Thursday, August 27, 2015

వివేకానందుడు - విద్య


వివేకానందుడు - విద్య
(The views of Vivekananda on Education)

Dr. Chilakamarthi DurgaprasadaRao
  
యదాయదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత:
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహ౦ (4/7)
అని గీతాకారులవచనం.
లోకంలోఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కల్గుతుందో, అధర్మం పెచ్చు పెరిగిపోతుందో అప్పుడు ధర్మస్థాపనకై నన్ను నేను సృష్టించుకొoదునని ఆ మాటల సారాంశ౦. ఆ విధ౦గా అవతరించిన వారిలో వివేకానoదస్వామి ఒకరు. పరస్పరవిరుద్ధమైన భారతీయ-పాశ్చాత్య నాగరికతల మధ్య నలిగి యువత దిక్కుతోచక యవస్థపతున్నప్పుడు  వారికి మార్గదర్శకునిగా ఆయన అవతరించారు. వివేకానందస్వామి 1863జనవరి 12వతేదీన విశ్వనాధదత్త-భువనేశ్వరీదేవి దంపతులకు జన్మించారు. ఈయనకు తల్లి రామాయణ, మహాభారత కథల్ని ఉగ్గుపాలతో  రంగరించి పోయడంతో భారతీయసంస్కృతిపై చిన్న వయస్సులోనే ఒక అవగాహన కల్గింది.  ఇవే ఆయన మనోవికాసానికి, బుద్ధివికాసానికి బాటలు వేశాయి. పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నవిధంగా ఈయన చిన్నతనం నుండే మేధాశక్తి, శారీరకబలం, ధైర్యసాహసాలు కలిగియుండేవారు. విద్యారంగంలోనే కాక మిగిలిన రంగాల్లో కూడ ప్రప్రథముడు గానే ఉండేవారు. ఆయన విశ్వవిద్యాలయజీవితం, రామకృష్ణుని సాన్నిధ్యం, విశ్వమతమహాసమ్మేళనసభలో పాల్గొనడం మొ|| విశేషాలన్నీ పాఠకులందరికి విదితమే. ఆయన భారతదేశoలోను, విదేశాలలోను, అనేక అంశాలపై అమూల్యమైన ఉపన్యాసాలిచ్చి ప్రజల్ని ఉత్తేజపరిచారు. ఆనాటి సమకాలీనసమాజంలో ఆయన ప్రభావానికి లోనుగానివాడు ఒక్కడు కూడ లేడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సాంఘిక, ఆర్ధిక, సాంస్కృతిక, విద్యారంగాల్లో ఆయన స్పృసి౦చని అంశమేదీ లేదు. ఆయా రంగాల్లో ఆయన చెప్పిన  విషయాలు సార్వదేశికాలు, సార్వకాలికాలున్నూ.
విద్య-నిర్వచనం
విద్య అనగా మానవునిలో అంతర్గతంగా దాగియున్న శక్తుల సంపూర్ణ వికాసం మాత్రమేనని వివేకానందుని అభిప్రాయం .
Education is the manifestation of the perfection already in man అన్నారాయన. కాబట్టి శిష్యులలోని అంతర్గతశక్తులను ఉద్దీపింపజేసేవాడే గురువు. దానికి కావలసిన సామగ్రియే బోధన. ప్రతివ్యక్తి తనకు తానే జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. గురువులు దానికి ప్రేరకులు ఔతున్నారు.
గురువు శిష్యులకెప్పుడు అనుకూలమైన ఆలోచనల్నే(positive thoughts) రేకెత్తించాలిగాని ప్రతికూలమైన ఆలోచనలను (negative thoughts) రేకెత్తించరాడు. ఎ౦దుకంటే  ప్రతికూలమైన ఆలోచనలు మనిషిని బలహీనపరుస్తాయి. మానవునకు సరియైన స్వేచ్ఛను ప్రసాదించేది విద్య మాత్రమే. స్వేచ్ఛయే మానవవికాసానికి పునాది. ఇక్కడ స్వేచ్ఛ అంటే బాధ్యతాయుతమైన  స్వయం నిర్ణయశక్తియే గాని విచ్చలవిడితనం కాదు .
పుస్తకాల్లోని విషయాన్ని అర్థం చేసుకోకుండా కేవలం బట్టీపట్టడం విద్యయొక్క పరమావధి కాదని వివేకానందుని అభిప్రాయం. . విషయపరిజ్ఞానం లేని గ్రంథపఠన౦ చిలుకపలుకుల వలె (parrot like repetetion) నిష్ప్రయోజనమని వివేకానందుని అభిప్రాయం.
విద్య మానవుని మనోవికాసానికి, బుద్ధి వికాసానికి  తోట్పడి ప్రతివ్యక్తిని తనకాళ్లపై తాను నిలబడేటట్లు చెయ్యాలి. విద్యకు మతమెంతో అవసరం .ఇక్కడ మతమంటే విశ్వజనీనమైన మానవతాధర్మమేగాని సంకుచితమైన నియమావళి కాదు.
చిత్తైకాగ్రత
జ్ఞానసముపార్జనకు ఏకాగ్రతయే ముఖ్యసాధనమంటారు స్వామి. సామాన్యమానవుని మొదలుకొని మహాయోగి వరకు జ్ఞానార్జనలో చిత్తైకాగ్రతయే ప్రథానసాధనంగా ఉపయోగపడుతో౦దని వివేకానందుని అభిప్రాయం. ఏకాగ్రత ఎంత ఎక్కువ అలవరచుకుంటే ఆ వ్యక్తి అంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తాడు. ఒక రంగంలో ప్రసిద్ధి పొందిన ఏ వ్యక్తినైనా మనం పరిశీలిస్తే ఆ రంగంలో అతనికిగల ఏకాగ్రతయే ప్రథానకారణమని మనం గుర్తించవచ్చు. ఈ ఏకాగ్రత ధ్యానం వల్ల సాధించవచ్చని స్వామి బోధించారు (The practice of meditation leads to mental concenration). కాబట్టి విద్య అంటే మానసిక ఏకాగ్రతయే గాని కేవల విషయసేకరణ కాదు. బ్రహ్మచర్యం , శ్రద్ధ మొ|| నియమాలు ఏకాగ్రతను పెంచి జ్ఞానాభివృద్ధికి దోహదం చేస్తాయని స్వామి తెలియజేశారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం  అన్నారు గీతాకారులు.
శీలస౦పద  
విద్య మానవుని సౌశీల్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. ఇచట ముఖ్యంగా తత్త్వచింతనను, పాశ్చాత్యుల శాస్త్రీయదృక్పథంతో సమన్వయం చేయగల  విద్య ఈ కాలానికి చాల  అవసరమని స్వామి అభిప్రాయపడ్దారు. అనాదిగా భారతీయులు శాస్త్రీయదృక్పథం కలవారే అయినప్పటికీ వారి దృష్టి  ఎక్కువగా ఆధ్యాత్మికవిషయాల మీదే కేంద్రీ కరి౦పబడిందని, అలాగే పాశ్చాత్యులు కూడ కొంతవఱకు ఆధ్యాత్మికదృక్పథం కలవారై నప్పటికీ వారి దృష్టి ఎక్కువగా భౌతికవిష యాల మీదే కేoద్రీకరిoపబడిoదని ఈ రెంటిలోని మంచిచెడ్డలను సమన్వయం చేయగలిగిందే ఉత్తమమైన విద్య అని స్వామి అభిప్రాయ పడ్డారు  .
           విద్య మంచి అలవాట్లను పెంపొందించాలి. చెడ్డ అలవాట్లను నివారించాలి. చెడ్డ అలవాట్లను మానివేయుటకు వానికి విరుద్ధమగు మంచి అలవాట్లను అభివృద్ధి చేసుకొనుటయే మార్గమని స్వామి సూచించారు. మనం మనకుగల దౌర్బల్యాన్ని దైవం పైకి నెట్టరాదు. అన్ని తప్పులకు హృదయదౌర్బల్యమే కారణం కాబట్టి విద్య ద్వారా  ప్రతివాడు హృదయదౌర్బల్యాన్ని పోగొట్టుకోవాలి.

    వ్యక్తిత్వవికాసం
వ్యక్తిత్వవికాసమే విద్య యొక్క పరమ ధ్యేయ౦. అట్టి వ్యక్తిత్వ వికాసానికై గొప్పగొప్పనాయకులు, తత్వవేత్తలు మొదలగువారి ఆత్మకథలను, చరిత్రలను, బోధలను వినాలని వివేకానందస్వామి పేర్కొన్నారు. మహాపురుషుల  స్వీయచరిత్రలను చదవడం  వల్ల మానవజీవితంలో ఎదురయ్యే ధర్మసంకటపరిస్థితులకు సరియైన  దారి దొరుకుతుందని, ఆ  మార్గంలో ప్రయాణం చేసి జీవితాన్ని సుగమం చేసుకోవచ్చునని స్వామి యువతకు తెలియజేసారు. మహాత్ముల ఆశయాలను కేవలం చదవడమేకాక, వాటిని ఆచరణలో పెట్టడానికి  ప్రతి యువకుడు ప్రయత్నించాలి. విద్యాసముపార్జనలో సహాయపడే మనస్సును, ఇంద్రియాలను పటిష్టంగా ఉంచుకోవడానికి యోగాభ్యాసం చాల అవసరమని ఆయన భావించారు.
గురుకులవిద్యా విధానం
 విద్యాసముపార్జనకు గురుగృహవాసమే ఉత్తమోత్తమo. ఇప్పటి ఈ విద్యావిధానం కన్నా ప్రాచీనవిద్యావిధానమే మిన్నయని వివేకానందస్వామి పేర్కొన్నారు. ఇంచుమించు ఈ అభిప్రాయాన్నే శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు ఈ క్రింది పద్యం ద్వారా వ్యక్తంచేశారు.

బెంచీలక్కఱలేదు, గేమ్సు మొదలౌ ఫీజుల్వినన్రావు, పొ
మ్మంచు న్నిర్ధను ద్రోసిపుచ్చరు గురుల్, ప్యాసైననే లాభమిం
దంచున్నేమము లేదు, మీ చదునoదాలోక మీ లోకమున్  
గాంచన్వచ్చెడునార్యులార! మిము మ్రొక్కం జెల్లు నెక్కాలమున్

జ్ఞానతృష్ణ
విద్యార్థి అర్హతలను గుఱి౦చి మాట్లాడుతూ వివేకానందస్వామి, విద్యార్థికి జ్ఞానతృష్ణ కావాలని, మనోవాక్కాయకర్మలసాక్షిగా అతడు పవిత్రుడై యుండాలని విద్యార్థికి పుస్తకాల్లోని వాక్యాలకంటే గురువు అనుభవంతో చెప్పిన మాటలే ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తాయని పలికారు. విద్యార్థి అనువాడు విద్యార్ధిదశలో విద్య తప్ప మరే ఇతర ప్రయోజనాన్ని ఆశిoచకూడదన్నారు. విద్యార్థికి ఇంద్రియనిగ్రహం , సహనం ముఖ్యమైన గుణాలు. శిష్యుడు గురువును దేవునివలె భావించాలని చెబుతూనే ,గురువుల బోధను కేవలం గ్రుడ్డిగా అనుసరించరాదనియ, హేతుబద్ధ౦గా ఆలోచించి అనుసరించాలని విద్యార్థి లోకానికి ఆయన సలహా యిచ్చారు. గురువు విద్యార్థికి మానవ జీవితoలోని ఉత్తమ ఆదర్శాలను బోధించాలి. ప్రపంచచరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులను గురువు విద్యార్థికి పరిచయ౦ చెయ్యాలి. రాముడు, కృష్ణుడు, హనుమంతుడుమొ|| పురాణపురుషులను గురించి చెప్పేటప్పుడు రాముని ధర్మప్రవర్తన, హనుమంతుని సేవాతత్పరత, శ్రీకృష్ణుని కార్యదక్షత మొ|| ఆదర్శగుణాలనే స్వీకరిoచాలి. గురువు ఎన్నడు విద్యార్థిని నిరుత్సాహపరచకూడదు. అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని రేకెత్తించాలి. ఆత్మ విశ్వాస౦ గురించి  మాట్లాడుతూ The history of the whole world is nothing but the history of few men who had faith in themselves” అన్నారు వివేకానందస్వామి.
అంతేగాక నేడు దీశానికి కావలసింది ఇనుపకండరాలు, ఉక్కునరాలు కలిగిన యువత మాత్రమేనని  పేర్కొన్నారు. బలహీనతకు మిoచిన పాపం మరొక్కటి లేదని చెబుతూ, యువత నిర్భయంగా అన్యాయాలను ఎదుర్కోవాలే గాని ఉదాసీనత వహి౦చరాదని, అచంచలమైన ధైర్యవిశ్వాసాలే యువత పురోగమనానికి ముఖ్య కారణమని స్పష్టం చేశారు.
స్త్రీ విద్య
ప్రపంచంలో అన్నిటికన్న మిక్కిలి ఆదర్శవంతమైన అద్వైతవేదాంతాన్ని బోధించిన ఈ పుణ్యభూమిలో స్త్రీలకు సమానమైన  విద్యావకాశాలు కలుగాజేయక పోవడం చాల ఆశ్చర్యకరమైన విషయమని పేర్కొంటూ ,
వేదయుగంలో గార్గి, మైత్రేయి మొ||నారీమణులు అన్నివిద్యల్లోను ఆరితేరినట్లుగా కన్పించడం వల్ల ఈ మార్పు మధ్యయుగ౦లోనే వచ్చినట్లుగా శ్రీ స్వామి భావించారు .
యత్ర నార్యస్తు పూజ్యoతే
రమంతే తత్ర దేవతాః
(ఎచ్చట స్త్రీలుపూజిoపబడతారో  అచ్చట దేవతలు సంతోషిస్తారు ) అన్న మనువు మాటలను ఆయన మనకు గుర్తు చేశారు. ప్రస్తుతం స్త్రీలకు గల సమస్యలు వారికి విద్య లేకపోవడంవల్లే కలుగుచున్నాయని, వారు విద్యావంతులైతే అసలు సమస్యలే ఉండవని స్వామి భావించారు. స్త్రీలకు బోధించే విద్య ముఖ్యంగా వారిని సీతమొ||ఆదర్శనారీమణులుగా తీర్చిదిద్దే విధంగా ఉండాలన్నారు. సీతను గురించి మాట్లాడుతూ She the ever chaste and ever pure wife, she the ideal of the people, the ideal of the Gods, the great Sita must always remain”-----“Ramas there may be several but Sitas can never be” అన్నారాయన. దీనిని బట్టి సీతపట్ల ఆయనకు గల పూజ్యభావమెట్టిదో వెల్లడౌతోంది. ఒక్క స్త్రీ విద్యావంతురాలైతే సమాజమంతా విద్యావంతమౌతుంది.
స్త్రీలకు ముఖ్యంగా పురాణాలు, చరిత్ర,   గృహావిద్య, లలితకళలు  మొ|| అంశాలను బోధించాలి. అన్నిరంగాల్లోను స్త్రీలు పురుషులతో బాటుగా సమానస్థాయికి ఎదగగలిగిననాడే సంఘంలో సమానత్వం సాధించగలం. సంఘమిత్ర, మీరాబాయి, అహల్యాబాయి మొ|| నారీమణుల చరిత్రలను మిగిలిన పాఠ్యాంశాలతో బాటుగా స్త్రీలకు పరిచయం చెయ్యాలి.      
 తన అభివృద్ధికి తనతల్లే ముఖ్యకారణమని ఆయన సగర్వంగా చాటుకున్నారు.
మన భారతదేశంలో నిరుపేదల పరిస్థితి చూస్తోంటే నా హృదయం ద్రవిస్తో౦ది అంటారు స్వామి . వారి పేదరికానికి కారణం విద్యాహీనతే గాని ధనహీనత కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతివ్యక్తి విద్య నేర్చుకోవాలని విద్య అతిసామాన్యపౌరునికి కూడ అందుబాటులో ఉండాలని స్వామి ఉద్బోధించారు .
మాతృభాషాప్రాశస్త్యం
ఇక బోధన విషయానికొస్తే విద్యాబోధన మాతృభాషలోనే ఉ౦డాలి గాని వేరొక భాషలో ఉండరాదని ఖచ్చితంగా చెప్పారు. ఈ విషయంలో మరో అడుగు ముందుకెళ్ళి  విద్యార్థికి అతిచేరువలో ఉన్న ప్రాంతీయ భాషలోనే (vernacular) లోనే విద్యాబోధన జరగాలని ప్రతిపాదించారు.  ప్రతి భారతీయుడు సంస్కృత భాషను తప్పక నేర్చుకొవాలని ఆ భాష మనజాతికి ఆత్మగౌరవాన్ని, బలాన్ని చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.(At the same time Sanskrit education must go along with it, because the very sound of Sanskrit words, gives a Prestige, a power and strength to the race).
కర్తవ్య నిర్వహణ
విద్య జాతీయతాభావాన్ని పెంపొందించి ప్రతి పౌరుని ఒక్కొక్క దేశభక్తునిగా తీర్చిదిద్దాలి. Work is worship” శ్రమయే భగవదారాధన అనే భావం అందరిలోను పెంపొందాలి. ప్రతివ్యక్తి తన కర్తవ్యాన్నివిధిగా నెరవేర్చాలి. ఆ చేసేపని ప్రతిఫలాన్ని ఆశించకుండ చేయాలి. కర్తవ్యాన్నివిస్మరింపరాదు. ఈ మాటల ద్వారా వికానందస్వామి

కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన
మాకర్మఫలహేతుర్భూ: మా తే సంగోస్త్వకర్మణి(2/47)

అని చెప్పిన గీతాకారుని  నిష్కామకర్మసిద్ధాంతాన్ని తిరిగి ప్రతిపాదించారు. ప్రతి వ్యక్తి సేవకుని వలె కాక యజమానివలె పని చేయాలని వివేకానందస్వామి యువతను ఆదేశించారు.
Work like a master but not like a slave .అన్నారు. అనగా
సేవకుడు అయ్యో!  నాకీ పని చేయక తప్పదే! అని బానిసభావంతో చేస్తాడే గాని కర్తవ్య నిష్ఠతో చెయ్యడు. కర్తవ్యనిష్ఠయే కార్యసాఫల్యానికి  సోపానం. ఇక కర్తవ్య౦ అనే పదాన్ని నిర్వచిస్తూ--
“Any action that makes us go God ward is good action and is our duty; any action that makes us go downward is evil; and is not our duty” అన్నారు.
ఏ పని మానవునకు ఉత్తమగతి కల్గిస్తుందో అది సత్కర్మ, అది చేయవలసినది. ఏ పని మానవునకధమగతులు కల్గిస్తుందో అది దుష్కర్మ అది చేయకూడనిది. విద్యయే మానవునకు కర్తవ్యాకర్తవ్యములను బోధించును.
ఇక పరమపురుషార్థమైన మోక్ష౦ ఆనందరూపమే అని, మానవుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తి౦చిననాడే అట్టి యానoదాన్ని  పొందగలడని శ్రీ వివేకానందస్వామి జాతికి సందేశమిచ్చారు.


No comments: