Tuesday, November 24, 2015

A joke in Sanskrit-2

A joke in Sanskrit-2

Laughter is the best medicine

एकदा कश्चन बालक: पाठशालामालस्येन गतवान् || उपाध्याय: तस्य आलस्यस्य कारणं पृष्ठवान् ? बालक: उक्तवान् यत् तस्य मातापितरौ परस्परं विवादं कुर्वन्तौ स्त: इति || उपाध्याय: पुन: पृष्ठवान् यत् तयो: विवादस्य तव आलस्यस्य मध्ये क: संबन्ध: इति || तदा  बालक: विना संकोचम् उक्तवान् मम एका पादरक्षा पितु: हस्ते अस्ति अपर: मातु: हस्ते अस्ति इति ||

  Once, a boy was late to his school. Teacher asked him the explanation for his delay.  “Sir, My mother and father disputed each other” answered the boy. What is the link between their dispute and your late arrival? The teacher enquired. Sir, one of my slippers was in the hand of my mother while the other is in my father’s hand.  
   
ఒకసారి ఒక కుర్రవాడు స్కూలుకి కొంచెం ఆలస్యంగా వెళ్ళాడు. టీచర్ అడిగాడు ఎరా! ఎందుకు ఆలస్యంగా వచ్చావని . సార్, మా అమ్మా,నాన్న ఇద్దరు  దెబ్బలాడుకుంటున్నారు, అందుకాలస్యమై౦దండి అన్నాడు.  నీ దుంప తెగ .మీ అమ్మా - నాన్న దెబ్బలాడుకోడానికి నువ్వాలస్యంగా రాడానికి ఏం సంబంధం ? అన్నాడు టీచర్. నా చెప్పొకటి మా అమ్మ చేతిలోనూ రెండోది మానాన్న చేతిలోనూ ఉండిపోయాయి సార్!  అన్నాడు అమాయకంగా .

(This joke is anonymous, I am only the composer)

Monday, November 23, 2015

A joke in Sanskrit- No-1

A joke in Sanskrit- No-1

(LAUGHTER IS THE BEST MEDICINE)

कस्मिंश्चित्  आपणे कश्चन बालक: चाकलेहान् विक्रीणाति स्म | तस्मिंश्च मार्गे कश्चन वृद्ध : गच्छति स्म | तेषां चाकलेहानां दर्शनेन तस्य मुखत: लालाजलमपि  (saliva) स्रवति स्म | स: बालकं  पृष्टवान् अयि भो! बालक ! चाकलेहानां दर्शनेनैव मम मुखत: जलं स्रवति ||  त्वं कथं निग्रहं वहसि ? आश्चर्यमेतत् इति || तदा बालक: प्रत्युत्तरं दत्तवान् ममापि खादने लालसा अस्ति || अत: अहं एकवारं चकलेहं उद्घाटय, तस्य चर्वणं कृत्वा पुन: पत्रं संवृणोमि (close)|.     

Once in a market place a boy was selling chocolates. An old man was passing near by and his mouth started watering on seeing the chocolates. He asked the boy “My dear boy, my mouth is watering like any thing on seeing the chuckles. Don’t you get temptation on seeing them? The boy humbly answered “I do sir, but the thing is that I close and tie the wrapper of every chocolate after tasting them for a while.  

***

Tuesday, November 17, 2015

ఆంధ్రులు - అద్వైతసేవ--part-1

ఆంధ్రులు - అద్వైతసేవ
                     అధ్యాయం -1
ఆంధ్రుల ప్రాచీనత చరిత్ర- సంస్కృతి-ప్రశస్తి

ఆంధ్రదేశం ఆంధ్రభాష
ప్రముఖకవి, పండితుడు , ఆలంకారికుడు , దార్శనికుడు నైన శ్రీఅప్పయ్య దీక్షితులవారు ఆంధ్రుల గొప్పదనాన్ని ప్రశ౦సిస్తూ ఆంధ్రుడుగా  పుట్టడం, ఆంధ్రభాష మాట్లాడగలగడం ఎంతో తపస్సు వలన గాని సిద్ధించదన్నారు.

ఆంధ్రత్వమాంధ్రభాషా చ ప్రాభాకరపరిశ్రమ:
తత్రాపి యాజుషీశాఖా నాsల్పస్య తపస: ఫలం

ఆంధ్రపదం జాతివాచకంగా, భాషావాచకంగా, దేశవాచకంగాను మూడు విధాలుగా  మనకు కనిపిస్తోంది . ఆంధ్రజాతి చాల ప్రాచీనకాలం నుంచే  ఉందానడానికి  ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నాయి. వేదాల్లోనూ, రామాయణ మహాభారతాల్లోను, పురాణాల్లోను , బౌద్ధగ్రంథాల్లోను ఆంధ్రులప్రసక్తి కనిపిస్తో౦ది. మొట్టమొదటగా ఆంధ్రశబ్ద ప్రయోగం ఋగ్వేదానికి సంబంధించిన ఐతరేయబ్రాహ్మణంలో లబిస్తోంది .
  ఆ కథ ఇలా ఉంది. పూర్వం హరిశ్చంద్రుడు అనే మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు . కాని యజ్ఞం పూర్తికావడానికి ముందుగానే యజ్ఞంలో  బలి కావలసిన పశువు మరణించింది . దానికి ప్రాయశ్చిత్తంగా హరిశ్చంద్రుడు ఒక నరపశువును బలి ఇవ్వవలసిన అవసరం ఏర్పడింది. ఆయన నరపశువును కొనడానికి కావలసిన ధనం సమకూర్చుకుని ఇల్లిల్లు తిరుగుతూ చివరకు ఋచీకుని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఋచీకుని భార్య సత్యవతి, విశ్వామిత్రుని సోదరి. ఆమెకు ముగ్గురు పిల్లలు. మొదటివాడు శున: పుచ్ఛుడు, రెండోవాడు శునశ్శేఫుడు, మూడోవాడు శునో లాంగూలుడు. హరిశ్చంద్రుడు ఆ దంపతులను చేరుకొని  వాళ్ళు అడిగినంత ధనం  ఇస్తానని ఆ ముగ్గురిలో ఒకరిని తనకిమ్మని కోరాడు . ఋచీకుడు తన  పెద్దకుమారుణ్ణి  ఇవ్వడానికి నిరాకరించగా అతని భార్య సత్యవతి మూడవకుమారుణ్ణి ఇవ్వడానికి నిరాకరించింది. ఇక రెండవవాడైన శునశ్శేఫుని విషయంలో  ఇద్దరు అభ్యంతరం చెప్పకపోయే సరికి  అతనికి హరిశ్చంద్రుని వెంట వెళ్ల వలసిన పరిస్థితి  ఏర్పడింది.   ప్రేమలేని  ఇటువంటి తల్లిదండ్రుల మధ్య జీవించేకంటే యజ్ఞంలో మరణి౦చడమే మేలనుకున్నాడు. హరిశ్చంద్రుని వెంట బయలుదేరదానికి సిధ్ధమయ్యాడు శున; శేఫుడు. హరిశ్చంద్రుడు ఋచీకునకు చెల్లించవలసిన ధనం చెల్లించి శునశ్శేఫుని తనవెంట తీసుకుపోతున్నాడు.  శున: శేఫునకు దారిలో తపస్సు చేసుకుంటున్న తన మేనమామ విశ్వామిత్రుడు కనిపించేసరికి   మామయ్యా! నన్ను రక్షించు అని అతని కాళ్ల మీద పడి సాష్టాంగనమస్కారం చేశాడు . విశ్వామిత్రుడు జరిగింది తెలుసుకుని  అతని మీద జాలి పడి , అతనికి బదులుగా హరిశ్చంద్రుని  అనుసరించి వెళ్ళమని  తన కుమారులను బ్రతిమలాడాడు. కాని ఏ ఒక్కడు అంగీకరించలేదు. అందరు నిరాకరించారు. అపుడు విశ్వామిత్రుడు వాళ్ళపై కోపించి శపించాడు. అలా విశ్వామిత్రునిచే శపించబడిన వారిలో  ఆంధ్రుడు ఒకడు. దీన్నిబట్టి ఆంధ్రులు విశ్వామిత్రసంతతి అని తెలుస్తోంది.  ఆ తరువాత  విశ్వామిత్రుడు శునశ్శేఫునికి కొన్ని మంత్రాలు ఉపదేశి౦చగా ఆ మంత్రాలను జపించి ఇంద్రుని సంతృప్తి పరచి ఆపదను౦చి బయట పడ్డాడు.  
ఈ విధంగా  వేదకాలం నుంచి ఆంధ్రజాతి ఉనికి కనిపిస్తున్నప్పటి సంస్కృత సాహిత్యానికి వారు చేసిన కృషి వివరించడానికి తగినన్ని ఆధారాలు మనకు దొరకలేదు. మనకు లభించిన మొదటి గ్రంథం ఆపస్తంబమహర్షి కూర్చిన గృహ్యసూత్రాలు.  ఆయన చెప్పిన ఆత్మలాభాన్న పరం విద్యతే కించిత్    అనే వాక్యం అద్వైతవేదాంతశాస్త్రానికి మూలస్తంభంగా నిలుస్తోంది.
భారతదేశంలో ఒక భాగమైన ఆంధ్రప్రాంతం సుసంపన్నమైన  సంస్కృతికి, వారసత్వ సంపాదకు నిలయం. గతంలో ఇది భౌగోళికంగా ఒకటే అయినా పరిపాలన సౌలభ్యం కోసం కోస్తఆంధ్ర , తెలంగాణ, రాయలసీమ అని మూడు భాగాలుగా  విభజించబడింది. ఈ కోస్తాప్రాంతం  సరస్వతితోను,  రాయలసీమ పార్వతితోను , తెలంగాణను లక్ష్మితోనూ , పోలుస్తూ ఉండేవారు.  ఇది శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరాలనే మూడు శివక్షేత్రాల మధ్యలో ఉండడం వల్ల త్రిలి౦గదేశంగా ప్రసిద్ధి పొందింది.  ప్రతాపరుద్రుని ఆస్థానంలోగల  కవి, పండితుడు,  గొప్ప ఆలంకారికుడు అయిన విద్యానాథుడు ప్రాచీన ఆంధ్రదేశాన్ని వర్ణిస్తూ ఇలా అంటాడు.

యైర్దేశస్త్రిభిరేష యాతి మహతీ౦ ఖ్యాతిం త్రిలి౦గాఖ్యాయా
యేషాం కాకతిరాజకీర్తివిభవై: కైలాసశైల: కృత:
తం దేవా: ప్రసరత్ప్రసాదమధురా: శ్రీ శైల కాళేశ్వర
ద్రాక్షారామనివాసిన: ప్రతిదినం త్వ చ్చ్రేయాసే జాగ్రతు
( విద్యానాథుని ప్రతాపరుద్రీయం పుట -151)

 ప్రాచీన  ఆంధ్రదేశపుటెల్లలు నేటి ఎల్లలతో కొంతవరకు భిన్నంగా కనిపించినా ప్రస్తుత ఆంధ్రదేశం కన్నా అది విశాలమైనదిగా చెప్పవచ్చు. విద్యానాధుని వర్ణన ప్రకారం ఆంధ్రదేశానికి పశ్చిమాన్ని మహారాష్ట్ర , తూర్పున కళింగ, ఉత్తర౦లో కన్యాకుబ్జం, దక్షిణదిశలో పాండ్యదేశం సరిహద్దులుగా ఉన్నట్లు తెలుస్తోంది .

పశ్చాత్పురస్తాదపి యస్య దేశౌ ఖ్యాతౌ మహారాష్ట్రకళింగదేశౌ
అవాగుదక్పాండ్యకకన్యకుబ్జౌ దేశస్స తత్రాస్తి త్రిలింగనామా
ఇక ఆంధ్రదేశపు భౌగోళికపరిస్థితులు, వాతావరణ స్థితిగతులు;  జ్ఞానసంపాదనకు, విద్యాభివృద్ధికి  అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా పాడిపంటలకు నిలయంగా ఉండి దక్షిణదేశపు ధాన్యాగారంగా పేరు పొందింది.  ఈ ప్రాంతం, లౌకిక మరియు పారలౌకిక జ్ఞానసంపాదనకు,  జ్ఞానవ్యాప్తికి కూడ అనుకూలంగా ఉంది. ఎంతోమంది చరిత్రకారులు  ఆంధ్రదేశం యొక్క గొప్పదనాన్ని వేనోళ్ళ కొనియాడారు. గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీసు రచనలను, కాకతీయవంశానికి చెందిన రుద్రమదేవి పాలనలో ఈ దేశం సందర్శించిన వెన్నిస్  యాత్రికుడు మార్కో పోలో రచనలను పరిశీలిస్తే మనకెన్నో విషయాలు తెలుస్తాయి. ప్రాచ్యపాశ్చాత్య దేశాలకు సంబంధించిన ఎంతోమంది  గొప్పవ్యక్తులు ఆంధ్రుల  భాష, సంస్కృతి, వారసత్వ౦ ముదలైన విషయాలకు   సంబంధించిన ఎన్నో  ప్రశంసలు కురిపించారు. ఉదాహరణకు శ్రీకృష్ణదేవరాయల ( AD1509-29) గొప్పతనం  వర్ణిస్తూ సుప్రసిద్ధ పాశ్చాత్య చరిత్రకారుడు బార్బోసా ఇలా అంటాడు.
 " ఆ కృష్ణదేవరాయలు కాలంలో ప్రతి పౌరుడు క్రైస్తవుడు గాని , యూదువంశీయుడు , మూరు వంశీయుడుగాని లేక హితేన్ దేశీయుడు గాని  ఎటువంటి బాధ, వత్తిడి లేకుండా చాల స్వేచ్చగా జీవించేవారు. రాజు, రాజుతో బాటుగా ప్రజలు అందరిని సమానంగా చూసేవారు . అందరు పరస్పరం ప్రేమతో మసలుకునే వారు
[The Wonder That Was India, vol-2, saa rizvee p-87]
ఇక సాహిత్యం మాటకొస్తే ఆంధ్రులు దాదాపు అన్ని శాస్త్రాల్లోను సమృద్ధిగా రచనలు చేశారు. ప్రముఖ విమర్శకుడు మరియు దక్షిణభారత దేశం లోనే గొప్ప ఇండాలజిస్ట్ గా పేరుపొందిన  Dr.V.Raghavan గారి మాటల్లో చెప్పాలంటే  సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల యోగదానం  రాసి లోను వాసిలోను కూడ  గొప్పదిగానే ఉంది. కావ్యాల్లో ఆంధ్రుల స్తోత్ర కావ్యాలు , ప్రశస్తి కావ్యాలు , లఘుకావ్యాలు అసంఖ్యాకంగా కనిపి స్తున్నాయి. ఎన్నో మహాకావ్యాలు ఆంధ్రులు వెలువరించారు. ఎంతోమంది కవయిత్రులు,  రచయిత్రులు  కావ్యాలు,  చారిత్రకకావ్యాలు వెలయించారు. వివిధ శాస్త్రాల్లో ఆంధ్రులు వెలువరించిన   సంస్కృత రచనలు విఖ్యాతిని పొందాయి. అలంకారశాస్త్రంలో విద్యానాధుని ప్రతాపరుద్రీయం అందరి మన్ననలు పొందింది. అనేక శాస్త్రాల్లో వెలువడ్డ ఆంధ్రులరచనలు భారతదేశంలో పలుచోట్ల  సంబంధితశాఖల్లో అధ్యయనాల్లో పాఠ్యాంశాలుగా  గౌరవం సంపాదించాయి . సాయణాచార్యుల  వ్యాఖ్యానం లేకుండా వేదాధ్యయనం ; పంచదశి , జీవన్ముక్తివివేకం  లేకుండా అద్వైతవేదాంతశాస్త్రాధ్యయనం , తర్కసంగ్రహం లేకుండా తర్కశాస్త్ర అధ్యయనం మనం ఊహి౦చలేం.  ఇక జగన్నాథపండితరాయల రసగంగాధారం   అలంకారశాస్త్రానికే మకుటాయమానం . మల్లినాథుని వ్యాఖ్యానాలతోనే సంస్కృతపంచకావ్యాల  అధ్యయనం ప్రారంభం అవుతుంది . (forward by Dr. V. Raghavan, Contribution  of Andhra to Sanskrit Literature by Dr. P. Sriramamurthy, Published by Andhra University, Waltair. Series No:-105m 1972), ఇప్పటివరకు సంస్కృతసాహిత్యానికి ఆంధ్రుల సేవలు స్థూలంగా తెలుసుకున్నాం.  ఇప్పుడు అద్వైత వేదాంతానికి ఆంధ్రుల సేవలు  కొంచెం విస్తృతంగా తెలుసుకుందాం .
అద్వైత వేదాంత౦-ఆంధ్రుల సేవ
 వేదాంతమంటే  వేదాల యొక్క సారాంశ రూపమైన  ఉపనిషత్తులు. ఇక బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల అభిప్రాయాలను  తర్కబద్ధంగా ప్రతిపాదించడం వల్ల;  భగవద్గీతను  ఉపనిషత్తుల సారాంశరూపంగా పేర్కొనడం వల్ల  ఈ మూటిని కలిపి వేదాంతదర్శనంగా పరిగణించారు.  ఇది భారతీయతత్వశాస్త్రంలోని ఆస్తిక దర్శనాలలో ఒక ప్రముఖమైన  స్థానం ఆక్రమించి౦ది. మొత్తం వేదాంతశాస్త్రం ఒక  భవనం అనుకుంటే  ఆ భవనం ప్రధానంగా ఈ మూడు స్తంభాలపైన నిలిచి ఉంది . ఈ మూడిటిని ప్రస్థానత్రయం అని పిలుస్తారు.   వీటిని ఆధారం చేసుకుని వరుసగా శంకరాచార్యులు అద్వైతసిద్ధాంతాన్ని, రామానుజాచార్యులు విశిష్టాద్వైతసిద్ధాంతాన్ని, మధ్వాచార్యులు ద్వైతసిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇవేగాక మరెన్నో సిద్ధాంతాలు మరికొంతమంది
 స్థాపించారు. ఇక ప్రజాబాహుళ్య౦లోను, పండితలోకంలోనూ అద్వైతసిద్ధాంతం ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది . అద్వైతాన్ని (బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాsపర: ) అని సారాంశరూపంగా చెప్పొచ్చు. బ్రహ్మమొక్కటే సత్యం జగత్తు మిథ్య అంటే శాశ్వతమైన నిజం కాదు ఇక  జీవుడు బ్రహ్మము  కంటే వేరు కాదు అని అర్థం. ఇక్కడొక విషయం  పేర్కొనడం  అసమంజసం కాకపోవచ్చు. దక్షిణ భారతదేశం జ్ఞానపారమ్యాన్ని బోధించిన ఆచార్యులకు  ప్రసిద్ధివహించింది. వేదాంతశాస్త్రానికి ప్రధాన ఆచార్యులైన శంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు, శ్రీకంఠుడు, వల్లభాచార్యులు వీరందరూ దక్షిణభారతీయులు కావడం ఒక విశేషం . శంకరులు కేరళదేశంలోనూ , రామానుజులు తమిళదేశంలోను, మధ్వాచార్యులు కన్నడదేశంలోను జన్మించారు. శ్రీకంఠుడు మరియు వల్లభాచార్యులు కూడ ఆంధ్రదేశీయులే. ఈ సందర్భంలో  శ్రీ కోటవేంకటాచలం అనే  ఒక ప్రసిద్ధ చరిత్రకారుడు, రామానుజ, మధ్వాచార్యుల  ఇంటిపేర్లను బట్టి వారి పూర్వీకులు ఆంధ్రులని నిర్ణయించారు.( Andhrula puttupurvottaralu &Jambudvipamu , Author:- Sri Kota Venkataachalam , publication:- Aarya Vijnana Granthamaala) రామానుజుల ఇంటిపేరు
ఆసూరి, మధ్వాచార్యుల ఇంటిపేరు నడిమింటి. ఈ పేర్లు రెండు  వారి పూర్వీకులు ఆంధ్రులని నిరూపించడానికి దోహదం చేస్తున్నాయి. రామానుజుల తండ్రి ఆసూరి కేశవయజ్వ, తల్లి కాంతిమతి. రామానుజులు1017 క్రీ.శ. జన్మించారు. ఇక మధ్వాచార్యుల జన్మస్థలం  ఉడిపి సమీపంలో గల  రజతపీఠ౦. ఇది  ఒక ప్రసిద్ధ అద్వైత మఠం గల  శృంగేరి కి  సమీపంలో ఉంది . ఈయన తండ్రి మధ్యగేహభట్టు. తల్లి వేదవతి.  శుద్ధాద్వైతమత ప్రవర్తకులు  వల్లభాచార్యులు [ఎ.డి 1481-1533] కూడ ఆంధ్రదేశానికి చెందినవారే.  ఆయన యాజ్ఞనారాయణ భట్టు వంశీయులు. నింబార్కుడను మరో పేరుగల నింబాదిత్యులు ఆంధ్రదేశీయులే . బహుశా ప్రస్తుత బళ్ళారి  జిల్లాలో గల నింబపురం వీరి జన్మస్థల౦ కావచ్చును. వీరు రచించిన వేదాంతపారిజాతసౌరభమనే  వ్యాఖ్యానం శుద్ధాద్వైతతత్త్వాన్ని వివరిస్తుంది . ఆంధ్రదేశంలో  అద్వైతవేదాంత  ప్రారంభసూచన కాకతీయుల పాలనలో  కనబడుతుంది. A.D1163 నాటి హనుమకొండలోని వెయ్యి స్తంభాల ఆలయం మీద ఒక శాసనం ఉంది. ఈ శాసనరచయిత అచింతే౦ద్ర దేవుడు . ఆయన రామేశ్వరపండితుని  కుమారుడు. ఆయన తన  చిన్నతనం  నుండి కాకతీయుల ఆస్థానంలో ఉండేవాడు.[; పద్యం-4 కార్పస్ 3] ఆయన అద్వాయామృతయతి  శిష్యుడు భారద్వాజసగోత్రుడు. అద్వయామృతయతి అనే ఈ  పేరు  కాకతీయుల కాలంలో అద్వైత ప్రాముఖ్యాన్ని సూచిస్తోంది. అదేవిధంగా అన్నంభట్టు తండ్రి మేలిగిరి మల్లినాథుని బిరుదైన అద్వయాచార్యతిరుమల  అలాగే కురుంగంటి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆశ్రమనామం అద్వైతానంద తీర్థ ఆ రోజుల్లో అద్వైత ప్రాముఖ్యాన్ని ల్లడిస్తున్నాయి. ఈ సందర్భంలో అద్వైతసిద్ధాంతం, సంరక్షణ కోసం కృషి చేసిన ఎంతోమంది ఆంధ్ర పండితుల సేవలు వివరించవలసిన అవసర౦  ఉంది. వారందించిగ్రంథాలు మూడు వర్గాలుగా విభజించవచ్చు: 
1 స్వతంత్ర గ్రంథాలు
2.వ్యాఖ్యానాలు
3. లఘుగ్రంథాలు
చిత్సుఖుడు రచించిన తత్త్వప్రదీపిక స్వతంత్ర గ్రంథానికి ఒక ఉదాహరణ. గుండయభట్టు అనే పండితుడు శ్రీ హర్షుడు రచించిన అత్యంత క్లిష్టమైన ఖండనఖండఖాద్య౦ అనే గ్రంథానికి  ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం వ్రాశారు. ఇది వ్యాఖ్యానగ్రంథాలకు ఒక ఉదాహరణ. లఘుగ్రంథాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇవిగాక అద్వైతేతర మతాల్ని ఖండిస్తో రచించిన ఎన్నోస్వతంత్ర రచనలున్నాయి.. ఇవిగాక అదనంగా, అనేక రచనలు ఇటివల కాలంలో వెలువడ్డాయి. అదేవిధంగా ఎన్నో మఠములు, గురుకులాలు, ఇతర ఉన్నతవిద్యాసంస్థలు, సంస్థానాలు, పండితులు అద్వైత  వేదాంతశాస్త్ర ప్రగతికి, పరిరక్షణకు,  ప్రచారానికి  అపారమైన కృషి చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అద్వైత వేదాంతానికి ఆంధ్రులు చేసిన సేవలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి . ఆ విషయాలన్ని  మనం  అంచెలంచెలుగా తెలుసుకుందాం .


 


Tuesday, November 3, 2015

ఉన్నతవిద్య ప్రైవేటీకరణ – నష్టాలు

ఉన్నతవిద్య ప్రైవేటీకరణ – నష్టాలు
డాక్టర్ . చిలకమర్తి దుర్గా ప్రసాద రావు
 విద్యావ్యవస్థ అనే అందమైన సౌధానికి  తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రభుత్వ౦ అనే నాలుగు ముఖ్యమైన  స్తంభాలున్నాయి. ఈ నాలుగు స్తంభాలు పటిష్ఠ౦గా ఉంటేనే  విద్యావ్యవస్థ సమర్థవంత౦గా నడుస్తుంది. ఏ స్తంభం బలంగా లేకపోయినా అది లోపభూయిష్టమే అవుతుంది.  ఇక ప్రభుత్వం ఈ నాలుగు స్తంభాల్లో ఒకటే అయినా  అది ఎంతో  కీలకమైన  పాత్ర పోషిస్తోంది.
పూర్వకాలం  మన దేశంలో  విద్య గురుకులాల్లో ఉచితంగా నేర్పేవారు . సంస్కృతంలో శిష్యుణ్ణి  అంతేవాసి అని పిలుస్తారు. ‘అంతే’ అంటే సమీపంలో ‘వసతి’ నివసించే వాడు అని అర్థం.  విద్యార్థులు గురువుల  సమీపంలో ఉంటూ విద్యనేర్చుకునే వాడు కాబట్టి శిష్యుడు అంతేవాసి అయ్యాడు.   రాజులు, వదాన్యులు గురుకులాలను పోషిస్తూ ఉండేవారు. శిష్యులు గురువులకు  సేవచేయడం ద్వారా విద్య నేర్చుకునేవారు.
దీన్ని బట్టి ప్రభుత్వమే స్వయంగా విద్యను తన బాధ్యతగా స్వీకరించేదని తెలుస్తోంది. కాళిదాసు తన  రఘువంశంలో దిలీపుని పరిపాలన విధానం  వర్ణిస్తూ,  ఆ దిలీపుడు ప్రజల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడంలోను, రక్షించడంలోను, అన్నపానాదులిచ్చి పోషించడంలోను ఆయనే  ప్రజల౦దరికి తండ్రి వంటివాడయ్యాడట. ఇక వారి వారి తలిదండ్రులు కేవలం జన్మనిచ్చిన వారుగానే మిగిలి పోయారట.
प्रजानां विनयाधानाद्रक्षणाद्भरणादपि
पिता पितरस्तासां कॆवलं जन्महेतव: (I-24)
ఇక పూర్వం మనదేశంలో కుల, మత, లింగ, జాతివివక్ష లేకుండా అందరికి ఉచితంగా విద్య బోధిస్తూ ఉండేవారు. మన వారితో బాటుగా వందలాది విదేశీయులు కూడ నలంద, తక్షశిల, విక్రమశీల మొ|| అనేక విశ్వవిద్యాలయాల్లో విద్య నేర్చుకునేవారు. చక్రవర్తులు, సామంత రాజులు విశ్వవిద్యాలయ కార్యకలాపాల్లో  ఏమాత్రం జోక్యం కలగ చేసుకోకుండా కేవలం పోషణ బాధ్యతను మాత్రమే  నిర్వర్తించేవారు.
      కానీ దురదృష్టవశాత్తు ఇటీవలకాలంలో కొన్ని ప్రభుత్వాలు ఉన్నతవిద్యను భారంగా భావిస్తూ నిధులందించే బాధ్యతను క్రమంగా విరమించుకుంటున్నాయి. ఇది కేవలం సంకుచితధోరణి అనక తప్పదు. ఎందుకంటే ఒక తండ్రి తన పిల్లవాణ్ణి స్కూల్లో వేసేటప్పుడే  “వీడి చదువు కోసం చాల డబ్బు ఖర్చు చేస్తున్నాను. దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి?” అని ఆలోచిస్తే వెంటనే ఎటువంటి ప్రయోజనం కనిపించక పోవచ్చు. కాని ఆ పిల్లవాడు విద్య పూర్తిచేసుకుని  మంచి ఉద్యోగంలో చేరి పేరు ప్రతిష్ఠలు వాటితోపాటు  పుష్కలంగా డబ్బు సంపాదించాక  విద్యకోసం తాను పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం తండ్రికి కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం ఒక తరంలో పెట్టిన పెట్టుబడికి ఫలం తరవాతి  తరంలో కనిపిస్తుంది. అందువల్ల ప్రభుత్వం విద్యావిషయంలో  సంకుచితమైన ధోరణి విడిచిపెట్టి విశాలదృక్పథం కలిగి ఉండాలి.   ఉన్నతవిద్యకోసం నిధులు వెచ్చించాలి. అలా కాకుండ  ఉన్నతవిద్యను ఉపేక్షిస్తే అది ప్రైవేట్ యాజమాన్యం  చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. ఈ వ్యాసంలో ఉన్నతవిద్య ప్రైవేటీకరణవల్ల కలిగే నష్టాలు చర్చిద్దా౦. 
1.    మన భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం గల దేశం. ఉన్నతవిద్య యొక్క బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తే అది  ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెల్లిపోతుంది. అదే జరిగితే  దేశం సాంస్కృతిక౦గా  క్షీణి౦చి పోతుంది.
2.    మన సంస్కృతిలో జ్ఞానాన్ని అమ్మడం గొప్ప పాపంగా  పరిగణి౦చారు. మాళవికాగ్ని మిత్రంలో   కాళిదాసు  ‘’ఎవడు తన జ్ఞానం కేవలం బ్రతుకుతెరువుకోసం వెచ్చిస్తాడో వాడు వ్యాపారితో సమాన౦” అనే   అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
    यस्यार्जनं केवलजीविकायै तं ज्ञानपण्यं वणिजं वदन्ति (I-17)
        ఇక ఉన్నతవిద్య  ప్రైవేటువ్యక్తుల చేతుల్లోకి చేరితే జ్ఞానం బజారులో పెట్టి విక్రయించే  ఒక            అమ్మకపు వస్తువు స్థాయికి దిగజారిపోతుంది. డబ్బుగలవాడికే ఉన్నతవిద్య అందుతుంది          డబ్బు లేనివాడికి అందుబాటులో  ఉండదు.    
3.    ఇక ఒకప్పుడు ఎంతో ఉన్నతస్థానాన్ని పొందిన అధ్యాపకుడు కేవలం  బానిసస్థాయికి  దిగజారిపోతాడు.
4.    పూర్వకాలంలో అందరు  సమాజ వ్యయంతోను, సమాజంలోని వ్యక్తుల సహాయ సహకారాలతోను , విద్య నేర్చుకునే వారు.  వారు తమకు సమాజం  చేసిన సహకారానికి జీవితాంతం కృతజ్ఞతాసూచకంగా సేవాభావంతో ప్రవర్తించేవారు. తాము ఏ రంగంలో స్థిరపడినా సమాజాభివృద్ధికి తమవంతు కృషి చేస్తూ ఉండేవారు.  కానీ ఉన్నతవిద్య ప్రైవేటీకరణ వల్ల అటువంటి ఉన్నతభావాలు పూర్తిగా అంతరించి పోయే ప్రమాదం ఉంది. యాజమాన్యం ప్రజల ముక్కుపిండి డబ్బు వసూలు చేసి విద్య నేర్పుతున్నారు. ఆ విధంగా విద్యనేర్చుకున్నవారు ఉద్యోగాల్లో ప్రవేశించాక అంతకు పదిరెట్లు సంపాదించాలనే కోరికతో రకరకాల పుంతలు తొక్కుతున్నారు. డబ్బు రాబట్టుకు౦టున్నారు. ఒక విధంగా సమాజంలో అవినీతి పేరుకుపోవడానికి   ఈ  ప్రైవేటీకరణ ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కారణం అవుతోంది.
5.    ఉన్నతవిద్య ప్రైవేటీకరణ వల్ల ముఖ్యంగా భాషలు, మరికొన్ని  సామాజికశాస్త్రాలు వాటి ప్రాముఖ్యాన్ని కోల్పోతాయి . ఎ౦దుకంటే ప్రైవేటుయాజమాన్యం ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే ప్రాధాన్యం ఇస్తు౦ది గాని సాంస్కృతిక, సామాజిక అంశాలను బోధించే కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వదు. అందువల్ల సామాజికవిలువలు క్రమక్రమంగా నశించే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని పాఠ్యాంశాలు కనుమరుగై పోయాయి . భాష, సాహిత్యం మనిషిలో సామాజికస్పందనను, సున్నితత్వాన్ని, నైతికవిలువలను  పెంపొందిస్తాయి.  ఇవి తమ ప్రాధాన్యాన్ని కోల్పోతే మనిషి యంత్రంగా మారిపోతాడు. ఆ నష్టం మనం ఎన్నటికి భర్తీ చెయ్యలేము.
6. ఉన్నతవిద్య ప్రైవేట్ వ్యక్తుల పరమైతే జ్ఞానం కన్న మార్కులకే ఎక్కువ విలువివ్వడం జరుగుతుంది. ఆ మార్కుల సంపాదనకు అనేక అక్రమమైన మార్గాలు వెదకడం మొదలౌతాయి. ఇప్పటికే విద్యారంగంలో ఉన్న అవకతవకలు లెక్కపెట్టలేక పోతున్నాం. ఇక విద్యారంగం పూర్తిగా ప్రైవేట్ పరమైతే పరిస్థితి ఊహాతీతంగా ఉంటుంది.  ప్రైవేట్ విద్యావిధాన౦లో సరస్వతి బాధతో ఏడుస్తూ, లక్ష్మి సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుందని  ఒక గొప్ప సంస్కృత పండితుడు భావించారు.

      ఇక మనం ప్రైవేటీకరణను నిరోధించలేము.   మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రైవేటీకరణ అనే పెనుభూతం సమాజం యొక్క సాంస్కృతికవిలువలు మ్రింగివేయడానికి ఇప్పడికే సిద్ధంగా పొంచి ఉంది. ఈ క్లిష్ట సమయంలో ప్రతివ్యక్తి విలువలతో కూడిన  పాఠ్యాంశాలు,  భాషలు, సామాజికశాస్త్రాల ప్రాముఖ్య౦ పెంచే విద్యావిధానాన్ని ప్రోత్సహించాలి. దానితో బాటు ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యంపై  కఠినమైన నిఘా, నిష్పాక్షికమైన పర్యవేక్షణ  అమలు చేయాలి. అప్పుడు మాత్రమే మనం రాబోయే ప్రమాదాన్ని కొంతవరకు అరికట్టగలుగుతాం .  సుసంపన్నమైన విలువల్ని భావితరాలకు అందించగలుగుతాం. మనకు అటువంటి మంచి రోజులు త్వరలోనే  వస్తాయని ఆశిద్దాం.