Wednesday, May 31, 2017

ప్రాకృతసాహిత్యంలో హనుమంతుని జన్మవృత్తాంతం

ప్రాకృతసాహిత్యంలో
హనుమంతుని జన్మవృత్తాంతం
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

* This is a free translation of a story entitled हणुओं जम्मकहा a portion of “PaUmachariyam” written by Vimalasuri’ in Maharashtri prakrit which depicts the birth of Lord Hanuman. ఇది విమలసూరి రచిoచిన పఉమచరియంఅనే జైనమహారాష్ట్రీప్రాకృతగ్రంథంలోని హణుఓ జమ్మకథా అనే భాగం యొక్క స్వతంత్రానువాదం .
***
కొంతకాలం గడిచిన తరువాత గర్భవతియగు  మహేంద్రతనయ అంజనాదేవి శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి.  ఆమె పాలిండ్లు బరువెక్కాయి . కటిభాగం వెడల్పయింది. గర్భభారం వల్ల నడక వేగం తగ్గింది. ఈ విషయం గమనించిన పవనంజయుని తల్లి అంజనాదేవితో ఓసీ పాపాత్మురాలా! భర్త దూరoలో  ఉన్నా నువ్వు గర్భవతివి ఎలా అయ్యావు అని నిలదీసింది.
 అంజనాదేవి అత్తగారి పాదాలపై పడి, నమస్కరించి భర్త పవనంజయుని రాకపోకలు,
ఆయన ఇచ్చిన ఆనవాలు చూపించినా ఆమె నమ్మలేదు. కీర్తిమతి ఆమెతో  అంది నీ పేరు, చోటు కూడ సరిగా తెలియని వాడు, చాల దూరంలో ఉన్నవాడు ఇక్కడకు రోజు ఎలా వచ్చి పోగలడు?  ఛీ దుష్టురాలా! నువ్వు ఇటువoటి పాపపు పని చేసి పవిత్రమైన వంశానికి చెడ్డ పేరు తెచ్చావు అని నిందించి సేవకుని పిలిచి  ఆమెను వెంటనే పుట్టింటిలో దిగబెట్టి రమ్మని ఆజ్ఞాపించింది. ఆమె ఆదేశానుసారం అంజనాదేవి తన సఖితో మేనాలో కూర్చుని ప్రయాణానికి సిద్ధమైoది. వాహనం మహేంద్రనగరానికి ప్రయాణమయింది . సేవకుడామెను నగరం పొలిమేరలో విడిచిపెట్టి    అమ్మా! పాపిని నన్ను క్షమించు అని  వేడుకొని అక్కడ నుంచి  వెళ్లిపోయాడు. అంతలో చీకటి పడింది .
 మరునాడు సూర్యుడుదయిoచగానే ఆమె తన సఖితో నగరం ప్రవేశించడానికి ప్రయత్నిoచింది. కాని ద్వారపాలకుడామెను లోపలికనుమతించలేదు. శిలాకపాటుడనే ఆ ద్వారపాలకుడు ఆమె చెప్పిన వృత్తాంతం అంతా విని ఆమె తoడ్రి మహే౦ద్రునకు  విన్నవించాడు. మహేంద్రుడు ఇదంతా నేను విన్నాను. ఈమె అత్తగారు ఈమెకు కలిగిన  గర్భం విషయమై అనుమానిoచిoది.  ఇప్పుడు ఈమె వలన నాకు ఎటువంటి కళoకము వాటిల్లకూడదు . అందువల్ల ఆమెను వెంటనే  నగరం నుంచి బయటకు పంపివేయమని ద్వారపాలకునికి చెప్పాడు.   
 ఆ తరువాత రాజాదేశాన్ననుసరిoచి అంజనాదేవి సఖితో నగరం నుoచి పరదేశానికి తరిమి వేయబడింది. అతిసుకుమారిమైన ఆమె రాళ్ళు , ముళ్ళు గల మార్గంలో నడుస్తూ సహిoపలేని బాధననుభవిoచింది .  ఆమె ఆశ్రయం కోసం ఏఏ ఇళ్లకు వెళ్లిందో వారందరూ  రాజుకు భయపడి ఆమెకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించారు.
 దయ, కరుణలేని వారందరు  నిరాకరిoచడంతో  పురుషులు కూడ ప్రవేశించడానికి భయపడే ఘోరమైన  అరణ్యంలో ప్రవేశించింది . ఆ తరువాత ఆమె తన చెలి వసంతమాల  నిర్మించిన శయ్యలో నివసిస్తూ కొన్నాళ్ళకు తూర్పుదిక్కు సూర్యుని ప్రసవించిన విధంగా ఒక వరపుత్రునికి జన్మనిచ్చింది .
ఆ బిడ్డ ప్రభావం వల్ల ఆమె ఉంటున్న గుహలోని చెట్లన్నీ చిగురించాయి, పూలతో వికసించాయి. కోకిలల నాదాలు, తుమ్మెదల ఝంకారాలు గుహoతా మారుమ్రోగాయి.
 అంజనాదేవి అప్పుడే పుట్టిన ఆ బాలుని ఒడిలోకి తీసుకుని నాయనా! నేను పాపాత్మురాలను . ఇటువంటి ఘోరమైన  అరణ్యంలో నీకు నేనేమి చేయగలను?     నువ్వు నీ తండ్రి ఇంట్లోగాని, మాతామహుని (తాతయ్య ) ఇంట్లోగాని పుట్టి ఉంటే నాకు చాల ఆనందంగా ఉండేది .  నేను పతికి , తల్లిదండ్రులకు దూరమై గుంపు నుండి విడివడిన లేడిలా బ్రతుకీడుస్తున్నానంటే అది నీ కోసమే అని దీనంగా విలపించింది . 
 అది విని వసంతమాల అంజనాదేవితో అమ్మా ! నువ్వు జరిగిందానికి బాధపడకు .
పూర్వం ముని చెప్పిన మాటలు నిజంగాక  మానవుకదా! అంది .  వారిద్దరి  మాటలు వింటున్న ఒక విద్యాధరుడు పరివారంతో ఆకాశంనుంచి దిగి వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు .
 ఆయన  గుహలో ప్రవేశించి ఓ యువతులారా! మీరెందుకు ఇక్కడ ఉంటున్నారు ?  అని ప్రశ్నించాడు .  దానికి సమాధానంగా వసంతమాల ఓ సత్పురుషుడా! ఈమె మహేంద్రనృపతి కుమార్తె . మహావీరుడైన పవనంజయుని భార్య .  పవనంజయుడు ఈమెను గర్భవతిని చేసి తన స్వామియైన రావణుని వద్దకు వెళ్ళాడు. ఈ విషయం ఎవ్వరికి తెలియదు . కాని దుష్టురాలైన ఈమె అత్తగారు  ఈమె గర్భాన్ని  అనుమానించి పుట్టింటికి పంపించేసింది . ఈమె తండ్రి కూడ అవమానంతో ఈమెను చేరదీయకుండా బయటకు గేంటేస్తే నేను ఈ ఘోరమైన అరణ్యానికి తీసుకొచ్చాను . ఏ పాపం ఎరుగని  ఈ పుణ్యవతి నేడు రెండవజామున ఈ పూలపాన్పుపై  బిడ్డను ప్రసవించింది అని వివరించింది .
 అది విని ఆయన అమ్మా! నాతండ్రి కరువరద్వీపానికి రాజు. ఆయన పేరు చిత్ర భానుడు .  నా పేరు ప్రతిసూర్యకుడు . నా సోదరి వరహృదయ సుందరి ఇంద్రుని భార్య .  ఈ యువతి నా చెల్లెలి కుమార్తె . ఈమెను చాల కాలం తరువాత చూడడం వల్ల గుర్తుపట్టలేకపోయాను. కొన్ని ఆనవాళ్ల వలన   నాకు నా బంధువులపై  గల ప్రేమవల్ల గుర్తించ గలిగాను అన్నాడు .
 అంజనాదేవి అతనిని మేనమామగా గుర్తించి ఎంతో హృదయవిదారకంగా విలపించింది. వసంతమాల ఆమెను ఓదార్చింది.   ప్రతిసూర్యకుడు ఆమెను ఓదార్చి జ్యోతిష్కుని పిలిచి  ఆ బాలకుడు పుట్టిన తిథి, వార౦ , నక్షత్ర౦ మొ|| వివరాలు చెప్పమని  అడిగాడు. జ్యోతిష్కుడు ఆ రోజు  ఆదివార౦, చైత్రమాసం , కృష్ణపక్షం , అష్టమి థి అని బ్రాహ్మ మను పేరుగల యోగమని వివరించాడు . అంతేగాక  ఆ బిడ్డ పుట్టిన ముహూర్తం శుభప్రదమై౦దని , మీనోదయకాలమని , గ్రహాలన్నీ ఉన్నతస్థానంలో ఉన్నాయని ఆ బిడ్డ  బల, భోగ, రాజ్య , సంపదలు కలిగి చివరికి  మోక్షసుఖాన్ని పొందుతాడని వివరించాడు .
 ప్రతిసూర్యుడు ఆ జ్యోతిష్కుని తగినవిధంగా సన్మానించి మేనకోడలితో అమ్మా ! మనం హనురుహ నగరానికి బయలుదేరదాం అని చెప్పాడు .   ఆ తరువాత  గుహలో నివసించే  దేవత సమ్మతితో బంగారు విమానంలో అక్కడ నుండి బయలుదేరేడు . అమ్మ ఒడిలో ఉన్న బాలుడు ఒడ్డాణపు మువ్వలను చూస్తూ చేపపిల్లవలె గంతులేస్తూ  ఆడటంవల్ల విమానం నుంచి జారి ఒక  పర్వతశిలపై పడిపోయాడు . క్రిందపడిపోయిన పుత్రుణ్ణి  చూస్తూ భగవంతుడు నాకు నిధి ప్రసాదించి నాకు కళ్ళు లేకుండా చేశాడు అని భావించి దీనంగా విలపిస్తూ  ప్రతిసూర్యకునితో సహా విమానం దిగి  పర్వతశిలపై పడియున్న పుత్రుని చూసి౦ది. ఆ బాలుని శరీరానికి గాని తక్కిన అవయవాలకు గాని ఎటువంటి గాయాలు తగులలేదు . ఆమె చాల ఆనందించింది . ప్రతిసూర్యకుడు చాల సంతోషంతో బాలున్ని మెచ్చుకున్నాడు .  ఆమె పుత్రునితో సహా మరల విమానంలో కూర్చొని మంగళవాద్యాలు మ్రోగుచు౦డగా హనురుహనగరంలో ప్రవేశించింది .  దేవలోకంలో ఇంద్రుడు జన్మించినప్పుడు ఏవిధంగా దేవతలు ఉత్సవం చేశారో ఈ బాలుని జన్మదినోత్సవం కూడ అదే విధంగా వైభవంగా జరిపారు .  బాల్యంలోనే పర్వతం పైన పడి ఆ పర్వతాన్ని నుజ్జునుజ్జుగా చేసినందున అతనికి  ప్రతిసూర్యకుడు శ్రీశైలుడు అని పేరు పెట్టాడు . అలాగే  ఆ బాలుడు హనురుహ నగరంలో ఎంతో గౌరవాదరాలు పొందడం వల్ల పెద్దవారందరు హనుమంతుడని  మరో పేరు పెట్టారు.                                     
From:
Prakritadipika,
Edited by Dr. Sudarsan Lal Jain,
Parshvanath Vidyashram Sodh Samsthan,
I.T.I Roan, Varanasi-5       
***********                                












Saturday, May 27, 2017

తెలివైన కోడలు ( ప్రాకృతకథ)

తెలివైన  కోడలు
( ప్రాకృతకథ)
డా|| చిలకమర్తి దుర్గాప్రసాద రావు
   
పూర్వం రాజగృహం అనే నగరంలో ధన్యుడు అనే పేరుగల వ్యాపారి ఉండేవాడు  . ఆయన ధర్మపరుడు,  నీతిమంతుడు . ఆయన భార్య భద్ర . ఆమె చాల గుణవతి . సౌందర్యవతి . ఆయనకు ధనపాలుడు, ధనదేవుడు, ధనగోపుడు, ధనరక్షితుడు అనే నలుగురు కుమారులు; ఉజ్ఝిక , భోగవతిక , రక్షిక , రోహిణిక అనే నలుగురు కోడళ్ళు ఉన్నారు .
ఒకనాడు ఆ వ్యాపారికి అర్థరాత్రి సమయంలో ఒక ఆలోచన వచ్చింది . ఒకవేళ నేను మరణించినా , లేదా దేశా౦తరాలకు  వెళ్లిపోయినా ఈ కుటు౦బం బరువు బాధ్యతలు ఎవరు వహిస్తారు?  ఎవరు చక్కగా నడుపగలరు?  అని ఆలోచించాడు .
ఆ మరునాడు లేచి, స్నానం చేసి , భోజనశాలలో సుఖంగా ఆసీనుడై బంధుమిత్రులను, కుమారులను, కోడండ్రను పిలిచి అందరికి రుచికరమైన విందు ఏర్పాటు చేసి, అందరికి కొత్తబట్టలిచ్చి, వారందరూ సంతోషపడిన తరువాత వారి సమక్షంలో కోడండ్రను పిలిచి వారికి ఒక్కొక్కరికి ఐదు ధాన్యంగింజలు పంచుతూ  ముందుగా పెద్దకోడలైన ఉజ్ఝికతో అమ్మాయీ ! నేను నీకు ఐదు ధాన్యం గింజలిస్తున్నాను . నువ్వు వీటిని సంరక్షించు . నేను మరల అడిగినప్పుడు నాకు వాటిని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పేడు . ఆమె సరే అని  మామగారిచ్చిన ఆ గింజలను అందుకుని తనలో మామగారి ధాన్యాగారంలో ఎన్నో పెద్దపెద్ద ధాన్యపు  రాసులున్నాయి , ఆయన అడిగినప్పుడు అందులోంచి ఐదు గింజలు తీసి ఇవ్వవచ్చు అని అనుకుని ఆ గింజల్ని ఎక్కడో  పారేసింది . ఆ తరువాత తనపనిలో తాను మునిగిపోయింది .
అలాగే రెండో కోడలు భోగవతిక మామగారిచ్చిన ఆ ధాన్యం గింజల్ని ఒలిచి తినేసింది .  ఆ తరువాత తన పనిలో తాను నిమగ్నమై౦ది . మూడో కోడలు రక్షిక ,  మామగారిచ్చిన ధాన్యం గింజలు అందుకున్న వెంటనే తనలో మామ గారు ఈ గింజల్ని తన కిస్తూ  వీటిని జాగ్రత్తగా రక్షించమన్నారు . ఇందులో ఎదో మర్మం ఉండి ఉంటుంది అని భావించి ఆ గింజల్ని గుడ్డలో మూటగట్టి , రత్నాలు చెక్కిన పెట్టెలో పెట్టి , తలాపుదిక్కున దాచిపెట్టి౦ది . ప్రతిరోజూ మూడు పూటలా తెరచి చూసుకుంటూ కాలక్షేపం చేస్తోంది . అదే విధంగా ఆ వ్యాపారి, నాల్గవ కోడలు రోహిణికకు  కూడ ఐదు గింజలధాన్యం ఇచ్చి రక్షించమని అడిగాడు . రోహిణిక ఆలోచించింది  మామగారి మాటలలో ఏదో ఆంతర్యం ఉంటుంది . నేను ఈ గింజల్ని రక్షించి అభివృద్ధి చెయ్యాలి అని ఆలోచించుకుంది. తన పుట్టింటి వారిని పిలిచి వారికి ఆ గింజలిచ్చి వర్షాలు పడ్డాక ఒక క్షేత్రంలో వీటిని నాటండి. మొలకెత్తిన గింజల్ని మరల మరల నాటండి . ఈ విధంగా వృద్ధి చేయండి అని కోరింది . అవి నాలుగేళ్ళకే కొన్ని వందల కుండలు సరిపోయే గింజలయ్యాయి .     నాలుగేళ్ళు గడిచి ఐదో ఏడు నడుస్తోంది . ఒకనాడు ఆ వ్యాపారి తనలో కోడళ్ళకు ధాన్యం గింజలు దాచమని ఇచ్చి ఐదేళ్లైంది. ఎవరు దాచారో , ఎవరు సంరక్షించారో , ఎవరు అభివృద్ధి చేశారో తెలుసుకోవలసిన సమయం వచ్చింది అని భావించి బంధుమిత్రులను రప్పించి వారి సమక్షంలో పెద్ద కోడల్ని పిలిచి అమ్మాయీ ! ఐదేళ్ళ క్రితం అందరి సమక్షంలో నీకు దాచమని ఐదు ధాన్యం గింజ లిచ్చాను , వాటిని  నాకు తిరిగి ఇచ్చెయ్యి అని అడిగాడు . ఆమె సరే అని ధాన్యాగారం దగ్గరకెళ్ళి అందులోంచి ఐదు గింజల్ని తీసి మామగారూ! మీరిచ్చిన గింజలివిగో అని చెప్పి ఆయనకు ఇచ్చేసింది . అపుడు ఆయన కోడలితో అమ్మాయీ ! ఇవి నేనిచ్చినవేనా లేక వేరే గింజలా ప్రమాణం చేసి చెప్పమని అడిగాడు . ఆ ప్రశ్నకు ఆమె మామగారితో అయ్యా! మీరు తిరిగి గింజల్ని ఇమ్మని అడిగినప్పుడు కోష్టాగారం నుంచి ఐదు గింజలు తీసి ఇవ్వవచ్చని భావించి అవి ఎక్కడో పారేశాను . ఇవి మీరిచ్చినవి కావు . వేరే గింజలని చెప్పింది . ఆమెమాటలు విన్న మామకు పట్టరాని కోపం వచ్చింది . అందరిని పిలిచి వారి సమక్షంలో ఆమెను ఆ ఇంటిలో బూడిద ఎత్తడం , ఇల్లు అలకడం,  పాచిపనులు చెయ్యడం , కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు సిద్ధం చెయ్యడం , స్నానానికి నీరు ఏర్పాటుచెయ్యడం మొదలైన బయటి పనులు చేసే దాసిగా నియమించాడు . ఆమె ఇంటిలో  బయటి పనులకే పరిమితమైంది .
(వర్ధమాన మహావీరుడు ఈ విషయం చెప్పి తన శిష్యులతో ఓ శ్రమణులారా! ఆ వ్యాపారి యొక్క పెద్దకోడలు మామగారిచ్చిన ఐదు గింజల్ని వదిలి వేసినట్లు మీరు ఐదు వ్రతాలను అంటే అహింసా , సత్యం , అస్తేయం (దొంగతనం చేయకుండుట ) , బ్రహ్మచర్యం , అపరిగ్రహం ( ఉచితంగా ఎవరినుండి ఏది పుచ్చుకొనకుండుట) అనే ఐదు నియమాలను విడిచిపెట్టారో మీరు సంసారంలో చిక్కుకొని ఆమె వలె నీచమైన పనులు చేస్తూ అందరిలో నిందలపాలౌతారు అని హితబోధ చేస్తాడు )
అదే విధంగా ఇచ్చిన గింజల్ని తినేసిన రెండవకోడలు   భోగవతికను ఆ వ్యాపారి పప్పురుబ్బడం , ధాన్యం దంచడం , అన్న౦ వండడం ,  వడ్డించడం మొ|| వంటింటికే పరిమితమై పనులు చేసే దాసిగా నియమించాడు . ఆమె తన ఇంటిలో వంటి౦టికి మాత్రమే పరిమితం చేయబడింది .
(వర్ధమానమహావీరుడు ఇలా అంటున్నాడు. ఓ శ్రమణులారా ! ఎవరైతే ఇంద్రియాలకు బానిసలై  ఈ పంచ మహావ్రతాలు విడిచిపెడతారో వారు ఈ భోగవతిలా సంసార౦లో చిక్కుకొని హీనంగా జీవిస్తారు)
ఇక మూడవకోడలు తన  పెట్టె తెరచి మామగారిచ్చిన ఆ ఐదు గింజల్ని తీసి ఆయన చేతిలో పెట్టింది. ఆ వ్యాపారి కోడలితో ఆమ్మాయీ ! ఇవి నేనిచ్చిన గింజలేనా వేరే గింజలా అని అడిగాడు. ఆమె అవే గింజలని చెప్పింది . ఆయన ఆమెతో అదెలా అని అడిగాడు.  ఔను మామగారు!  మీరు నాకు ఐదేళ్ల క్రితం ఈ ఐదు  గింజలు ఇచ్చి దాచమన్నారు . నేను మీ మాటల్లో ఎదో విశేషం  ఉంటు౦దని భావించి ఆ గింజల్ని ఒక తెల్లటి గుడ్డలో మూటకట్టి పెట్టిలో పెట్టి జాగ్రత్తగా దాచాను . మీ రిచ్చిన ఆ గింజలే  ఈ గింజలు మామగారు ! అంది . అదివిని ఆయన చాల సంతోషించి ఆమెను బంగారం , వెండి , మొ|| ఆభరణాలు,  విలువైన పాత్ర సామానులు ఉండే గదికి సంరక్షకురాలిగా నియమి౦చాడు.
(వర్ధమానమహావీరుడు తన శిష్యులతో ఓ శ్రమణులారా ! మీరు మీ వ్రతములను జాగ్రత్తగా అనుసరిస్తూ వాటిని రక్షిస్తే మీరు రక్షిత వలే అందరికి గౌరవపాత్రులౌతారు అన్నాడు .
ఇక నాలుగో కోడలు వ్యాపారితో మామగారు! మీరు నాకు దయతో  ఒక చిన్న బండి , ఒక పెద్ద బండి ఇప్పించండి మీ గింజలు  మీకు అప్పగిస్తాను అంది . దానికి వ్యాపారి ఆమెతో అదేంటమ్మా! నా గింజలు నా కివ్వడానికి నీకు బళ్ళు కావాలా అదెలాగో వివరించమని అడిగాడు . దానికి సమాధానంగా ఆమె మామగారూ ! మీరు నాకు అందరి సమక్షంలో ఐదు ధాన్యం గింజలిచ్చారు . అవిప్పుడు కొన్ని వందల కుండలు పట్టే ధాన్యం అయ్యాయి . మీరు నాకు బళ్ళు ఇస్తే నేను ఆ ధాన్యం మీకు తీసుకురా గలను  అంది . ఆవ్యాపారి ఆమె కోరిన విధంగా బండ్లను పంపించాడు . ఆమె ఆ బండ్లను తన పుట్టి౦టికి తీసుకెళ్ళి , ధాన్యాగారంలో దాచిన ధాన్యాన్ని బళ్ళల్లోకెత్తించి రాజగృహం చేర్చింది .
ఆనగర వీధుల్లోని జనమంతా ఈ ధన్యుడు చాల ధన్యుడు . ఇతని కోడలు ఐదు గింజల్నిధాన్యపు రాసిగా  పెంచి బండ్లలో నింపి ఇలా తీసుకొస్తో౦ది అని వేనోళ్ళ పొగిడారు . ఆ తరువాత వ్యాపారి తానిచ్చిన అయిదు గింజల్ని వృద్ధిచేసి బండ్లలో  నింపి తెచ్చిన కోడలి నైపుణ్యానికి మిక్కిలి సంతోషించి ఆమెకు సమున్నతస్థానం ఇవ్వడమే కాకుండా  ఆ ఇంటిలో అన్ని ముఖ్యమైన విషయాలు చర్చించడానికి అర్హతగల ఒక ప్రథానమైన వ్యక్తిగా నియమించాడు .
(వర్ధమాన మహావీరుడు తనశిష్యులతో ఓ శ్రమణులారా! ఈ విధంగా ఎవరు పంచ వ్రతాలను పెంచి పోషిస్తారో వారు  అందరి మన్ననలు పొంది ఈ జన్మలోనే  రోహిణిక వలే ఉన్నతస్థానం పొంది చివరకు సంసార౦ నుంఛి  ముక్తి పొందుతారు .         
                                తెలివిగా ఉండండి విలువైన స్థానం పొందండి  
Note :-  This is a free translation of a story in Prakrit language entitled रोहिणिया सुण्हा compiled and edited by Dr. Sudarsan lal Jain.   ఇది रोहिणिया सुण्हा అనే జైనప్రాకృత కథకు స్వేచ్ఛానువాదం.





Thursday, May 25, 2017

భట్టి(రామాయణ)కావ్యం - విశిష్టత

భట్టి(రామాయణ)కావ్యం - విశిష్టత
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు
సంస్కృతసాహిత్యానికి సంబంధించిన పండితకవులలో భట్టికవి ప్రధానగణనీయుడు . ఇతడు రావణవధ అను పేరుగల 22 సర్గల మహాకావ్యాన్ని రచించాడు . ఈ కావ్యాన్ని కవిపేరు మీదుగా భట్టికావ్యం అని కూడ పిలుస్తారు . కొంతమంది విమర్శకులు భట్టి, భర్తృహరి ఒక్కరే అని అభిప్రాయపడగా మరికొంతమంది వారిద్దరు భిన్నభిన్న వ్యక్తులని భావిస్తున్నారు. ఒకవేళ భట్టి, భర్తృహరి ఒక్కరే అయినచో భర్తృహరి విక్రమాదిత్యునికి సోదరుడు కాబట్టి అతని కాలం క్రీ ||పూ|| ప్రథమశతాబ్ది అని నిర్ణయించవచ్చు . అట్లుగాక వారిరువురు భిన్న భిన్న వ్యక్తులైనచో కొన్ని చారిత్రక ఆధారములనుబట్టి అతని కాలం 6వ శతాబ్దంగా నిర్ధారించవచ్చు.
ఇక కావ్యం స్వభావాన్ని బట్టి కావ్యశాస్త్రమని, శాస్త్రకావ్యమని రెండు రకాలుగా ఉంటుంది . భట్టి కావ్యమైన రావణవధను కావ్యశాస్త్రంగా పరిగణి౦ప వచ్చు. ఎందుకంటే ఇందలి రామాయణకథ అప్రధానం, వ్యాకరణశాస్త్రాన్ని బోధించడమే ప్రధానం . కావ్యం ద్వారా వ్యాకరణశాస్త్రాన్ని సరళంగా పాఠకులకు బోధించడమే ఈ కావ్యం యొక్క ముఖ్యోద్దేశం . వ్యాకరణశాస్త్రజ్ఞానం సుతరాం లేనివారికి తన కావ్యం అగమ్యగోచరమని కవి తానే స్వయంగా చెప్పుకున్నాడు . కవి కావ్యంలో ప్రధానకథతో బాటుగా అనేక వ్యాకరణ , అలంకార శాస్త్రవిశేషాల్ని జోడించి కావ్యాన్ని రచించాడు . అనగా ఈ కవి శాస్త్రం, కావ్యం అనే రెండు గుఱ్ఱాలపై ఒకే కాలంలో ఎంతో నైపుణ్యంతో ప్రయాణం చేసి తరువాతి శాస్త్రకవులకు మార్గదర్శకుడయ్యాడు . ఈ విధంగా కవి కావ్యాన్ని , శాస్త్రాన్ని  రెంటిని జోడించి రచన చేయడం వల్ల శైలిలో కొంత కృత్రిమత్వం కనిపించినా చాలవరకు ధారాశుద్ధితో ప్రసన్నగంభీరంగా నడిచిందనే చెప్పాలి. మొత్తం మీద ఈ కావ్యం కేవలం పండితుల కోసం మాత్రమే వ్రాయబడిందని చెప్పక తప్పదు. ఈ కావ్యంలో కవి యొక్క కావ్యనిర్మాణకౌశలాన్ని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం .
ఈ కవి వాల్మీకిచే 24౦౦౦ శ్లోకాలలో నిబద్ధమైన రామకథను 1650 శ్లోకాలలో వెల్లడించాడు . కవి తాను ఆశించిన ప్రయోజనం సాధించడం కోసం మూలకథకు కొన్ని మార్పులు చేశాడు .  ఉత్తరరామాయణకథను పూర్తిగా వదలి వేశాడు .
1. వాల్మీకిరామాయణంలో అయోధ్యానగరవర్ణనతో కథ ప్రారంభమౌతుంది. ఈ కావ్యంలో దశరథుని వర్ణనతో కథ ప్రారంభమౌతుంది .
2. రామాయణంలో రామలక్ష్మణభారతశత్రుఘ్నుల వివాహం వర్ణింపబడగా భట్టికావ్యంలో కేవలం రాముని యొక్క వివాహం మాత్రమే వర్ణింపబడింది .
3. రామాయణకావ్యంలోని మంథరావృత్తాంతం భట్టికావ్యంలో లేదు . రాముని పట్టాభిషేకవార్తను విని సహింపలేని కైకయే  తన దుష్టబుద్ధిని ప్రదర్శించింది .
4. వాల్మీకిరామాయణంలో గల సీతాదేవి ఆభరణములను వానరులు రాముని ముందు ప్రదర్శించుట , వాలిసుగ్రీవుల వైరం , వాలివధ, తారావిలాపం మొదలైన విశేషాలు భట్టికావ్యంలో లేవు .
5. రామాయణంలోని యుద్ధకాండలో లేని సాగరవర్ణనం భట్టికావ్యంలో కనిపిస్తోంది . ఇందులో కవి అనేక అలంకారవిశేషాలను ప్రదర్శించడం మనం గమనించవచ్చు .
6. రామాయణంలోని సుగ్రీవరావణుల యుద్ధం , రామ మకరాక్షుల యుద్ధం భట్టికావ్యంలో లేవు
7. కుంభకర్ణుడు మరణించిన పిమ్మట రావణుని శోకం రామాయణంలో వర్ణింపబడింది. భట్టికవికూడ ఈ ఘట్టాన్ని వర్ణిస్తూ అనేక వ్యాకరణశాస్త్రవిశేషాలను ప్రదర్శించాడు .
8. రామాయణంలోని సుశేణవృత్తాంతాన్ని భట్టి పూర్తిగా వదలివేశాడు .
9. భట్టికావ్యం యుద్ధకాండతోనే సమాప్తమౌతుంది .
ఈ కావ్యంలో నాయకుడైన రాముడు ధీరోదాత్తుడు . ప్రధానరసం వీరం . సందర్భానుసారంగా అనేక రసాలు పోషింపబడ్డాయి . ధర్మపరాయణుడైన రాముని జయం , ధర్మవిముఖుడైన రావణుని పరాజయం వర్ణించడం వల్ల ధర్మం యొక్క గొప్పదనం సూచించబడుతోంది.    
ఈ కవి ప్రకృతిని వర్ణించడంలో ఎంతో నిపుణుడు .
ఈయన వర్ణనలు సందర్భోచితాలు, సహజరమణీయాలున్నూ. కవి శరదృతువును వర్ణించిన తీరు గమనించండి ..

న తజ్జలం యన్న సుచారుపంకజం   న పంకజం తద్యదళీనషట్పదం
న షట్పదోsసౌ న జుగుంజ య: కలం న గుంజితం తన్న జహార యన్మన:     
అందమైన పద్మములతో వికసించని జలం జలమే కాదు . తుమ్మెదలు మూగని పద్మ౦ పద్మమే కాదు . ఏ తుమ్మెద  అవ్యక్తమధురంగా ఝంకారం చేయదో అది తుమ్మెదయే కాదు. హృదయాన్ని ఆకర్షి౦చని ఝంకారం ఝంకారమే కాదు . అంటే ఆ శరదృతువులో వికసించని కమలాలు లేని సరస్సులు గాని , తుమ్మెదలు మూగని కమలాలు గాని , అవ్యక్తమధురంగా ధ్వనిచేయని తుమ్మెదలు గాని , సర్వజన హృదయాలను ఆకర్షి౦చని తుమ్మెదల  నాదాలు గాని  లేవని తాత్పర్యం  .
ఈ కవి కావ్యంలో అష్టాదశవర్ణనలు చేసినట్లు మనం గమనించవచ్చు. ఉత్ప్రేక్షాలంకారంతో కూడిన ఈ శ్లోకం సూర్యోదయాన్ని సహృదయహృదయానురంజకంగా వర్ణించింది .

దరుత్తరే పంక ఇవాంధకారే మగ్నం జగత్సంతత రశ్మిరజ్జు:
ప్రణష్టమూర్తి ప్రవిభాగముద్యన్ ప్రత్యుజ్జహారేవ తతో వివస్వాన్                                

ప్రపంచమంతా దట్టమైన చీకటి అనే బురదలో కూరుకుపోగా తూర్పుకొండపై ఉదయించిన సూర్యుడు కిరణములనెడి త్రాళ్లను పఱచి ప్రాణులను పైకి లాగుతున్నాడా అన్నట్లున్నాడు .  
ఈ కవి సులభగ్రాహ్యమైన వైదర్భీ రీతినే ఇష్టపడినప్పటికీ ఇది శాస్త్రకావ్యం కావడం వల్ల అక్కడక్కడ కఠినమైన గౌడీరీతినే ఆశ్రయించవలసి వచ్చింది .               
ఈ కవి అందమైన అలంకారాలను ఉపయోగించడం లో  చేయితిరిగిన చతురుడు . ఈ కావ్యంలో 20 యమకాలంకారరీతులను ప్రయోగించాడు . చక్రవాళమనే పేరుగల ఈ క్రింది యమకాలంకారభేదాన్ని గమనించండి.
అవసితం హసితం ప్రసితం ముదా  విలసితం విసితం స్మరవాసితం
న సమాదా: ప్రమదా: హతసంమదా: స్మరహితం నిహితం న సమాహితం       
ఈ కవి శబ్దాలంకారాలను ప్రయోగించడంలో ఎంత చతురుడో అర్థాలంకారరచనలో కూడ అంతే నిపుణుడు . అర్థా౦తరన్యాసాలంకారశోభితమైన ఈ క్రింది పద్యం తిలకించండి .
ప్రభాతవాతాహతకంపితాకృతి: కుముద్వతీ రేణుపిశంగవిగ్రహం
నిరాస భ్రుంగం కుపితేవ పద్మినీ న మానినీ సంసహతేsన్యసంగమం
ఇది    ప్రభాతకాలవర్ణన. ఆ సమయంలో కలువలు ముడుచుకోవడం, పద్మాలు వికసించడం మొదలెడతాయి . ఒక పద్మం పూర్తిగా వికసించ లేదు . తన ప్రియుడగు తుమ్మెదను ఆహ్వానించలేదు.    ఆ దృశ్యాన్ని కవి చాల చక్కగా వర్ణిస్తున్నాడు.
ప్రభాతకాలంలో గాలి కలువపూవులగుండా వీచి పుప్పొడిని వెంటతెచ్చు కొనుటచే ఆ తుమ్మెద పుప్పోడిచే దూసరితమైనది. పద్మము ఆ విధంగా    కలువనుండి వచ్చిన పుప్పొడి(దుమ్ము)చేత మలినమైన తన ప్రియుని (తుమ్మెదను) గాంచి అతడు వేరొక కాంతతో (కుముదిని) కూడెనని భావించి అతనిని నిరాకరిస్తోంది . అది సమంజసమే . అభిమానవతియైన ఏ వనితయు తనభర్త (ప్రియుడు) పరకాంతతో కూడుటను సహి౦పలేదు కదా!     ఈ కల్పన ఎంత రమణీయ౦గా ఉంది.
హనుమంతుడు లంకను కాలుస్తున్నప్పుడు కవి శబ్దాలంకారాలతో వర్ణించిన తీరు అర్థం తెలియనివారికి కూడా ఆ సన్నివేశం ఎంత గందరగోళంగా ఉందో వ్యక్తం చేస్తోంది .

సరసాం సరసాం పరిముచ్య తనుం  పతతాం పతతాం కకుభో బహుళ:
సకలై: సకలై: పరిత: కరుణై: ఉదితైరుదితైరివ ఖం నిచితం
నగజా: నగజా : దయితా దయితా: విగతం విగతం లలితం లలితం
ప్రమదా : ప్రమదా: మహతా మహతా: మరణం మరణం సమయాత్ సమయాత్
      
ఈ కవి యొక్క  వ్యాకరణశాస్త్రపాండిత్యం గ్రంథమంతా కన్పిస్తుంది . మచ్చునకు ఒక శ్లోకం :

నిరాకరిష్ణూ  వర్తిష్ణూ వర్ధిష్ణూ  పరితో రణం
ఉత్పతిష్ణూ  సహిష్ణూ చ చేరతు:  ఖరదూషణౌ

కవి ఈ శ్లోకంలో ఇష్ణుచ్  ప్రత్యయరూపాలను అధికంగా ప్రయోగి౦చాడు . పాత్రపోషణలో కూడా ఈ కవి సిద్ధహస్తుడు. రాముని ధీరోదాత్తత, సీత పాతివ్రత్యం , ఆంజనేయుని ఉత్తమ దౌత్యం, రావణుని దౌష్ట్యం , భరతుని సోదరప్రేమ , లక్ష్మణుని సోదరభక్తి , కైక దుష్టబుద్ధి , సుగ్రీవుని మైత్రి , విభీషణుని పాపభీతి మొదలగు అంశాలు ఆయా పాత్రల స్వరూపస్వభావాల్ని వెల్లడిస్తున్నాయి .      
అంతేగాక దశరథ , రావణుల అంత్యేష్టి విశేషాలు , రాజనీతి విశేషాలు , కోశాభివృద్ధి, పంచాంగనిర్ణయం, దండనీతి మొదలగు విశేషాలు కవియొక్క ఇతరశాస్త్ర పరిచయాన్ని తెలియ జేస్తోంది .
ఈ కావ్యాన్ని ఆధారం చేసుకుని ఆధునికకాలంలో కూడ ఎందరో కవులు రావణార్జునీయ౦ కౌముదీకథాకల్లోలినీ మొదలగు ఎన్నో గ్రంథాలను రచించారు . అనేక కావ్యవిశేషాలతో బాటుగా వ్యాకరణశాస్త్రవిశేషాలతో నిండిన ఈ కావ్యం పాఠకులకు శాస్త్రవిజ్ఞానాన్ని , వినోదాత్మకంగా అందింస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు .
ఉపయుక్త గ్రంథములు :
.                      ౧. రావణ వధ భట్టికవి
.                      ౨ . సంస్కృత సాహిత్య చరిత్ర శ్రీ మల్లాది సూర్య నారాయణ శాస్త్రి
.                      ౩. సంస్కృత సాహిత్య చరిత్ర డా|| ముదిగొండ గోపాలరెడ్డి  

.                      & డా|| ముదిగొండ సుజాతారెడ్డి.  --