Tuesday, November 3, 2015

ఉన్నతవిద్య ప్రైవేటీకరణ – నష్టాలు

ఉన్నతవిద్య ప్రైవేటీకరణ – నష్టాలు
డాక్టర్ . చిలకమర్తి దుర్గా ప్రసాద రావు
 విద్యావ్యవస్థ అనే అందమైన సౌధానికి  తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రభుత్వ౦ అనే నాలుగు ముఖ్యమైన  స్తంభాలున్నాయి. ఈ నాలుగు స్తంభాలు పటిష్ఠ౦గా ఉంటేనే  విద్యావ్యవస్థ సమర్థవంత౦గా నడుస్తుంది. ఏ స్తంభం బలంగా లేకపోయినా అది లోపభూయిష్టమే అవుతుంది.  ఇక ప్రభుత్వం ఈ నాలుగు స్తంభాల్లో ఒకటే అయినా  అది ఎంతో  కీలకమైన  పాత్ర పోషిస్తోంది.
పూర్వకాలం  మన దేశంలో  విద్య గురుకులాల్లో ఉచితంగా నేర్పేవారు . సంస్కృతంలో శిష్యుణ్ణి  అంతేవాసి అని పిలుస్తారు. ‘అంతే’ అంటే సమీపంలో ‘వసతి’ నివసించే వాడు అని అర్థం.  విద్యార్థులు గురువుల  సమీపంలో ఉంటూ విద్యనేర్చుకునే వాడు కాబట్టి శిష్యుడు అంతేవాసి అయ్యాడు.   రాజులు, వదాన్యులు గురుకులాలను పోషిస్తూ ఉండేవారు. శిష్యులు గురువులకు  సేవచేయడం ద్వారా విద్య నేర్చుకునేవారు.
దీన్ని బట్టి ప్రభుత్వమే స్వయంగా విద్యను తన బాధ్యతగా స్వీకరించేదని తెలుస్తోంది. కాళిదాసు తన  రఘువంశంలో దిలీపుని పరిపాలన విధానం  వర్ణిస్తూ,  ఆ దిలీపుడు ప్రజల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడంలోను, రక్షించడంలోను, అన్నపానాదులిచ్చి పోషించడంలోను ఆయనే  ప్రజల౦దరికి తండ్రి వంటివాడయ్యాడట. ఇక వారి వారి తలిదండ్రులు కేవలం జన్మనిచ్చిన వారుగానే మిగిలి పోయారట.
प्रजानां विनयाधानाद्रक्षणाद्भरणादपि
पिता पितरस्तासां कॆवलं जन्महेतव: (I-24)
ఇక పూర్వం మనదేశంలో కుల, మత, లింగ, జాతివివక్ష లేకుండా అందరికి ఉచితంగా విద్య బోధిస్తూ ఉండేవారు. మన వారితో బాటుగా వందలాది విదేశీయులు కూడ నలంద, తక్షశిల, విక్రమశీల మొ|| అనేక విశ్వవిద్యాలయాల్లో విద్య నేర్చుకునేవారు. చక్రవర్తులు, సామంత రాజులు విశ్వవిద్యాలయ కార్యకలాపాల్లో  ఏమాత్రం జోక్యం కలగ చేసుకోకుండా కేవలం పోషణ బాధ్యతను మాత్రమే  నిర్వర్తించేవారు.
      కానీ దురదృష్టవశాత్తు ఇటీవలకాలంలో కొన్ని ప్రభుత్వాలు ఉన్నతవిద్యను భారంగా భావిస్తూ నిధులందించే బాధ్యతను క్రమంగా విరమించుకుంటున్నాయి. ఇది కేవలం సంకుచితధోరణి అనక తప్పదు. ఎందుకంటే ఒక తండ్రి తన పిల్లవాణ్ణి స్కూల్లో వేసేటప్పుడే  “వీడి చదువు కోసం చాల డబ్బు ఖర్చు చేస్తున్నాను. దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి?” అని ఆలోచిస్తే వెంటనే ఎటువంటి ప్రయోజనం కనిపించక పోవచ్చు. కాని ఆ పిల్లవాడు విద్య పూర్తిచేసుకుని  మంచి ఉద్యోగంలో చేరి పేరు ప్రతిష్ఠలు వాటితోపాటు  పుష్కలంగా డబ్బు సంపాదించాక  విద్యకోసం తాను పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం తండ్రికి కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం ఒక తరంలో పెట్టిన పెట్టుబడికి ఫలం తరవాతి  తరంలో కనిపిస్తుంది. అందువల్ల ప్రభుత్వం విద్యావిషయంలో  సంకుచితమైన ధోరణి విడిచిపెట్టి విశాలదృక్పథం కలిగి ఉండాలి.   ఉన్నతవిద్యకోసం నిధులు వెచ్చించాలి. అలా కాకుండ  ఉన్నతవిద్యను ఉపేక్షిస్తే అది ప్రైవేట్ యాజమాన్యం  చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. ఈ వ్యాసంలో ఉన్నతవిద్య ప్రైవేటీకరణవల్ల కలిగే నష్టాలు చర్చిద్దా౦. 
1.    మన భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం గల దేశం. ఉన్నతవిద్య యొక్క బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తే అది  ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెల్లిపోతుంది. అదే జరిగితే  దేశం సాంస్కృతిక౦గా  క్షీణి౦చి పోతుంది.
2.    మన సంస్కృతిలో జ్ఞానాన్ని అమ్మడం గొప్ప పాపంగా  పరిగణి౦చారు. మాళవికాగ్ని మిత్రంలో   కాళిదాసు  ‘’ఎవడు తన జ్ఞానం కేవలం బ్రతుకుతెరువుకోసం వెచ్చిస్తాడో వాడు వ్యాపారితో సమాన౦” అనే   అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
    यस्यार्जनं केवलजीविकायै तं ज्ञानपण्यं वणिजं वदन्ति (I-17)
        ఇక ఉన్నతవిద్య  ప్రైవేటువ్యక్తుల చేతుల్లోకి చేరితే జ్ఞానం బజారులో పెట్టి విక్రయించే  ఒక            అమ్మకపు వస్తువు స్థాయికి దిగజారిపోతుంది. డబ్బుగలవాడికే ఉన్నతవిద్య అందుతుంది          డబ్బు లేనివాడికి అందుబాటులో  ఉండదు.    
3.    ఇక ఒకప్పుడు ఎంతో ఉన్నతస్థానాన్ని పొందిన అధ్యాపకుడు కేవలం  బానిసస్థాయికి  దిగజారిపోతాడు.
4.    పూర్వకాలంలో అందరు  సమాజ వ్యయంతోను, సమాజంలోని వ్యక్తుల సహాయ సహకారాలతోను , విద్య నేర్చుకునే వారు.  వారు తమకు సమాజం  చేసిన సహకారానికి జీవితాంతం కృతజ్ఞతాసూచకంగా సేవాభావంతో ప్రవర్తించేవారు. తాము ఏ రంగంలో స్థిరపడినా సమాజాభివృద్ధికి తమవంతు కృషి చేస్తూ ఉండేవారు.  కానీ ఉన్నతవిద్య ప్రైవేటీకరణ వల్ల అటువంటి ఉన్నతభావాలు పూర్తిగా అంతరించి పోయే ప్రమాదం ఉంది. యాజమాన్యం ప్రజల ముక్కుపిండి డబ్బు వసూలు చేసి విద్య నేర్పుతున్నారు. ఆ విధంగా విద్యనేర్చుకున్నవారు ఉద్యోగాల్లో ప్రవేశించాక అంతకు పదిరెట్లు సంపాదించాలనే కోరికతో రకరకాల పుంతలు తొక్కుతున్నారు. డబ్బు రాబట్టుకు౦టున్నారు. ఒక విధంగా సమాజంలో అవినీతి పేరుకుపోవడానికి   ఈ  ప్రైవేటీకరణ ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కారణం అవుతోంది.
5.    ఉన్నతవిద్య ప్రైవేటీకరణ వల్ల ముఖ్యంగా భాషలు, మరికొన్ని  సామాజికశాస్త్రాలు వాటి ప్రాముఖ్యాన్ని కోల్పోతాయి . ఎ౦దుకంటే ప్రైవేటుయాజమాన్యం ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే ప్రాధాన్యం ఇస్తు౦ది గాని సాంస్కృతిక, సామాజిక అంశాలను బోధించే కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వదు. అందువల్ల సామాజికవిలువలు క్రమక్రమంగా నశించే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని పాఠ్యాంశాలు కనుమరుగై పోయాయి . భాష, సాహిత్యం మనిషిలో సామాజికస్పందనను, సున్నితత్వాన్ని, నైతికవిలువలను  పెంపొందిస్తాయి.  ఇవి తమ ప్రాధాన్యాన్ని కోల్పోతే మనిషి యంత్రంగా మారిపోతాడు. ఆ నష్టం మనం ఎన్నటికి భర్తీ చెయ్యలేము.
6. ఉన్నతవిద్య ప్రైవేట్ వ్యక్తుల పరమైతే జ్ఞానం కన్న మార్కులకే ఎక్కువ విలువివ్వడం జరుగుతుంది. ఆ మార్కుల సంపాదనకు అనేక అక్రమమైన మార్గాలు వెదకడం మొదలౌతాయి. ఇప్పటికే విద్యారంగంలో ఉన్న అవకతవకలు లెక్కపెట్టలేక పోతున్నాం. ఇక విద్యారంగం పూర్తిగా ప్రైవేట్ పరమైతే పరిస్థితి ఊహాతీతంగా ఉంటుంది.  ప్రైవేట్ విద్యావిధాన౦లో సరస్వతి బాధతో ఏడుస్తూ, లక్ష్మి సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుందని  ఒక గొప్ప సంస్కృత పండితుడు భావించారు.

      ఇక మనం ప్రైవేటీకరణను నిరోధించలేము.   మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రైవేటీకరణ అనే పెనుభూతం సమాజం యొక్క సాంస్కృతికవిలువలు మ్రింగివేయడానికి ఇప్పడికే సిద్ధంగా పొంచి ఉంది. ఈ క్లిష్ట సమయంలో ప్రతివ్యక్తి విలువలతో కూడిన  పాఠ్యాంశాలు,  భాషలు, సామాజికశాస్త్రాల ప్రాముఖ్య౦ పెంచే విద్యావిధానాన్ని ప్రోత్సహించాలి. దానితో బాటు ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యంపై  కఠినమైన నిఘా, నిష్పాక్షికమైన పర్యవేక్షణ  అమలు చేయాలి. అప్పుడు మాత్రమే మనం రాబోయే ప్రమాదాన్ని కొంతవరకు అరికట్టగలుగుతాం .  సుసంపన్నమైన విలువల్ని భావితరాలకు అందించగలుగుతాం. మనకు అటువంటి మంచి రోజులు త్వరలోనే  వస్తాయని ఆశిద్దాం. 

No comments: