాలిని పీల్చడం, కుంభకం అంటే పీల్చిన గాలిని కొంతసేపు బంధించడం, రేచకం అంటే ఆ గాలిని బయటకు విడిచిపెట్టడం.    ఇది సగం అంతరంగం సగం  బహిరంగం ( both external and internal) కాబట్టి రెండూను.  ఇక రాజు పక్షంలో భ్రా౦తౌ శ్వాస వినిగ్రహ: అంటే నువ్వెప్పుడైన దిగ్భ్రాంతి చెందినప్పుడు ఊపిరి బిగబెడతావు అని అర్థం.
5. ఇక ఐదవది ప్రత్యాహారం . అంటే ఇంద్రియాలను వాటియొక్క ప్రవృత్తి నుంచి మళ్లింప జేయడం. అందమైన వస్తువును చూసే కన్నును అది చూడకుండా అరికట్టడం. మంచిసంగీతాన్ని వినే చెవిని అది వినకుండ అరికట్టడం. రుచికరమైన పదార్థాలను ఆస్వాదించే నాలుకను తినకుండా నిలిపివేయడం . సౌరభంకోసం పరితపించే ముక్కును అటు నుంచి మళ్ళించడం . అలాగే చల్లని వాతావరణాన్ని కోరుకునే చర్మాన్ని అటువంటి వాతావరణ౦ నుంచి  మళ్ళించడం. withdrawl of senses from their respective objects. ఇది internal. ఇక్కడ రాజుపక్షంలో గుణగణే ప్రత్యాహృతి: శ్రీమత: అంటే సంపదలయొక్క , సంపన్నుల యొక్క గుణాల స్తుతి నుంచి మనసును మళ్ళించడం. అనగా వాటిపట్ల నిస్పృహ కలిగి ఉ౦డడ౦. అంటే ఆసక్తి లేకపోవడం.
6. ఇక ఆరవది ధారణ. ధారణ అంటే ఆయా విషయాలనుంచి మళ్లించిన ఇంద్రియాలను ఒక స్థానంలో నిల్పు చెయ్యడం. దీన్నే పతంజలి దేశబంధ: చిత్తస్య ధారణా అన్నారు. ఇక రాజు పరంగా చూస్తే భూమిని ధరిస్తున్నాడు( పరిపాలిస్తున్నాడు) అని అర్థం . ఇది కూడ internal.    
7.  ధ్యానం: ఇది ఏడవ అంగము . తత్ర  ప్రత్యయైకతానతా ధ్యానం అని పతంజలి.  ఏ విషయము మనకు ధ్యేయమో ఆ విషయము అవిచ్ఛిన్నప్రవాహరూప౦గా చిత్తమందుంచుట ధ్యానం . ఇది internal.  ఇక రాజుపరంగా చూస్తే అతని మనస్సు ఎల్లప్పుడూ శివుని యందే లగ్నమై ఉంటుంది.   
8. సమాధి: ఇది ఎనిమిదవది , ఆఖరిదిన్ని. ధ్యానమే ధ్యేయ వస్తువుతోనేకమైనచో అది సమాధి. అక్కడ ధ్యానం , ధ్యేయం అనే భేదం కనిపించదు.ఇది కూడా internal. ఇక  రాజుపక్షంలో  ఆయన ధర్మం పట్ల లగ్నమై ఉన్నాడని అర్థం. మొత్తం మీద శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా ఉంటుంది .

ఒరాజా! నీబాణాల్లో యముడున్నాడు. నీ విజయాల్లో నియమముంది . నువ్వు జయిస్తే ఆసనం స్థిరం . నువ్వు భ్రాంతి పొందినప్పుడు  ఊపిరి బిగబెడతావు. ధనవంతులపట్లనీకు వైమనస్యం . నువ్వుదీనజనపక్షపాతివి. నీ ధారణ౦తా ప్రజాపాలనం మీదే ఉంటుంది.  నువ్వుఎల్లప్పుడు ప్రజాపాలనమే కర్తవ్యంగా భావిస్తావు. నీ ఏకాగ్రతంతా ధర్మం మీదే  నీ హృదయం కామనా రహితం . ఒక రాజును యోగీశ్వరుడడానికి ఇంతకంటే మరే౦కావాలి.

త్వద్బాణేషు యమ:, జయేషు నియమ:, ప్రాప్తే స్థిరం చాసనం
భ్రాంతౌ శ్వాస వినిగ్రహో, గుణగణే  ప్రత్యాహృతి : శ్రీమత:,
ధ్యానం శూలిని, ధారణా చ ధరణే:, ధర్మే   సమాధి,ర్యత:
తన్నిర్విణ్ణహృద: కిమీశ్వరపరే వాంఛంతి పాతంజలే

( సుభాషితరత్నభాండాగారం -౧౦౯/౨౧౮.  

No comments: